ఎలక్షన్ వ్యాపారం
పాత ఇటుకల గోడకు శివారు చేస్తున్నాడు రామాచారి. రాలిపడ్డ సిమెంటునంత ఎత్తుకుంటూ టాపితో మెత్తుతుండు. ముఖమంతా వాడిపోయింది. కళ తప్పింది. మునిపెటి లెక్క లేడు. చేతి కింద పని చేస్తున్న శంకరవ్వ మాత్రం సంతోషంగా ఫోన్ మాట్లాడుకుంటూ సిమెంటు కలుపుతుంది. అంతలోనే అటునుంచి మల్లయ్య స్కూటీ మీద వస్తుండు. రామాచారిని చూడగానే స్కూటీ ఆపి ‘‘ఏమైంది తమ్మి పొద్దుగల్ల ఇంట్లో బాగా లొల్లి ఇనిపిచ్చింది’’ అన్నాడు. తెల్వంది ఏముందన్న మీ మరదలు లొల్లి పెట్టుకుంటుంది. మొన్న సర్పంచ్ ఎలక్షన్ల నిలబడ్డప్పటినుంచి ఒకటే లొల్లి. మనసు పట్టనిస్తలేదు. అయ్యో తమ్మి ఏమైంది? ఏం చెప్పాల్నే 12 లక్షల అప్పు అయ్యింది. నా కష్టం నేను చేసుకుని బతుకుతున్న వాడిని. ఇంట్ల పెద్దమనుషుల పానాలు బాగలేక రెక్కల కష్టంతో వాళ్లను దవఖాండ్లల్ల చూపించుకుంటూ కాపాడుకుంటున్న. అట్లాంటిది నన్ను తెచ్చి మందిల పడేసిండ్రు. పైసలు నేను పెట్టుకుంటా అని చెప్తే ఆ మంజీర రెడ్డి మాటలు విని మోసపోయిన. ఎక్కడ ఎన్ని ఖర్చుపెట్టిండో, ఎట్ల ఖర్చు పెట్టిండో! లెక్క లేదు పత్రం లేదు. కానీ మొత్తం 11 లక్షలు అని చెప్పిండు అన్న. కాదనస్తదా? ఎదురు తిరిగి అడగనిస్తడా? ఆయన మీదికి తిరగబడి మా లాంటొళ్లం బతుకుతమా? లెక్కలు అడగలేక వాడు చెప్పింది విని తలికాయ ఊపి కాగితం రాస్తే సంతకం పెట్టి వచ్చిన. ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు అన్న. చిన్నప్పటి నుంచి ఆయన మోసం పనులు చూసి కూడా నేను మోసపోయిన. ఆయన చేతుల మా తాతలు మోసపోయిండ్రు, మా అయ్యలు మోసపోయిండ్రు, నేను కూడా మోసపోయిన. ఎక్కతక్క కాకున్నా ఒక మూడు లక్షల వరకు అబద్ధం చెప్పిండన్న. ఆయన ఎనుక ఏం పని చేయకుండ తిరిగే సన్నాసులకు యాడాది ఖర్చులకు సరిపోయేటంత దాసుకుండ్రు అన్న. ఆనికిచ్చినం, ఈనికిచ్చినం అన్నరు. ఓనికి ఇయ్యలేరు. దొంగలెక్కలు చెప్పిన ఆ పైసలను ఏడాది అయినంక ఇస్తా అంటే ఒప్పుకోలేడన్న. మిత్తికి రాసుకో అన్నాడు. లేదంటే ఇంత భూమి రాసియ్యు అన్నడు. గొంతుల ముల్లు ఇరికినట్లు అయింది. నోరుమూసుకుని మిత్తికి రాసిచ్చి అచ్చిన. ఇంటికచ్చి చెప్తే ఒకటే లొల్లి. మొదలే మీ మరదలు వద్దని చెప్పింది. నేను ఇనకపోతి. నా జీవితంలో కోలుకొని దెబ్బ అన్న ఇది. నా చేతిలో నుంచి ఒక లక్ష పెట్టిన. మొత్తం 12 లక్షలు అయినయే. గెలిసుంటే నైనా నాలుగు రూపాలు సంపాదించుకుంటుంటి.
అయ్యో తమ్మి ఆని గుణం నీకు తెల్వదా? వాని బోనులోకి పోయిన వాడు ఎవడిని బాగుపడనియ్యడు. గెలిచిన పైకిరానియ్యడు. ఓడిన బాగుపడనియ్యడు. ఒక వేళ నీవు సర్పంచ్ గా గెలిసుంటే ఐదేండ్లు వాడికి బానిసగ పడి ఉండే వాడివే. అన్ని పనులల్ల ఏలు పెడ్తడు. వచ్చే రూపాయి నుంచి సగం అడుగుతడు. ఇయ్య అంటే కుదురదాయే. ఎలక్షన్ ల ఖర్చువెట్టిన పైసలు బాకుంటివి. పొద్దున లేచి గ్రామ పంచాయతీ దగ్గరు పోకముందే వాడి ఇంటికి పోవాలె. ఏ ఆఫీసర్లు వచ్చిన వాడిదగ్గరే తీసుకపోవాలె. ఒక్క రకమైన హింస కాదు తమ్మి. ఇంతకు ముందు ఎన్నో చేసిండి. ఎన్నో చూసినం. వీళ్ళిద్దరి ముచ్చట నడుస్తనే ఉంది అటునుంచి భీమ్లనాయక్ వచ్చిండు.
నిజమే రామాచారి మల్లన్న చెప్పేది. మస్తు రోజులకింద జడ్.పి.టి.సి. ఎస్టి రిజర్వేషన్ వస్తే ఓ మంచి మనిషిని ముంగటికి నూకిండు. గిట్లనే ఇన్ని పైసలిచ్చి, ఎగిరిచ్చి, రెచ్చగొట్టి నిలవెట్టిండు. గెలిసిండు. కాని ఆయనకు స్వేచ్ఛలేదు, స్వాతంత్ర్యం లేదు. నలిసినలిసి సంపిండు. తిరగవడ్తే తొక్కడం మొదలు పెట్టిండు. మంచి రాజకీయ భౌవిషత్ ఉన్నోడు కాని అన్ని మానుకుని వ్యవసాయం చేసుకుంటుండు. సర్పంచ్ కు ఒకసారి ఎస్టి రిజర్వేషన్ వచ్చింది. ఆయనే ఒక అమాయకున్ని రోడ్డుమీదికి తెచ్చిండు. సర్పంచి అయినంకా మొదటి నాలుగేండు ఊరికి ఒక్క పని చేయనియ్యలేడు. ఆయనను ఏమి బాగుపడనియ్యలేదు. చివరికి వాడితో కంటుకు అయిన తర్వాతనే ఈ సర్పంచి ఇంత తెల్లగ బతికిండు. ఊర్లే నాలుగు పనులు చేసిండు. మొన్నటిదాక ఉన్న ఓ ఎంపిటీసి పరిస్థితి కూడా గదే కదనే. ఉషారు పిల్లగాడు మంచి లీడర్ అయితడు అనుకున్నం వాడిని బరుబత్తల్ చేసిండు. చివరికి ఇంత భూమికూడా అమ్మిపిచ్చిన సంగతి తెల్వదాయే. అనుకుంటూ ముగ్గురి ముచ్చట నడుస్తుండగానే నడుమల పక్కూరి పర్వయ్య అచ్చి కలిసే.
నిజమేనే పెద్దమనుషులు మీరంటున్నది. అంతెందుకు మొన్నడిది మొన్న మా ఊర్లే ఉపసర్వంచ్ ను రెచ్చగొట్టి, అది జేపిచ్చి, ఇది జేపిచ్చి పాపం ఆయనను ఊర్లే లేకుండా చేసిండు. అప్పుల పాలై హైదరాబాద్ పోయి బతుకుతుండు. మా సర్పంచ్ ఉషారు మనిషై ఆని గాలానికి పడలే. ఆయకు దోసినంత చేసిండు. ఓని ఇండ్లళ్ల మట్టికొట్టలే. మొన్నటి దాక ఉన్న మీ సర్పంచ్ విషయం మనకు తెల్సిందే నాయే. వాళ్ళ పాలొల్లే తిరగబడే దమ్ముంది అని ఎన్నుకుంటే ఆమే పోయి గదే కొంపల సొచ్చింది.
అంతా విన్న మల్లయ్య ఓ నిట్టూర్పు తీసుకుండు. మళ్ళీ తేరుకోని అంతెందుకు తమ్మి వానికోసం దోతులు చింపుకోని కుస్తీలు పట్టినోళ్లు, వాని చేను పనిచేసినోళ్లు ఎవర్ని ఉద్దరియ్యలేడు. ఎవ్వరి పిల్లల చదువుకు ఉపయోగపడలేడు. మూర్ఖుడు తమ్మి. ఎంతమందిని మోసం జేసిండు నీకు తెల్వదా? భూముల లెక్కలు తెలిసినోడివి. ఎన్ని ఎకరాలు గుంజుకుండు నీకు తెల్వందా. ఆనికి లాభమే ముఖ్యం. పైసల ముంగట దోస్తులు, పాలొళ్లు, పనిపొంటి వచ్చెటొళ్లు ఎవ్వరు కనిపియ్యరు. వీడికి చిన్నప్పటి దోస్తి పలాన నారాయణది 3 ఎకరాలు గుంజుకుండు. ఆ ఫికర్ మంచ్చంపట్టి చనిపాయె నీకు తెలువంది ఏముంది తమ్మి.
అన్న నువు చెప్పినవి అన్ని నాకు తెలిసినయేనే. కాని ఇంటికి పిలిసి కమ్మక మాట్లాడితే కరిగిపొయినా. ఈ సర్వంచ్ ఎలక్షన్ లో నా మీద ఇంత వ్యాపారం చేస్తడని అనుకోలేదే. నిలవడంగనే నాలుగు గుంటల భూమి అమ్ముకొని నా చేతుతోని నేను ఖర్చు వెట్టిన బాగుండు. నాకు అప్పుడు అర్థం కాకపాయే. వాడు ఏమి ప్రచారం కూడా చెయ్యలేదే. వాడి చేసిందల్ల నా మీద వ్యాపారమే. అప్పుడిప్పుడు నా ముంగట నలుగుర్కి ఫోన్ చేసిండు. కొంత మందిని దగ్గరికి పిలిపించుకుండు. అమాయకులను బెదిరించిండు. ఇవన్ని చూసి మంచిగనే సాయం చేస్తుండు అనుకున్న. ఇరవై మందికి ఫోన్లు చేసి ఇన్ని లక్షల వ్యాపారం చేస్తాడని అనుకోలేదే. ఆ లీడర్ ని కలిసివచ్చిన, ఈ లీడర్ కి చెప్పి వచ్చిన అని మెల్లెగ పునికిండే. వాడి ఎనుకుండే మందు, మాంసానికి, మంది రక్తానికి మరిగినొళ్ళు ఆ కాగితాలు, ఈ పోస్టర్లు, కొన్ని ప్లెక్సీలు అని పీకల దాక మింగిండ్రు అన్న. మా కలకల మంచిది కాదన్న. వాళ్ళ పిల్ల పిల్లల తరాలకు తాకుతది. ఊకో తమ్మి బాధపడకు. అన్ని తెలిసినోడివి, అన్ని చూసినోడివి. గా రొంపిల ఎట్లవడ్తివి తమ్మి. వాడి ఎంబడి తిరిగినోన్ని ఒక్కోడినైనా మంచి లీడర్ గా ఎదగనివ్వలేడు. వాడు ఎదగనివ్వడు. వాడికి బానిసాగే వాని చుట్టు తింపుకుంటడు. వాడివళ్ల మన చాలా మందికి స్వాతంత్ర్యం రాలేదు తమ్మి. పనికి బానిసలు అయితే బాధపడలేం కాని రాజకీయ బానిసలు అయితే సిగ్గేస్తుంది తమ్మి. ఏం బాధపడకు తమ్మి ఒకరోజు ఇంటికి వచ్చి మరదలు నచ్చచెప్పి వస్త.