తెలుగు సాహిత్య పరిశోధన వైభవ 'సారాంశం'
సాహిత్య పరిశోధన చరిత్రలో 'సారాంశం' వర్ధమాన పరిశోధకులకు శిక్షణా వాచికం. సాహిత్య జిజ్ఞాసువులకు షడ్రసోపేతమైన విందు భోజనం. విశ్వ విద్యాలయ థీసేస్ సెక్షన్ లో, గ్రంథాలయాల్లో దుమ్ము కొట్టుకుపోయిన అపురూప సిద్ధాంత గ్రంథాల సారాంశాల గ్రంథమే ఈ సారాంశం. బిరుదురాజు రామరాజు, సి. నారాయణరెడ్డి, పల్లా దుర్గయ్య, అమరేశం రాజేశ్వరశర్మ, ఎస్వీ. రామారావు, ఎన్. గోపి, కె.శ్రీనివాస్, పిల్లలమర్రి రాములు, వెలుదండ నిత్యానందరావు, యశోదారెడ్డి, సిధారెడ్డి, ఎస్వీ, రవ్వా శ్రీహరి మొదలైన వారు చేసిన ప్రామాణిక సిద్ధాంత గ్రంథాల పరిచయాలు చదవడం ఎంతో అధ్యయనం చేసిన అనుభవాన్ని ఇస్తుంది. పరిశోధనాసక్తితో, సాహిత్య రంగంలో కృషిచేసిన ప్రముఖ కవులు, విమర్శకులు, పరిశోధకులు, అధ్యాపకులైన వారితో వ్యాసాలు రాయించడంతో ఈ గ్రంథం విలువైనదిగా రూపుదిద్దుకుంది.
ఒక సిద్ధాంత గ్రంథ రచనా ప్రణాళిక ఎలా ఉండాలి, అధ్యాయాల విభజన ఎంత కీలకం, పాఠ సూచికల ప్రాముఖ్యత, వాటిని అర్థం చేసుకునే తీరు, ఉపయుక్త గ్రంథాల ప్రాముఖ్యత, ఉపసంహారంలో చెప్పవలసిన విశేషాలు ఒకటేమిటి ఒక్కొక్క వ్యాసకర్త తమ పరిధిలో పరిమితితో పరిచయం చేసిన తీరు ప్రసంశనీయం. వ్యాసకర్తల ఎంపికలో సంపాదకుడు అట్టెం దత్తయ్య ఎంపిక ఔచిత్యనీయం. వేయి ఏండ్ల తెలుగు సాహిత్య వైవిధ్యమం ఈ రెండు సంకలనాల్లో సంపూర్ణంగా గోచరిస్తుంది.ఇతిహాసాలు, ప్రబంధాలు,కావ్యాలు, శతకాలు, జానపద విజ్ఞానం, గేయాలు, నాటకాలు, భాషా, వ్యాకరణం, ఛందస్సు, లక్షణ శాస్త్రం, కథలు, నవలలు, ఆధునిక కవిత్వం, ఆత్మకథలు, యాత్రా చరిత్రలు, తులనాత్మక పరిశీలనం మొదలైన అంశాలపై జరిగిన పరిశోధనలు ఈ గ్రంథంలో పరిచయమయ్యాయి. నూటపది సిద్ధాంత గ్రంథాల సారాంశాన్ని చదువుతుంటే విశ్వ విద్యాలయాలలో జరుగుతున్న పరిశోధనల మీద ఉన్నతమైన గౌరవం కలుగుతుంది. ఒక పరిశోధక విద్యార్థిగా ఉంటూనే అట్టెం దత్తయ్య ఇంతమంది ప్రముఖుల చేత అనేక వ్యయ ప్రయాసలకోర్చి ఈ రెండు సంకలనాలను తీసుకురావడం అభినందనీయం.చిన్నమాట.
'సారాంశం'
(పరిశోధన గ్రంథాలు-పరిచయ వ్యాసాలు, రెండు సంపుటాలు)
సంపాదకుడు: అట్టెం దత్తయ్య
1200 పేజీలు; వెల: 720;
డా.ఎస్.రఘు
తెలుగు సహాయాచార్యులు,
ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్
(ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో ముద్రితమైంది)
తెలంగాణ విశిష్ట పరిశోధనల ‘సారాంశం’
పరిశోధన ఒక తవ్వకం పని. అన్వేషణ దాని లక్షణం. సత్యావిష్కరణ దాని లక్ష్యం. రంగం ఏదైనా ఒక కొత్త సత్యాన్నో, సౌకర్యాన్నో సమాజానికి అందించడం పరిశోధన నిర్వర్తించే కర్తవ్యం. ఎంచుకున్న అంశాన్ని విభిన్న కోణాలలో దర్శించి, శాస్త్రీయ విశ్లేషణ చేస్తూ ప్రామాణిక పద్ధతుల్లో సిద్ధాంతీకరణ చేయడం సాహిత్య పరిశోధన అనవచ్చు. జిజ్ఞాస, సత్యాన్ని శోధించే శ్రద్ధ, విశ్లేషణా సామర్థ్యం, సాధికారికంగా నిరూపించగల నైపుణ్యం ఉన్న పరిశోధకులు ఉత్తమ పరిశోధకులుగా సాహిత్య చరిత్రలో నిలిచిపోయారు.
తెలుగులో చిలుకూరి నారాయణరావు మొదలు ఇప్పటి వరకు వేలాది మంది పరిశోధకులు, పండితులు ప్రాచీన, ఆధునిక సాహిత్య మర్మాలు వెల్లడి చేస్తూ అనేక రచనలు చేశారు. అకాడమిక్ గానూ, అభిరుచితోనూ తొలితరం పండితులు చేసిన పరిశోధన, విమర్శ తెలుగు సాహిత్యంపై కొత్త వెలుగులు ప్రసరింపజేశాయి. ఆయా కావ్యాలు సృజించబడిన కాలం నాటి రాజకీయ, సామాజిక, చారిత్రక, సాహిత్య వాతావరణానికి సంబంధించిన అనేక అంశాలను ఈ పరిశోధనలే వెలుగులోకి తెచ్చాయి. ఆ పరిశోధనల ఆధారంగానే మనం ఆయా రచనలను ఎట్లా అర్థం చేసుకోవాలనే అవగాహనను పొందుతున్నాం. సామాన్య పాఠకులకు ఈ పరిశోధకులే కవిత్వ లోతులును దర్శింపజేస్తున్నారు. సాహిత్యాంశాల్ని నిరంతరం శోధించడం, వాటిని భిన్న కోణాల్లో విమర్శించడం నిరంతరంగా జరుగుతున్న, జరగవలసిన ప్రక్రియ.
ఈ పరిశోధనల కొనసాగింపును ఎప్పటికప్పుడు పరిశీలన చేయవలసిన అవసరం ఇప్పటి కాలానికి ఉన్నది. అంటే పరిశోధనలు జరుగుతున్న తీరును గమనించడం, పరామర్శలు చేయడం వల్లనే ఆ పరిశోధనలు ప్రామాణిక దిశలో సాగే అవకాశమున్నది. ఒక పరిశోధకుని అవగాహనకు అందని పార్శ్వం మరో జిజ్ఞాసువు కంటికి ఆనవచ్చు కదా! కనుక పరిశోధనల మీద విమర్శలు కొనసాగినప్పుడే సాహిత్యానికి పుష్టి చేకూరుతుంది.
తెలుగులో జరిగిన పరిశోధనల మీద జరిగిన పరిశీలనలను నమోదు చేసే కృషి గతంలో తెలుగు అకాడమీ చేసింది. “తెలుగు పరిశోధన సంహిత” పేరుతో పరిశోధన, పట్టభద్రుల పరిశోధకుల పరిశోధనాంశం- సంగ్రహ వివరణలు పేరుతో 1975, 86లలో రెండు సంపుటాలుగా ప్రచురించింది. 16 విశ్వవిద్యాలయాలకు సమర్పించిన 2007 సిద్ధాంత వ్యాసాలపై ప్రాథమిక సమాచారంతో రాసిన పరిచయాలు అందులో ఉన్నాయి. అలాగే 2004లో జానపద విజ్ఞానంలో పరిశోధనలు సంక్షిప్త వివరణలు పేరుతో 126 పి.హెచ్.డి. సిద్ధాంత వ్యాసాల వివరణలతో దాక్షిణాత్య జానపద విజ్ఞాన సంస్థ ప్రచురించింది. కానీ అందులోని అంశం జానపదం మాత్రమే. తర్వాత సిపి బ్రౌన్ అకాడమీ వారు ‘తెలుగు పరిశోధన వ్యాసమంజరి’ పేరుతో రెండు సంపుటాలు ప్రకటించారు. ఆచార్య వెల్దండ నిత్యానందరావు ‘విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన’ కూడా ఈ రంగంలో ఉన్న ఆచార్యులకు, పరిశోధకులకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న రచన. ఇవన్నీ పరిశోధనల సమాచారం, సంక్షిప్త పరిచయాలను అందించిన గ్రంథాలు.
ఆ వరుసలో మరో ముందడుగు డా.అట్టెం దత్తయ్య వెలువరించిన ‘సారాంశం’. సారాంశం - 1, సారాంశం - 2 పేర్లతో వెలువడ్డ ఈ సంపుటాల్లో 1216 పేజీలున్నాయి. వీటిలో తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలకు సమర్పించిన 110 ముద్రిత పరిశోధన గ్రంథాలను పరిచయం చేస్తూ రాసిన వ్యాసాలున్నాయి. ధ్రువ ఫౌండేషన్, ప్రణవం పబ్లికేషన్స్ తరఫున ప్రచురించారు. ఈ పరిచయ వ్యాసాలు రాసిన వారిలో ప్రసిద్ధ ఆచార్యుల నుంచి పరిశోధక విద్యార్థుల వరకు ఉన్నారు.
ఈ బృహత్ గ్రంథాల రూపకల్పనకు ప్రణాళిక పకడ్బందీగా జరిగినట్లు ఈ సంపుటాలు తెలుపుతున్నాయి. తెలంగాణ తెలుగు సాహిత్యంలో చోటు చేసుకున్న విభిన్న ప్రక్రియలు, కవిత్వ నిర్మాణం, ప్రభావం, తెలుగు సాహిత్యానికి వెలుగులిచ్చిన రచయితలు, గేయ కవిత్వం, భాష, ఛందస్సు, వ్యాకరణం, అలంకారం, నవలలు వంటి అంశాల మీద పిహెచ్డి, ఎం.ఫిల్. పరిశోధన సిద్ధాంత వ్యాసాలను ఎంపిక చేసుకున్నారు.
మొదటి సంపుటంలో ప్రాచీన సాహిత్య పరిశోధన మీద 17, ఆధునిక సాహిత్య పరిశోధనల మీద 16, జానపద సాహిత్య పరిశోధనల మీద 11, భాష, వ్యాకరణాంశాల మీద 4, లక్షణ శాస్త్ర సంబంధమైన వాటిపై రెండు పరిశోధన గ్రంథాలను ఎంచుకున్నారు. అలాగే రెండో సంపుటంలో నవల మీద ఆరు, కథ మీద మూడు, దినపత్రికల మీద రెండు, జిల్లాల సాహిత్యం మీద మూడు, గేయ రచన మీద 14, ఇంకా ఇతర సిద్ధాంత గ్రంథాల పరిచయ వ్యాసాలున్నాయి. ఒక్కో సంపుటంలో 55 చొప్పున 110 సిద్ధాంత గ్రంథాల మీద రాసిన వ్యాసాలున్నాయి. తెలంగాణ సాహిత్య అకాడమి తొలి అధ్యక్షులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి ఆలోచన, సాహిత్య పరిశోధకుడు డాక్టర్ అట్టెం దత్తయ్య ఆచరణ వల్ల ఈ ‘సారాంశం’ రూపుదిద్దుకున్నది.
సిద్ధాంత వ్యాసాలను ఎంపిక చెసుకున్న తర్వాత సంపాదకుడు పరిచయ వ్యాసాలలో ఏకరూపత సాధించడం కోసం పది అంశాలతో ఒక ఛట్రం తయారుచేసుకున్నారు. ‘1.ప్రాథమిక సమాచారం (పరిశోధకుడు, పర్యవేక్షకుడు, అంశం, విశ్వవిద్యాలయం, అవార్డైన సంవత్సరం, పట్టిన కాలం, ముద్రణ విశేషాలు) 2. పరిశోధకుడు అనుసరించిన పద్ధతులు (పరిశోధన పరిధులు, సమాచార సేకరణ పద్ధతులు, సమాచార విశ్లేషణ పద్ధతులు) 3. పరిశోధకుడు అధ్యాయాల విభజనలో పాటించిన పద్ధతి 4. అధ్యాయాల్లో చర్చించిన అంశాల పరిచయం 5 ఆ రంగంలో ఆ సిద్ధాంత గ్రంథ ప్రత్యేకత 6. ఆ సిద్ధాంత వ్యాసం పూరించిన ఖాళీలు 7. పరిశోధన ఫలితాల క్రోడీకరింపు 8. పరిశోధన రచనా శైలి 9. భావి పరిశోధకులకు సలహాలు 10 తర్వాత పరిశోధన రంగంపై చూపిన ప్రభావం” ఇవీ సిద్ధాంత గ్రంథ పరిచయంలో ప్రస్తావించాలని నిర్దేశించుకున్న అంశాలు. వ్యాస రచయితలందరూ దాదాపు ఈ నియమాలను పాటించారు.
తెలుగు సాహిత్యంలోని చాలా ప్రక్రియల్లో తొలి పరిశోధకులు తెలంగాణ నుంచే ఉన్నారని ‘సారాంశం’ నిరూపిస్తున్నది. జానపద గేయ సాహిత్యం మీద బిరుదురాజు రామరాజు, ప్రబంధ వాజ్మయం మీద పల్లా దుర్గయ్య, శతక వాఙ్మయం మీద గోపాల కృష్ణారావు, ఆంధ్ర వ్యాకరణ వికాసం మీద అమరేశం రాజేశ్వర శర్మ, తెలుగులో సాహిత్య విమర్శ పై ఎస్ వి రామారావు, అచ్చ తెనుగు కృతుల మీద కెవి సుందరాచార్యులు, తెలుగులో యాత్రా చరిత్రల మీద మచ్చ హరిదాసు, పేరడీల మీద వెల్దండ నిత్యానంద రావు ఇట్లా ఎన్నో ఉదాహరించవచ్చు. ఈ పరిశోధకుల కృషి చరిత్రాత్మకమైనది. మరో విశేషమేమంటే తెలంగాణ నేల మీద జరిగిన తెలుగు సాహిత్య పరిశోధనలు అత్యధికం ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా జరిగాయి. వినూత్న అంశాల మీద పరిశోధన చేయించడంలో ఉస్మానియా తెలుగుశాఖనే అగ్రగామిగా నిలుస్తుంది అనడంలో అత్యుక్తి లేదు.
మొదటి సంపుటానికి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి రాసిన ‘పరిశోధనల సారాంశం’ తెలుగు సాహిత్యంలో జరుగుతున్న పరిశోధనలు నిష్పక్షికంగా వివరిస్తూ పరిశోధనల మీద ప్రామాణిక పరిశీలనలు చేయాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పారు. రెండో సంపుటంలో బుక్క బాలస్వామి అన్నట్లు ‘ఈ రెండు వ్యాస సంపుటాలు అపూర్వమైనవి. అమూల్యమైనవి. అలాగే డా.అట్టెం దత్తయ్య ‘సారాంశ లోచనం, సారాంశ రోచనం’ పేర్లతో రాసిన సంపాదకుని మాటల్లోనూ ఆయకున్న సాధికారత, ఎంపిక చేసుకున్న సిద్ధాంత వ్యాసాలు, రచయితల పట్ల స్పష్టత, నిర్దుష్టత ఎంతగా ఉందొ తెలుపుతాయి.
ఈ రెండు గ్రంథాలను పరిశోధకులు మాత్రమే కాక తెలుగు సాహిత్య రంగంలో ఉన్నవారందరూ చదవాలి. ఇవి కొత్త పరిశోధకులకు దారి దీపాల్లా పనిచేస్తాయి. పరిశోధకుడు నిత్య విద్యార్థి కావాలి అని కూడా గుర్తు చేస్తాయి. ఇంతటి బృహత్ కార్యాన్ని తలకెత్తుకోవడం అత్యంత సాహసంతో కూడిన పని. ఒక సంస్థ చేసే పనిని ఒక్కడే పూర్తి చేశాడు. సారాంశం ఇప్పటి తరానికి గొప్ప స్ఫూర్తి. అట్టెం దత్తయ్యకు అభినందనలు.
డా. వి. శంకర్
సహాయాచార్యులు, కామారెడ్డి.
తెలంగాణ పరిశోధనల ‘సారాంశం’
దేశ వ్యాప్తంగా 1990లో మండల్ ఉద్యమం, ఫూలే శత వర్ధంతి, 1991లో అంబేడ్కర్ శత జయంతి, ఆ తర్వాత ఎల్పిజి (లిబరలైజేషన్, ప్రయివేటైజేషన్, గ్లోబలైజేషన్) ప్రభావం, తెలుగునాట వీటికి తోడు కాన్షీరావ్‌ు ఉద్యమాల ప్రభావం అన్నీ కలగలిపి బహుజనోద్యమాలకు ఊపిరులూదాయి. ఈ ప్రభావం అధ్యాపకులు, విద్యార్థులు, విశ్వవిద్యాలయాలు, అందులో జరిగే పరిశోధనాంశాలపై కూడా బలంగా ఉండింది. 1990వ దశకం నుంచి ఉస్మానియా కేంద్రంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కూడా ఊపందుకుంది. తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ ఇప్పుడే ఏర్పడింది. తెలుగు డిపార్ట్మెంట్లలో ప్రాంతేతరులపై పాఠ్యాంశాలను నిరసించింది. తెలంగాణ సోయిని ప్రోది చేసింది. ఇట్లా వివిధ విశ్వవిద్యాలయాల్లో మెజారిటీ తెలంగాణ స్కాలర్లకు ఇక్కడి అంశం తమ పరిశోధనకు కేంద్రకమైంది. ఇంకొందరికి దళిత బహుజన ఉద్యమాలు దారి చూపాయి. ఈ దశలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మారంరాజు ఉదయ ‘తెలుగు నవలల్లో తెలంగాణ జనజీవనం’ అనే అంశంపై పరిశోధన చేసి పట్టాపుచ్చుకున్నారు.
అట్లాగే యం.డి. రాజ్మహమ్మద్ ‘తెలంగాణ గిరిజనుల మౌఖిక సాహిత్యం’ అనే అంశంపై 1992లో థీసిస్ సబ్మిట్ చేసిండు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పని చేసి రిటైరైన ఎన్.ఆర్. వెంకటేశం ‘బుడిగె జంగాలుభాషా సాహిత్య సాంస్కృతికాంశాల పరిశీలన’ అనే అంశం పై విలువైన పరిశోధన చేసిండు. వీటితో పాటు అభ్యుదయ భావాలతో వి.వీరాచారి ‘తెలుగునాట సాంస్క ృతిక పునరుజ్జీవనోద్యమాలు, కవులు రచయితలు’, కథ, నవలా రచయిత కాలువ మల్లయ్య ‘తెలుగులో ప్రగతిశీల కథా సాహిత్యం’, బన్న అయిలయ్య ‘తెలంగాణాలో సాహిత్య కార్యక్రమాలు సంస్థలు’ అనే అంశంపై పరిశోధన చేసి పట్టాలందుకున్నారు. అంటే 1990ల తర్వాత తెలంగాణ స్కాలర్లు వివిధ విశ్వవిద్యాలయాల్లో ఇక్కడి ఉద్యమాలు, సాహిత్యం, సంస్థలు, కవులు, రచయితలపై ఫోకస్‌గా పరిశోధన చేశారు. అంతేగాదు దాదాపు ఇందులో ఒక్క మారంరాజు ఉదయ మినహా మిగతావారందరూ దళిత, బహుజన వర్గాల వారు కావడం విశేషం.
ఈ విషయాలన్నీ ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న అట్టెం దత్తయ్య సంపాదకత్వంలో వెలువడ్డ ‘సారాంశం’ ద్వారా తెలుస్తున్నది. మొత్తం 110 మంది తెలంగాణ స్కాలర్లు వివిధ అంశాలపై పరిశోధన చేసి పిహెచ్డి పట్టా పుచ్చుకొని, అచ్చేసిన పుస్తకాలపై విహంగ వీక్షణ వ్యాస సంపుటాలు ఇవి. దాదాపు 1200ల పేజీల్లో అచ్చయిన ఈ రెండు సంపుటాల్లో తెలంగాణ పరిశోధనా రంగం ఎట్లా ఎదుగుతూ వచ్చిందో కండ్ల మందుంచిండు దత్తయ్య. వివిధ విశ్వవిద్యాలయాల్లోని తెలుగు విభాగాల్లో గత 50 ఏండ్లుగా ఎంత పరిశోధన జరిగిందో గడచిన రెండు దశాబ్దాల్లో అంతకన్నా ఎక్కువ రీసెర్చ్ తెలంగాణ స్కాలర్లు చేసిండ్రు. విషయాల్లోనూ వినూత్నత, భిన్నత్వం చోటు చేసుకున్నది. ఈ రెండు సంపుటాలను గమనించినట్లయితే తెలంగాణలో తెలుగు సాహిత్య పరిశోధన ఎట్లా సంప్రదాయ, సనాతన మార్గాల నుంచి అభ్యుదయ, ప్రగతిశీల దారిన నడిచిందో తెలుస్తది.
1929 నుంచి (చిలుకూరి నారాయణరావు తొలి పిహెచ్డి నుంచి) దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లోని తెలుగు విభాగాల్లో దాదాపు 3000లకు పైగా పిహెచ్‌డిలు సబ్మిట్ అయ్యాయి. ఇందులో అచ్చయినవి 2000లకు మించి ఉండవు. ఇందులో తెలంగాణ నుంచి దాదాపు 1200ల మంది స్కాలర్లు పరిశోధనలు చేసి డాక్టరేట్ పట్టానందుకున్నారు అని భావిస్తే అందులో నాలుగో వంతు కూడా అచ్చుకు నోచుకోలేదంటే అతిశయోక్తి కాదు. తెలంగాణలో ఒక విశ్వవిద్యాలయంలో మొదట తెలుగు విభాగాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఉస్మానియా విశ్వవిద్యాలయానికి దక్కుతుంది. ఈ విశ్వవిద్యాలయంలో తొలి లెక్చరర్‌గా ఆంధ్రా ప్రాంతానికి చెందిన రాయప్రోలు సుబ్బారావు నియమితులయ్యారు. అందుకు ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్తోటి పైరవీ చేయించుకున్నాడు. ఆయనతో పాటు కొన్ని రోజులు వరంగల్‌లో ఆ తర్వాత ఉస్మానియాలో పని చేసిన వాడు ఖండవల్లి లక్ష్మీరంజనం. ఈయన తెలంగాణలో పుట్టకపోయినా ఇక్కడి ప్రజలతో మమేకమయిన మెన్నతుడు.
ఖండవల్లి మీది కోపంతో రాయప్రోలు సుబ్బారావు తన పదవీ కాలం ముగిసిన పిదప హైదరాబాద్‌పై పోలీసు చర్యకు ముందు ఈ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అవసరం లేదు. దీన్ని రద్దు చేయాలని విశ్వవిద్యాలయ అధికారులకు లేఖ రాసిండు.అయితే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, హైదరాబాద్‌పై పోలీసు చర్య వల్ల ఆయన సిఫారసు పని చేయలేదు. దీంతో 1949 తర్వాత విశ్వవిద్యాలయంలో కొత్త నియామకాలు జరిగాయి. ఈ దశలోనూ ఆంధ్రా, రాయలసీమ నుంచి ప్రాంతం నుంచి వచ్చిన అధ్యాపకులు ఇక్కడ తెలుగు సాహిత్యానికి కొత్తగా పాదులు తీసిండ్రు. అప్లయి చేసుకున్నా శేషాద్రిరమణ కవులు లాంటి వారికి అధ్యాపక పదవులు రాలేదు. వారి స్థానంలో దివాకర్ల వెంకటావధాని లాంటి వారు లెక్చరర్లుగా నియమితులయ్యారు. ఇక్కడే కె.గోపాలకృష్ణారావు లాంటి వారు తెలంగాణ ఆత్మను డిపార్ట్మెంట్లో పటిష్ట పరిచారు.
ఈ విశ్వవిద్యాలయంలో మొదటి పరిశోధన సురవరం ప్రతాపరెడ్డి సూచన మేరకు బిరుదురాజు రామరాజు ‘జానపద గేయ సాహిత్యం’ మీద చేసిండు. ఇది తెలంగాణ మట్టిపరిమళానికి సాహిత్య గౌరవం కల్పించింది. అట్లాగే కె. గోపాలకృష్ణారావు చేసిన ‘ఆంధ్ర శతక వాఙ్మయ వికాసం’ సాహిత్యమంటే శిష్ట వర్గాలదే కాదు బహుజనులది కూడా అని నిరూపించింది. విస్మరణకు గురైన ఎందరో బహుజన శతకకారులని లెక్కగట్టి, పండితులు తిరస్కరించిన సాహిత్యానికి పట్టం గట్టిండు. ఇవి రెండూ తెలంగాణ నుంచి తెలుగు సాహిత్య పరిశోధనకు తొలినాళ్ళలో చేసిన మేలైన చేర్పులు. అయితే 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఏర్పాటైన తర్వాత ఆంధ్రాధిపత్యం రాజకీయ రంగంలో పెరుగుతూ ఉండడం తెలంగాణ వాడయినప్పటికీ సినిమా పాటల అవకాశాల కోసం ఎల్లకాలం ఆంధ్రావారితో మమేకమైన సి. నారాయణ రెడ్డి, సనాతనుడైన బిరుదురాజు రామరాజు, ప్రాంతేతరుడైన దివాకర్ల వెంకటావధాని తెలుగు శాఖలో ఆంధ్రా వారికి ఎక్కువ అవకాశాలు కల్పించారు. ఈ దశలో కె. గోపాలరావుకు పిహెచ్డి గైడ్షిప్ లేదు అని గుర్తుంచుకోవాలి.
ఈ దశలోనే కె.వి.రామకోటి శాస్త్రి, పాటిబండ్ల మాధవశర్మ, వేటూరి ఆనందమూర్తి తదితరులు ఉస్మానియాలో పరిశోధనలు చేసిండ్రు. దీంతో 1953 నుంచి 1980ల వరకు ఎక్కువగా ఉస్మానియాలో రామాయణ, భారత, భాగవతాలు, ప్రబంధ కవులు, సనాతన సాహిత్యం, కవిత్రయం, వ్యాకరణాలు, నిఘంటువుల మీదనే పరిశోధనలు జరిగాయి. తెలంగాణకు చెందిన ప్రాచీన కవులను సైతం ఉస్మానియా విశ్వవిద్యాలయం విస్మరించింది. కాకతీయ విశ్వవిద్యాలయం ఇందుకు కొంత మినహాయింపు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటై దాదాపు 45 ఏండ్లవుతున్నా అందులో తెలంగాణవాళ్ళు చేసిన పరిశోధన అరుదు. నిజామాబాద్‌లోని తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి ఇప్పుడిప్పుడే తెలుగు స్కాలర్లు డాక్టరేట్లు పొందుతున్నారు. అవి ఇంకా అచ్చు రూపంలోకి రావాల్సి ఉన్నది.
1958లో ప్రచురితమైన బిరుదురాజు రామరాజు పరిశోధన గ్రంథం ‘తెలుగు జానపద గేయ సాహిత్యము’ మొదలు 2017లో ప్రచురితమైన తాళ్లపల్లి యాకమ్మ రీసెర్చ్ థీసిస్ ‘బోయ జంగయ్య సాహిత్యానుశీలన’ వరకు మొత్తం 110 రీసెర్చ్ గ్రంథాలపై అవలోకనా వ్యాస సంపుటాలు ‘సారాంశం’. ఇందులో బుక్కా బాలస్వామి, గిరిజా మనోహర్ బాబు, ఎన్. వేణుగోపాల్, సంగిశెట్టి శ్రీనివాస్ మొదలు అనేక మంది లబ్ధప్రతిష్టులతో పాటు వర్ధిష్ణువులు కూడా ఒక ఫార్మాట్ పద్ధతిలో పరిచయ వ్యాసాలు రాసిండ్రు. ఒక్క ఘట్టమనేని మినహా దాదాపు అందరూ తెలగాణ వాళ్ళే కావడం విశేషం. ఇవన్నీ కూడా వివిధ విశ్వవిద్యాలయాల్లోని ఆచార్యులకు, పరిశోధక విద్యార్థులకు, సామాన్య పాఠకులకు రెడీ రెఫరెన్స్ బుక్ లాగా ఉపయోగపడనున్నాయి. ఒక్కో పరిశోధకుడు పదేండ్లు పరిశోధన చేసి తెలుసుకున్న విషయాలను ఒక క్రమ పద్ధతిలో రీసెర్చ్‌లో భాగంగా పట్టా కోసం సమర్పించుకున్నారు.
ఇందులో పల్లా దుర్గయ్య, నారాయణ రెడ్డి, ఎం. కులశేఖరరావు, హరి శివకుమార్, పాకాల యశోదారెడ్డి, అమరేశం రాజేశ్వర శర్మ, ఎస్వీ రామారావు, ముకురాల రామారెడ్డి, వే. నరసింహారెడ్డి మొదలు యువకులైన తాళ్లపల్లి యాకమ్మ, పసునూరి రవీందర్, బూర్ల చంద్రశేఖర్‌ల వరకు వారి పరిశోధనా గ్రంథాలపై విశ్లేషణ ఉన్నది. ఒక్కొక్క సిద్ధాంత గ్రంథం గురించి క్లుప్తంగా పది పేజీలకు మించకుండా అందించారు సంపాదకులు.నిజానికి మొత్తం తెలుగు సాహిత్యంలోనే మొట్టమొదటి డాక్టరేట్ పుచ్చుకున్న దళిత మహిళ బొజ్జ విజయ భారతి. ఈమె 1969లో ‘దక్షిణ దేశీయాంధ్ర వాఙ్మయము సాంఘిక జీవనము’ అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పల్లా దుర్గయ్య పర్యవేక్షణలో పరిశోధన చేసింది. ఆ తర్వాత వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి కొలకలూరి ఇనాక్ ‘తెలుగు వ్యాసం’ పైన రీసెర్చ్ చేసిండు.
అయితే తెలంగాణ నుంచి పట్టా అందుకున్న తొలి దళిత వ్యక్తిగా ఎన్.ఆర్ వెంకటేశం రికార్డయిండు. ఈయన 1992 లో ‘బుడిగె జంగాలు భాషా, సాహిత్య సాంస్కృతికాంశాల పరిశీలన’ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టానందుకున్నాడు. అంటే 1969లో ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఒక దళిత మహిళ పట్టా అందుకున్న 23 ఏండ్లకు తెలంగాణ వ్యక్తి ఆ స్థాయికి చేరుకోలేదని అర్థమవుతున్నది. మొదటి సంపుటిలో తాళ్లపల్లి యాకమ్మ, మండల స్వామి లాంటి దళితులు వ్యాసకర్తలుగా ఉన్నారు. రెండో భాగంలో పుస్తకం అచ్చేసిన దళిత పరిశోధకుల్లో ఎన్.ఆర్. వెంకటేశంతో పాటు బన్న అయిలయ్య, గుండె డప్పు కనకయ్య, పసునూరి రవీందర్, తాళ్లపల్లి యాకమ్మలున్నారు. ఒకే ఒక్క గిరిజన మహిళ పరిశోధకురాలిగా సూర్యా ధనంజయ్ ఉన్నారు. వీళ్లందరూ తమ తమ పరిశోధనాంశాలను పుటంబెట్టి మెరుగు పరిచారు. ఈ సంపుటాల్లో మొదటి దాన్ని ఆచార్య వెలుదండ నిత్యానందరావుకు, రెండో దాన్ని ఆచార్య వై.శ్యామలకు అంకితమివ్వడం కూడా వారు పరిశోధన, నిఘంటు రంగాల్లో చేసిన కృషికి సరైన గౌరవం.
ఇట్లా విశ్వవిద్యాలయాలకు సమర్పించుకున్న గ్రంథాలను చాలా మంది ఆర్థిక ఇబ్బందులకు తాళలేక అచ్చు వేసుకోలేదు. అచ్చు వేసుకున్న వాటిలో కొన్నింటిని ఈ పరిశీలనకు అర్హతగా ఎంచి అట్టెం దత్తయ్య ఇప్పుడు వెలుగులోకి తెస్తున్నాడు. అంటే దాదాపు 70 ఏండ్ల తెలంగాణ పరిశోధనా పరంపరను కొండ అద్దంలో చూపించినట్లు మనకందిస్తున్నాడు. ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. థాంక్‌లెస్ పని కూడా. అయినా అవసరమైన పని. ఈ అవసరమైన పనిని తెలంగాణ కాలంలో (సాహితీ రంగంలో తెలంగాణ కాలమే నడుస్తున్నది)అందిస్తున్న దత్తయ్యకు అభినందనలు. కవిత్వం, కథలు రాసుకొని ప్రచారం చేసుకోవడానికి తెలుగునాట ఎక్కువ మంది రచయితలు ఇష్టపడతారు. ఇతరుల గురించి అధ్యయనం చేయాలంటే, అదీ పరిశోధన గ్రంథా లు చదవాలి, రాయాలి అంటే పిడికెడు మంది కూడా ముందుకు రారు. అట్లా ఇంత మంది పరిశోధనల గురించి ఇష్టంగా రాయించి, దానికి సొంత సమయాన్ని వినియోగించి, సమాజానికి ఉపయోగపడేలా పని చేయడం సాహసోపేతం.
అందుకే అట్టెం దత్తయ్య అంటే పట్టువిడవని పరిశోధకుడు, అలుపెరుగని రచయిత అని చెప్పవచ్చు. ఇది ఆయన కార్యదీక్షకు నిదర్శనం. ఆయన గతంలో ఎంతో శ్రమకోర్చి వెలువరించిన ‘బిసి సాహిత్య విమర్శ’ రాబోయే తరానికి మార్గ నిర్దేశనం చేసే ‘లైట్ హౌజ్’గా కానున్నది. సముద్ర ప్రయాణం చేసే సెయిలర్స్‌కు ఈ లైట్ హౌజ్ విశిష్టత తెలుసు. చిమ్మ చీకటిలో దిశా నిర్దేశం చేస్తది. ఇక మళ్ళీ ప్రస్తుత విషయానికి వస్తే పరిశోధనల కోసం వివిధ విశ్వవిద్యాలయాల మధ్యన సమన్వయం ఉండాలి. ఏ డిపార్ట్మెంట్లో ఏ అంశంపై ఏ ఏ విద్యార్థులు పరిశోధన చేస్తున్నారు అని ఆయా శాఖల వెబ్సైట్లో పొందుపరచాలి. దీని వల్ల దేశంలో ఎక్కడ కూడా పరిశోధన రిపీట్ కాకుండా ఉంటుంది. అట్లాగే వివిధ శాఖల మధ్యన ఉదాహరణకు తెలుగు విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖల్లో ఒకే అంశంపై పరిశోధన జరిగేందుకు వీలులేకుండా ఎప్పటికప్పుడు తమ దగ్గర అలాట్ అయిన పరిశోధన టాపిక్‌లను ఇరు విభాగాలు వెబ్సైట్లో ఉంచినట్లయితే టాపిక్ కేటాయించేప్పుడు జాగ్రత్త పడడానికి వీలుంటది.
నిర్ణీత గడువులోగా పరిశోధన చేయని విద్యార్థి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించేందుకు వీలవుతుంది. అట్లాగే పరిశోధన థీసిస్‌ని సబ్మిట్ చేసిన మూడు నెలల వ్యవధిలో దాన్ని ‘శోధ్ గంగ’ జ్ఞాన సాగరంలో జత చేయాల్సి ఉంటది. కానీ దురదృష్టవశాత్తు ఏ విశ్వవిద్యాలయం ఆ పని చేయడం లేదు. ఈ సారాంశం స్ఫూర్తితోనైనా ఆ పనిని అని విశ్వవిద్యాలయాలు చేసినట్లయితే భవిష్యత్ పరిశోధకులకు బంగారు బాటలు వేసినట్లయితది.
డా. సంగిశెట్టి శ్రీనివాస్
ప్రముఖ రచయిత, పరిశోధకులు.
(మన తెలంగాణ దినపత్రికలో ప్రచురితం. 28.10.2023)
https://www.manatelangana.news/mandal-commission-protests-of-1990/
భావి పరిశోధకులకు మార్గదర్శి ‘సారాంశం’
‘‘పరిశోధన ఒక జాతి అభివృద్ధి పరిణామానికి, వికాస దశకు సూచిక. వ్యక్తి, సమూహం, సమాజం, తరం తమ మూలాల వైపు, పరంపర వైపు దృష్టిసారించి వెలికి తీసేది పరిశోధన’’ - డా. నందిని సిధారెడ్డి
దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల తెలుగుశాఖల నుంచి ప్రతి సంవత్సరం కొన్ని వందల పిహెచ్.డి. థీసిస్‌లు రాయబడి అవార్డు పొందుతున్నాయి. వాటిలో ఎన్ని నాణ్యమైనవి, ఎన్ని కాలానికి నిలిచేవి, ఎన్ని భవిష్యత్ తరాలకు ఉపయోగపడేవి, ఎన్ని సమాజాన్ని మార్చేవి అనేది కాలమే నిర్ణయించాలి. ఏదో ఒక విషయికంగా ఎక్కువ సమాచారాన్ని ప్రోది చేసుకున్నవి, ఉత్తమ పరిశోధనా ప్రమాణాలను పాటించినవి, ప్రజల జీవితాలను ప్రభావితం చేసేవి పాఠకుల చేత, పరిశోధకుల చేత, పర్యవేక్షకుల చేత, విమర్శకుల చేత ఉత్తమ పరిశోధనా గ్రంథాలుగా గుర్తింపు పొందుతున్నాయి. వాటిని మాత్రమే విభిన్న పాఠకులు పదేపదే చదువుతున్నారు. సంప్రదిస్తున్నారు. రానురాను పరిశోధనా నాణ్యతా ప్రమాణాలు పడిపోతున్న సందర్భంలో, సోమరి పరిశోధకులే ఎక్కువున్న కాలంలో కొన్ని వందల పుటల పరిశోధనా గ్రంథాలను తెరిచి చదివేవారు చాలా తక్కువ. నిజానికి ఒక వ్యాసం రాయాలంటే మన ముందు తరాల వాళ్లు రాసిన వ్యాసాలు కనీసం వంద చదవాలి. అలాగే ఒక పరిశోధన చేయాలంటే ఉత్తమ పరిశోధనా గ్రంథాలనదగ్గవి కనీసం వంద థీసిస్‌లను సంప్రదించాలి. అప్పుడే ఒక సిద్ధాంత వ్యాసాన్ని రాసే భాషాపాటవం, శైలీశిల్పాలు, పరిశోధనా విధానం, సిద్ధాంత ప్రతిపాదన, అనుసరించాల్సిన మెథాడాలజీతో పాటు ఎన్నో సూక్ష్మ విషయాలు బోధపడుతాయి. తద్వారా ఒక ఉత్తమ పరిశోధనా గ్రంథం రూపొందుతుంది. కానీ ఇదంతా పరిశోధకుడు పరిశోధన పట్ల సానుకూల దృక్పథం కలిగియున్నప్పుడు మాత్రమే సంభవించే విషయం. ఇప్పటి డిజిటల్ తరం, అన్నీ స్మార్ట్‌గా అయిపోవాలని ఉబలాటపడే నవీన పరిశోధకులలో అంత ఓపిక, నేర్చుకునే వైఖరి సన్నగిల్లుతుంది. అలాంటి వారి కోసమే డా. అట్టెం దత్తయ్య తెలుగులో ఇప్పటిదాకా వెలువడిన కొన్ని ఉత్తమ పరిశోధనా గ్రంథాల సారాంశాన్ని అందించాలనే తలంపుతో ‘సారాంశం’ పేర రెండు సంపుటాలు వెలువరించాడు. పూర్తి సిద్ధాంత వ్యాసాలను చదవలేని, అందుబాటులో లేని పాఠకులు కనీసం వాటి ‘సారాంశం’ అయినా తెలుసుకోవాలి అని చేసిందే ఈ ప్రయత్నం
ఈ ‘సారాంశ’ వ్యాసాలు చక్కని అమరికతో, ఏకరూపతతో వెలువడడానికి కారణం సంపాదకుడు వ్యాసకర్తలకు కొన్ని విలువైన సూచనలు చేసి వాటిని అతిక్రమించకుండా రాయించడమేనని చెప్పాలి. ఈ రెండు సంపుటాలలో కలిపి 110 వ్యాసాలున్నాయి. ఇవన్నీ భావి పరిశోధకులకు ఎంతో కొంత పరిశోధనా ప్రణాళికా రచనలో మార్గదర్శనం చేసేవే కావడం గమనార్హం. వీటి ద్వారా నూతన పరిశోధకులు జ్ఞానాన్ని, చైతన్యాన్ని, కొత్త ఆలోచనా విధానాన్ని అలవర్చుకొని స్ఫూర్తి పొందుతారని భావించవచ్చు.
తెలుగు పరిశోధక విద్యార్థులు ఇవాళ చౌరస్తాలో నిలబడ్డారని చెప్పాలి. పరిశోధనకు ఏ విషయాన్ని ఎన్నుకోవాలో తెలియదు. ఇప్పటిదాకా ఏయే విషయాల మీద పరిశోధనలు జరిగాయో తెలియదు. (ఆచార్య వెలుదండ నిత్యానందరావు వెలువరించిన ‘విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన’ 1930 `2013 వరకు జరిగిన పరిశోధనలను గురించిన సమాచారం ఇచ్చినప్పటికీ) సిద్ధాంత వ్యాస రచనకు నియమిత శైలీపత్రం ఇప్పటికీ లేదు. ఇలాంటి సంక్షోభ సందర్భంలో ఈ సారాంశ వ్యాసాలు పరిశోధక విద్యార్థులకు కొంత ఉపయోగపడుతాయని చెప్పవచ్చు. పరిశోధన అంశ ఎన్నికలో, అధ్యాయాల విభజనలో, పాటించాల్సిన ప్రామాణికతలో, సిద్ధాంత వ్యాస రచనా విధానంలో ఈ వ్యాసాలు కొత్త చూపును, ప్రేరణను ప్రసాదిస్తాయి.
వివిధ ప్రక్రియలపై మన పూర్వ పరిశోధకులు చేసిన గ్రంథాలపై ఇందులో విలువైన వ్యాసాలున్నాయి. ఇవి తదుపరి పరిశోధనలను ఎంతో ప్రభావితం చేశాయని చెప్పవచ్చు. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం 1968లో మహాభారత ‘సంశోధిత ముద్రణ’ను వెలువరించి భారతం మీద విశిష్టమైన పరిశోధలను చేయించింది. ఆ వ్యాసాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇక కావ్యాల మీద సాధికారికంగా చేసిన పరిశోధనలకు సంబంధించిన వ్యాసాలు విద్యార్థులకు ఎంతో ఉపయుక్తం. రచయితల సాహిత్య మంచి చెడులను విడమరిచి చెప్పే విమర్శ గురించిన పరిశోధనల మీద రెండు వ్యాసాలున్నాయి. ఇవి విమర్శ ఆంతర్యాన్ని ఆవిష్కృతం చేశాయి. కవిత్వం లోతుపాతులను చర్చించిన ‘ఆధునికాంధ్ర కవిత్వము ` సంప్రదాయములు, ప్రయోగములు’, ‘తెలుగులో కవిత్వాదర్శాలు ` పరిణామాలు’, ‘ఆధునిక తెలుగు కవిత్వం ` వాస్తవికత, అధివాస్తవికత’ అనే పరిశోధనల మీద రాయబడిన వ్యాసాలు నమూనా వ్యాసాలనదగ్గవి. ఆయా కవుల సాహిత్య సేవను పరిశీలిస్తూ చేసిన పరిశోధనల మీద కూడా కొన్ని వ్యాసాలున్నాయి. అవి కూడా ఆయా కవుల సాహిత్యపు వెలుగును, అవి సమాజం మీద చూపిన ప్రభావాన్ని ఎత్తి చూపాయి. మానవుని తొలి వ్యక్తీకరణ అయిన పాట మీద కూడా కొన్ని ఎన్నిక చేసిన పరిశోధన గ్రంథాల మీద వ్యాసాలున్నాయి. ఇవి పాట గురించిన లోతైన అవగాహనను కల్పిస్తాయి. పాట మీద పరిశోధన చేయాలనుకునే విద్యార్థులకు ఇవి మార్గదర్శకాలు. భాష, ఛందస్సు, వ్యాకరణం, అలంకారం మీద కూడా వచ్చిన వేరువేరు పరిశోధనలను పరిచయం చేస్తూ రాసిన వ్యాసాలు ఎన్నో నూతన అంశాలను చెప్తున్నాయి. నవల, కవిసమయములు, పేరడీ, యాత్రా చరిత్రల పైన వచ్చిన పిహెచ్. డి. గ్రంథాలను పరిచయం చేయడం ద్వారా పాఠకులకు ఎన్నో కొత్త విషయాలు తెలియపరుస్తాయి.
ఈ నూటపది వ్యాసాలు తెలుగు సాహిత్య పరిశోధనా క్రమవికాసాన్ని, పరిశోధనలో అవలంభించాల్సిన రీతులను, కఠోర పరిశ్రమను తెలుపుతాయి. తద్వారా పాఠకులకు కొంత నూతన ఆలోచనా ధోరణి, విస్తృతి, పరిణతి కలుగుతాయి. ముఖ్యంగా ఇప్పటి పరిశోధక విద్యార్థులకు పరిశోధనాంశ ఎన్నికకు, ఉన్నత ప్రమాణాలతో సిద్ధాంత గ్రంథాన్ని ఎలా రూపొందించాలో, శాస్త్రీయ ప్రమాణాలకు కట్టుబడుతూ విషయ నిరూపణ ఎలా చేయాలో, ప్రతిపాదనలను ఎలా స్థిరీకరించాలో ఈ రెండు గ్రంథాలు బోధపరుస్తాయి. పరిశోధనపట్ల ఆసక్తి, సత్యశోధన, విషయ విశ్లేషణ, సప్రమాణ నిరూపణ ఈ నాలుగు గుణాలు ఉత్తమ పరిశోధనకు మరింత సారాన్ని అందిస్తాయి. శ్రద్ధ, సహనం, పరిశోధనా గ్రంథాన్ని ఉత్తమంగా రాసే సామర్థ్యం లేకపోతే పేలవమైన సిద్ధాంత గ్రంథమే బయటకు వస్తుంది. ఈ ప్రమాదాన్ని దాటడానికి ఉపయోగపడే ఉత్తమ వ్యాసాల సంకలనమే ఈ ‘సారాంశం’.
తెలుగులో ఉత్తమ ప్రామాణిక పరిశోధన గ్రంథాలనదగ్గ వాటిని ఎన్నుకొని ఎంతో శ్రమించి ఈ వ్యాసాలను రాయించడం ద్వారా సంపాదకుడు ఆశించిన లక్ష్యం నెరవేరినట్లయింది. పరిశోధన గ్రంథాన్ని స్థాయి తగ్గకుండా ఎలా రాయాలో ఈ గ్రంథాలు తెలియజేస్తాయి. ‘మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన’ అయినట్లు కాలక్రమంలో పరిశోధకులు పెరిగిపోవడం వలన నీరసమైన, నాణ్యతలేని పరిశోధనా గ్రంథాలే ఎక్కువ వెలువడుతున్నాయి. పరిశోధన స్థాయిని మెరుగుపరుచుకోవడానికి, రాసే విధానం తెలుసుకోవడానికి ఈ వ్యాసాలు ఎంతో మేలు చేస్తాయి.
సాహిత్య కృషిలో ఎంతో లబ్దప్రతిష్ఠులైన వారు, కీర్తిగడిరచిన వారు కూడా పరిశోధన రంగంలో రాణించలేకపోయారు. కారణం పరిశోధనకు ఆవేశం పనికిరాదు. సంయమనం, ఓర్పు, నేర్పులాంటి ఎన్నో ఉత్తమ గుణాలు కావాలి. లేకపోతే అంతా రసాభాస అయిపోయి మొదటికే మోసం వచ్చి పరిశోధన రంగం నుండి పూర్తిగా తప్పుకోవాల్సి వస్తుంది. అలా మధ్యలోనే పుట్టి ముంచి తప్పుకున్న పరిశోధకులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి ప్రమాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, పరిశోధనలో మెలకువలను నేర్చుకోవడానిక ఈ వ్యాసాలు మార్గాన్ని చూపుతాయనడంలో అతిశయోక్తి లేదు. పరిశోధనలో ఇంకా ఖాళీలు ఎక్కడున్నాయో కనీస అవగాహన కలుగుతుంది. జరిగిన పరిశోధనలు ఎంత ఉత్తమంగా జరిగాయి, ఇప్పుడు ఇంకెంత ఉత్తమోత్తమంగా పరిశోధనలు రావాల్సి ఉన్నది అనే జ్ఞానం కలుగుతుంది. అరిగిపోయిన అంశాలు, ఒక పరిశోధనకు నఖలులాంటి పరిశోధనల నుంచి తప్పుకోవడానికి ఈ ‘సారాంశం’ ఉపయోగపడుతుంది.
కాలక్రమానుసారం మనకు తెలియకుండానే సమాజంలో, సాహిత్యంలో ఎంతో మార్పు వచ్చింది. వచ్చిన మార్పును ఎలా పట్టుకోవాలి. దాని ద్వారా సమాజం ఎంత ప్రభావితం అయిందని పరిశీలించడానికి, కొత్త అంశాలను ఎన్నుకోవడానికి సూక్ష్మంగా అర్థం చేసుకోవడానికి ఈ వ్యాసాలు దారి చూపిస్తాయి. నిత్యం ఎన్నో మార్పులకు గురవుతూ కదిలిపోతున్న సమాజాన్ని, సాహిత్యాన్ని అవలోకనం చేసుకొని నూతన పరిశోధనలు రావాలని ఈ వ్యాసాలు ఆకాంక్షిస్తాయి. ప్రపంచీకరణ తరువాత అన్ని రంగాలలో వేగం పెరిగిపోయింది. దానికి పరిశోధనా రంగం కూడా అతీతం కాదు. దీని వల్ల లోతైన పరిశీలన లేకుండానే ఎన్నో పరిశోధనా గ్రంథాలు రాయబడుతున్నాయి. అవార్డు పొందుతున్నాయి. ఈ ధోరణి మంచిది కాదని చెప్పడానికి చేసిన ప్రయత్నం ఇది. మన పూర్వ పరిశోధనలు ఎంత గొప్పగా, నాణ్యతగా ఉన్నాయో ఇప్పటి తరానికి తెలియజెప్పడానికి ఈ వ్యాసాలు ప్రయత్నించాయి. రాబోయే పరిశోధనలు మరింత సారవంతంగా ఉండాలనే సంపాదకుని తపన ఏ మాత్రం ఫలిస్తుందో కాలమే చెప్పాలి.
అధ్యయనం లేకుండానే పరిశోధనా సౌధం మెట్లను ఎక్కడం సాధ్యం కాదని ఈ ‘సారాంశం’ గ్రంథాలు నిరూపించాయి. ఆయా వ్యాస రచయితలు సూచించిన సూచనలను పరిగణనలోకి తీసుకొని ముందుకు అడుగేస్తే దారి అదే దొరుకుతుందని తెలిపిన వ్యాసాలివి. ఈ రెండు గ్రంథాల చివర రెండు భాగాలుగా ఆచార్య జి.ఎస్. మోహన్ రాసిన ‘పరిశోధన స్వరూప స్వభావాలు’ వ్యాసం ఎంతో విలువైనది. ప్రతి పరిశోధక విద్యార్థీ చదివి తీరవలసిన వ్యాసం ఇది. పరిశోధన అంశ ఎన్నిక నుంచి మొదలుకొని సిద్ధాంత గ్రంథం తుది ప్రతి రూపకల్పన దాకా అన్ని విషయాల మీద ఒక స్థూల అవగాహన ఈ వ్యాసం కల్పిస్తుంది. పరిశోధనకు ఉపయోగపడే ఎన్నో సూక్ష్మ అంశాలను చర్చించిన వ్యాసం ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రెండు సంపుటాల ‘సారాంశం’ నూతన పరిశోధకులకొక స్వర్గం.
డా॥ వెల్దండి శ్రీధర్
తెలుగు సహాయాచార్యులు
(నవ తెలంగాణ దిన పత్రికలో ప్రచురితం. 20.11.2023)
బాటవేసిన సారాంశం
విశ్వవిద్యాలయాల్లో డాక్టరేట్ పట్టాకోసం జరిగే పరిశో ధనలు, సిద్ధాంత వ్యాస సమర్పణతో ముగుస్తాయి. అవి ముద్రణకు నోచుకోని గ్రంథంగా మిగిలిపోతాయి. అట్ల గాని సిద్ధాంత వ్యాసాలు అనేకం. రాకపోవడానికి కారణాలు కూడా అనేకం. పరిశోధనా గ్రంథాలు చదువ రులకు చేరడం కష్టం. అలా చేరని గ్రంధాల విశిష్టతను, సమర్థతను ప్రామామికతను, విషయ ప్రాధాన్యతను పదిమందికీ అందించాలనే ఆలోచన డాక్టర్ అట్టెం దత్తయ్యలో పురుడు పోసుకుంది. ఫలితంగా 'సారాంశం పరిశోధన గ్రంథాలు పరిచయ వ్యాసాలు' రెండు సంపుటాలుగా వెలువడ్డాయి. ఈ రూపం సంత రించుకోవడానిక ఆర్ధిక సహకారం అందించినవారు ధ్రువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు దుండె లక్ష్మణ్ (అమెరికా), అధ్యక్షులు దుండె మల్లేశ్.
అనుకున్నదే తడవుగా చేయడానికి ఇది ఒకరిద్దరు చేసే పని కాదు. పదుగురితో కూడిన పని చేయడానికి కావల సినది సమన్వయ సమర్థత, దక్షుడు దత్తయ్య. దానికి సాక్ష్యంగా 110 వ్యాసాలతో కూడిన 1200 పేజీలు. ముద్రణకు నోచుకున్న సిద్ధాంత గ్రంథాల పరిచయంలో ఏకరూపత కోసం పది అంశాలను వ్యాస కర్తలకు అందించాడు. ఈ వ్యాసాలు మూలగ్రంథాల రుచిని చవిచూసాయి. అది ప్రణాళికా విశిష్టత. వ్యాసకర్తల సమర్థత. ఈ వ్యాసాలు సిద్ధాంత వ్యాస నడకను చూపెట్టాయి. విశ్వవిద్యాలయాల బయట జరిగిన పరిశోధన, సాహిత్య చరిత్ర రచన, ప్రక్రియ ప్రయోగాలు సిద్ధాంత వ్యాస రచనపై చూపాయి. ఆ మేరకు అవి విశ్వవిద్యాలయ పరిశోధనల వల్ల పరిపూర్ణత పొందాయి. ప్రక్రియాపరంగా సాగిన పరిశోధనలు, ఆయా రంగాల్లో మొదటి సిద్ధాంత వ్యాసాలుగా గణుతికెక్కాయి.
సకల వాదాల సమగ్ర 'సారాంశం'
మొదటగా తమ కళ్ల ఎదుట కనబడుతున్న సృజన సాహిత్యం పరిశోధకులను ఆకర్షించింది. పరిశోధకులు తమ అభిరుచి మేరకు ప్రక్రియాపరమైన సాహిత్యాన్ని పరిశోధించారు. వచన, శతక వాజ్ఞ్మయము, గేయ, వ్యాకరణ, విమర్శ, నాటక, పీఠిక, యాత్రాచరిత్ర, లేఖ, నవల, లలితగీత, కథ మొదలైన ప్రక్రియాపరమైన సాహిత్య పరిశోధనలు కనిపిస్తాయి. కావ్యాలు, ప్రబంధాలు, ఇతిహాసాలపై గల భక్తి శ్రద్దలు వాటిపై పరి శోధనలకు పురికొల్పాయి. అవి అనేక రీతులుగా సాగాయి. ఆ తర్వాత ఆధునిక సాహిత్యంపైకి దృష్టి మరలింది. ఇందులో కవిత్వంపై పరిశోధన సింహభాగం ఆక్రమించింది. వస్తు దృష్టిలో కొన్ని నిర్మాణ దృష్టిలో కొన్ని, పరిణామదృష్టిలో కొన్ని పరిశోధనలు వచ్చాయి. ఈ కోవలోని గ్రంథాలు భావి తరాలకు దిశా నిర్దేశం చేశాయి. నన్నయ నుంచి నేటివరకు తమ సృజనతో ప్రగాఢ ప్రభావం వేసిన రచయితలు ఎందరో ఉన్నారు. ప్రభావశీలురుగా, యుగకర్తలుగా, ప్రయోగశీలురుగా, భావజాల ప్రతినిధులుగా ఆయా రచనా ధోరణికి ఆద్యులుగా, వాటిని సంపద్వంతం చేసిన సృజనశీ లురుగా, సాహిత్యోద్యమం జీవులుగా తమతమ వ్యక్తిత్వ ప్రాభవాలచే ముద్రలు వేసినవారున్నారు. వారిపై తదనంతర పరిశోధనలు జరిగాయి. కాలక్రమంలో అస్తిత్వ కాంక్షలు సమాజాన్ని ఊపిరి సలపనివ్వకుండా ప్రభావితం చేశాయి. విప్లవ, స్త్రీ, దళిత, బహుజన, మైనారిటీ, బహుజన కాంక్షలు సృజన సాహిత్యాన్ని కొత్తపుంతలు తొక్కించాయి. వీటిపై పరిశోధనలు జరిగాయి. వీటన్నింటి సారాంశం ఈ గ్రంథాల్లో కనప డుతుంది. విశ్వవిద్యాలయాలు ఆయా జిల్లాల్లో వచ్చిన సాహిత్యాన్ని ప్రత్యేక దృష్టితో పరిశోధనకు పెట్టింది. ఆ విశిష్టతలు కూడా 'సారాంశం'లో చోటుచేసు కున్నాయి. సంస్కృతీ సంప్రదాయాలు, పునరుజ్జీవనో ద్యమాలు, భాషా వికాసాలు, సాయుధ పోరాటాలు, శాసనాలు, జ్యోతిష్యం, మనో వైజ్ఞానికత, తొలి మలి తరం సాహిత్యం, రచనలపై ప్రభుత్వ ఆంక్షలు, ప్రపంచీ కరణ మొదలైన అభిరుచులలో సాహిత్యాన్ని పరిశోధించి అంచనా కట్టడం కూడా జరిగింది. ఇదంతా 'సారాంశం'లోనమోదయింది..
పరిశోధనా వ్యాసాలకు టార్చి లైట్
'సారాంశం' సంపుటాల్ని చదువుతున్నప్పుడు గ్రంథరూ పంలోని ఈ సిద్ధాంత వ్యాసాల గురించి మనసు కొట్టుకుంది. గ్రంథ రూపంలో ఉండి సారాంశంకు అందని పరిశోధనలు గుర్తుకొచ్చి బాధకలిగింది. రాస్తాను అని రాయకపోవడం, రాసి సమయానికి ఇవ్వ కపోవడం వల్ల కూడా 'సారాంశం' సమగ్రం కాలేక పోయింది. అసంపూర్ణం అనేది పరిశోధన లక్యం... దానికెప్పుడు కొనసాగింపే ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన పరిశోధనాంశాల్ని క్లుప్తంగా పరిచయం చేస్తూనో, ఒక టార్చిలైట్ ను ఇచ్చినట్లవుతుంది. గతంలో తెలుగు అకాడమీ వారు, సీపీ బ్రౌన్ అకాడెమీ వారు, వెల్దండి నిత్యానందరావు గారు ఈ పని చేశారు.. దాని కొనసాగింపుగా మరొక ప్రయత్నం జరగాల్సి ఉంది. ఆచార్య జీఎస్ మోహన్ అందించిన పరిశోధన స్వరూప స్వభావాలు అనే వ్యాసం ఈ సంపుటాలకు వెన్నెముకగా నిలిచింది. పరిచయకర్తలు విమర్శచాటున నడిచినవారు. సమీక్ష మార్గం చూపినవారు. ఏకరూ పకత కోసం సంపాదకుడు పరిచిన దానిని మరింత విశాలం చేసిన వారు కొందరైతే ఆ దారిని విడవని వారు మరికొందరు. మొత్తానికి పరిచయ కర్తలు అభినంద నీయులు. దత్తయ్య దక్షుడు కనుక 'సారాంశం' అవస రమైంది.ప్రచురణకర్తలకు కృతజ్ఞతలు.
డా. బీవీఎన్. స్వామి
కథారచయిత, విమర్శకులు
(దిశ దినపత్రికలో ప్రచురితం. 23.10.2023)
పరిశోధనల సారం
మానవసమాజాల ప్రగతి వికాసాలన్నీ పరిశోధనలపైనే ఆధారపడ్డాయి. పరిశోధన కొత్త ఆవిష్కరణలకు దారితీయడమే కాదు, గతకాలాల పొరల్లో దాగి ఉన్న ఆణిముత్యాలను తవ్వి తీసేది కూడా పరిశోధనే. వివిధ కాలాల్లో మానవ సమాజాలు ఎలా ఉండేవో తెలుసుకోవాలంటే పరిశోధనే మార్గం. ఈ జ్ఞానం మానవసమాజాలకు మార్గదర్శనం చేస్తుంది. చరిత్ర పరిశోధనలు మానవ ప్రగతి, వికాసాలు, మార్పులు, విజ్ఞానసాంకేతిక విజయాలు మానవపురోగతికి మార్గం వేసిన మలుపులు ఇవన్నీ మన ముందు పెడతాయి. గతానికి, వర్తమానానికి మధ్య వారధి చరిత్ర పరిశోధన. చరిత్ర పరిశోధనల్లో సాహిత్యశోధన కూడా చాలా ముఖ్యమైనది. నిర్దిష్ట కాలంలో మనిషి జీవనవిధానాన్ని స్పష్టంగా నిర్వచించేది ఈ పరిశోధనలే. చరిత్ర, సాహిత్య పరిశోధనల వల్ల వివిధ కాలాల్లో వివిధ ప్రాంతాల్లో మానవ విలువలు, సంస్కృతి, భావోద్వేగాలు, మానవ ఆలోచనలు, మానవ అనుభవాల జ్ఞానం లభిస్తుంది.
అనేక సబ్జక్టుల్లో పరిశోధన నిత్యం కొనసాగుతూ ఉంటుంది. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో పరిశోధన నిరంతరం నడుస్తూనే ఉంటుంది. సాహిత్యంలో జరగే పరిశోధనలు కూడా చాలా ఎక్కువ. తెలుగు సాహిత్యంలో వెలువడుతున్న వేలాది పరిశధనల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి వెలువడిన వంద ఉత్తమ పరిశోధనా గ్రంథాల పరిచయ వ్యాసాలతో ఒక గ్రంథం వేయాలన్న ఆలోచన అద్భుతమైనది. గతంలో ఆచార్య వెలుదండ నిత్యానందరావు 'విశ్వవిద్యాలయాలలో తెలుగు పరిశోధన' అనే గ్రంథం తీసుకొచ్చారు. ఈ పుస్తకం చాలా మందికి తెలుగు సాహిత్య పరిశోధనలకు సంబంధించి ఒక దిక్సూచిగా ఉపయోగపడింది. ఆ తర్వాత మరో పుస్తకం ఏదీ రాలేదు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత డా. అట్టెం దత్తయ్య ఈ ప్రయత్నం మళ్ళీ చేశారు.
గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయని అట్టెం దత్తయ్య ఈ పుస్తకంలోని 'సారాంశలోచనం'లో రాశారు. 1975లో మొదటిసారి తెలుగు అకాడమీ "తెలుగు పరిశోధన సంహిత" పుస్తకాన్ని తీసుకువచ్చిందని, 1986లో రెండవ సంపుటాన్ని ప్రచురించిందని రాశారు. ఈ సంపుటాలు పరిశోధకులకు పరిశోధనాంశం ఎంచుకోవడంలో ఎంతైనా ఉపయోగపడతాయి. 'జానపద విజ్ఞానంలో పరిశోధనలు సంక్షిప్త వివరణలు', “తెలుగు పరిశోధన వ్యాసమంజరి” వంటి పుస్తకాలను కూడా అట్టెం దత్తయ్య ఇందులో పేర్కొన్నారు. ప్రామాణికంగా ఉపయోగపడుతున్న వివిధ సిద్ధాంత గ్రంథాలను పరిశీలించి, అధ్యయనం చేసి లోతుల్లోకి వెళ్ళి ఆ గ్రంథసారాంశాన్ని క్లుప్తంగా వ్యాసరూపంలో అందించే యోగ్యులైన పరిశోధకులను గుర్తించి వారితో వ్యాసాలు రాయించి ఒక పుస్తకంగా అచ్చేయాలంటే ఎంతో ఓపికగా, అనేకమందితో సమన్వయంతో నిర్వహించవలసిన పని. ఈ సంపాదకత్వ బాధ్యతను అట్టెం దత్తయ్య అనితర సాధ్యంగా చేసి చూపించారు.
రెండు సంపుటాలుగా వచ్చిన "సారాంశం" పరిశోధనా సారంలో మొత్తం 55 సిద్ధాంత గ్రంథాలపై పరిచయ వ్యాసాలతో మొదటి సంపుటం, మరో 55 సిద్ధాంతగ్రంథాలపై పరిచయ వ్యాసాలతో రెండవ సంపుటం వెలువరించారు.. జానవద సాహిత్యం, సాహిత్యవిమర్శ, కవిత్వం, కవిత్వ సంప్రదాయాలు, ప్రయోగాలు, ప్రజాకవి వేమన, నవల, భాషాసాహిత్యాల పరిశీలన, శ్రామిక గేయాలు, రైతాంగ పోరాటంలో గేయాలు, సామాజిక భాషాశాస్త్ర పరిశీలనలు, ఛందస్సు, వ్యాకరణం, అలంకారం, శతకం, ఆధునిక సాహిత్యం, ప్రాచీన సాహిత్యం, లక్షణశాస్త్రం ఇలా అనేక అంశాలపై పరిశోధనల్లో ఉత్తమ పరిశోధనలను సేకరించి కూర్చిన గ్రంథం ఇది. ఈ రెండు సంపుటాలు నిజానికి తెలుగు సాహిత్యంలో పరిశోధనలకు ఒక ప్రామాణికతను అందించే సంపుటాలు.
ఈ రెండు సంపుటాలు తెలుగు పరిశోధనల్లో కొత్త దశకు తలుపులు తెరుస్తాయని చెప్పవచ్చు. వివిధ పరిశోధనా గ్రంథాలను లోతుగా పరిశీలించి రాసిన ఈ పరిచయ వ్యాసాలు భావి పరిశోధకులకు పదనిర్దేశనం చేస్తాయి.
ఉస్మానియా నుంచి వచ్చిన మొదటి పరిశోధనా గ్రంథం బిరుదురాజు రామరాజు పరిశోధన "తెలుగు జానపద గేయసాహిత్యం" మొదటి సంపుటంలోని మొదటి వ్యాసంగా ప్రారంభమైన ఈ పరిశోధనా గ్రంథాల ప్రయాణంలో అనేక పరిశోధనాంశాలు ఒక్కో మైలురాయిగా మన ముందుకు వస్తుంటాయి. ఈ పుస్తకానికి పరామర్శ రాసిన శ్రీ ఘట్టమనేని ప్రకారం తెలుగు సాహిత్య పరిశోధన ప్రారంభమై 91 సంవత్సరాలు గడిచిపోయాయి. చిలుకూరి నారాయణరావు 1930లోనే "పదునొకండవ శతాబ్దము నాటి తెనుగుభాష" అనే అంశంపై మద్రాసు యూనివర్శిటీ నుంచి పిహెచీ పొందారని ఆయన రాశారు. అప్పటి నుంచి ప్రారంభమైన తెలుగు సాహిత్య పరిశోధనా ప్రయాణం అనేక మైలురాళ్ళను దాటింది. ఈ ప్రయాణంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం పోషించిన అసాధారణ పాత్ర ఈ రెండు సంపుటాల్లోని వ్యాసాలు చాటి చెబుతున్నాయి. ఏదేమైనా.. విశ్వవిద్యాలయాల్లోని తెలుగు శాఖలు ప్రత్యేకంగా నిర్వహించవలసిన బాధ్యత ఇది. డా. అట్టెం దత్తయ్య నడుంకట్టి, తన సహచర మిత్రబృందంతో కలిసి ఈ బాధ్యతను భుజాలపై వేసుకుని, ఎంతో శ్రమకోర్చి తీసుకొచ్చిన ఈ రెండు సంపుటాలు తెలుగు సాహిత్య పరిశోధకులకు ఎంతగానో ఉపయోగపడతాయి.
ప్రొ. వై. పార్థసారథి
(పునాస త్రైమాసిక పత్రికలో ముద్రితం. 2023)
పరిశోధనల ‘సారాంశం’
డాక్టరేటు పరిశోధనలకు ఎల్లవేళల్లోనూ ఉంటుంది. నామమాత్రం పరిశోధన చేసిన వారికి పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోవడం అదనపు ఆభరణం. నిబద్ధతతో పిహెచ్.డి సాధించినవారికి మాత్రం అది వారిని వీడని పరిమళం. స్వర్గీయులైనా గొప్ప కీర్తికాయులను చేయదగిన శక్తి పిహెచ్.డికి ఉంది. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డిగారి పేరు చెప్పగానే కర్పూర వసంతరాయలు, విశ్వంభర కావ్యాల తరువాత ఆయన రచించిన గొప్ప సిద్ధాంత గ్రంథం ‘‘ఆధునికాంధ్ర కవిత్వం ` సంప్రదాయం, ప్రయోగములు’’ గుర్తుకు రావడం సహజం. కొన్ని సిద్ధాంతగ్రంథాలు స్నాతక, స్నాతకోత్తర స్థాయిల్లో బోధనాధ్యయనాలకు కల్పిత రూపాలగుతున్నాయి. ఆచార్య ఎస్వీరామారావు గారి ‘‘తెలుగు సాహిత్య విమర్శ ` అవతరణ వికాసములు’’ ఇందుకొక మంచి ఉదాహరణ. అది ఇప్పటికి ఆరు ముద్రణలు అందుకుంది. సిద్ధాంత గ్రంథ ప్రచురణల విషయంలో ఇదొక గొప్ప రికార్డు. జానపద సాహిత్యంలో పిహెచ్.డి చేయాలనుకున్న వారెవ్వరైనా ఆచార్య బి. రామరాజుగారి సిద్ధాంత గ్రంథాన్ని పరామర్శించవలసిందే. ఇట్లా అనేక కోణాల్లో పలు ప్రక్రియల్లో సిద్ధాంత గ్రంథాలు మహత్తరమైన మార్గదర్శనాన్ని అందిస్తున్నాయి. అయితే వీటిని గుర్తించి నిరంతర సమీక్షలు జరుగుతున్నాయా? అంటే సంతృప్తికరమైన సమాధానం మాత్రం లభించదు.
విశ్వవిద్యాలయాలలో జరిగిన, జరుగుతున్న ఎంఫిల్ మరియు పిహెచ్.డి పరిశోధనలపై నిరంతర పరిశీలన చేసినవారు బహు అరుదు. వారిలో మునుముందుగా ప్రస్తావించవలసిన పేరు ఆచార్య వెలుదండ నిత్యానందరావుగారిది. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాయంలో పరిశోధక విద్యార్థిగా ఉన్న రోజుల్లో (1990) ‘‘విశ్వ విద్యాలయాలలో తెలుగు పరిశోధన’’ అన్న పేరుతో ఒక సప్రమాణిక గ్రంథాన్ని వెలువరించారు. 2013లో దాని పరివర్ధిత ముద్రణ కూడా వెలువడిరది, పాఠకుల ఆదరణను పొందింది. బహుశ: వెలుదండ వారి స్ఫూర్తితో కావచ్చు యువ పరిశోధకులు అట్టెం దత్తయ్య ‘‘సారాంశం’’ అనే పేరుతో పరిశోధనా గ్రంథాల పరిచయవ్యాసాలు సంకలనంగా తీసుకొనివచ్చారు. ఇటీవల వెలువడిన తొలి సంపుటి ఆరువందల పుటల నిడివితో ఉంది. ఇంతటి బృహత్ గ్రంథాన్ని తీసుకువచ్చిన డాక్టర్ అట్టెం దత్తయ్య కృషి అభినందనీయం. ధృవ ఫౌండేషన్, ప్రణవం పబ్లికేషన్స్‌ను తప్పక ప్రశంసించాలి.
పిహెచ్.డి సిద్ధాంత గ్రంథాల్లో రకరకాలు ఉంటాయన్న సంగతి అనుభవజ్ఞులకు తెలిసిందే. పరిశోధకులు కేవలం తమ అభిరుచి ఆధారంగా అంశాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు అది పరమిత పరిధిలోనే ప్రచారాన్ని పొందుతుంది. అట్లా కాకుండా ఒక సువిశాలమైన అంశాన్ని లేదా ప్రక్రియను ఎంచుకుంటే దానివల్ల సాహిత్యలోకానికి గొప్ప ప్రయోజనాలు చేకూరుతాయి. పరిశోధకుడికీ గుర్తింపు లభిస్తుంది. అటువంటి సిద్ధాంత గ్రంథాలు 110 ఎంపిక చేసుకొని అందులో సగభాగాన్ని అంటే 55 సిద్ధాంత గ్రంథాల పరిచయంతో ‘‘సారాంశం’’ వెలువడిరది. ప్రవర్ధమాన పరిశోధకులు అందరూ తప్పక చదవదగిన గ్రంథమిది.
సమస్త అంశాలు ఒకేచోట లభ్యమయ్యేట్టుగా డాక్టర్ దత్తయ్య ‘‘సారాంశం’’ రూపకల్పన చేశారు. అది సిద్ధాంత గ్రంథాల పట్ల ఆయన అవగాహనకూ, సాహిత్య లోకానికి ఉపకరించే గ్రంథాన్ని తిరిగి ప్రచారంలోకి తేవాలన్న ఆయన సంకల్పానికి నిదర్శనమవుతోంది. జానపదం, సంప్రదాయ తెలుగు కవిత్వ ప్రక్రియలు, ఛందస్సు ` వ్యాకరణం, అలంకారశాస్త్రాలు, పూర్వకవులు, ఆధునిక కవులు, ఆధునిక సాహిత్య ప్రక్రియా వాదాలు, ఉద్యమాలు, ధోరణులు తెలుగులో పెద్దగా ప్రచారంలో లేని యాత్రా చరిత్రల వంటి అంశాల మీద జరిగిన పరిశోధనల్ని సారాంశంలో చేర్చారు. ఇందులో సంపాదకుల విశాల దృష్టి స్పష్టమవుతున్నది.
సిద్ధాంత గ్రంథాన్ని సమీక్షించినవారిలో ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు, సంగనభట్ల నర్సయ్య, వెల్దండ నిత్యానందరావు, గండ్ర లక్ష్మణరావు, గుమ్మనగారి బాల శ్రీనివాసమూర్తి, రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, వి. త్రివేణి, ఘట్టమరాజు, ఎన్. వేణుగోపాల్, సిహెచ్. లక్ష్మణచక్రవర్తి, బి. మనోహరి, గిరిజా మనోహర్‌బాబు, డి. సాంబమూర్తి, వంటి ప్రసిద్ధులతో పాటు ఇటీవలి కాలంలో చక్కని విమర్శా వ్యాసరచన చేస్తున్న నవతరం ప్రతినిధులూ ఉన్నారు. ఇట్లా కొత్త తరానికి దత్తయ్య తగిన ప్రోత్సాహం కల్పించారు. ఇది ఆయన సహృదయతకు సూచిక.
సిద్ధాంత గ్రంథాలపై రచించిన విశ్లేషణలన్నీ నిడివిలో (దాదాపు) తూకం వేసినట్లు సమాన పుటల్లో ఉన్నాయి. సంపాదకులు ముందుగానే ఇందుకు అవసరమైన ఒక సూత్రబద్ధ ప్రణాళికను రచయితలకు సూచించినట్లు అర్థమవుతుంది. వ్యాసాల్లో మప్పాతిక భాగం పాజిటివ్ రివ్యూలే! ఆయా సిద్ధాంత గ్రంతకర్తల పట్ల వారి విశేషమైన కృషి విషయంలోనూ వ్యాసకర్తలు ఏర్పర్చుకున్న గౌరవం ఇందుకు కారణం, అంతేకాదు ఆయా సిదాంత గ్రంథాలపట్ల అభిరుచి ఉన్నవారితోనే వ్యాసరచన చేయించడం కూడా ఇందుకు కారణం కావచ్చు.
గ్రంథం చూడగానే చదివేయాలనంత అందంగా రూపొందింది. పెద్దలు, సాహిత్య అకాడమీ పూర్వ సారథి నందిని సిధారెడ్డిగారు ‘‘పరిశోధనల సారాంశం’’ పేరుతో ఔచితీవంతమైన ముందుమాట రచించారు. ఇంకా ఘట్టమరాజు, జిఎస్. మోహన్ గారల వ్యాసాలు బాగున్నాయి.
నవలా సాహిత్యంపై బి.వి. కుటుంబరావుగారు, తెలుగు నాటక రంగంపై పోణంగి శ్రీరామ అప్పారావుగారు చేసిన పరిశోధనలు ఇప్పటికీ ప్రామాణికాలు. ఇవి ఆయా ప్రక్రియల్లో ప్రప్రథమ పరామర్శ గ్రంథాలు ‘‘సారాంశం’’లో వాటి సమీక్ష లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బహుశ: ‘తెలంగాణ పరిశోధకుల పరిశోధన గ్రంథాలు’’ అన్న పరిమితి వల్ల వాటిని తీసుకోలేదేమో, మరి శ్రీశ్రీ కవిత్వంపై దేవరాజు కృష్ణంరాజుగారి సిద్ధాంత గ్రంథం సంగతి ఏమిటి? (అది ప్రచురణ పొంది ఎన్నో సంవత్సరాలు అవుతుంది) బహుశ రెండవ సంపుటంలో వస్తుందేమో.
ఈరోజుల్లో ఇంతటి బృహత్ వ్యాస సంకల్నం ప్రచురించడం మహా సాహసం. అసాహసిక ప్రవృత్తితో సామాత్వ యాత్ర చేస్తున్న ‘‘డా. దత్తయ్య ‘‘సారాంశం’’ ` 2 ను కూడా త్వరోలే వెలువరిస్తారని ఆశిద్దాం.
మండలోజు నర్సింహస్వామి
పరిశోధక విద్యార్థి
(మూసీ మాస పత్రికలో ప్రచురితం. ఏప్రిల్ 2022)
తెలుగు పరిశోధన గ్రంథాల ‘సారాంశం’
మన తెలుగు సాహిత్యము ఎంతో విశిష్టమైనది, విశాలమైనది. భారత, భాగవత, రామాయణ, ప్రబంధాలు, కావ్యాలు, పురాణాలు, ఛందస్సు, జానపదం, కవిత్వం, కథ, నాటక ఇలా ఎన్నో అంశాలు. ఈ అంశాలను మూల్యాంకనం చేయడం, అందులోని నిధులను తవ్వి మనకు కొత్త మార్గాలను, విషయాలను అందించడం అనేది ఒక పరిశోధన. ఆ పరిశోధన అంటే ఆయాన కృతులలోని అంతర్ రహస్యాలను వెలికితీసి మనముందుంచడం. వేదం వేంకటరాయశాస్త్రి గారు ఆముక్తమాల్యదకు అందించిన ‘సంజీవనీ వ్యాఖ్య’. ఇదొక పరిశోధన. మానవల్లి రామకృష్ణ, బండారు తమ్మయ్య, సురవరం, బాలేందుశేఖరం, ఖండవల్లి లక్ష్మీరంజనం లాంటివారు స్వచ్ఛందంగా పరిశోధనలు చేసి కొత్త కొత్త అంశాలను తవ్వి మనముందుంచారు. బంగోరె, జి.వి. సుబ్రహ్మణ్యం, కోవెల సంపత్కుమారాచార్యుల (ఛందో వికాసము) లాంటి వారితో పాటు సమకాలీనులు ఎందరో పరిశోధన పట్టాలకు అతీతంగా మూల్యాంకనమును చేస్తూ అమూల్య గ్రంథాలను అందిస్తూనే ఉన్నారు.
ఉన్నత విద్య కోసం, ఉద్యోగాల కోసం అధికారిక డాక్టరేట్ పట్టా నిమిత్తం పరిశోధన చేయడం మరొక పార్శ్వం. ఈ పరిశోధనలు విశ్వ విద్యాలయ పరిధిలో పర్యవేక్షకుడి నేతృత్వంలో జరుగుతవి. తెలంగాణాలో ఉస్మానియా విశ్వవిద్యాలయం మొదటిది. రెండవది కాకతీయ. తెలుగులో వచ్చిన మొదటి డాక్టరేట్ పట్టా 1956లో. బిరుదురాజు రామరాజుగారి ‘తెలంగాణ జానపద గేయ సాహిత్యము’. ఇది 1958లో అచ్చైనది. ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయమునకు ఖండవల్లి లక్ష్మీరంజనం గారి పర్యవేక్షణలో సమర్పించబడినది.
కాకతీయ విశ్వవిద్యాలయంనుడి తొలి డాక్టరేట్ పట్టాను కోవెల సంపత్కురాచార్యులుగారు ‘ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ ` సాంప్రదాయిక రీతి’ అను అంశముతో పరిశోధించి సమర్పించి నారు. ఈ పరిశోధనకు పర్యవేక్షకులు కేతవరపు రామకోటిశాస్త్రిగారు. 1976లో పట్టా అందుకున్నారు. 1981లో ఇది అచ్చైనది. ఇలా నాంది పడిన పరిశోధనా పట్టాలు సుమారు 5,6 వందలుండవచ్చును. దీనిని గమనించే వెలుదండ నిత్యానందరావు ‘‘విశ్వ విద్యాలయాలలో తెలుగు పరిశోధన’’ పేరుతో 1956 నుండి 2013 వరకు వచ్చిన యం.ఫిల్, పిహెచ్.డి పట్టానన్నిటిని గ్రంథస్థము చేసారు. ఇందులో 5 వేలపై చిలుకు నమోదు చేసారు.
డాక్టరేట్ పట్టా పొందిన అచ్చైన పరిశోధన గ్రంథాలను పరిగణనకు తీసుకుని డా. అట్టెం దత్తయ్య ఒక ప్రణాళికను సిద్ధ చేసుకున్నాడు. ఆ ప్రణాళిక ఏమిటంటే తెలంగాణలోని విశ్వ విద్యాలయాల నుండి వచ్చిన పరిశోధన (డాక్టరేట్)ల సారాన్ని ఒకదగ్గర అందిస్తే అది పదుగురికి ఉపయోగపడడమే కాకుండా, ఆయ పరిశోధనలను ఒక దగ్గర చదువుకునే అవకాశంతో పాటే ఏయే అంశాలపై పరిశోధన జరిగిందో కూడా తెలుస్తుంది అనుకున్నాడు ఆయా పరిశోధనలను మూల్యాంకనము చేయించితే బాగుంటుందని ఆలోచించి 2019 తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డా. నందిని సిధారెడ్డిగారిని సంప్రదించగా ఆమోద ప్రోత్సాహమును అకాడమీ తరఫున ప్రచురిద్దామని చెప్పారు.
డా. అట్టెం దత్తయ్య ఆయా పరిశోధనలపై సమ్యవేక్షణ చేయగల సుహృన్మూర్తులను సంప్రదించి వారి నుండి వ్యాసాలను రాబట్టుకుని ‘సారంశం’’ రెండు సంపుటాలుగా 1216 (608 G 608) పుటలతో వెలువరించారు. ఈ గ్రంథాల వెలుగుకు ఆర్థిక చేయూతను అందించిన కరీంనగరం జిల్లా అమ్మాపురం మండల వాస్తవ్యులు, ఎన్.ఆర్.ఐ. శ్రీ దుండె లక్ష్మణ్‌గారి సుహృదతను మనమందరితో పాటు, తెలంగాణ సాహితీలోకం కూడా గుర్తుంచుకుంటుంది. అభినందిస్తున్నది. మన సంకల్పము, స్వచ్ఛతరి అయిత అది ఎలాగో అలా ఫలిస్తుందంటే ఇలా అన్నమాట. ఒక్కొక్క సంపుటంలో 55 వ్యాసాలు. మొత్తం 110 వ్యాసాలతో పరిశోధన సారాలు సాహితీలోకంలోకి వచ్చినవి. ఈ వ్యాసాలు బిరుదురాజు రామరాజుగారి పరిశోధన నుండి తాళ్ళపల్లి యాకమ్మ వరకు చోటు చేసుకున్నది.
సారాంశం - 1లో ఉస్మానియా విశ్వవిద్యాలయం - 47, కాకతీయ విశ్వ విద్యాలయం - 8 మొత్తం 55
సారాంశం - 2లో ఉస్మానియా విశ్వవిద్యాలయం - 33, కాకతీయ విశ్వ విద్యాలయం - 13, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం - 4, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం - 2, శ్రీకృష్ణదేవరాయ విశ్వ విద్యాలయం - 1, మద్రాసు విశ్వ విద్యాలయం - 1, ద్రవిడ విశ్వ విద్యాలయం - 1 మొత్తం 55.
ఈ సారాంశం రెండు సంపుటాలు తెలంగాణాకే పరిమితము అన్నప్పటికీ తెలంగాణేతర విశ్వ విద్యాలయాలయిన శ్రీకృష్ణదేవరాయ, మద్రాసు, ద్రవిడ విశ్వవిద్యాలయాలలోని పరిశోధనలు, తెలంగాణకు సంబంధించిన సినారె, తెలంగాణ సాహిత్యం, ప్రభావాలు ` పరిణామాలు, బోయ జంగయ్య సాహిత్యానుశీలన అంశాలు అవడం వలన చోటు కల్పించారు. డా. అట్టెం దత్తయ్య పరిశోధను సంబంధించిన ‘జి.యస్. మోహన్’ పరిశోధన స్వరూప స్వభావాలు’ పుస్తకమును ఇందులో చేర్చి భావి పరిశోధకులకు మార్గదర్శకత్వమును చేసి సుకృతులుగా నిలబడినారు. ఇందుకు దత్తయ్య అభినందనీయుడు.
‘సారాంశరోచనం’ శీర్షికతో అట్టెం దత్తయ్య రాసిన ముందుమాటల్లో ‘ప్రతి పరిశోధనా గ్రంథం వెనుక కొన్ని సంవత్సరాల శ్రమ ఉంటుంది. పరిశోధకుల పరిశ్రమ, పర్యవేక్షకుల పరిశీలన, మరికొందరు ఆచార్యుల అంగీకారాలు, విశ్వ విద్యాలయం గుర్తింపు ఉంటుంది. ఇలా వచ్చిన పరిశోధనలు వేలకొలది అయినప్పటికీ కొన్ని మాత్రమే అచ్చుగ్రంథాలుగా రూపుదిద్దుకుంటాయి. పరిశోధన సమయంలో ఆలోచనలకు అవధులు, పరిశోధనాంశానికి పరిధులు, పర్యవేక్షకుల దిద్దుబాటులు, కాలపు పరిమితులకు లోబడి పరిశోధనా గ్రంథం నిర్మించబడుతుంది. కొన్ని గ్రంథాలు ముద్రణకు వెళ్ళేముందు స్వేచ్ఛగా విశాల దృక్పథంతో విస్తృతపరచబడుతాయి. కొన్నిటికి శీర్షికలు సింగారించబడుతవి. మరి కొన్నిటి అధ్యాయాల రూపురేఖలు మార్చబడుతాయి. మొత్తంగా పరిశోధన గ్రంథం కొంతైనా వినూత్నీకరించబడుతుంది. అందుకే సారాంశం 1 & 2 ప్రచురించిన గ్రంథాలకే పరిమితమయ్యాను. మరికొన్ని ప్రసిద్ధి గ్రంథాలకు సంబంధించిన వ్యాసాలను వ్యాసకర్తలు అందించలేకపోవడం వల్ల ఇందులో చేర్చడానికి వీలు పడలేదు’’ అని చెప్పుకొన్నారు.
ఈ సంపుటాలలోని సిధారెడ్డి, భిన్నూరి మనోహరిగారల మాటలు అందరూ తప్పకుండా గుర్తు పెట్టుకోవలసి ఉంటుంది. ‘‘పరిశోధన’’ పదమే చాలా అద్భుతమైనది. పవిత్రమైనది. అసలు పరిశోధన అనేది ఎందుకు చేస్తారు? ఒక నూతన అంశాన్ని గూర్చి పూర్తిస్థాయిలో లేదా తమ పరిధిలో ఉన్న అవకాశాలను వినియోగించుకొని పూర్వపు సిద్ధాంతాలను, లేదా పరిశీలనలను సమన్వయం చేయడం లేదా దానికి భిన్నమైన వాదాన్ని తెలుపడానికి చేసే పరిశ్రమే పరిశోధన. ఒకవేళ కొత్త అంశాన్ని ప్రతిపాదిస్తే తత్సంబంధ విషయాలు, ఉపమానాలు (ఉదాహరణలు కాదు) చెప్పడం వల్ల పరిశోధనకు కొంత బలం చేకూరుతుంది. పరిశోధన అనేది ఒక పవిత్రమైన కార్యం. ఎంపిక చేసుకున్న అంశానికి లభించిన ఆధారాలను జోడిరచి, తన స్పష్టమైన అభిప్రాయాలను విశ్లేషణాత్మకంగా వివరించడం పరిశోధనలో ప్రధాన అంశంగా మనం గమనించాలి. పూర్వపు పరిశోధనలు చేసిన వారు పాటించిన నియమాలు, పరిశోధనా పరిధి, లక్షణాలు, వాటిని కొన్నిసార్లు స్వయంగా ఏర్పరచుకొని ముందుకు కొనసాగినారు. అంశం తిరిగి తిరిగి ఆయా కోణాల్లో చర్చించవలసి వచ్చినప్పుడు మొదటివారిని సమర్థిస్తూనో, వ్యతిరేకిస్తూనో చెప్పవలసిన అవసరం ఉంటుంది. అందుకే పరిశోధన నిరంతరం కొనసాగేది. కొనసాగుతుంటుంది’’ (భిన్నూరి మనోహరి, సారాంశం - 2, పుట 23)
ఆరు దశాబ్దాల పరిశోధనల నుంచి ప్రచురితమైన గ్రంథాల నుంచి ఎంపిక చేసిన పరిచయాలు భావి పరిశోధకులకు మార్గదర్శనం చేయటంలో కొంతయిన తోడ్పడుతాయని ఈ సంపుటాలు ఉపయోగ పడుతవని చెప్పవచ్చును. ఈ సంపుటాలలోని వ్యాసకర్తలు అనుసరించిన విధానమును పరిశోధక విద్యార్థులు గమనిస్తే ఆయా గ్రంథాలను ఏవిధముగా అనుశీలించవచ్చునో తెలుస్తుంది.
భిన్నూరి మనోహరిగారు ఇదే ముందు మాటలో ‘‘ఈ రెండు సారాంశ గ్రంథాల వల్ల ఏమిటి ప్రయోజనం అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఏ అంశం మీద పరిశోధన ఎవరు చేసారన్నది ప్రాథమిక అంశం. అదేవిధముగా ఆయా పరిశోధక గ్రంథాల మీద వ్యాసాలు రచించిన రచయితలు గ్రంథాన్ని ఎలా విశ్లేషించారు? సిద్ధాంత వ్యాసంలో పరిశోధకులు అనుసరించిన విధానం, అందులో ఉన్న మంచి చెడలను ఎట్లా వివరించారు? ఒక సిద్ధాంత గ్రంథాన్ని కొని సమీక్ష చేస్తే ఒక్కొక్కరిది ఒక్కో కోణం, మార్గం ఉంటుంది. 110 పరిశోధన గ్రంథాలపై రాసిన ఈ వ్యాసాలు విద్యార్థికి ఎన్నో కోణాలు తెలుపుతాయి. కాబట్టి విద్యార్థులందరికి ఒక గ్రంథాన్ని ఏవిధంగా సమీక్షించవచ్చో తెలుసుకోవడానికి సారాంశం 1 & 2 సంపుటాలు ఉపయోగపడతాయి’’ అని అంటారు.
డా. అట్టెం దత్తయ్య చేసిన ఈ బృహత్తర కావ్యం ఏదైనా సంస్థ చేయవలసినది. ఈ రెండు సంపుటాల ప్రచురణతో తెలుగు సాహిత్య చరిత్రలో అట్టెం దత్తయ్య, దుండె లక్షణ్గారు తమదైన ముద్రతో కలకాలం నిలిచిపోతారని ఘంటాపథంగా చెప్పవచ్చు. రెండు సంపుటాలలోని 110 ఆ వ్యాసాలను ఇక్కడ ఉటంకించాలి. ఉన్న స్థలాభావం అడ్డువస్తుంది. మూడవ సంపుటం తెచ్చిన పక్షములో ‘పుస్తక పరిచయం, సమీఓ, వ్యాసం, విమర్శ, మూల్యాంకన విమర్శ మొదలగు అంశాలపై ఒక వ్యాసమును చేరిస్తే భావి తరాలకు ఉపయోగపడుతుంది. ఇది కేవలం పుస్తక పరిచయం మాత్రమే కాదు నలుగురికి తెలియాల్సిన అవసరము కూడా.
డా. టి. శ్రీరంగస్వామి
(మూసీ మాస పత్రికలో ముద్రితం. నవంబర్ 2022)
తెలుగు పరిశోధనల నిగ్గుదేల్చిన ‘సారాంశం'
ఆధునిక కాలంలో 'పరిశోధన'దే పెద్ద పీట. రంగం ఏదైనా కావచ్చు కాని దాని లోతులు చూడాలంటే మాత్రం మిక్కిలి అవసరమైనది పరిశోధన మాత్రమే. ప్రతి రంగంలోనూ అవసరమైన జ్ఞాన సముపార్జన సాధించుకోవడానికి దారిదీపంగా తోడ్పడేవి నిస్సంశయంగా పరిశోధన మాత్రమేనన్నది నిర్వివాదమైన అంశం. ఇది సార్వకాలిక సత్యం.
ఆ సత్యాన్నే పరిగణనలోకి తీసుకొని యువసాహితీ వేత్త, పరిశోధనాసక్తుడు డా. అట్టెం దత్తయ్య విశ్వ విద్యాలయాల్లో జరిగిన పరిశోధనలపై ఒక ప్రత్యేక గ్రంథాన్ని వెలువరించే ప్రయత్నానికి పూనుకున్నారు. దాని ఫలితమే 110 పరిశోధన గ్రంథాలపై సమీక్షా గ్రంథంగా తెలుగు వారికి అందిన 'సారాంశం' రెండు సంపుటాలు, సంపాద కులుగా కొన్ని పరిమితులు ఏర్పాటు చేసుకొని తెలంగాణలోని ప్రధాన విశ్వ విద్యాలయాల్లోను, తెలంగాణేతరమైన కొన్ని విశ్వ విద్యాలయాల్లోను తెలుగు భాషా సాహిత్యాలపై జరిగిన పరిశోధనల వల్ల పిహెచ్ పట్టానందుకున్న రచనలపై రాష్ట్రంలోని ప్రముఖ సాహితీ వేత్తలతో వ్యాసాలను సేకరించి గ్రంథం విలువను రెండింతలు చేశారు. అనేక పరిశోధనలను విద్యార్థి లోకానికి, పరిశోధనాసక్తి కలిగిన సాహితీ ప్రియులకు అత్యంత ఉపయుక్తమయ్యే రీతిలో ఇవి రూపొందింపబడ్డాయి. అక్షర ప్రయోజన మేమో ఈ సంపుటాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయ నిపిస్తుంది. మన తెలుగు భాషలోని సాహిత్య సంబంధ గ్రంథాల్లోని వివిధ కోణాలను ప్రదర్శించిన వైవిధ్యం కల 110 పరిశోధనా గ్రంథాల సారాంశాన్ని ఒక చోట గుదిగుచ్చి అందించిన తీరు సంపాదకుని శ్రమను, ఆసక్తిని, సాహిత్య నిబద్దతను తెలుపుతూ ఉంది.
పుస్తక నిర్మాణంలో ప్రధానాంశం వ్యాసరచయితల ఎంపిక, వ్యాస రచయితలు కేవలం రచయితలైతే సరిపోదు. వారు తామెంచుకున్న పరిశోధనా గ్రంథంలోని విషయంపై సమగ్ర అవగాహన ఉండాలి. దాన్ని వ్యాసరూపంలోకి తీసుకొని రాగలిగిన వ్యాస నిర్మాణ చాతుర్యం కూడా అవసరమే. దాన్ని పరిగణనలోకి తీసుకున్న సంపాదకులు ఎన్నుకున్నారు. దాని వల్ల ఈ గ్రంథానికి సరైన న్యాయం జరిగింది. పరిశోధన అనేది తెలుగు సాహిత్యానికి కొత్తేమీ కాదు. విశ్వవిద్యాలయాల స్థాపనకు పూర్వమే మహా మహా విద్వద్వరేణ్యులు అప్పటి సాహిత్య ప్రమాణాలతో గ్రంథాలలోని మంచి చెడులను గూర్చి విశేషమైన రీతిలో గ్రంథ రచనలు చేశారు. విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డ తదనంతరం కూడా వాటిలో జరిగిన కృషికి సమాంతరంగా కూడా చెప్పుకోదగినంత కృషి ఈ మార్గంలో జరిగింది. మాన్యపండితులైన సురవరం, వేటూరి, వేదం, బండారు, చినసీతారామ స్వామి, మానవల్లి, ఖండవల్లి సోదరులు, దివాకర్ల, పాటిబండ, పల్లావారి వంటి పండితులెందరో కృషి చేస్తూ సాహిత్య పరిశోధనకు రాచమార్గం ఏర్పరచి భావి పరిశోధకులకు చక్కని మార్గదర్శనం చేశారు.
కొన్ని పరిమితుల వరకు కృషి చెయ్యాలన్న సంకల్పం వల్ల ఉస్మా నియా, కాకతీయ, కేంద్రీయ, పొట్టి శ్రీరాములు తెలుగు, శ్రీకృష్ణ దేవరాయ, మదరాసు, ద్రవిడ, విశ్వవిద్యాలయాలలోని 110 పరిశో ధనలకు సంబంధించిన సారాంశ వ్యాసాలు ఈ సంపుటాలలో చోటు చేసుకున్నాయి. ఇతర విశ్వవిద్యాలయాల్లో జరిగిన భాషా విశేషాంశాలపై జరిగిన పరిశో ధనల పరిచయం కూడా సాహిత్య జిజ్ఞాసువులకు కొత్త కొత్త విషయాలను తెలుపుతున్నాయి. పరిశోధన అనేది "ఒక జాతి అభి వృద్ది పరిణామానికి, వికాసదశకు సూచిక, వ్యక్తి, సమూహం, తరం, తమ మూల్యాల వైపు" సాగిపో వడానికి ప్రధానమన్న తెలంగాణా సాహిత్య అకాడెమీ పూర్వ అధ్యక్షులు డా. నందిని సిద్ధారెడ్డి మాటలు పరిశోధకులకు, పరిశోధక ప్రేమికులకు లక్ష్య నిర్దేశం చేస్తున్నాయి. ఆ లక్ష్యంతో సాగిన ఈ ప్రయత్నం సర్వులకు శిరోధార్యం. డా. భిన్నూరి మనోహరి కూడా "పరిశోధన పదము చాలా పవిత్రమైనది" అని వెలిబుచ్చిన తమ అభిప్రాయానికి ఈ గ్రంథమే సాక్షరోదాహరణగా నిలుస్తుంది.
గన్నమరాజు గిరిజా మనోహర బాబు
ప్రముఖ విమర్శకులు
(తెలంగాణ మాస పత్రికలో ప్రచురితం. జనవరి 2023)
పరిశోధనల దిక్సూచి...
ఒక జాతి చరిత్రను భిన్న కోణాలలో, విభిన్న అంశాలతో అధ్యయనం చేసి ఆధార సహితంగా సప్రమాణికంగా నిరూపించి విశ్లేషణాత్మకంగా వెల్లడించే సారమే పరిశోధన. విస్తృతంగా వచ్చిన అనేకానేక పరిశోధనల్ని ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే ఆ దిశగా విశ్వవిద్యాలయాల గురుతర భూమిక ఎంతటిదో తెలిసిపోతుంది. వేల సంఖ్యలో సిద్ధాంత వ్యాసాలు వస్తుంటే అవి ఏ అంశాల మీద, ఎక్కడ, ఎవరి పర్యవేక్షణలో, ఎవరు చేశారన్న సమాచారం పొందడం మాత్రం చాలా కష్టంగా మారింది. సరిగ్గా అలాంటి సంశయాలను నివృత్తి చేసేందుకు 2013లో ఆచార్య వెలుదండ నిత్యానందరావు వెలువరించిన విశ్వవిద్యాలయాలలో తెలుగు పరిశోధన అన్న గ్రంథం తోడ్పడింది. అంతకు ముందు 1975, 1986 ప్రాంతాల్లో తెలుగు అకాడమీ తెలుగు పరిశోధన సంహిత అన్న పేరుతో వివిధ తెలుగు శాఖలకు చెందిన సిద్ధాంత గ్రంథాల సంక్షిప్త సమాచారంతో రెండు సంపుటాలను వెలువరించింది. 2004లో దాక్షిణాత్య జానపద విజ్ఞాన సంస్థ పక్షాన ఆచార్య భక్తవత్సలరెడ్డి, డాక్టర్ భట్టు రమేశ సంపాదకత్వంలో జానపద విజ్ఞానంలో పరిశోధనలు! సంక్షిప్త వివరణలు అనే గ్రంథాన్ని ప్రచురించింది. 2009, 2010లలో సిపి బ్రౌన్ అకాడమీ తెలుగు పరిశోధన వ్యాసమంజరి అన్న గ్రంథాన్ని వెలువరించారు. ఆయా గ్రంథాలన్నీ పరిశోధనల గురించి సమగ్ర సమాచారాన్ని అందిస్తూనే వాటి వైశిష్ట్యాన్ని విస్తృతీకరించడంలో, పరిశోధనాత్మక దృష్టిని పెంపొందించడంలో విజయం సాధించాయని చెప్పొచ్చు. ఇలా తెలుగు పరిశోధనలపై వచ్చిన గ్రంథాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరొక బృహత్తర ప్రయత్నానికి డాక్టర్ అట్టెం దత్తయ్య శ్రీకారం చుట్టారు. 110 సిద్ధాంత గ్రంథాలను ఎన్నుకొని సారాంశం పేరుతో రెండు విశిష్ట సంపుటాలను వెలువరించారు. గతంలో వచ్చిన గ్రంథాలకు కొనసాగింపుగా, విభిన్నతలతో కూడిన వినూత్న పరిశోధనల ప్రత్యేకతగా వెలువడిన ఈ సంపుటాల బహుముఖ కృషికి ఆచార్య జీఎస్ మోహన్ అందించిన పరిశోధన స్వరూప స్వభావాలు అన్న వ్యాసం ప్రేరణగా నిలిచింది. ప్రామాణికతే ప్రాతిపదికగా ఎంపిక చేసుకున్న సిద్ధాంత గ్రంథాలను గురించి లోతైన విశ్లేషణలను అందించ గలిగే పరిశోధకులను సారాంశం రూపకల్పనలో భాగంగా గుర్తించి వారితో ఈ వ్యాసాలను సిద్ధం చేయించారు. 10 ప్రధాన అంశాల మీద దృష్టి సారించి సారాంశం రెండు సంపుటాలను రూపొందించారు. పరిశోధనకు సంబంధించిన ప్రాథమిక సమాచారం, పరిశోధనకు అనుసరించిన పద్దతులు, పరిశోధనాంశ అధ్యాయాల విభజనలో పాటించిన పద్ధతి, అధ్యాయాలలో భాగంగా చర్చించిన అంశాల పరిచయం, సంబంధిత రంగంలో ఆ సిద్ధాంత గ్రంథ విశిష్టత, ఆ సిద్ధాంత వ్యాసం పూరించిన ఖాళీలు, పరిశోధన ఫలితాల క్రోడీకరింపు, పరిశోధనలో పాటించిన రచనాశైలి, రాబోయే పరిశోధకులకు అందించిన మార్గదర్శనం, సలహాలు తదనంతర పరిశోధనా రంగాలపై అది చూపిన ప్రభావం అన్న అంశాల ప్రాతిపాదికన సారాంశంలోని విశ్లేషణాత్మక వ్యాసాలన్నీ భావి పరిశోధకుల కోసం ఎంతో ఉపయుక్తంగా రూపొందాయి.
మంచి మార్గదర్శనంతో కూడిన ప్రేరణ అందిస్తూ ప్రామాణికతతో ఈ సంపుటాలలోని వ్యాసాలను పొందుపరిచారు. ఎన్నో విలువైన సిద్ధాంత గ్రంథాలు అనేక కారణాలతో ముద్రణకు, పునర్ముద్రణకు నోచుకోక అలభ్యస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులలో ఔత్సాహిక పరిశోధకులకు, పరిశోధక విద్యార్థులకు, సాహిత్యాభిలాషులకు మార్గదర్శనం, ప్రేరణ అందడానికి డాక్టర్ దత్తయ్య చేసిన సారాంశపు అడుగు మరొక బృహత్తర పరిశోధనాత్మక ప్రయత్నమనే చెప్పాలి. సారాంశం మొదటి సంపుటిని పరిశోధనల సారాన్ని తెలుగు సాహిత్యానికి సమగ్రంగా అందించిన ఆచార్య వెలుదండ నిత్యానందరావుకు, రెండవ సంపుటిని భాషా పరిణామాలను విపులంగా విశ్లేషించి పేరొందిన ఆచార్య వై రెడ్డి శ్రామలకు అంకితమిచ్చారు. ధ్రువ ఫౌండేషన్, ప్రణవం పబ్లికేషన్స్ 2021 ప్రచురణగా ఈ రెండు సంపుటాలు వెలువడ్డాయి. ధ్రువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు దుండె లక్ష్మణ్ (అమెరికా), అధ్యక్షులు దుండె మల్లేశంలు సాహిత్యభిలాషులై సారాంశం సంపుటాలు వెలుగులోకి వచ్చేందుకు వెన్నుదన్నుగా నిలిచారు.
సారాంశం తొలి సంపుటిలో మొత్తం 55 వ్యాసాలుండగా తొలి వ్యాసం డాక్టర్ బిరుద రాజు రామరాజు పరిశోధన తెలుగు జానపద గేయ సాహిత్యము కాగా, 55వ వ్యాసం డాక్టర్ డింగరి నరహరి పరిశోధన వానమాములై జగన్నాధాచార్యులు రచనలు- భాషా సాహిత్య పరిశోధన. తొలి సంపుటికి డాక్టర్ నందిని సిధారెడ్డి, ఆచార్య సూర్యాధనంజయ్, ఘట్టమరాజు రాసిన ముందు మాటలలో అందులోని 55 సిద్ధాంత గ్రంథాలలోని ప్రామాణికతను, పరిశోధాత్మక విలువలను ప్రత్యేకంగా ప్రస్తావించి నూతన పరిశోధకులకు అవి ఎంతో మార్గదర్శకమని సూచించారు. రెండవ సంపుటిలో కూడా 55 వ్యాసాలున్నాయి. అందులో డాక్టర్ గండ్ర లక్ష్మణావు పరిశోధన వేయిపడగలు - ఒక దర్శనం అన్నది తొలి వ్యాసం కాగా, డాక్టర్ తాళ్ళపల్లి యాకమ్మ పరిశోధన బోయ జంగయ్య సాహిత్యానుశీలనపై చివరి వ్యాసం. ఈ సంపుటికి డాక్టర్ బుక్కా బాలస్వామి, డాక్టర్ భిన్నూరి మనోహరి రాసిన ముందు మాటలు ఇందులోని ప్రదీపాత్మక పరిశోధనా గ్రంథాలు భావి పరిశోధకులకు ఎలా దిక్సూచిగా నిలుస్తాయన్న విషయాన్ని వెల్లడించారు. మొదటి రెండు సంపుటాలలో సారాంశ లోచనం, సారాంశ రోచనం పేరిట డాక్టర్ దత్తయ్య రాసిన సంపాదకీయ వివరణలు ఈ రెండు గ్రంథాల ప్రచురణ ఆంతర్యాన్ని విడమర్చి స్పష్టంగా ఆవిష్కరించాయి.
సారాంశం మొదటి సంపుటంలో వరుసగా డాక్టర్ బిరుదరాజు రామరాజు, డాక్టర్ పల్లా దుర్గయ్య, డాక్టర్ సి. నారాయణరెడ్డి, డాక్టర్ ఎం కులశేఖరరావు, డాక్టర్ కె గోపాల కృష్ణరావు, డాక్టర్ హరి శివకుమార్, డాక్టర్ పాకాల యశోదారెడ్డి, డాక్టర్ ఎస్వీ రామారావు, డాక్టర్ ముకురాల రామారెడ్డి, డాక్టర్ వే. నరసింహారెడ్డి, డాక్టర్ యెల్దండ రఘుమారెడ్డి, డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి, డాక్టర్ ఏ. ప్రభాకరరావు, డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి, డాక్టర్ కె.వి సుందరాచార్యులు, డాక్టర్ ముదిగొండ వీరేశలింగం, డాక్టర్ ఎన్.జి. రామానుజాచార్యులు, డాక్టర్ కోవెల సంపత్కుమారాచార్య, డాక్టర్ జి. చెన్నకేశవరెడ్డి, డాక్టర్ ఎన్. గోపి, డాక్టర్ కె. కోదండరామాచార్యులు, డాక్టర్ రవ్వా శ్రీహరి, డాక్టర్ వరవరరావు, డాక్టర్ కిడాంబి నరసింహాచార్య, డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి, డాక్టర్ అనుమాండ్ల భూమయ్య, డాక్టర్ అందె వేంకటరాజం, డాక్టర్ చందూరి హైమవతి, డాక్టర్ కె బుక్నుద్దీన్, డాక్టర్ పేర్వారం జగన్నాథం, డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్, డాక్టర్ కె. సింగరాచార్యులు, డాక్టర్ నందిని సిధారెడ్డి, డాక్టర్ ఎం. గంగాధర్, డాక్టర్ బుక్కా బాలస్వామి, డాక్టర్ పైడిమర్రి మాణిక్ ప్రభు, డాక్టర్ జయధీర్ తిరుమలరావు, డాక్టర్ కె యాదగిరి, డాక్టర్ సంగనభట్ల నరసయ్య, డాక్టర్ ననుమాస స్వామి, డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య, డాక్టర్ డి చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ మసన చెన్నప్ప, డాక్టర్ శ్రీరంగాచార్య, డాక్టర్ అప్పం పాండయ్య, డాక్టర్ దాశరథుల నర్సయ్య, డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ, డాక్టర్ వెలుదండ నిత్యానందరావు, డాక్టర్ మచ్చ హరిదాసు, డాక్టర్ డింగరి నరహరీలు వివిధ విశ్వ విద్యాలయాలలో విభిన్న సాహిత్య అంశాలపై చేసిన పరిశోధనలకు సంబంధించిన వ్యాసాలున్నాయి.
కాగా ఆయా వ్యాసాలను డాక్టర్ బుక్కా బాలస్వామి, డాక్టర్ యల్లంభట్ల నాగయ్య, డాక్టర్ జి. బాలశ్రీనివాసమూర్తి, వేదార్థం మధుసూదనశర్మ, డాక్టర్ పల్లేరు వీరస్వామి, డాక్టర్ వేలూరి శ్రీదేవి, డాక్టర్ బూదాటి వెంకటేశ్వర్లు, డాక్టర్ సంగనభట్ల నర్సయ్య, డాక్టర్ అట్టెం దత్తయ్య, డాక్టర్ దహగం సాంబమూర్తి, తాటికొండ లక్ష్మీనారాయణ, డాక్టర్ వెలుదండ నిత్యానందరావు, డాక్టర్ మంత్రి శ్రీనివాస్, డాక్టర్ వి. త్రివేణి, డాక్టర్ కె.కె వెంకటశర్మ, డాక్టర్ బి. బాలకృష్ణ, డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, డాక్టర్ జి విజయ్‌కుమార్, డాక్టర్ రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, బోళ్ల ప్రవీణ్‌కుమార్, ఘట్టమరాజు, చీపిరిశెట్టి కవిత, డాక్టర్ పి. వారిజారాణి, డాక్టర్ సి. యాదగిరి, ఎన్ వేణుగోపాల్, కె. వెంకట నర్సింహాచార్య, అవుసుల భానుప్రకాశ్, డాక్టర్ కె. జోత్స్న ప్రభ, డాక్టర్ తిరునగరి శరత్చంద్ర, డాక్టర్ వి. జయప్రకాశ్, డాక్టర్ తాళ్లపల్లి యాకమ్మ, డాక్టర్ ఆర్ సూర్యప్రకాశ్‌రావు, డాక్టర్ కందాల శోభారాణి, డాక్టర్ మండల స్వామి, డాక్టర్ బర్ల మహేందర్, డాక్టర్ భూదాటి వెంకటేశ్వర్లు, డాక్టర్ సిహెచ్ లక్ష్మణ చక్రపర్తి, మామిడి సంతోష్ గౌడ్, వర్ద వేణు, డాక్టర్ సళ్ల విజయ్‌కుమార్, డాక్టర్ బి. మనోహరి, డాక్టర్ చంద్రయ్య, రమాదేవి, గిరిజా మనోహరబాబు, డాక్టర్ సావిత్రిబాయి, డాక్టర్ బి.వి.ఎన్ స్వామి తదితరుల విశ్లేషణాత్మక వ్యాసాలు ఉన్నాయి.
సారాంశం రెండవ సంపుటంలో వరుసగా డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, డాక్టర్ ఎం ప్రమీలారెడ్డి, డాక్టర్ మారంరాజు ఉదయ, డాక్టర్ యం.డి రాజ్‌మహ్మద్, డాక్టర్ ఎన్.ఆర్ వెంకటేశం, డాక్టర్ వి. వీరాచారి, డాక్టర్ కాలువ మల్లయ్య, డాక్టర్ పరవస్తు కమల, డాక్టర్ టి. శ్రీరంగస్వామి, డాక్టర్ బన్న అయిలయ్య, డాక్టర్ పంతంగి వెంకటేశ్వర్లు, డాక్టర్ మలయశ్రీ, డాక్టర్ సిహెచ్. సీతాలక్ష్మి, డాక్టర్ ఎన్. రజని, డాక్టర్. జి. బాలశ్రీనివాసమూర్తి, డాక్టర్ జె చెన్నయ్య, డాక్టర్ వై. ఎ. విశాలక్షి, డాక్టర్ గంగు కిషన్రసాద్, డాక్టర్ అయాచితం శ్రీధర్, డాక్టర్ వేలూరి శ్రీదేవి, డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య, డాక్టర్ కళామురళి, డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ, డాక్టర్ కె శ్రీనివాస్, డాక్టర్ కాకునూరి సత్యనారాయణ, డాక్టర్ వి. శంకర్, డాక్టర్ కంచి విజయలక్ష్మి, డాక్టర్ గుండెడప్పు కనకయ్య, డాక్టర్ బండారు సుజాతశేఖర్, డాక్టర్ ఎం. పురుషోత్తమాచార్యులు, డాక్టర్ సిహెచ్. లక్ష్మణ చక్రవర్తి, డాక్టర్ సాగి కమలాకర శర్మ, డాక్టర్ బి. మనోహరి, డాక్టర్ గుఱ్ఱం విజయ్‌కుమార్, డాక్టర్ కె.వి రమణాచారి, డాక్టర్ తిరునగరి దేవకీదేవి, డాక్టర్ రాళ్ళబండి కవితా ప్రసాద్, డాక్టర్ సూర్యా ధనంజయ్, డాక్టర్ చాట్ల నర్సయ్య, డాక్టర్ యాకుబ్, డాక్టర్ అడువాల సుజాత, డాక్టర్ జె. నీరజ, డాక్టర్ సి. కాశీం, డాక్టర్ వై. గీతావాణి, డాక్టర్ పి. భాస్కరయోగి, డాక్టర్ ఆకునూరు విద్యాదేవి, డాక్టర్ కందాళ శోభారాణి, డాక్టర్ పసునూరి రవీందర్, డాక్టర్ చింతనూరి కృష్ణమూర్తి, డాక్టర్ పుట్ట యాదయ్య, డాక్టర్ కొండపల్లి నీహారిణి, డాక్టర్ బూర్ల చంద్రశేఖర్, డాక్టర్ తాళ్ళపల్లి యాకమ్మలు చేసిన పరిశోధనలకు సంబంధించిన విశ్లేషణాత్మక వ్యాసాలున్నాయి.
ఆయా పరిశోధనలకు సంబంధించిన వ్యాసాలను డాక్టర్ జె భారతి, ఘట్టమరాజు, ఘనపురం సుదర్శన్, డాక్టర్ సూర్యా ధనంజయ్, డాక్టర్ ఏలె విజయలక్ష్మి, వి సత్యవతి, మునగపాటి అరవింద, డాక్టర్ వీపూరి వెంకటేశ్వర్లు, డాక్టర్ నమిలికొండ సునీత, డాక్టర్ కర్రె సదాశివ్, వై సత్యనారాయణ, స్తంభంకాడి గంగాధర్, డాక్టర్ ఎం దేవేంద్ర, పంబాల మురళీకృష్ణ, డాక్టర్ వై. రెడ్డి శ్యామల, డాక్టర్ వడ్కాపురం కృష్ణ, డాక్టర్ అట్టెం దత్తయ్య, డాక్టర్ పగడాల నాగేందర్, డాక్టర్ వి జయప్రకాశ్, డాక్టర్ చెమన్, డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ, డాక్టర్ బైరోజు శ్యామ్‌సుందర్, డాక్టర్ వోలేటి పార్వతీశం, టి శ్రీవల్లి రాధిక, డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ సాగి కమలాకర్ శర్మ, పిల్లి సురేశ్, డాక్టర్ సయ్యద్ అఫ్రిన్ బేగం, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, గురిజాల రామశేషయ్య, డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి, డాక్టర్ బి సూర్యకుమార్, డాక్టర్ జి వెంకటలక్ష్మి, డాక్టర్ వెలుదండ నిత్యానందరావు, డాక్టర్ వెల్దండి శ్రీధర్, డాక్టర్ పి సావిత్రిభాయి, యడవల్లి సైదులు, జమ్మిడి మహేందర్, డాక్టర్ ఎన్. వి రమణ, డాక్టర్ చంద్రయ్య ఎస్, కోడం కుమారస్వామి, డాక్టర్ మంత్రి శ్రీనివాస్, డాక్టర్ టి. శ్రీరంగస్వామి, డాక్టర్ వి. వీరాచారి, డాక్టర్ సీతారాం, మ్యాతరి ఆనంద్, తాటికొండ లక్ష్మీనారాయణ, గాలిపెల్లి వెంకన్న పరిశోధనాత్మక విశ్లేషణలతో అందించారు.
అభివృద్ధి వికాసాల వైపు సాహిత్య పరిశోధన నడిచిన తీరును ఈ రెండు సంపుటాలలోని సిద్ధాంత గ్రంథాలకు సంబంధించిన వ్యాసాలలో రచయితలు చాలా స్పష్టంగా వెల్లడించారు. కాలానుగుణంగా చోటు చేసుకుంటున్న ప్రమాణాలను నిర్ధారించడంలో సాహిత్యమే తప్పనిసరిగా కీలకమైన ఆధారమవుతుంది. పాత, కొత్తల మేలు కలయికలను విశ్లేషిస్తూ కాలానుగుణమైన భావోద్వేగాలు, సాహిత్య సాంస్కృతిక విలువలు, జీవన పోకడలను శాస్త్రీయంగా మధించి ఒక సప్రమాణ సారాంశంగా మలచి భవిష్యత్తు ఉన్నతీకరణ కోసం 110 పరిశోధనలు సాగిన తీరును ఈ సంపుటాలలోని 1200 పేజీలలో సవివరంగా ప్రచురించిన వ్యాసాలు వెల్లడించాయి. సత్యశోధన, విషయ స్పష్టత, ఆధార సహిత నిరూపణ, సమగ్రాధ్యయనం, సమన్వయం, సంయమనం, సాలోచన, పరిశోధనా పద్ధతుల బేరీజు, శాస్త్రీయ దృష్టి కోణం, విశేషాంశాల ఆవిష్కరణ, సామాజిక భాషా దృక్పథం, గతంలోని కొన్నింటిని వదిలించుకొని కాలానుగుణంగా తప్పనిసరిగా స్వీకరించాల్సిన నవ్య మార్గాలు, పద్ధతులు, మారిన ప్రాపంచిక మానవ జీవన స్థితిగతుల వంటి ఎన్నెన్నో వైవిధ్య అంశాలను ప్రతిబింబింపజేస్తూ రచయితలు సమగ్రతను పెంపొందించే లోతైన విశ్లేషణతో కూడిన ప్రమాణాత్మక పరిశోధన వ్యాసాలను అందించారు.
మారిన జీవనం, పెరిగిన అనూహ్య వేగంతో విపుల శోధనకు, విశేష ఫలిత సాధనకు పరిశోధనలు దూరమవకుండా గత వైభవాన్ని నిలుపుకుంటూనే సరికొత్త దీప్తితో ముందుకు సాగాలన్న ఆకాంక్షతో కూడిన మార్గదర్శనం, విమర్శనాత్మక సమీక్షణంతో పాటు పరిశోధనా పద్ధతుల అవలంబనకు సూచనలు సారాంశం సంపుటాలలోని వ్యాసాల విశ్లేషణల్లో స్పష్టంగా వ్యక్తమయ్యాయి. భావి పరిశోధకుల కోసం వారి కృషిలో తోడ్పడే విధంగా ఎంతో దీక్షా దక్షతతో డాక్టర్ దత్తయ్య ఈ రెండు సంపుటాలను రూపొందించి అందించారు. నవ్య పరిశోధకులకు ఈ సంపుటాలు దిక్సూచులుగా తప్పనిసరిగా ఉపకరిస్తాయి.
డా. తిరునగరి శ్రీనివాస్
ప్రముఖ విమర్శకుడు
(ప్రజాతంత్ర దినపత్రికలో ప్రచురితం. 26-10-2023)