కథలు
కాపరి
అవి వరంగల్లు జిల్లా గట్టు దుద్దెనపల్లి అడవులు. మస్తుగా వానలు పడుతున్న కాలం. మస్కుమస్కు చీకటి అవుతున్న సమయం. ఉంటుంది ఊరికి రెండు కిలోమీటర్ల దూరం. అప్పుడే మూడు లారీలు హారన్ ఇచ్చుకుంటూ అటువైపు వస్తున్నాయి. ఆ లారీల చప్పుడు వినగానే బియ్యం పొయ్యిమీద పెట్టిండ్రు. అన్నం కాగానే మనిషికింత ఏసుకుని తిన్నరు. తినే లోపే లారీ డ్రైవర్లు హారన్ మీద హారన్ కొడుతుండ్రు. తినుడు అయిపోంగనే ముల్లె మూట సర్ది కట్టిపెట్టిండ్రు. ఇద్దరు వెళ్ళి లారీలను మందల దగ్గరకు తీసుకుని అచ్చిండ్రు. మూటలు తీసుకెళ్ళి లారీలో డ్రైవర్ దగ్గర సీటుకింద పెట్టిండ్రు. తర్వాత ఒక్కొక్కమేకను లేపుకుంటూ లారీలో వేస్తుండ్రు. మేకలన్ని అరుపులు మొదలుపెట్టినై. ఆ రోజు ఉదయం వరకు కలిసున్న మేకలు ఇప్పుడు రెండు మందలుగా విడిపోయినై. తల్లులు పిల్లలు అని లెక్కలేకుండా విడగొట్టిండ్రు. ఒక మంద ఇక్కడే అడవులలో ఉంటాయి. మరో మందను పూర్తిగా లారీలలో నింపుతుండ్రు. వాటిని సొంత ఊరికి తీసుకుపోవాలి.
ఆ లారీలలో అడుగు భాగంలో ఇంత చిట్టు పోసుకొనివచ్చిండ్రు. మేకల కాలి అడుగు భాగపు గిట్టలు చాలా సన్నగా ఉంటాయి. అవి ఆ లారిలో గట్టిగా నిలబడలేక పోతున్నాయి. అటూ ఇటూ జారుతున్నాయి. నింపుడు అయిపోగానే లారీల డోర్లు వేసి, ఎక్కుమన్నారు. లారీకి ఇద్దరు చొప్పున ఎక్కి నిలవడ్డరు.
అక్కడే ఉండిపోతున్న మేకలలో మంచి జాతి వాటిని చూసుకుంటూ కొందరు కాపర్లు కంటనీరు పెట్టుకుండ్రు. అందులో కొన్ని కాపర్లకు ఆత్మీయంగా ఎప్పుడు పిలిచిన పలికే మేకలు. అటువంటివి దూరమౌతున్నందుకు కొందరు బాధపడుతుండ్రు. అంతలోనే లారీలు చాల్ జేసారు. అప్పుడే వాన మెల్లిగా సురువయింది. సచ్చినమురా దేవుడా అనుకున్నారు. అయినా తప్పదు కదా లారీలు నడుస్తూనే ఉన్నాయి.
ఒక లారిలో గొల్ల నర్సయ్య వాళ్ల మేనల్లుడు బాలమల్లు ఉన్నారు. లారీ కదిలనప్పటి నుండి మేకలన్ని అతలా కుతలం అవుతూనే ఉన్నాయి. చిన్న బిరెక్ వేసిన మేకలన్ని ఒకదాని మీద ఒకటి పడ్తాయి. వాటన్నిటిని వీళ్లీద్దరు లేపుకుంటూ ఉండాలి. ఏ మాత్రం చూడకపోయినా ఊపిరి ఆడక సచ్చిపోతాయి. వాటి మధ్యలోకి వెళ్ళి వాటిని లేపి దూరం చేస్తున్నారు. వీళ్ళ కాళ్ళను తొక్కి తొక్కి మేకలు పుండ్లు చేస్తున్నాయి. బాలమల్లు ఆ మంటను భరించలేక లారిలో ఓ మూలన కూర్చున్నాడు. లారి మొదలయిన నుండి వాన పడుతూనే ఉంది. బాలమల్లు చిన్నగ వనుకు పట్టిండు. కూర్చున్న బాలమల్లు మీద ఒక మేక మూత్రం పోసింది. "ఛూ..ఛూ...నీ యవ్వా!... అబ్బా...ఎంతగరం వుందే" అనుకుంటూ అట్లానే కూసుండు. ఆ మేక ఉచ్చ వేడికి వనుకు మాత్రం తగ్గింది అనుకున్నాడు. బాలమల్లుకు ఆ టైంలో ఏవేవో గుర్తుకు వస్తూన్నాయి...
‘‘ఏం బతుకురా నాయనా... చదువుకుంట అంటే మా అయ్య వినక పాయే. ఈ కష్టాలకంటే చావు నయం. మూడు నెలలు అవుతుంది ఇంటికాడికెళ్ళి వచ్చి. అవ్వను చూద్దామన్నా తీరకపాయే. నేను మన్నెం పోనే యయ్య అంటే వినకపాయే. రాళ్ళు వడ్తె మేకలకు మంచి రేటస్తది. ఇదొకసారి పోతే బాకితేరుతది అని బతిమిలాడితే అస్తి. ఆ రాళ్ళు సల్లగుండా మంచిగనే పడ్డయి గాని కటికోడు మోసం చేసిండు. రాళ్ళమేకకు ఆరువేలు ఇస్తా అని మాట్లాడుకొని తీసుకచ్చిండు. తీర మూడు నెలలు మేపినంక ఇయ్యల్ల మ్యాకమ్యాకను చూసి అందులో సంగం కూడా తియ్యకపాయే. అందరి కంటే కొంత కష్టపడి మేపినం. సంచుల కొద్ది తుమ్మ కాయ వోసినం. అచ్చం బిల్లగొడిశా, పంచాత్కం ఆకే మేపినం. ఈ ఆకు ఎంత మీపితే అంత రాయి మీద పొరెపోస్తదన్నరు. మేపిందంత ఎటుపోయిందో. మంచిగా మేపలేరనవట్టే ఆ కటికోడు. సగం మేకలను పరిగ కిందనే అడిగి మళ్ళి నాలుగు వేలకే బ్యారం చేసుకునే. అన్ని కలిపితే గాడికే అచ్చె సంసారం. ఈడికి కొట్టుకొచ్చిన నుండి గుట్టలెక్కక మలాస్క మ్యాకలు సచ్చిపాయె. ఇంటికాన్నే ఉండి అటు ఇటు మేపుకుని వుత్తా జీవాల్ని అమ్ముకున్నా ఒక్కొక్కదాన్కి మూడున్నరా వేలు యాడికివోయేవికావు. చెప్తె ఇనకపాయే మా యయ్య. ఈ దుద్దెన పల్లె సల్లగుండా, ఆ వొడ్డె కొమిరిగాడు సచ్చిపోను. మమ్మల్ని చిన్నబాధవెట్టెనా... ఎన్నిమేకలు ఆని బొందకు అయినయో? ఆన్ని బెధిరిచ్చెటోడే లేకపాయే. అచ్చినప్పుడల్లా నాలుగైదు పట్కపాయే. ఏమన్న అంటే వాళ్ళ వొడ్డెరొళ్ళను అందర్ని తీస్కచ్చి కొడ్తడంట. అన్నిమూస్కొని మేపుకుంటిమి. రాత్రి అచ్చి ఎత్తుకపోతడు. పొద్దున లేవగానే మందుబాటిల్ తీస్కచ్చి మమ్మళ్నే తాగుమంటడు. వాని దుర్మార్గమీద మన్నువడ. వాడె పెద్దిర్కం తోటి 'నా చేతో ముడ్తే ఉక్కు తాళాలు, చిక్కు గొళ్ళాలు ఊసిపోతై' అంటుండే. ఆన్ని సుట్టుపక్కల ఏ పోలీసోల్లు ఏమనరట. మా దెగ్గరినుండి ఎత్తుకపోయిన మ్యాకలల్లో ఒకటిరెండు వాళ్ళకుగూడ ముడ్తయంటా.
మొండన్న పెళ్ళాం కడుపు సల్లగుండా నన్ను కొడుకోలే పలకరిచ్చేది. ఈ మూడు నెలలు నన్ను మంచిగా మాట్లాడిచ్చింది. వచ్చెటప్పుడు చెప్తామంటే లేకపాయో. వాళ్ల ఇల్లు నాకు తెల్వదాయే. పోయిన నుండి వాళ్ళింటికి నన్ను ఒక్కసారి తొల్కపోయింది. మంచిగ కడుపునిండ బువ్వవెట్టింది. నాకిద్దరు బిడ్డలే మా దగ్గరే ఉంటవా అని అంది. ఆళ్ళ ఇంట్ల పిల్లల పుస్తకాలు చూసినప్పుడు నాకు మస్తు బాధేసింది. జెరసేపు ఉండి మందకాడికి అచ్చిన. అచ్చిన్నుండి మా మామ ‘‘ఆళ్ళ ఇంట్ల తినచ్చినవా? నీ పోరండ్ల మన్నువడ. వాళ్ళు మాలొల్లట. యాడదొరికితే ఆడ తినుడే నిన్ను బొందవెట్ట. పో అటు ఆ మ్యాకల మొకాన వొయ్యి సావుపో. దరిద్రపోడు.’’ అని మస్తు తిట్టిండు. అప్పుడప్పుడు ఊకే గుర్తుచేసి ఎక్కిరిస్తుండే కూడా. కాని మాకంటే వాళ్ళే నీటుగుండ్రు. ఆమే మాట్లాడితే మా యవ్వ(అమ్మ) మాట్లాడినట్లనిపిచ్చేది. వాళ్ళ చేండ్లనే మందవెట్టినం గన్క రోజు పల్కరిస్తుండే.
సవనపురం సాయన్న మళ్ళెప్పుడు కలుస్తాడో. ‘‘నువు చదువుకో తమ్మి చాల వుశారున్నవ్’’ అంటుండే ఎప్పుడు. ఈయనకు ఓ ఇచిత్రమైన మంత్రం అస్తుండే. మ్యాకలన్ని మందవెట్టంగనే జెర్రసేపు ఆగినంగా చేతిలో ఓ కట్టె వట్టుకొని మందసుట్టు గీత గీసుకుంటూ తిరిగస్తుండే. ఆ గీతలోపల్కి ఏ మొనగాని దొంగకూడా రాడడ. నిజంగానే ఆ సాయన్న ఉన్నన్ని రోజులే మేము సరిగ్గ నిద్రవోతుంటిమి. ఆయన పెండ్లాం పిల్లలు గల్లోడు. ఎప్పుడు ఊరికి వోయిన ఆ రాత్రి ఒకటి రెండు మేకలు ఒడ్డొళ్ళ పాలు కావల్సిందే’’ అని బాలమల్లు ఆలోచనల్లో మునిగిపోయిండు. డ్రైవర్ లారిని అనుకోకుండా ఆపిండు. వెంటనే బాలమల్లు లేచి లారి అంచునుండి చూసే సరికి రోడ్డుపక్కని అందమైన ఆడమె నిలబడింది. అది రాత్రి పన్నెండు ఒకటి గంటల సమయం. ఆమెతో ఈ డ్రైవర్ మాట్లాడుతుండు. బాలమల్లు మామ నర్సింలు లారి ఎట్లయిన ఆగింది కదా... బాలమల్లును ముంగటికి పంపిద్దాం ‘‘ఇప్పటిదాక పడ్డ ఆనకు తడిసి పోరడు అనుకు వడ్తుండు.’’ అనుకుని డ్రైవర్ ను అడిగిండు. పంపియ్యు అని డ్రైవర్ అన్నాడు. బాలమల్లును దించి ముంగట కూర్చోమన్నాడు. ఇప్పుడు మేయిన్ రోడ్డు మీదనే పోతుంది కదా... బ్రేక్ లు అంతగా లేవు. మేకలు జెర అటూ ఇటూ జారిపడ్తలేవు గదా అనుకుని ముందుకు పంపిండు. డ్రైవర్ ఆ రోడ్డు పక్క ఆడమేతో ఎం మాట్లాడిండో తెలువది. ఆమే కూడా లారిలో ఎక్కి కూర్చుంది. అంతకు ముందే వాన తగ్గింది. డ్రైవర్ పక్కన ఆ ఆడమే. ఆమె పక్కన బాలమల్లు. ఈ బాలమల్లుకు ఏమేమె డౌట్లు.
‘‘ఈమెకు ఏమై ఉండచ్చు. గీ రాతిరి రోడ్డుమీద ఎందుకు నిలవడ్డది? మొగడు కొట్టిండేమో? లేదా ఎక్కడికైనా అర్జంట్ గా పోవల్సి ఉందా. అట్లయితే వెంట ఊరొళ్ళను ఎవర్నైనా తెచ్చుకోవచ్చుగా. గింత మంచిగా ఉంది. పాపం ఏ ఆపతచ్చిందో...’’ అనుకుంటూ లోలోపల. వాళ్ళ వ్యవహారం చిన్నపిల్లవాడైన బాలమల్లుకు ఏం తెలుసు పాపం. పశుల కాపరిగా మారి ఏ పాపం తెలియని పిల్లవాడు. కొంత దూరం పోగానే లారినీ ఆపిండు. డ్రైవర్ దగ్గరున్న పెద్ద వాటర్ క్యాన్ ను తీసుకొని కిందికి దిగిండు. డ్రైవర్ దిగగానే ఆమె దిగింది. చాలా సేపు అటే పోయిండ్రు. బాలమల్లుకు మళ్ళి ఏవేవో ప్రశ్నలు. తిరిగి డ్రైవర్ ఒక్కడే వచ్చి లారెక్కిండు. స్టార్ట్ చేసిండు. ‘‘అయ్యో ఆమె రాకపాయే ఈడు స్టార్ట్ చేసి తీసుకుపోవట్టే. ఆమెను గీ అడువులల్ల దించిండు. ఎటు చూసిన ఊరు, పట్టణం ఏం కనిపిస్తలే. ఎందుకు దించిండు. ఏం చేసిండు? ఎక్కడ వదిలిపెట్టిండు? ఆమెకు ఆపతి ఉండి వస్తే వీడు మధ్యలో దించి పెయ్యిమీద వున్న సొమ్ములు గుంజుకోని సంపలేడు కదా...’’ అని బాలమల్లుకు ఎన్నెన్నో ప్రశ్నలు. బాలమల్లు ఇంటి దగ్గర మంచి సంప్రదాయ వాతావరణం. వార వారం భజన, స్వాధ్యాయి వంటివి వారికి మంచితనాన్ని నేర్పాయి. ఎటువంటి అక్రమాలు తెలియని వాడు.
కొంతకొంత తెల్లవారుతుంది. గొల్ల నర్సయ్య వూరికి దగ్గర వచ్చిండ్రు. ఊరికి కొంత దూరంలో మేకలన్నింటిని దించిండ్రు. దించుతుంటే లారి డోర్ సందుల తట్టుకుని రెండుమూడు మేకలకు కాళ్ళు విరిగిపోయినై. దించినంకా నర్సింలు డ్రైవర్ ను ఇయ్యర మయ్యర తిడుతుండు. ‘‘జీవాలను తీసుకచ్చెటప్పడు రాత్రి గా పిచ్చి పని ఏంది? వేరే పనిమీద పోయినప్పుడు ఎట్లనన్నా సావుండ్రి. వాళ్ళకేమో యభిచారం చెయ్యకుంటే కడుపునిండది. మీకేం బుట్టిందిరా ఇంటికాడ పెండ్లాలు లేరా? అడ్డమైన రోగాలచ్చి సంకనాకి పోతరు’’ అని బెదిరిచ్చి పైసలిచ్చి పంపించిండ్రు. నర్సింల మాటలు విన్నంక బాలమల్లుకు కొంత అర్థమైంది.
మందకాడ నర్సయ్య వాళ్ళ అన్నను ఉంచి ఇంటికి పోతుండ్రు. రాత్రంతా వానలో తడిసి, రొచ్చులో మునిగి, ఎండి, ఆరిపోయిన బట్టలు వాళ్ళవేషం చూడలేనంత దరిద్రంగా ఉన్నారు. ఈ గొల్లకుర్మోల్లు ఒక నియమం పాటిస్తారు. అది మన్నెం ఎన్ని రోజులు పోయినా మళ్ళి ఇంటికి వచ్చే వరకు గడ్డం, నెత్తి వెంట్రుకలు తీయించుకోరు. బాలమల్లుకు మూడు నెలల నెత్తి వెంట్రుకలు చాల పెరిగినై. రాత్రి మేక పోసిన ఉచ్చతో గట్టిగా పిడ్సలు గట్టినై. అటువంటి అవతారంతో మూటలను నెత్తిమీద ఎత్తుకుని ఊర్లోకి పోతే వారిని చూసే తిరును వర్ణించడం సాధ్యం కాదు. బాలమల్లు మనసుల రాత్రి ఈ విషయమే తిరుగుతుంది. ‘‘గంతమంచిగుంది ఆమె గంటకొకడితోటి గడిపి సంపాదించుకునుడేనా? వీల్లను బలవంతంగా అట్లా ఎవరన్న మారుస్తారా? వారి పరిస్థితులే అట్ల తయారు చేస్తయా? అందమైన వాళ్ళ పెయ్యిని అప్పగియ్యడం ఒకటైతే ఆ రాత్రులల్లా గొంతుపిసికి చంపేస్తరనే భయం లేకుండ ఉండడు అంటే ఎంత సాహసం. పాపం వాళ్ళను మార్చేవారే లేరా..." అనుకున్నాడు.
తెల్లారి బాలమల్లు తండ్రి మేకలు ఉంటున్న ఊరికి వచ్చిండు. నరసయ్య దగ్గర కూసొని ఖర్చులు ఆదాయం అమ్ముడుపోయిన మేకల పైసలు అన్ని లెక్క చూసుకుండ్రు. కొన్నయి, రాళ్లువడ్డవి, చచ్చిపోయినయి, పరిగే కింద వొదులుకున్నయి, అన్నీ లెక్క చేసి ఖర్చులు తీసేస్తే, మిగిలింది ఏం లేదు. ఇదంతా బతుకులు మారే యవ్వారం కాదు అనుకుని బాలమల్లు తండ్రి మిగిలిన మేకల్ని నరసయ్య మందలో ఉంచి బాలమల్లును తోలుకొని వాళ్ళ ఊరికి పోయిండు. మర్నాడు పొద్దున్నే ఆ పిల్లవానిని తీస్కపోయి బడిల చేర్పించిండు. తోటి పిల్లల కంటే పెద్దగా ఉండడంతో కొన్ని రోజులు ఎక్కిరించిండ్రు. ఇన్నాళ్లు అడవితో మమేకమైన జీవితం. ప్రకృతిని ఆస్వాదించే మనసు. ఏ పాఠం చెప్పిన అట్లనే పట్టేసుకుంటుండు. బాలమల్లు చురుకుదనానికి పిల్లలంతా మంచి దోస్తులు అయ్యిండ్రు. సార్ల సహకారం దొరికింది. అన్నిట్లో మంచి మార్కులు తెచ్చుకుని పెద్ద చదువులు చదివి, పంతులు ఉద్యోగం సాధించిండు.
తంగెడు పక్ష పత్రిక
01.05.2021
(యూటూబ్ లో ఉంది. వినాలనుకునే వారి కోసం కింద లింక్)
https://www.youtube.com/watch?v=7uKYYCCXQ-c
బత్కుబండి
ఆన కాలం మండుతున్న ఎండతో పొద్దంతా ఎగసిపడ్డ సూర్యుడు తన కోపం చల్లారనట్లు ఎర్రటి రంగుతో మెల్లగా గుట్టల సాటుకు పాకుతూ, గూకుతుండు. కాని కొద్ది కొద్దిగా ఎలుగుంది. పశాంతంగా నల్లని నీడతో నాలుగు మూలల నుండి చీకటి అలుముకుంది. ఆనకాలం మెరిసిమెరిసి కొట్టె ఎండతో చెమటకు పెయ్యంత తడిసి సాయంత్రం సల్లవడుతుంది. మేకలన్ని మందకు జేరుకున్నయి. పిల్లలు తల్లులను కల్సుకుని, ఆరుస్తూ, అంగడంగడి చేస్తున్నయి. తల్లులకోసం తల్లడిల్లుతున్న పిల్లలను మేకలకు గూడుపుతూ సతమతమైతున్న. ఆ యాళ్ళకు సూర్యుడు గూకిన దిక్కునుండి మా మామ నెత్తిమీద సంచి మూటతో బస్సుదిగి మేకల మందదిక్కు వస్తుండు. మామ నెత్తిమీద మూట సూడంగనే నా ఆనందం ఆకాశమంటింది.
మామంటే భయం. వాళ్ళతాన్నే మూడు యేండ్లునుండి మేకలు మేపుతున్న. ప్రేమతో పరుగెత్తి అటకాయించలేను. కాని నిల్వక రెండడుగులు ముందుకేసి ‘‘ఇప్పుడే వస్తున్నవ మామ, మా ఇంటికాడంత మంచిగుండ్ర’’ అని అడిగిన. ‘‘ఆ ఇప్పుడే అస్తున్న. అందరు మంచిగుండ్రు’’ అని చెప్పుకుంట, గుడిసెల దిక్కువోయిండు. అక్కడున్నోళ్ళంత వాళ్ళ ఇంటికాడి సంగతులన్ని మాట్లతుండ్రు.
ఎండ కాలమే వేల రూపాలు అప్పుసేసి ముప్పైకొత్త మేకలు కొన్నం. మా దగ్గరో యాబై మేకలుండే. అన్నిటిని కొట్టుకుని మేపెతందుకు మా జిల్లను ఇడిసి కరీంనగర్ అడవుల్లో ఉన్నం. కొన్న మేకలకు అడవులపొంటి తిరిగే అల్వాటు లేదు. ఆ ఆనలకు తడిసి, గుట్టలెక్కి మేసేవరకు పన్నెండు మేకలు సచ్చిపోయినై. ఆ చింతతోనే నేను ఓ పక్కన కూసున్న. అప్పుడు మా మామ నన్ను పిలిసి ‘‘మీ తమ్ముడేమో కాయితం వంపిండు, ఆ సంచిముల్లెలుంది సూడు’’ అన్నడు. అప్పటికే చీకటినిండింది. కాయితం తీసిన సదువరాదు. మంట ఎల్గుకు సూద్దామని నాలుగు కట్టెలు ఒక్క దగ్గరేసి మంటవెట్న. అప్పుడే వర్షం సన్నగ సురువైంది. ‘‘పొద్దుగల్ల సూతువులే సికట్లేమి కనిపిస్తది’’ అని మామ అనంగనే, మూటను తీస్కపోయి గుడిసెల ఓ మూలకు తల్గెసిన. సినుకుల పడ్తుండగనే అడ్డందొడ్డం ఇన్ని బియ్యం ఉడ్కవెట్టుకుని, తొక్కులేస్కోని, తలో బుక్కెడుదిని మందసుట్టు అక్కడక్కడ అందరం పండుకున్నం.
వారం రోజులనుండి ఇడువని వాన. ఎండ సక్కగా లేక గొంగడంతా ముక్క వాసనవట్టింది. ఆ గొంగడి కప్పుకొని, దాని మీదినుంచి ప్లాస్టిక్ కాయితమేస్కోని, కింద ఓ వరుస రాళ్ళు, ఆ రాళ్ళమీద టేకుటాకులు ఏసుకొని పడుకున్నం. గొంగట్లకెల్లి వస్తున్న ముక్కవాసన అంతో ఇంతో అలవాటయింది. కాని కాయితం మీదవడ్తున్న సినుకుల సప్పుడు సిటపట ఇనుపిస్తుంది. కిందేసుకున్న రాళ్ళు పక్కబొక్కలను ఒత్తుతున్నయి. నిద్రస్తలేదు. మనసంత ఆ మూటలున్న పేపర్ మీదనే. అందులో పదో తరగతి పాసైనొళ్ళ నంబర్లున్నై. వాటిల్లో నా నంబర్ సూసుకోవాలని ఆరాటం. ఆ ఆనందంలో అంతా గర్తుకస్తుంటే, ఆ చినుకుల సప్పుల్లలో, రాళ్ళ ఒత్తిడి నొప్పుల్లలో కండ్లు మూస్కొని ఇలా సూసుకున్న నా గతమంతా...
చిన్నప్పనుండి అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్లలో నేనే పస్టుండే వాన్ని. ఏడొ తరగతిలో కూడా నాదే పస్టు ర్యాంకు. నేను సదువు మాని ఏడెండ్లయింది. నా ఏడో తరగతి దాటటం మా నాన్నలు ఏరుపడడం ఒకే ఏట. అప్పుడు మేకలు పంచుకుంటే నలుగురికి నల్పై, నల్పై మేకలు ఇంత అప్పు అచ్చింది. ఆ అప్పుకు భయపట్టి మా అయ్య జీతగాన్ని వెట్టుకోకుండా, నేను ఏడ్సిన వినకుండా, సదువు మాన్పించి నన్ను మేకల కాపరి చేసాడు.
ఐనా ఆ సరస్వతి సాయ నా సంకనుండి ఇడ్వలేదు. ఎప్పుడొక పాటల పుస్తకం గొంగడి సాటుకు వెట్టుకొని టైం దొరికనప్పుడల్ల బండలమీద కూసోని బాగా సదివే వాన్ని. వేమన, సుమతి, నరసింహ శతక పద్యాలు, అనేకం భజనం కీర్తనలు నోటికస్తున్నాయి. మేకలెనుక ఒంటరిని. పలకిరించే వార్గూడ కనిపించరు. మాట ముచ్చటంత పుస్తకాలతోటే.
మా ఊర్లే ప్రతి గురువారం దోసడి నారాయణ ఇంట్ల భజన. వరుసకు అల్లుడైన నా సోపతి మేకలకాడి మల్లయ్య నన్ను భజనకు అల్వాటు జేసిండు. దానితోనే నాకు ఆ నాలుగు అక్షరాలు నా నాలికపై జీవితానికి పదును వెట్నై. అట్లే ‘స్వాధ్యాయి’ కి పోయేవాన్ని. ఇట్లా ప్రార్థన ప్రీతి, గీతమాల, సప్తఋషులు, రామాయణం, శ్రాద్దం మొదలైన ఎన్నో పుస్తకాలు సదివిన. లేక పోతే నా సదువు అడివిలో కల్సి పోయేది. ఊరుతో, సమాజంతో, జనాలతో, బంధువులతో సంబంధమే లేదు. రోజుకు వేల మాటలు వినడం కోల్పోతి. మేకల అర్పులు, చేనుకావలి వాల్ల తిట్లు తప్ప నా సెవులకు ఇంకో శబ్దం ఇనవడదు. ఇటువంటి నన్ను నా గొంగడి సాటుకు నక్కి, నక్కి బ్రతుకుతున్న సరస్వతి సమాజానికి సూపియ్యాలనుకుందేమో? ‘ఇఫ్తెకార్’ అనే దోస్తి రూపంలో ఓ రోజు రాత్రి ఎదురైంది విజ్ఞానం.
యాడాడనో సదివే నా చిన్నప్పటి దోస్తులు పండుగు సెలవులకు మా ఊరికచ్చిండ్రు. వాళ్ళంత కల్సి మస్కు వడంక ఓ జాగల కూసొని మాట్లతుండ్రు. అప్పుడే నేను తొడల వరకు గొల్లగోసి కట్టుకొని, భుజం మీదో తువ్వాల, కాళ్ళకు కిర్రుసెప్పులు ఏస్కోని నా దురద్రుష్టాన్నికి చింతిస్తూ మెల్లెగా వోతున్న. ఆ మాట్లాడుకుంటున్న నల్గురిలో ఇఫ్తెకార్ సూసి ఎదురచ్చి, ఇట్లండు ‘‘ఒరే నువ్వు సిన్నప్పుడు మాకంటే మంచిగా సదివే వానివి. నీ సోపతొల్లం మీమందరం డిగ్రీ జేస్తున్నం. నువ్విట్లనే మేకలు కాస్తవా? చదువురా ! ఇప్పుడైన పదవ తరగతి పరీక్ష ఫీజుగట్టు’’ అని సెప్పి, ఇంక ఏవేవో విషయాలు నూరిపోసిండు. ఈ సంగతి ఇంట్ల జెప్పి వేయ్యి రూపాలు అడిగితే నాల్గు తిట్టి ఇచ్చిండ్రు. ఐనా తీస్కొని ఫీజు కట్టిన. కాని సదువడం ఎట్లా? పాటలు, పద్యాలు నేర్వటంతో తెలుగు సదువుతా. కాని తక్కిన సబ్జెక్టుల సంగతేంటి? అని ఆలోచనలో పడ్డ. ఎవరైన రాత్రి చెప్తె మంచిగుండు అనుకుని, ఐదొవ తరగతిలో నాకు టూషన్ జెప్పిన ‘రత్నాకర్’ సారు మా పక్కూర్లె ఉంటుండు. ఓ రోజు పొద్దున్నే లేసి వాళ్ళ ఇంటికివోయి ‘‘పదొ తరగతి పరీక్ష ఫీజు కట్టిన సార్. మీరే మా ఇంటికచ్చి రాత్రి రాత్రి లెక్కలు, ఇంగ్లీష్ జెప్పాలె సార్ జెర్ర’’ అని బతిమిలాడితే నా మీది నమ్మకంతో ‘‘ఖచ్చితంగా వస్తాను. నీవు ఖచ్చితంగా పాస్ అవుతావు’’ అని సెప్పి తోలిచిండు.
తరువాత రోజునుండి రాత్రి ఏడుగంటలకు రావడం మొదలు వెట్టిండు. సారచ్చెసరికి మేకలు కొట్టంలో తోలి, పిల్లలను తల్లులకు గూడ్పి. ఒక పాత పైంటు ఏసుకొని సారెంబడి ఒక రెడ్డిల ఇంట్లో నేర్సుకుంటున్న. రోజు బడికి వోయె పిల్లలు నాతోపాటు పదిమంది వరకు అస్తుండ్రు. అట్ల కష్టపడి మూడు నెల్లు జెప్పాడు. ఆ సరస్వతికి ఎంతగా నచ్చానో కాని సారు ఏది జెప్తె అది నా నాలికేమీద నాట్యంచేసేది. ఆలోచనకో, ఆనందానికో తెల్వదు గాని నిద్ర అస్సలు వట్టేది గాదు. ఎప్పుడు మేల్కుండి సదివే వాన్ని. అమ్మ తిడుతూనే ఉండేది. ‘‘పిచ్చి వట్టిందరా! పొద్దంతా మేకల్తో తిర్గుతవ్ సప్పుడ్దాక వుండుకో’’ అనేది. నిద్ర సరిగ్గాలేకనే ఇంచు, మించు ఇరవై సార్లు జరం రావచ్చు. నన్ను చాల మంది ఎక్కిరిచ్చిండ్రు. ‘‘రోజు బడిక్వోయి సదివెటొల్లంత పాసైతుండ్రు ఇగ నువ్వు పాసైతవు’’ అని ఎంతమంది అన్నరో! వాల్ల మాటలే బాగ నాకు కసిని వెంచినై.
రోజు బడికివోయె పిల్లలు నాతాడ వచ్చె మేకల గబ్బు వాసనకు గుల్గిన గాని సిగ్గువడకుండ వాళ్ళ దగ్గర కూసొని సదువుకున్న. పరీక్ష రాసెందుకు ఓ పైంటు, అంగి కుట్టిచిండ్రు. అంతకు ముందు నాకు మంచి పైంటు లేదు. ఏడో తరగతి వరకు లాగు. ఆక్కనుంచి దోతి. ఇంత కష్టపడి సదివినందుకు ఫలితం దక్కింది, పాసైన. కాని నంబరు పేపర్లో సూసుకోవాలి.’’ అని నెమరు వెసుకుంటు సుక్క యాల్లకు నిద్ర వటింది.
అంతలోనే మేకపిల్లలు ఆరుస్తే మేల్కచింది. మామ కోపం గూడ గుర్తచింది. గమ్మున కొట్టాలు ఊడ్సి, పిల్లలకు పాలు వట్టి, రాత్రి అండిన గిన్నెలను తోమడానికి ఓ మడుగుకు వోయి, నీళ్ళు తీస్కొని వచ్చిన. తర్వాత పొయ్యి మీద బియ్యం వెట్టి, సంచి మూట మూతి ఇప్పిన. అందులో తొలి యాకాసికి చేసిన నూనె వంటలు సెగొల్లు, అప్పాలు, గర్జలు, మామిడి కాయ తొక్కులు ఉన్నాయి. వాటి నడుమ ‘ఈనాడు’ నిజామాబాద్ జిల్లా పేపర్లో పదోతరగతి ఫలితాలున్నాయి. అందులో ఒక నంబరుకింద గీత గీసింది ఉంది. కాని పేపర్ మొత్తం నూనెకు తడిసి ముద్దైంది. నంబర్లు బాగ సరిగ్గా కన్పిస్తలేవు. ఇంకా టెక్షన్తో పరీక్షవట్టి సూసి మస్తు సంతోషవడ్డ.
ఉదయం తేటగా తెల్లవారింది. సూర్యుడు కొండల మధ్యనుండి ప్రచండ కిరణాలతో ప్రకాశిస్తున్నాడు. నేను పాసైన ఆనందాన్ని నా తోటి కాపర్లందరితో పంచుకున్నాను. కాని వారికి ఫలితం వెనక ఉన్న బాధ, కాని ఫలితం ముందున్న ఆనందం గాని ఏమి అర్థం కాలే. నాల్గు రోజుల్లో మా అయ్య ‘మల్లయ్య’ వచ్చాడు. నా కోసం కాదు. చనిపోతున్న మా మేకలను చూస్తెందుకు. అదే సంధుగా నాన్న రాంగనే నేను ఇక్కడ ఉండనే ఉండను అని మొండికేసి ఇంటికివోయిన.
అప్పుడు మేముంటుంది కరీంనగర్ జిల్లా భేగం పేట అడవుల్లో. మాది నిజామాబాద్ జిల్లా శట్పల్లి ఊరు. ఇంటికి బస్సుల వోతుంటే కాళేజీ పిల్లలు ఎంతో మంది బస్సుల గనిపిస్తున్నరు. ఆల్లు ఏసుకున్న బట్లలకు నేనేసుకున్న బట్టలకు శాన తేడ. తొడల వరకు దోతి, మొండి చేతుల అంగి, భుజం మీద చిన్న గొంగడి, కాళ్ళకు కిర్రు చెప్పులు, నడుముకు గోతం, మేకల రొచ్చు వాసన ఇది నా రూపం. నేన్ కూసున్న సీట్ల ఎవ్వరు కూసోలే. నా మనసులో ఏదో ఆలోచన. జీవితంలో సదువును సాధించాలి. లేకపోతే నేను సమాజానికి పనికి రాను. నాకెవ్వరు విలువివ్వరు అని ఆలోచిస్తూ ఇల్లు జేరుకున్న.
నేను కాలేజికి రోజు పోయి సదువుకుంటా అని నాన్నను అడిగితే తిట్టి పంపాడు. సదువుకో ఏమన్న చేసుకో కాని మేకలైతే నువ్వే కాయాలి అన్నడు. అచ్చిన మర్నాడు పొద్దున లెవంగనే మా మండలం లింగంపేటలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో క్లర్కుగా పని చేస్తున్న యూసుఫ్ సార్ దగ్గరికి వోయిన. ఆయన నాకు ముందు జెర్ర పరిచయం. నేను కాలేజికి రోజు వోయి సదుకోలేననే విషయం అంత చెప్పిన. అట్లయితే H.E.C. గ్రూప్ తీస్కోని మేకలు కాస్తు సదువుకో అని సలహయిచ్చి, చేర్పించి పంపిండు యూసుఫ్ సారు. అదే కాలేజికి మొదటి రోజు, చివరి రోజు. పుస్తకాలు తెచ్చుకొని బాగా సదువుతున్న. అనుమానాలోస్తె రోజు కాలేజికి పోయేటొల్లను అడిగి నేర్చుకుని ఇంటర్ గూడ పాసైన. ఆ కాలేజిలో 140 మందిలో ఆ ఏడాది 12 మంది మాత్రమే పాసైండ్రు. అందులో నేను ఒకన్ని.
ఇంటర్ పాసైనంక మా అయ్యకు నాపై నమ్మకం కుదిరింది. ఏదో సాధిస్తాడు అనుకుండు. నాతో అవసరం కూడా తీరిపోయింది. అప్పు ముట్టిపోయింది. అందుకే మా అయ్య డిగ్రీని రోజు వెళ్ళి సదుకో అని సెలవిచ్చాడు.
నేను మేకలకాడ సదివిన పద్యాలు, పాటలు, రామాయణ, భారత కథలు, కోలాట పాటలు మొదలైన వాటిమీద ప్రేమతో తెలుగే సదువాలనుకున్న. ఇందుక కామారెడ్డిలో ఉన్న ప్రాశ్చవిద్యా కళాశాలలో చేరాను. అది సాయం కాల కళాశాల. సాయంత్రం వరకు కంప్యూటర్ నేరిస్తందుకు సాయంత్రం కాలేజికి పోయేవాన్ని. అందులో ఉన్న అధ్యాపకులందరు అమిత ప్రజ్ఞా వంతులు. నటేశ్వర శర్మ, అవధానం రంఘనాథ వాచస్పతి, అమరేవం ప్రభాకర రావు, మల్లికార్జున్ మొదలైనొల్ల పాండిత్య ప్రభావం నన్ను ఎంతో ఆకట్టుకుంది. సదువు తప్ప మరో ఆలోచన లేదు. ఆ కాలేజిలో ఆ ఏడాది నాదే పస్టు ర్యాంకు. రెండవ ఏట నుంటి రోజంత ప్రైవేట్ ఇస్కుల్లో పనిజేస్తు, సదువుకున్న. ఓరియంటల్ డిగ్రీ కాగానే తెలుగు పిండిత శిక్షణ (టి.పి.టి) పూర్తి జేసిన. వెంటనే ఉస్మానియా విశ్వద్యాలయంలో ఎం.ఏ తెలుగు సీట అచ్చింది. అక్కడి ప్రొపెసర్లలో డా॥ సాగి కమాలాకర శర్మగారు నన్ను చేరదీసి భాషపై ఎంతో మమకారాన్ని కల్గించిండు. పదంపై ఎంతో పట్టు నేర్పిండు. అక్కడే కథ, కవిత్వం, వ్యాసం రాయడం గూడ నేర్సుకున్న. తెలుగులో పి.జి. పూర్తి కాగనే ఎం.ఫిల్ లో చేరాను. ఆ సంవస్సరమే UGC NETలో ఉత్తీర్ణుణ్ణి అయిన. డా॥ సాగి కమలకర శర్మగారి పర్యవేక్షణలో ‘మహాభారతంలో సంవాదాలు - సమగ్ర పరిశీలన’ అనే విషయం మీద పి.హెచ్డి చేసుకుంటూ ఓ ప్రైవేట్ కాలేజిలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్న. వీటిన్నిటి కంటే మరో సంతోష విషయం ‘ఓపెన్ ఇంటర్, ఓపెన్ టెన్త్’ సెంటర్ను మా ప్రాంతలో మా మిత్రుడు నడుపుతుండు. అందులో మా చుట్టుపక్కల నావంటి పశుల కాపర్లనందరిని చేరిపిస్తూ వారికి పాఠాలు చెప్పె అవకాశం దొరికినందు చాల ధన్యున్ని. పి.హెచ్డి పట్టా సాధించి ఆచార్యునిగా విశ్వవిద్యాలయంలో ఉద్యోగం చేయాలనేది నా లక్ష్యం.
తెలుగు వెలుగు మాస పత్రిక
జులై 2015
(యూటూబ్ లో ఉంది. వినాలనుకునే వారి కోసం కింద లింక్)
https://www.youtube.com/watch?v=Vnkt49z6Qtw
కవితలు
ఉద్యోగం
ఉద్యోగాల నోటిఫికేషన్లు
మెరుపులుగా ఉరిమినప్పుడల్లా
మెదడులు మేఘాల వలే గర్భం దాలుస్తాయి
పరీక్షా కేంద్రాలు అన్నీ ప్రసూతి ఆస్పత్రులు
ఈనేది మాత్రం భూమే
అందరి మెదళ్ళు ఆపరేషన్ చేసుకుని
ఆరేసుకుంటారు మూడు గంటలు
ప్రయత్న ఫల సంతానం కొందరికే
ఈ ఆశతో కొన్నేళ్ళ కిందటి నుండి
వరకట్నంగా డబ్బులుపోసి కొందరు
స్వయంవరంలో ఎన్నికై మరికొందరు
సర్టిఫికెట్ల పుస్తే కట్టుకొని
పుస్తకాలతో సంసారం చేస్తున్నారు
అయినా...
కృషి పురుషత్వం మీద నమ్మకం పోయింది
పరీక్షపత్రపు పిండాలు తయారుచేసే
అధికార దేవుళ్ళకి మతిస్తిమితం తప్పింది
గ్రహణమొర్రి శిశువులుగా ఎన్నో లోపాలు
వీటన్నింటికంటే
లక్షలతో కొందరికి
టెస్ట్ ట్యూబ్ బేబీల వలె కొన్ని
ఇంకొందరికి ఐయూఐ వలె ఆన్సర్స్ దొరుకుతాయి
ఫుణ్యం, పురుష ప్రయత్నం
కలిసొచ్చినవారు కాకుండా
ఏమీ తెలియని వారికి
చదువుతో సంసారం అంటేనే భయమేస్తుంది.
తాత వైద్యం
గత కాలాన్ని దర్శించే
కళ్లద్దాలను నా మనసుకు పెట్టికొని
కొన్ని రోజులుగా
వెతుకుతూనే ఉన్నాను...
మా తాత వైద్యం
ఏమైనా గుర్తుకు వస్తదా అని !
ఊరు బయట మందకు దొడ్డి పెట్టినప్పుడు
మా పొరుగూర్ల జీవాలన్నీ
పొలిమేరకు చాలా దూరంగానే ఉంచబడేవి
మా గొర్లను కూడా
ఒంటరిగానే మేపేది
తాతకు సద్ది మోసుకువెళ్ళే నన్ను
చాలా దూరం నుండే సద్ధిని
చాలా దూరాన్నే పెట్టి పొమ్మంటుండే
అప్పుడది గొర్రెలకు
క్వారంటైన్ అని తెలియలేదు
రోగం వచ్చి తేరుకున్న
ఒక గొర్రె రక్తాన్ని తీసి
ఆకు పసర్లలో కలిపి
గోర్గల్లు కత్తితో ప్రతి గొర్రె చెవ్వుకు
కాటు పెట్టి అంటించిన నాడు
అది ఒక ప్లాస్మా థెరపీ అని
పసిగట్టి వుండుంటే
ఇప్పుడు సైంటిస్ట్ లకు
చాలా సులువై ఉండేది
ప్రతి నిమిషం ప్రకృతితో మమేకమైన
పశువుల కాపరి మా తాతకు
ఏ చెట్టు - ఏ గుట్ట నేర్పిన పాఠమో
కోతకు పనికొచ్చే జీవాలను కూడా
కొరతపడకుండా కాపాడుకునేవాడు
నేటి మనుషులు
నాటి పశువులకన్నా మిన్నగా
మరణానికి గురి అవుతున్నా
మందుకోసం ప్రయోగశాలలో
ఇంకా పాట్లు పడుతునే ఉన్నారు
సహజసిద్ధ వైద్యుడు గొర్లకాపరి-
జ్ఞాపకాల కోసం
మూలకు పడేసిన
పాత గొంగడి బొంతలను
దులిపి దులిపి చూస్తున్న.
(కరోన కవిత)
గుణపాఠం
ఊర్లన్నీ మాస్కులు కట్టుకున్నాయి
హింసించే వాహనాల రొద నుండి
విశ్రాంతి పొందాలనుకున్నాయేమో
తొవ్వలను పాత సామాన్లతో
పనికిరాని మొద్దులతో అడ్డుకుంటున్నాయి
పంట చేన్లు చేతులకు
గ్లౌజులు తొడుక్కున్నాయి
మందులతో మాలిన్యం చేసి
సారవంతాన్ని సాగనంపిన
మానవుని స్పర్శకు కొన్ని దినాలు దూరం ఉందామనుకున్నాయేమో !
గాలి ముక్కుమీద బట్టతో వడపోయ బడుతుంది
తను రూపాంతరం చెందే
చెట్లను పాడు చేసినందుకు
ఆ పని మనిషి మీదనే నెట్టేసింది కావచ్చు !!
తాగే నీళ్ళు కూడా వేడెక్కుతున్నాయి
జీవమై జీవులకోసం
తాను పారే ప్రతినదిని అపవిత్రంగా మార్చిన
మానవ ప్రవర్తనపై ప్రతీకారము కావచ్చు !!
ధ్వనులన్నీ కడపలోపటే కట్టుబడిపోయాయి
ముసలమ్మతో మూల్గే ఇల్లును
ముచ్చట్ల మాగాణం చేద్దామని !
ఇన్నాళ్లు అరుపులతో దద్దరిల్లిన
ఆఫీసులు, సంస్థలు బిక్కుమంటున్నాయి
పల్లెలో వలస వెళ్ళిపోయిన ఇండ్లలాగా !
పట్టించుకోని సాంప్రదాయాన్ని
పాత దొంతుల్లో నుండి వెతుక్కుంటున్నారు
కాళ్ళను, కడపలనూ
పసుపు నీటితో కడుక్కుంటూ !!
మనిషి ఎంత ఎదిగినా
ప్రకృతిని కాపాడుకోవడమే
ప్రాణరక్ష అనే
పాఠం ప్రతిరోజు చదువుకోవలసిందే.
(కరోన కవిత)
నన్నేమి అడగకండి
మా ఇల్లు
యంత్రశాల అయ్యింది.
ఏది నేరుగా వాడుకునే అవకాశమే లేదు
త్రాగే నీరు
ఎంత తండ్లాట పడుతుందో గాని
గరగర చప్పుడుల మధ్య రాల్చితే
గ్లాసెడు గ్లాసెడు పట్టుకుని మింగుతున్నాం.
పీల్చే గాలిని
ఎంత జెల్లెడ పడుతుందో డబ్బ
రాత్రింబగలు మోగుతూనే ఉంటుంది
కమ్ముకున్న విషాన్ని కాస్త కలరు మార్చి ఇస్తుంది.
తిండి అంటారా !
వండింది, వండంది
కొన్ని ఓవెన్లో
కొన్ని ఫ్రిజ్లో
సహజత్వాన్ని చంపేసి
పిప్పిని తినడం.
ఇక్కడ రెండే కాలాలు
ఏసి నడవడం ఆపిన వెంటనే
రూమ్ హీటర్లు మొదలు పెట్టాల్సిందే
దేహం లోపల చలివేడితో సంబంధం లేదు
బయటనుండి పూసుకోవల్సిందే.
ఒళ్ళు తుడిచే నీల్లేకాదు
బోళ్ళు కడిగే నీల్లుకూడా
కరంటును తాకి కాగాల్సిందే.
బట్టలు బండలకు తాకడం
దండాలకు ఆరబెట్టడం
ఎప్పుడో మరిచిపోయాయి.
కండ్లు, చెవులు
నిరంతరం ఎరుపెక్కుతూనే ఉన్నాయి
మా ఇంట్లోకి సహజకాంతి
మాట్లాడే మిత్రులు
నేరుగా రాక చాలా రోజులవుతుంది.
ఇదే గొప్ప బతుకు అని గప్పాలు కొడుతుంటే
ఏడుపులాంటి నవ్వొస్తుంది
తప్పదుకదా! బతుకుతున్నాం
కానీ...
బాగున్నావా? అని నన్ను అడగకండి
నేను ఢిల్లీలో ఉంటున్నాను.
చెట్టే ఆదర్శం
ఇగురించె చిగురును చూస్తే
వినయం ఏమిటొ తెలిసింది.
పొడుచుకు వచ్చెడి ధైర్యం ఉన్న
అది దండం పెడుతూ పుడుతుంది
కొమ్మలు, కాయలు ఎన్నో పెరిగి
గమ్మత్తుగ అవి గాలికి ఊగిన
చలనం లేని మొదలును చూస్తె
ఓరిమి ఎమిటో తెలిసింది
కాయమె కలప, గాయం ఔషధం
రాతిరి వేలలొ పక్షుల గూడై
ఎండకు నీడై, ఆకలి తీర్చె పండును చూస్తే
త్యాగమన్న, ఉపయోగమన్న
అది నీవల్లె నాకు తెలిసింది
మూర్ఖులు కొందరు మొదలె నరికిన
మరణం తెలియక తిరిగి ఇగురచ్చి
కొరికిన, చిదిమిన, మేసిన, విరిసిన
ఆగకుండ నీవు ఎదుగుతూ ఉంటే
కర్తవ్యం ఏమిటొ తెలిసింది
ఆరాటం ఏమిటొ అర్థమయింది
పైకెదగాలి, పైకెదగాలని.
అన్యాయం
నా ఊరు
మొసళ్ళ చెరువులో
తేలియాడుతున్న
మేకపోతు కళేబరం
పీక్కతిన్న వాడికి పీక్కతిన్నంత
వర్షమా...
వర్షమా! నీవింత కురిసితే జనులంత
పరేషాను అయిపోతరమ్మా !
కురిసి మురిపించేది మరచి, ఏడిపిస్తే
కరువుకంటేక్కువ కష్టమైపోతుంది.
చెరువు నిండిరదని నారు పోసిపెడితె
గండిబడి భూమంత ఇసుక కప్పేసింది.
మొరము భూములు దున్ని మొక్కజొన్నా లేస్తే
నీరెక్కి మక్కంత కూరుకు పట్టింది.
చినుకెనుక చినుకుకు చెట్టుకే వనుకచ్చి
దారికడ్డం పడి దద్దరిల్లుతుంది.
వనుకు విడవక, గుడిసెలగ్గి రాజక కడుపు మెతుకు లేక కాలి అలమటస్తున్నది ॥వ॥
పంచకుండే కుక్క కడప అంచుకు వచ్చి
ముడుచుకుని గునుపు పెడుతుంది.
దండెమెక్కిన కోడి ముక్కు ఈకలో చొప్పి
గింజబుక్కాకుండా గుంజుకు వస్తుంది.
వనికి దుడ్డెచచ్చి, బాలింత బర్రెమో
పాలుతన్ని అది పసక మానేసింది.
సూర్యుడు కనరాక వెలుగన్నది లేక రాత్రి, పగలు తేడ రహితమై పోయింది. ॥వ॥
చుక్క యాళ్ళకు లేచి చక్కగా పాడేటి
చిన్న పిచ్చుకలేడ కన్నుమూస్తున్నయో!
సంధ్య యాళ్ళకు అరిచె నక్కలటువంటివే
బండ సంధుల జొచ్చి బంధిలై పోయినయో!
జూలుగల గుడ్డెలుగు బారెడీకల నెమలి
తడచి ముద్దై ఏడ ముడుచుకుని పన్ననవో!
చల్లగుండుటే కాక చడిచప్పుడులేక ఏమైతదో అనే దిగిలు మిగిలిపాయె ॥వ॥
తాత గట్టిన మట్టి గోడల మిద్దెలు
కూన పగిలి తడిచి కూలిపోతున్నవి.
ఏటి ఒడ్డుకున్న పల్లెపట్నాలెన్నో
నీరు నిండి నిస్సారమై పొయినవి.
ఆలయపు ప్రాంగాణమురిసి పాకురెక్కి
పంతులడుగు పెడితే పడిపోయెటట్లయ్యె
స్నానాది పూజలు సకల కార్యాలన్ని నీకుమాకు లేక, శోకమే మిగిలెను ॥వ॥
వరద పొంగుకు ఎన్నో వంతెనలు వంగగ
నీరుదుంకుకుంటు పారిపోతావుంది.
తారురోడులన్ని తారుమారులయి
ఏకంగ యమపురికి చేరవేస్తున్నవి.
భూమంత నీటితో బుగ బుగ పొంగితే
పక్క దారులు లేక జిక్కి పోతున్నారు.
ఇంట్లో అడుగు దీసి ఇవతలేద్దామంటే, మనసొప్పక ఎంతో మదన పడుతున్నారు ॥వ॥
భీద భారత దేశమందు అనాదలు
గతిలేక రోడ్ల మీదుండ్రు
వారి జీవన పోరంత పొట్టకోసమెగాని
జిట్టెడు బట్టెరుగనోళ్ళు
ఎండ చలికి తోలు ఏమయిందో గాని వానపడితే అంత పగిలి పోతావుంది ॥వ॥
మల్లెమొగ్గవలె పిల్లలు సిద్ధమై
బడికి పోదామని బస్సుదగ్గరికురుక
తడచి వనుకు పుట్టె, దగ్గు పడిశం బట్టె
బస్సుఎక్కే లోపే బట్టలకు బురదాయె.
ఇంటికచ్చి బట్ట ఇడిచి కడుదామంటే
ఏది చూసిన ముక్క వాసనే రావట్టే.
బ్రతుకులు, బట్టలు మెత్తబడి పోవట్టే ఎన్నిరోజులింక ఏడిపిస్తావమ్మా ॥వ॥
వెతుక్కుంటున్న
పని కోసం
బతుకును తాకట్టు పెట్టి
పల్లెను విడిచి
ఢిల్లీకి వచ్చాను
బతుకమ్మ నాకు బంగారమైంది
గుంటగుంటకు తిరిగి గునుగుపువ్వు
పొదపొదకు తిరిగి తంగేడుపువ్వు
కోసుకచ్చి గంపలు నింపిన నాకు
ప్లాస్టిక్ తీగలతో, రంగుల వెలుగుతో
నా రంగును పోగొట్టుకున్నాను
బతుకమ్మ నాకు బంగారమైంది
అక్కాచెల్లెండ్ల ఆత్మీయ ఆలింగనాలు
వదినెమరదండ్ల చిలిపి పలకరింపులు
వరుసకలపని మనిషిలేని ఊరు
పక్క ఇంటివారు కూడా పలకరించని
సంస్కృతిలో నేను భాగమైనాను
బతుకమ్మ నాకు బంగారమైంది
పచ్చిపులుసు, పాలకూర
పెసరుపప్పు, చక్కర బెల్లం
చేతినిండ పంచుకుని
కట్టమీద కూసోని కడుపునిండ తినిపించే ఊరు
కుల్చా, కచోరి, పరోటలతో
ఆరోగ్యాలను కూడా అరగదీసుకుంటున్న
బతుకమ్మ నాకు బంగారమైంది
కాళ్లుచేతులు కలుపుతూ, ఆడుతూ
స్వరాలు సప్తరాగాలై పాడుతున్నపుడు
తిలకిస్తే పులకింప చేసే ఊరు
కంప్యూటర్ లో పాటలు పెట్టుకుని
కదలని కుర్చీలో బంధీనైన
బతుకమ్మ నాకు బంగారమైంది
పూలతో బతుకమ్మను పేర్చిన చేతులు
ఆ జ్ఞాపకాలతో ఈ యేట కవితను పేర్చుకుంటూ
కాలం గడుపుతున్న
మా ’అమ్మ’కు, ‘బతుకమ్మ’కు
దూరమైన బాధతో
భారమైన గుండెతో
దూరంగున్న బతుకమ్మను
బతుకుదారిలోనే వేరుకుంటున్న
వెతుకుంటున్న.