జీవితంలో ఎదురయ్యే కష్టాలు మన ప్రయాణాన్ని ఆపలేవని తన జీవితం ద్వారా నిరూపించిన వ్యక్తి డా. అట్టెం దత్తయ్య. చిన్నతనంలోనే చదువు ఆపేసి మేకల కాపరిగా మారిన ఆయన, విద్యపై ఆసక్తితో, స్వయంకృషితో తిరిగి ఉన్నత విద్యావంతుడయ్యారు. బ్రతుకు పోరాటంలో ఆటుపోట్లు, కష్టజీవితం నుంచి ప్రారంభమైన ఆయన ప్రయాణం, పట్టుదలతో, విరామమెరుగని కృషితో సాగి చివరకు పరిశోధన రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. ఇప్పుడు ఆయన ఢిల్లీవిశ్వవిద్యాలయం ఎస్వీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలందిస్తూ, ఎందరో విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తున్నారు.
వ్యక్తిగతంగా ఎదగడం మాత్రమే కాకుండా, సమాజంలోని అణగారిన వర్గాల స్వరాన్ని సాహిత్యం ద్వారా వెలుగులోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా బీసీ సాహిత్యంపై ఆయన చేసిన కృషి తెలుగు సాహిత్యంలో కొత్త దిశను చూపించింది. వృత్తి ఆధారిత సంస్కృతులు, భాష, జీవన అనుభవాలను సాహిత్యంలో ప్రతిబింబింపజేస్తున్న ఆయన ప్రయత్నం విశేషమైనది. ఈ ఇంటర్వ్యూలో ఆయన జీవన ప్రయాణం నుంచి సాహిత్య దృక్పథం వరకు ఎన్నో ఆలోచింపజేసే అంశాలు మన ముందుకు తీసుకు వస్తున్న ‘నినాదం’ సాహితీలహరి ప్రత్యేక ప్రతినిధి డి. సాయినాథ్ రెడ్డి చేసిన ప్రత్యేక సంభాషణ.
● చిన్నప్పుడు చదువు ఆపేసి గొర్రెలను మేపేవారని తెలిసింది? అటువంటి సమయంలో మరలా చదువుకోవాలని ఎందుకు అనిపించింది?
జ. ఏడవ తరగతి వరకే నేను పాఠశాలకు వెళ్ళి చదువుకున్నాను. ఆ తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థతులవల్ల నేను మేకల కాపరిగా మారాల్సి వచ్చింది. మాకు కొన్ని మేకలుండేవి. వ్యవసాయంతో పాటుమేకలు కూడా మాకు అప్పుడు ప్రధాన జీవనాధారం. అట్లా మేకల కాపరిగా ఏనిమిది సంవత్సరాల జీవితం గడిపాను. తర్వాత నా చిన్ననాటి క్లాస్ మెట్ ఇఫ్తేకార్ సలహాతో ప్రైవేట్ 10వ తరగతి పరీక్ష ఫీ కట్టాను. మా బంధువు మఠం కాశీరాం అతని పాత పుస్తకాలు, గైడ్స్ అన్ని ఇచ్చాడు. చదివాను. పాస్ అయ్యాను.
· ఆ సమయంలో చదువుకోవడానికి సహాయం చేసింది ఎవరు?
జ. గణితం, ఆంగ్లం తప్ప మిగిలినవి అన్ని సబ్జెక్టులు నేను చదువుకుంటున్నాను. ఆ రెండు సబ్జెక్టులకోసం మా మండలం లింగంపేటలో ఉండే రత్నాకర్ సార్ దగ్గరకు వెళ్ళి నా పరిస్థితి అంతా చెప్పాను. నాకు ట్యూషన్ చెప్పాలి అని బతిమిలాడాను. అంగీకరించారు. ప్రతి రోజు రాత్రి 7 తర్వాత మా ఊరికి చిన్న టి.వి.ఎస్. షాంపూ మీద వచ్చి నాకు గణితం, ఆంగ్లం నేర్పించారు. ఏడు వరకు నేను మేకలను దొడ్డిలో తోలి సిద్ధంగా ఉండే వాడిని. అప్పుడు చెప్పడం మొదలుపెట్టేవారు. చాలా సార్లు నాతోనే అక్కడే పడుకునే వారు. అలా రాత్రి అని కూడా చూడకుండా నాకు కష్టపడి ప్రేమతో నేర్పించారు. ఇష్టంతో బాగా నేర్చుకున్నాను.
· అప్పటికీ మీ వయసు ఎంతా? మళ్ళీ ఎప్పటి నుండి రెగ్యూలర్ గా చదివారు?
జ. నేను తిరిగి చదవడం మొదలు పెట్టినప్పుడు నా వయసు 19 సంవత్సరాలు దాటింది. 2003లో నేను 10వ తరగతి పాస్ అయ్యాను. ఇంటర్ కూడా రెగ్యూలర్ గా వెళ్ళి చదవలేదు. యూసూఫ్ సార్ సహకారంతో హెచ్.ఇ.సి. గ్రూప్ తీసుకుని మేకల వెంట ఉంటూనే చదివాను. కాని ఆ కళాశాలలో పాస్ అయినా అతి తక్కువ మందిలో నేను ఒకడిని. డిగ్రీ నుండి రెగ్యూలర్ గా చదివాను. అది కూడా పొద్దంతా పనిచేసుకుంటూ నైట్ కాలేజీ, పి.వి.వి. ఓరియంటల్ కామారెడ్డిలో చదివాను. మంచి మార్కులతో పాస్ అయి టీచర్ ట్రేయినింగ్ పూర్తి చేసుకున్నాను. అనంతరం ఉస్మానియా క్యాంపస్ లో ఎం.ఏ.లో చేరాను. అక్కడే ఆచార్య సాగి కమలాకర శర్మగారి పర్యవేక్షణలో పిహెచ్.డి. పూర్తి చేసుకున్నాను. మధ్యలో తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్య వై.రెడ్డి శ్యామల గారి పర్యవేక్షణలో ఎం.ఫిల్.చేసాను.
● దూర విద్యా విధానానికి, ప్రత్యక్ష విద్య అభ్యసన విధానానికి మధ్యగల భేదాలను అనుభవ పూర్వకంగా గమనించారు కదా! ప్రస్తుత విద్యా విధానానికి ఏ పద్దతి మంచిదనుకుంటున్నారు? ఎందువల్ల?
జ. ప్రత్యక్ష విద్యనే మంచిది. కాని మాలాంటి వారికి దూరవిద్య చాలా మేలు చేసింది. ప్రత్యక్ష విద్య అభ్యసించే వారిని తీసిపోని విద్యను అందించింది. దూరవిద్యలో చదువుకున్న వారు చాలా రంగాలలో చెప్పుకోదగ్గ స్థానాలలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
● కవిత్వం, కథలు కూడా రాశారు కదా... పరిశోధనలోకి వచ్చాక సృజనాత్మక సాహిత్యం రాయడం తగ్గించడానికి కారణం ఏమిటి?
జ. సృజనాత్మక సాహిత్యం రాయడం తగ్గించడానికి కారణాలు ఏమి లేవు. కాని పరిశోధనలో మునిగిన తర్వాత సృజన సాహిత్యం వైపు సమయాన్ని కేటాయించడం తగ్గిపోతుంది. రెండింటిని సమానంగా రాయడం కొంతవరకు అసాధ్యమైన విషయమే. కాని నేను ఎదిగి వచ్చిన జీవితం నన్ను ఎప్పుడు సృజనాత్మక సాహిత్యం వైపు లాగుతుంది. నేను ఎదగాల్సి జీవితం నన్ను పరిశోధన సాహిత్యం వైపు లాగుతుంది.
●పరిశోధనలో, ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలంగాణ సాహిత్య అకాడమీలతో కలిసి పని చేసిన సాహిత్య కృషిని వివరించండి.
జ. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో పరిశోధక విద్యార్థిగా ఉన్నకాలంలో ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు మొదలయ్యాయి. అప్పుడు తెలుగుశాఖ అధ్యక్షులుగా గౌరవనీయ ఆచార్య సూర్యాధనంజయ్ మేడం ఉన్నారు. నిరంతరం సాహితీ కార్యక్రమాలు జరుగుతూనే ఉండేవి. అందులో మా అందరిని భాగస్వాములను చేసారు. ‘తెలంగాణ సాహిత్యం - సమాలోచనం’, ‘శతవాసంతిక’, ‘గురుతరం’ వంటి గొప్పగొప్ప పుస్తకాలకు సహాయసంపాదకుడిగా పనిచేసే అవకాశం కలిగింది.
నేను తెలంగాణ సాహిత్య అకాడెమితో కలిసి చేసిన పనులలో ‘తెలంగాణ సాహిత్య గ్రంథ సూచి’ చాలా సంతృప్తినిచ్చింది. తెలంగాణ నుండి ముద్రితమైన 16వేల సాహిత్య గ్రంథాలను (2017వరకు) పూర్తి వివరాలతో సూచీని తయారు చేసి అందించాం. దీనికి మూలకారణం అంతా ఆనాటి తెలంగాణ సాహిత్య అకాడెమి చైర్మన్ డా. నందిని సిధారెడ్డి గారు. గ్రంథసూచీ నిర్మాణంలో గౌరవనీయ ఆచార్య వెలుదండ నిత్యానందరావు గారి మార్గనిర్దేశం కీలకమైనది. నాతో పాటు ఇంకా ముగ్గురు పనిచేసారు. మొత్తానికి అది పెద్ద పుస్తకంగా ఈ మధ్య కాలంలో డా. బాలాచారి గారు ముద్రించారు. అట్లాగే తొలి మూడు సంవత్సరాల అకాడెమి ప్రయాణాన్ని ఒక పుస్తకంగా రాసాను. అది త్వరలో వస్తుంది.
●ఈ మధ్యకాలంలో బీసీ సాహిత్యం పై విస్తృతంగా రచనలు వెలువరిస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఈ సాహిత్యాన్ని తీసుకురావడంలోని మీ లక్ష్యం?
జ. బీసీ సాహిత్యం అంటే వృత్తి సాహిత్యం. ప్రతి బీసీ కులానికి ఒక ప్రత్యేక వృత్తి ఉంది. ఆ వృత్తికి సంబంధించిన విశేషమైన పదజాలం ఉంది, పండగలున్నాయి. సంస్కృతులున్నాయి. అదే స్థాయిలో లాభనష్టాలున్నాయి. వాటిని నమ్ముకుని సమాజానికి ఉపయోగపడ్డ వారెందరో వారి జీవితాలను కోల్పోయారు. వారి జీవితాలు ఆధిపత్య పీడనకు గురయ్యాయి, గురవుతూనే ఉన్నాయి. ఈ గోడు ఎంత రాసిన ఇంకా మిగిలే ఉంటుంది. ఇప్పుడిప్పుడే వారివారి కులం పేరు, వృత్తిపేరు పెట్టుకుని రాస్తున్నారు. ఆ రచనల వల్ల భాషనుండి బతుకు వరకు అధ్యయనం చేసే అవకాశం కనిపించింది. ఆ కోణంలో పనిచేస్తున్న. ఇంతకాలం తెలుగు ప్రధాన సాహిత్యం వాటిని సరిగ్గా పట్టించుకోలేదు. ప్రస్తుతం ఆ చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అదే ప్రధాన సాహిత్యంగా మారబోతుంది ముందుముందు.
· మీరు వెలువరించిన బీసీ సాహిత్యం గురించి తెలియజేయండి.
జ. నేను 2021లో ‘తెలంగాణ బి.సి.వాద సాహిత్యం’ అనే గ్రంథాన్ని తీసుకువచ్చాను. ఇది మంచి గుర్తింపును ఇచ్చింది. అప్పటికి నేను ఉస్మానియాలో పరిశోధక విద్యార్థిని. ఆ పుస్తకం రాసినప్పటి నుండి బీసీల మీద వచ్చిన కథలను, కవిత్వాన్ని, పాటను కులాల వారిగా వేరు చేస్తూ పెట్టాను. వాటన్నిటిని ఇప్పుడు పుస్తకాలుగా తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నాను. అందులో భాగమే ‘మోకు’ (గౌడుల బతుకు తాళ్లు), ‘వాము’ (కుమ్మరుల బతుకు చక్రాలు), ‘రేవు’ (రజకుల బతుకు మూటలు), ‘రుంజ’ (పంచదాయీల బతుకు ధ్వనులు) ఈ నాలుగు కథా సంకలనాలు. అన్నింటిలో 20 కథల చొప్పున ఎంపిక చేసాము. త్వరలో ఇంకా 8 బీసీకథా సంకలనాలు, బీసీకవిత, బీసీపాట పేర్లతో రెండు సంకలనాలు సిద్ధం అవుతున్నాయి. ఇదంతా ధ్రువ ఫౌండేషన్ సహకారంతో చేస్తున్నాము.
● బీసీ సాహిత్యం ఏ యే వృత్తులపై ఎక్కువగా వచ్చింది?
జ. అక్షరాస్యత ఎక్కువ ఉన్న బీసీ వృత్తుల మీదనే ఎక్కవగా వచ్చింది. పద్మశాలీలు, పంచదాయీలు, గౌడ, యాదవులు వంటివారి వృత్తులకు సంబంధించిన సాహిత్యం ఎక్కువగా వచ్చింది. ఇప్పుడిప్పుడే వారిని గురించి, వారి వృత్తులను గురించి రాసుకుంటున్న బీసీ కులాలున్నాయి. అన్ని బీసీ కులాలకు ఆశ్రిత కులాలున్నాయి. ఈ ఆశ్రిత కులాల వారు వారికి సంబంధించిన కులాల జీవితాలను, నాయకులను, వీరులను, సంస్కృతులను గానం చేస్తారు. అవన్ని రికార్డు కావాల్సిన అవసరం ఉంది. అప్పుడు అసలైన బీసీ సాహిత్యం కొంత వరకు బయటకు వస్తుంది.
● తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోను, దేశవ్యాప్తంగాను బీసీలకు మధ్య వృత్తులలో వైవిధ్యాలు ఉన్నాయి. వీటిని ఎలా అర్థం చేసుకోవాలి?
జ. ప్రాంతీయ చరిత్ర, సంస్కృతి ప్రభావాలు, భౌగోళిక పరిస్థితులు, సహజ వనరులు, సంప్రదాయ కులవృత్తులు – ఆధునిక మార్పులు, ఆర్థిక అవకాశాలు, సామాజిక పరిస్థితులు, మార్కెట్ ప్రభావాలు, ఆయా ప్రభుత్వ విధానాలు, రిజర్వేషన్లు, వలసలు మొదలగు అంశాల కోణంలో దేశంలో గల బీసీవృత్తులను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.
● కొన్ని వృత్తులు చేయడం అనేది ఆధునిక కాలంలో అన్ని కులాల వారు చేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని వృత్తులనేవి కొంత మంది అస్తిత్వాన్ని తెలిపేవిగా మాత్రమే గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వృత్తులను బట్టి ఆ వృతులు చేసేవారు అంతా బీసీలుగా గుర్తించవచ్చా?
జ. బీసీలుగా గుర్తించడానికి వృత్తి ఒక్కటే ప్రధాన అంశం కాదు. వారి సామాజిక స్థితి, విద్యాపరమైన వెనుకబాటు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పాతినిధ్యం మొదలగు వాటన్నిటితో ముడిపడి ఉంటుంది.
● ప్రస్తుతం బీసీ సాహిత్యంలో ఏ ఏ ప్రక్రియల్లో రచనలు వెలువడుతున్నాయి?
జ. ప్రధాన స్రవంతిలో ఉన్న అన్ని ప్రక్రియలలో రచనలు వస్తున్నాయి. నేను 2021లో తీసుకొచ్చిన ‘బి.సి.వాద సాహిత్యం’ పుస్తకంలో బీసీల మీద వచ్చిన పద్యం, పాట, కవిత్వం, కథ, నవల, నాటకం, విమర్శ అనే ఏడు ప్రక్రియలలో రాసిన సాహిత్యాన్ని పరిశీలించాను. అనంతరం బీసీల మీద వచ్చిన నానీలు, బీసీల మీద వచ్చిన మొగ్గలు వంటివాటిని కూడా సేకరించి పెట్టాను. త్వరలో రానున్న ‘తెలంగాణ బి.సి.వాద సాహిత్యం’ పుస్తకం పునర్ముద్రణలో వాటిని కూడా చేర్చబోతున్నాను.
● బీసీ సాహిత్యంపై జరుగుతున్న పరిశోధనల పట్ల మీ అభిప్రాయం?
జ. బీసీ సాహిత్యం మీద పరిశోధనలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయని చెప్పుకోవాలి. ఇంకా విస్తృతంగా రావల్సిన అవసరం ఉంది. వస్తాయి కూడా.
● రాజ్యాధికార లక్ష్యంలో బీసీసాహితీ వేత్తల లక్ష్యం ఎలా ఉంటే బాగుంటుందని మీ అభిప్రాయం?
జ. సాహిత్యం ప్రజల్లో అవగాహన పెంచే సాధనం. బీసీ వర్గాల చరిత్ర, పోరాటాలు, సాధించిన విజయాలు మరింత ప్రతిబింబిచేలా ఉండాలి. అణగారిన వర్గాల స్వరాలను మరింత బలంగా వినిపించేలా ఉండాలి. రచనలు భావోద్వేగాలకు మాత్రమే పరిమితం కాకుండా, అసమానతలను బలంగా ప్రశ్నించేలా ఉండాలి. సమాన అవకాశాల కోసం ఆలోచనలు రేకెత్తించేలా ఉండాలి. బీసీవర్గాలలో ఉన్న విభజనలు తగ్గించి, ఐక్యతను మరింత ప్రోత్సహించేలా రచనలు రావాలి. బీసీ వర్గాల సంస్కృతి, వృత్తులు, సంప్రదాయాలపై గౌరవాన్ని పెంచుతూ, హీన భావనను తొలగించి, స్వాభిమానాన్ని బలపరచే రచనలు కూడా రావాలని నా భావన.
● దళితులు, గిరిజనులు, మైనారిటీ వాద సాహిత్యాలపట్ల బి.సి. సాహిత్య దృక్పథం?
జ. వీరందరి సాహిత్య లక్ష్యం ఒకటే. అణచివేత, అసమానతలను ప్రశ్నించి సమానత్వం సాధించడం. వీరందరికి ఒకరి పట్ల మరొకరికి సహానుభూతి, ఐక్యత ఉండాలి. అందరూ కలిసి ఐక్యంగా పూలే, అంబేద్కర్ దృక్పథంతో అధిపత్యాలకు వ్యతిరేకంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.
● బహుజన సాహిత్యం అంటే మీ అభిప్రాయం ఏమిటి?
జ. బీసీ, దళిత, మైనారిటీ, గిరిజన, సబ్బండ కులాల జీవితాలను ఎత్తిపడుతూ, తరతరాలుగా అణిచివేతను ఎదుర్కుంటున్న వారి విముక్తికి చైతన్యాన్ని అందించేదే బహుజన సాహిత్యం.
● బీసీలకు కులపరమైన వివక్ష ఉందని మీరు భావిస్తున్నారా? ఆ దిశగా ఎలాంటి సాహిత్యం వచ్చింది?
జ. ఒకటి రెండు కులాలు మినహాయిస్తే అన్ని కులాల వారు వివక్షను ఎదుర్కుంటున్నారు. ఆ దిశగా చాలా సాహిత్యం వచ్చింది. ముఖ్యంగా సంచార కులాల వారు, ఆశ్రిత కులాల వారు. ఉదాహరణకు భిక్షుకకుంట్ల వారు. ఇట్లాంటి బీసీ కులాల మీద సాహిత్యం వచ్చింది. పరిశోధనలు కూడా జరుగుతున్నాయి.
● బీసీ సాహిత్యానికి, బహుజన సాహిత్యానికి మధ్య గల భేద సాదృశ్యాలు?
జ. బీసీ సాహిత్యం కూడా బహుజన సాహిత్యం గొడుగుకింది నుండి వచ్చినదే. బహుజన చైతన్యం కోసం సమష్టిగా కృషి చేస్తూనే, వ్యక్తిగత అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం గొంతు విప్పాల్సిన సమాజంలో ఉన్నాము. కనుక దళిత, మైనారిటీ, గిరిజన, బీసీ సాహిత్యాలు విడివిడిగా రావాల్సిన అనివార్యత ఏర్పడింది. అట్లా అయితేనే సకల జనుల జీవితం, సమస్యలు సంపూర్ణంగా వ్యక్తమైతాయి. అంతే తప్ప బీసీ సాహిత్యానికి, బహుజన సాహిత్యానికి మధ్య భేద సాదృశ్యాలు వేరుగా ఉండవు. మనం చూడాల్సిన అవసరం కూడా అంతగా లేదని నా అభిప్రాయం.