ఇప్పటివరకు తెలుగు సాహిత్యంలో బి సి వాదం గురించి సమగ్ర పరిశోధన జరగలేదు. ఎన్నో కవిత్వ సంకలనాలు, కథాసంకలనాలు వెలువడినా వాటిని ఒక్క విమర్శకుడు కూడా సీరియస్ గా పట్టించుకోలేదు . ఇప్పటికి ఆ కొరత స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఇన్నాళ్లకు ఉస్మానియా పరిశోధక విద్యార్ధి అట్టెం దత్తయ్య ఎంతో శ్రమకోర్చి తెలంగాణా సాహిత్యంలోని అన్ని పార్శ్వాల్ని పరిశోధించి ఒక మంచి విమర్శనా గ్రంధాన్ని వెలువరించారు. అందుకు మిత్రుడు దత్తయ్యను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
డా. బాణాల శ్రీనివాస రావు
కవి. విమర్శకులు
సమాచారాన్నంతా ఒక దగ్గర కుప్పబోశారు
"కులవృత్తుల సంక్షోభం" "కులవృత్తుల చైతన్యం" పేరిట ఎన్నో వ్యాసాలు, చిరుపుస్తకాలు, సిద్ధాంత గ్రంథాలు కూడా వచ్చాయి."కులవృత్తులు" అనే పదాన్ని మరింత విస్తృతపరిచి బి.సి.వాదంగా ముందుకుతెచ్చారు. బి.సి.లలోని అన్ని గ్రూపుల వారి సాహిత్యాన్ని కలిపి బి.సి.వాద సాహిత్యంగా అట్టెం దత్తయ్య ఒక పుస్తకాన్ని తీసుకువచ్చారు. దీన్ని తెలంగాణకే పరిమితం చేయడం విశేషం. వెరసి ఇది "తెలంగాణ బి.సి.వాద సాహిత్యం". ఇందులో మొదటి అధ్యాయం "తెలంగాణ బి.సి.వాదసాహిత్యం-పరిచయం". ఇందులో దళితులు - బహుజనులు - బి.సి.లు అంటే ఎవరో చర్చించి, ఆయా ఉద్యమాల ఆరంభ వికాసాలను తెలియజేశారు. రెండవ అధ్యాయం "తెలంగాణ పద్య కవిత్వం- బి.సి.వాదం"లో పాల్కురికి సోమన నుండి దోరవేటి వరకు వివిధ బి సి కులాల మీద రాసిన పద్యాలను తెలియజేశారు. మూడవ అధ్యాయం" తెలంగాణ పాట - బి.సి.వాదం"లో ఆశ్రిత గాయకులు మొదలుకుని విప్లవ కవులు, దళిత వాగ్గేయకారులు రాసిన బి.సి.కులాల పాటల గురించి తెలియజేశారు. నాల్గవ అధ్యాయం "తెలంగాణ వచనకవిత్వం- బి.సి.వాదం"లో 2000సం. నుంచి వెలువడిన కవితా సంకలనాలలో తెలంగాణ ఉద్యమంతో పాటు బి.సి.ల కులవృత్తులు, వారి స్థితిగతుల కవితలు చోటుచేసుకున్నాయని, వాటి గురించి వివరించారు. అయిదవ అధ్యాయం" తెలంగాణ కథ-బిసి.వాదం"లో జి.రాములు రాసిన "ఆత్మఘోష" (1945) మొదలుకొని ఇప్పటివరకు వచ్చిన బి.సి.కథలను కులాలవారిగా విభజించడంతో పాటు, కొన్ని కులాలకు సంబంధించిన ప్రత్యేక కథా సంపుటాల గురించి కూడా తెలియజేశారు. ఆరవ అధ్యాయం "తెలంగాణ నవల-బి.సి.వాదం"లో కులాలవారీగా వచ్చిన నవలల పరిచయం చేశారు. ఏడవ అధ్యాయం "తెలంగాణ బి.సి.వాద సాహిత్య విమర్శ"లో బి.సి.సాహిత్య విమర్శగా గుర్తించిన నాలుగు పుస్తకాలతో పాటు ఎన్నో వ్యాసాలు పుస్తకాలలో, పత్రికలలో ప్రచురితం కాగా, ముందుమాటలు - చర్చల రూపంలో కూడా విమర్శ వచ్చిందని తెలియజేశారు. పరిశోధకుడు సమాచారాన్నంతా ఒక దగ్గర కుప్పబోశారు. విశ్లేషించుకోవాల్సిన బాధ్యత పాఠకుడిదే.
కె.పి. అశోక్ కుమార్
ప్రముఖ సమీక్షకులు, విమర్శకులు.
‘తెలంగాణ బీ.సీ. వాద సాహిత్యం’ ఒక గైడ్..
పరిశోధన అంటే కేవలం సేకరణ మాత్రమే కాదని.. ఒక అధ్యాయనం, పరిశీలన అని నిరూపించాడు అట్టెం దత్తయ్య. ‘తెలంగాణ బీ.సీ. వాద సాహిత్యం’ ఒక గైడ్.. ఎంచుకున్న అంశంలో ముఖ్యంగా ప్రాంతపు కులవృత్తులపై వచ్చిన సాహిత్యం పుస్తకాలల్లో ఇది ఎన్నో మెట్లు ముందుంది. నిజానికి రెండు దశాబ్దాల కాలంల నాటిని అధ్యాయనం చేయడమే పెద్ద సాహసం. అందుకోసం కులవృత్తుల పై, తెలంగాణ సాహిత్యం పై ప్రేముంటే సరిపోదు.. పరిశీలనగా పరిశోధించదగా శక్తి చాలా అవసరం. పైగా ఒక్క పక్రియపై కాకుండా తెలంగాణ పద్య కవిత్వం, పాట, వచన కవిత్వం, కథ, నవల, విమర్శలపై అంటే సామాన్యమైంది కాదు. అందుకు దత్తయ్యని మెచ్చుకోక తప్పదు. నాకు బాగా నచ్చిన విషయం parallel గా కాలాన్ని బట్టి ..కులవృత్తులు పుష్టుగా ఉన్న సమయంలో వచ్చిన సాహిత్యం, అంతరించి పోతున్న సమయంలో వచ్చిన సాహిత్యం మార్పులు ఎత్తు చూపిన విధానం..ప్రతి కులంపై వచ్చిన రచనల్ని విభజించి విపులంగా రాసిన విధానం. ప్రపంచీకరణ, వైశ్వీకరణ ప్రభావం వల్ల దెబ్బతిన్న(తింటున్న) వృత్తులపై వచ్చిన సాహిత్యపు వ్యాసాలు పత్రికలకు అంకితమవ్వకుండా, యూనివర్సిటీల్లో అకడమమిక్ గా అధ్యాయనం మాత్రమే చేయకుండా ఇలా పుస్తక రూపకంగా తీసుక రావడం ఓ మంచి ప్రయత్నం. Standard of Living అనేది పెరిగినప్పుడు కులం మీద మమకారం పోదుగానీ, కులవృత్తుల్ని మాత్రం వదిలేయడం చాలా వరకు చూస్తూనే వున్నాం. అయితే పెద్దకులపోల్లు ఇవే వృత్తులను Organised గా చేస్తూ ఎదుగుతున్న విషయం ఈ పుస్తకంలో లోతైన అధ్యయనం. అట్టెం దత్తయ్యకు అభినందనలు…
కె.వి. నరేందర్
కథ, నవల, నాటక రచయిత
బి.సి.సాహిత్య పరిశోధనకు దిక్సూచి
బి.సి.సాహిత్య పరిశోధనకు దిక్సూచి
సుమారు వెయ్యేండ్ల తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలు వెలువడి సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. ప్రాచీన సాహిత్యంలో ఇతిహాసం, పురాణం, శతకం, కావ్యం, ప్రబంధం, యక్షగానం, ఉదాహరణ,రగడ, అష్టకం మొదలగు ప్రక్రియలుంటే, ఆధునిక సాహిత్యంలో నవల, నాటకం, కథ, వ్యాసం, విమర్శ, జీవిత చరిత్ర, ఆత్మకథ మొదలగు ప్రక్రియలు వెలువడ్డాయి. ఆధునిక కవిత్వంలో భావ, అభ్యుదయ, దిగంబర, విప్లవ కవిత్వాలతోపాటు దళిత వాద, స్త్రీవాద, బి.సి.వాద,ముస్లిం మైనార్టీ వాద కవిత్వం కూడా వచ్చింది. ప్రపంచీకరణ ప్రభావం వల్ల తమ తమ అస్తిత్వాలు కోల్పోతున్న సందర్భంలో ఆయా కులాలవారు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేయడం ప్రారంభించారు. అందువల్లనే ఆధునిక కవిత్వంలో అస్తిత్వవాదాలకు ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంది. అందులో భాగంగానే కవులు, రచయితలు తమ రచనల ద్వారా విధ్వంసానికి గురవుతున్న తమ సంస్కృతిని తమ రచనల ద్వారా స్పష్టపరిచారు. ఈ సందర్భంలో భాగంగా బి.సి. కులాలకు సంబంధించిన సాహిత్యం పద్యం, పాట, వచన కవిత్వం, కథ, నవల, విమర్శ- ఇలా బహురూపాలుగా విస్తరించింది. ముఖ్యంగా తెలంగాణలో వచ్చిన బి.సి.వాద సాహిత్యాన్ని పరిశోధిస్తూ అట్టెం దత్తయ్య రూపొందించిన గ్రంథమే ‘తెలంగాణ బి.సి.వాద సాహిత్యం'. మొత్తం ఏడు అధ్యాయాలుగా విభజిస్తూ రాయబడిన ఈ గ్రంథాన్ని పరిశీలిద్దాం.
మొదటి అధ్యాయంలో తెలంగాణ బి.సి. వాద సాహిత్యాన్ని రేఖామాత్రంగా పరిచయం చేశాడు. ‘ కొన్ని గాయాలు మానవు, కొన్ని గాయాలు మానినట్టుగా ఉంటాయి, కొన్ని అస్తిత్వ ఉద్యమాలు కూడా గాయాల్లాంటివే. ఒక్కసారి ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం అదే స్థాయిలో నిలబడలేకపోతుంది. నిశ్శబ్దంగా మొదలైన ఉద్యమాలు ఒక్కసారిగా ఉప్పెనలా ఎగసిపడతాయి. తమ ఆశలు, ఆశయాలు సాధించడానికి ఉరకలేసే ప్రయత్నం చేస్తాయి .అంతర్గత రక్తస్రావాలు జరుగుతూనే ఉంటాయి. గుండె ఆరిపోని కుంపటిలా రాజుకుంటూనే ఉంటుంది ' అని డాక్టర్ ఎస్. రఘు అన్నట్లుగా తెలుగు కవిత్వంలో బి.సి. వాద ఉద్యమానికి చారిత్రక నేపథ్యం ఉందన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇతర అస్తిత్వ ఉద్యమాల వలె బి.సి. వాద సాహిత్యం కూడా వచ్చిందన్న విషయాన్ని దత్తయ్య ఈ అధ్యాయంలో చెప్పాడు.తెలంగాణ బి.సి.వాద సాహిత్యాన్ని పరిచయం చేస్తూ బి.సి.వాద సాహిత్యానికి ఒక నిర్వచనాన్ని, లక్షణాలను, సిద్ధాంత భూమికను స్థిరపరచడంలో సఫలీకృతుడయ్యాడు.పూర్తిస్థాయి బి.సి. కవిత్వంగా ‘వెంటాడే కలాలు- వెనకబడ్డ కులాలు' సంకలన గ్రంథం రావడానికంటె ముందురోజుల్లో కొన్ని సంస్థలు ఒక అడుగు ముందుకు వేసి ‘దళిత బహుజనవాద కవిత్వం’అను ఉప శీర్షికలతో సంకలనాలు తెచ్చాయి. వాటిలో' నీలిసాహితి' సంస్థ ‘మేమే’, ‘మొగి', నీలగిరి సాహితీ సంస్థ ' బహువచనం' అను పేర్లతో సంకలనాలుగా వెలువరించాయన్న విషయాన్ని ప్రస్తావించాడు.
దళిత ససాహిత్యలోంచి ఒక పాయలాగా మొదలిడి, క్రమంగా దాని నుంచి విడివడి, ఆ తర్వాత ప్రత్యేక వాదంగా, దృక్పథంగా నిలదొక్కుకుంది బి.సి.వాద దృక్పథమంటూ ఖచ్చితమైన అభిప్రాయంతో బి.సి.లందరు ఉండాలన్న విషయాన్ని స్పష్టపరిచాడు. బి.సి. వాదమంటే ‘కులాన్ని పట్టుకొని వేలాడడం కాదు, కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడడం' అన్న విషయాన్ని ప్రతి బిసి గుర్తుంచుకోవాలని సూచించాడు. బి.సి. కవిత్వం ద్వారా తమ తమ కులవృత్తులు ఏ విధంగా విధ్వంసమవుతున్నాయో తెలియజేయడమే కాకుండా బి.సి.ల ఐక్యతను చాటి చెప్పడం కూడా జరిగింది. మరికొందరైతే ఆయా వృత్తులు ఆయా కులాలకు అంటగట్టడం వల్లనే వెనుకబడిపోతున్నామనే భావనతో కవిత్వం రాస్తున్నారన్న విషయాన్ని గుర్తుచేశాడు.
రెండవ అధ్యాయంలో తెలంగాణ ప్రాంత కవులు పద్య కవిత్వం ద్వారా బిసి వాదాన్ని ఏ విధంగా చాటిచెప్పారో తెలియజేశాడు.కులవృత్తులను ఆధారంగా చేసుకొని జీవించేవారు వెనకబడి ఉన్నారే తప్ప అభివృద్ధి చెందలేదని కవులు తమ పద్య కవిత్వం ద్వారా చెప్పిన విషయాల్ని ప్రస్తావించాడు.’ సజ్జన బిసి’శీర్షికతో మమత ఐల రాసిన పద్యాలతో పాటు మారుగొండ సాయిలు రాసిన ‘కులవృత్తులు’ అను పద్య కవితను పేర్కొన్నాడు. అంతేకాకుండా ఆయా కులాల వృత్తి నైపుణ్యాలను తమ పద్యాల ద్వారా చెప్పిన విధానాన్ని చక్కగా విశ్లేషించాడు. ఆయా కులవృత్తుల ప్రస్తావన పాల్కురికి సోమనాథుని వృషాధిప శతకంలో, పండితారాధ్య చరిత్రలో కనబడుతుందన్న విషయాన్ని తెలియజేశాడు. అదేవిధంగా గొల్ల కురుమలు, ఉప్పరులు, మున్నూరు కాపులు, దర్జీలు, విశ్వబ్రాహ్మణులు, పద్మశాలీలు, కుమ్మరులు, పిచ్చుకగుంట్లవారు,గౌండ్లు, నాయీ బ్రాహ్మణులు, మేదరులు, గంగిరెద్దులవారు, రజకులు, గంగపుత్రులు మొదలగువారి కులవృత్తుల ప్రాధాన్యతతో పాటు వాటిని ఆధారంగా చేసుకొని జీవించడం వల్ల కలిగే సమస్యల్ని పద్య కవిత్వం ద్వారా చెప్పిన విషయాల్ని పరిశీలించి చెప్పిన విధానం బాగుంది. వివిధ కులవృత్తుల వారు పెట్టుబడిదారుల చేతుల్లో కూలీలుగా మారే విధానాన్ని తెలిపాడు. అంతేకాకుండా దోపిడీకి గురికాకుండా పెట్టుబడిదారులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఆయా కవులు చేసిన దిశానిర్దేశాన్ని ఎరుకపరిచాడు.
‘గొల్లడా' అను శీర్షికతో కేశవపంతుల వేంకట నరసింహ శాస్త్రి రాసిన పద్యాలు, దోరవేటి శ్రమదేవోభవ కావ్యంలో రాసిన కులవృత్తులకు సంబంధించిన పద్యాలు, కాపుల జీవన విధానాన్ని తెలియజేస్తూ గంగుల శాయిరెడ్డి రాసిన ‘కాపుబిడ్డ’ కావ్యం, గోశిక్ నరహరి రచించిన ‘పద్మశాలి శతకం', అవుసుల భానుప్రకాష్ రాసిన ‘ఘన శతకం', మామిండ్ల రామాగౌడ్ గౌడ వృత్తిని తెలియజేస్తూ ' మధు విక్రేత' శీర్షికతో రాసిన పద్యాలు, డాక్టర్ పాండాల మహేశ్వర్ రాసిన పద్యాలు, గంగిరెద్దుల వారి జీవితాన్ని చిత్రిస్తూ పల్లా దుర్గయ్య రాసిన ' గంగిరెద్దు' కావ్యం మొదలగునవి ఆయా కులవృత్తుల ప్రాధాన్యతను, అందులోని సమస్యల్ని చక్కగా విపులీకరించాడు.
మూడవ అధ్యాయంలో ' తెలంగాణ పాట- బి.సి.వాదం’ గురించి తెలియజేస్తూ పాటకు,మానవుడికి అనాదిగా ఉన్నటువంటి సంబంధాన్ని చక్కగా చెప్పాడు. మనిషి పుట్టింది మొదలు మరణించేంత వరకు పాటతో అల్లుకొని పోయిన మనిషి జీవితాన్ని విడమరిచి చెప్పాడు. సకల మానవాళిని పాట ఏ విదంగా పరవశింపజేస్తుందో, ఆలోచింపజేస్తుందో, చైతన్యపరుస్తుందో, ఉద్యమింపజేస్తుందో అదేవిధంగా ఆయా కులవృత్తుల వారి బాధల్ని పాటల ద్వారా చాలామంది కవులు చెప్పడం జరిగింది. ఒకవైపు కులవృత్తుల ప్రాధాన్యతను వివరిస్తూనే మరోవైపు కులవృత్తులు ప్రపంచీకరణ ప్రభావం వల్ల ఏ విధంగా ధ్వంసమైపోతున్నాయో వివరించడం జరిగింది. బి.సి. కులాల ఆశ్రిత గాయకులు ఆయా కులాలకు సంబంధించిన వీరులు, నాయకులు , దాతల గురించి గానం చేస్తారు. కాని ఇప్పటికీ అన్ని బి.సి. కులాలకు సంబంధించిన ఆశ్రిత గాయకుల గురించి , వారు గానం చేసిన సాహిత్య సేకరణ సంబంధించి పరిశోధన పూర్తిస్థాయిలో జరగలేదన్న విషయాన్ని తెలియజేశాడు.
బి.సి. కులాల అస్తిత్వాన్ని తెలియజేస్తూ చాలామంది కవులు రాసిన పాటల్ని ఈ అధ్యాయంలో ప్రస్తావించడం జరిగింది. అయితే ఆయా వృత్తులకు సంబంధించిన పాటలన్నింటిని ఇక్కడ ప్రస్తావించకపోవడం గమనార్హం. రచయిత దృష్టికి రానటువంటి పాటలు కూడా చాలా ఉన్నాయని చెప్పవచ్చు. చెరబండరాజు, గూడ అంజయ్య, గోరటి వెంకన్న, జయరాజు, మిత్ర, దరువు ఎల్లన్న, కందికొండ, బండి సత్తెన్న, ననుమాస స్వామి, వయ్యా సామేలు, గుండేటి రమేష్ ,వడ్డేపల్లి కృష్ణ, స్ఫూర్తి,రాచ భూమయ్య, శమశ్రీ , నకిరేకంటి సీనయ్య మొదలగు కవులు రాసిన పాటలు ఆయా కులవృత్తుల విశిష్టతను, క్రమంగా కనుమరుగైపోతున్న కులవృత్తుల విధ్వంసాన్ని ఎరుక పరుస్తూ, బి.సి.ల ఐక్యతను చాటి చెప్పడం జరిగిందన్న విషయాన్ని తెలియజేశాడు. కేవలం పాటల్లోని భావాలను విశ్లేషించడమే కాకుండా బి.సి.లను చైతన్యపరిచే ఆవేశాన్ని రగిలిస్తూ దత్తయ్య వ్యాఖ్యానించిన విధానం బాగుంది.
నాలుగవ అధ్యాయంలో ' తెలంగాణ వచన కవిత్వం- బి.సి. వాదం' గురించి తెలియజేశాడు. ఆధునిక కవిత్వంలో వచ్చిన పరిణామాల్లో భాగంగా పాట, పద్యం తర్వాత ప్రాధాన్యతను సంతరించుకుంది వచన కవిత్వమే. అస్తిత్వ ఉద్యమాలకు ఒక విస్తృతిని కలిగించింది వచన కవిత్వం. ఇవ్వాళ అన్ని ప్రక్రియల కన్నా వచన కవిత్వమే ముందంజలో ఉందని చెప్పవచ్చు. బి.సి.ల కుల వృత్తులు, వారి స్థితిగతులను తెలియజేస్తూ అనేక వచన కవితా సంకలనాలు వెలువడ్డాయి. జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో ‘వెంటాడే కలాలు- వెనుకబడిన కులాలు’,' పొక్కిలి',’ ఎడపాయలు’, ‘చెమ్మస్’, సుంకర రమేష్ సంపాదకత్వంలో' తెలంగాణ కవిత’ మూడు సంపుటాలు, అఫ్సర్, వంశీకృష్ణ సంపాదకత్వంలో ‘అనేక’, ఎస్వీ సత్యనారాయణ, పెన్నా శివరామకృష్ణ సంపాదకత్వంలో ' దశాబ్ది కవిత’,చింతం ప్రవీణ్ సంపాదకత్వంలో ' సమూహం’, వి.జయప్రకాష్ సంపాదకత్వంలో' బి.సి. కవితాసంకలనం’, ‘రుంజ’ మొదలగువాటిలోని కవితలన్నీ బి.సి.ల సబ్బండ కులాల అస్తిత్వానికి నిదర్శనంగా నిలిచిన విధానాన్ని రచయిత ఈ అధ్యాయంలో వివరించాడు.
అమ్మంగి వేణుగోపాల్ రాసిన ‘బి.సి. ప్రభంజనం' కవిత బి.సి. కులాల మూలాలను, ప్రారంభంలో వారి వృత్తులను, చరిత్ర నిర్మాణానికి, సమాజాభివృద్ధికి, సకల మానవులకు బి.సి.ల వృత్తులు ఎంతగా పనిచేశాయో, చేస్తున్నాయో సకల మానవులకు గొంతెత్తి చెప్పింది. డాక్టర్ బెల్లి యాదయ్య రాసిన ‘నేను గొర్రెల్ని కాస్తుంటాను’, టి కృష్ణమూర్తి యాదవ్ రాసిన' యదువంశ పుత్రులం' , భైతి దుర్గయ్య రాసిన ‘గొంగడి గోస ‘ ,తగుళ్ళ గోపాల్ రాసిన ‘నాన్న గొడ్డలి' ,అట్టెం దత్తయ్య రాసిన' కాపరి' , అవని శ్రీ రాసిన ‘నేను గొర్రెల కాపరిని’, దెంచనాల శ్రీనివాస్ రాసిన ‘యాడీ’, ‘మనే మార్నాక్' , ఆడెపు లక్ష్మణ్ రాసిన' కొలిమి’, సుద్దాల అశోక్ తేజ రాసిన' శ్రమ కావ్యం', వెన్నెల సత్యం రాసిన ' కొలిమి నా చెలిమి' , వంగాల సైదాచారి రాసిన’ వడ్రంగి బతుకులు’ , వడ్ల సంగయ్య రాసినవ' కట్టెపురుగు తొలిసినట్టు' , బాణాల శ్రీనివాస్ రాసిన' రుంజ', దాసోజు జ్ఞానేశ్వర్ రాసిన' నిక్కాక', డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య రాసిన ‘కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్’, వనపట్ల సుబ్బయ్య రాసిన' ధర్మచక్రం',డాక్టర్ నందిని సిద్ధారెడ్డి రాసిన' మృత్కళలు' , అన్నవరం దేవేందర్ రాసిన' బువ్వకుండ’ మొదలగు కవితల్లో ఆయా కవులు తమ తమ కులవృత్తుల విశిష్టతను గూర్చి తెలియజేయడమే కాకుండా అవి విధ్వంసమవుతున్న తీరును తెలియజేసిన విధానాన్ని పేర్కొనడం జరిగింది. తెలంగాణ వచనకవిత్వంలో బహుజన సామాజిక, సాంస్కృతిక కోణాలనన్నింటిని ఈ అధ్యాయంలో దత్తయ్య విశ్లేషించాడు.
ఐదవ అధ్యాయంలో ‘తెలంగాణ కథ- బి.సి.వాదం’ గురించి పరిశీలించాడు . కథాసాహిత్యంలో బి.సి. కులాల స్థితిగతులను తెలియజేసిన కథలు అస్తిత్వ ఉద్యమాల కంటె ముందు నుంచే కనిపిస్తాయి. తెలంగాణ కవులు, రచయితలు ఎక్కువగా గ్రామీణ జీవితాల నుంచి వచ్చినవారు కావడం వల్ల వారి చుట్టూ ఉన్న అన్ని రకాల వ్యక్తుల గురించి, వృత్తుల గురించి కథలు రాశారు . తెలంగాణ నుంచి వచ్చిన కథాసాహిత్యంలో ఎక్కువగా గ్రామీణ జీవితాన్ని, కుల వృత్తి జీవితాన్ని తెలిపినవిగానే కనిపిస్తాయి. ఆవుల పిచ్చయ్య, గూడూరి సీతారాం ,పి.వి. నరసింహారావు, ఆదిరాజు వీరభద్రరావు, అల్లం నారాయణ మొదలగువారు కులవృత్తి ఆధారిత జీవితాలను కథలుగా మలిచి సమాజాన్ని చైతన్యం కలిగించారు. అయితే బి.సి.లు చాలా వరకు తమ కుల బాధల్ని తక్కువగా చెప్పడం జరిగిందన్న విమర్శ కూడా లేకపోలేదు. అగ్రవర్ణాల మెప్పు కోసం తమ సొంత అస్తిత్వాన్ని పక్కకు పెట్టి కథలు రాస్తున్నవారు కూడా లేకపోలేదు. కొన్ని కులాలకు సంబంధించిన కథలు ప్రత్యేక సంపుటాలుగా వెలువడిన విషయాన్ని రచయిత పేర్కొన్నాడు. సంగిశెట్టి శ్రీనివాస్, ఓబులేష్, వెల్దండి శ్రీధర్ ల సంపాదకత్వంలో చేనేత కథలకు సంబంధించిన' పడుగు పేకలు', కాలువ మల్లయ్య, ప్రభంజన యాదవ్, భారతిల సంపాదకత్వంలో గొల్ల కురుమలకు సంబంధించిన' వేపకాయంత నిజం', నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్ వెలువరించిన గౌడ్ లకు సంబంధించిన ‘మా బతుకులు', నాయిబ్రాహ్మణుల జీవితాలకు సంబంధించి తుమ్మల రామకృష్ణ సంపాదకత్వంలో వెలువడిన ‘అడపం’, ఉప్పల నరసింహం వెలువరించిన' సబ్బండ వర్ణాల సారస్వతం' మొదలగునవి బి.సి.ల అస్తిత్వాన్ని తెలియజేసే విధంగా ఉన్నాయంటూ దత్తయ్య విడమరచి చెప్పాడు.
వివిధ కులాల జీవితాలను చిత్రించే కథలు రాసిన పి.వి. నరసింహారావు , ఆవుల పిచ్చయ్య, కాలువ మల్లయ్య, నల్ల భూమయ్య, బి.ఎస్.రాములు, భూపాల్, అల్లం రాజయ్య, పెద్దింటి అశోక్ కుమార్,అట్టెం దత్తయ్య, ప్రభంజన్ యాదవ్, కె వి నరేందర్, బోయ జంగయ్య, జూకంటి జగన్నాథం, గూడ అంజయ్య, బివియన్ స్వామి, నందిని సిధారెడ్డి, దిలావర్, వెంకట రామారావు, రేగులపాటి కిషన్ రావు, మేరెడ్డి యాదగిరిరెడ్డి, దేవేంద్ర, వెల్దండి శ్రీధర్, అంబల్ల జనార్దన్, అనిశెట్టి రజిత, జి. రాములు, శిరంశెట్టి కాంతారావు, కాలువ మల్లయ్య, నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్, జాతశ్రీ, టి. సంపత్ కుమార్, ఐతా చంద్రయ్య, గూడూరి సీతారాం మొదలగు వారు రాసిన కథలను ప్రస్తావించడం జరిగింది. చాలా కథలు ప్రపంచీకరణ దుష్పరిణామాలను ఎంత ప్రభావవంతంగా రికార్డు చేశాయో కూడా దత్తయ్య ఈ అధ్యాయంలో చర్చించాడు.
ఆరవ అధ్యాయంలో' తెలంగాణ నవల- బి.సి. వాదం' గురించి వివరించాడు. తెలుగు సాహిత్యంలో కవిత్వం తప్ప కథ, నవల ,నాటిక, విమర్శ, వ్యాసం మొదలైన వాటిని సాహిత్యంగా పరిగణించక పోవడం గమనిస్తుంటాం. ఇతర ప్రక్రియల కన్నా కవిత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కనిపిస్తుంది. మిగతా ప్రక్రియల్లో వచ్చినంతగా బి.సి.వాద సాహిత్యం నవలా ప్రక్రియలో రాలేదనే విషయాన్ని రచయిత స్పష్టపరిచాడు. సమాజంలో ఎక్కువ శాతం వివిధ కుల వృత్తులకు సంబంధించిన నవలలు రావడం చాలా అరుదు. బి.సి.ల స్థితిగతులను తెలిపే నవలలో 1954లో వచ్చిన ‘పెరటి చెట్టు' నవలిక,1955లో వెలువడిన ‘సంఘము’ నవల ముఖ్యమైనవి. భూపాల్ రాసిన ‘గుడ్డెళ్ళ గుమ్మి మారెమ్మ', ‘పట్నమొచ్చిన పల్లె’, కాలువ మల్లయ్య రాసిన ‘సాంబయ్య సదువు', ‘భూమి పుత్రుడు', ‘బతుకు పుస్తకం' , ‘గువ్వలచెన్న’, ముదిగంటి సుజాత రెడ్డి రాసిన' సంకెళ్లు తెగాయి', దేవులపల్లి కృష్ణమూర్తి రాసిన ‘ఊరు వాడ బ్రతుకు', ‘బయటి గుడిసెలు', బి.ఎస్.రాములు రాసిన ‘జీవనయానం’, శిరంశెట్టి కాంతారావు రాసిన ‘పరంపర’ , నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్ రాసిన ‘బ్రతుకుతాడు’, ‘దుల్దుమ్మ’, ‘కల్తీ బతుకులు’, కె వి ఎల్ రాసిన’ కల్లు మండువ’ జి. రాములు రాసిన ‘పెరటిచెట్టు’ ననుమాస స్వామి రాసిన ‘మోహిని’, ఎమ్.ఎస్.ప్రాణ్ రావు రాసిన ‘ప్రజా జ్యోతి పాపన్న', ఎన్ వి తిరుపతయ్య రాసిన' జీవన సమరం' మొదలగు నవలల్లో ఆయా కులాల చిత్రీకరణ జరిగిన విధానాన్ని చక్కగా విశ్లేషించాడు. అయితే బహుజనుల జీవితాలను చిత్రీకరిస్తూ తెలంగాణలో పరిమితంగా నవలలు వచ్చాయన్న విషయాన్ని కూడా గుర్తు చేశాడు.
చివరగా ఏడవ అధ్యాయంలో ‘తెలంగాణ బి.సి. వాదం- సాహిత్య విమర్శ'ను పరిశీలించడం జరిగింది. రచయిత తన చుట్టూ ఉన్న సాంఘిక జీవితంలో మానవ సంబంధాల పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడు, తన రచనను ఏ సామాజిక ప్రయోజనం కోసం అంకితం చేశాడు, వర్గ జీవితంతో రచయితకున్న సామాజిక తాత్విక సంబంధాలు ఏమిటి, తన రచన సంఘం మీద ఎలాంటి ప్రభావం చూపాలని ఆశిస్తున్నాడు, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ శాస్త్రీయమైన సమాధానాలను ప్రశ్న ద్వారా విశ్లేషించడమే విమర్శ. బి.సి. సాహిత్య విమర్శ గురించి ప్రత్యేక పుస్తకాల రూపంలో ప్రస్తావించడం జరిగింది. కథా సాహిత్యం మీద బి.ఎస్.రాములు వెలువరించిన ' బి.సి. కథలు- ఒక విశ్లేషణ' (2000 -2010), జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వచ్చిన వ్యాస సంకలనం ' ఒక కవిత 20 కోణాలు’. తెలుగు అకాడమీ వారు ప్రచురించిన తెలుగులో కవిత్వోద్యమాలు గ్రంథంలో జూలూరు గౌరీశంకర్ రాసిన వ్యాసం ‘కవిత్వంలో బి.సి. అస్తిత్వవాదం’. ఇందులో బి.సి.ల అస్తిత్వాలను, వారి రచనల్లో మేళవించిన వేమన, పోతులూరి వీరబ్రహ్మం వంటి వారిని గూర్చి గుర్తు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా బాణాల శ్రీనివాస్, సంగిశెట్టి శ్రీనివాస్ ,పగడాల నాగేందర్, జె.చెన్నయ్య , బివిఎన్ స్వామి, కె.పి.అశోక్ కుమార్, ఆచార్య ననుమాస స్వామి మొదలగు వారి విమర్శ వ్యాసాలు బి.సి.వాదాన్ని మరింత ఇనుమడింపజేసే విధంగా ఉన్నాయి. ఇటీవల కాలంలో విశ్వవిద్యాలయాలలో కూడా బి.సి. కులాల సాహిత్యం మీద పరిశోధనలు జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించాడు. అయితే బి.సి. సాహిత్య విమర్శ మీద పక్షపాతం వహిస్తున్నారన్న విషయాన్ని కూడా ప్రస్తావించాడు. బి.సి.యేతర సాహిత్య విమర్శకులు కొంత న్యాయబద్ధంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించడం బాగుంది. బి.సి. విమర్శకులు ఈ మధ్యకాలంలో సాహిత్య విమర్శ పునాది గోడలుగా నిలుస్తున్నారు కాని బి.సి. సాహిత్యాన్ని మాత్రం పట్టించుకోవడంలేదనే విమర్శ ఉంది. బి.సి. కవులకు, రచయితలకు విమర్శకులు ప్రోత్సాహాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని తెలియజేయడం ఎంతో సమంజసంగా ఉంది.
ఇలా తెలంగాణ బి.సి వాద సాహిత్యంపై ఒక పరిశోధనా గ్రంథాన్ని తీసుకొని వచ్చిన దత్తయ్య ప్రయత్నం చాలా గొప్పది. ‘ ఒక చిన్న ప్రయత్నం’ అని తాను వినయంగా విన్నవించుకున్నా అది చిన్న ప్రయత్నమేమీ కాదు, పెద్ద సాహసమే. బి.సి. సాహిత్యాన్ని పరిశోధించడమంటే ఆయా కులాల అస్తిత్వాన్ని శోధించడమే. డాక్టర్ సాగి కమలాకర శర్మ అన్నట్లుగా ‘వేరు వేరు కులాల వేదనాక్షరాలను విశ్లేషించే ప్రయత్నం ఈ గ్రంథం’. ఎంతో ఓపికగా బి.సి.వాద సాహిత్యాన్ని సేకరించి ప్రక్రియలవారీగా పరిశీలించడంలో సఫలీకృతుడయ్యాడు దత్తయ్య. మొత్తం బి.సి.వాద సాహిత్యాన్ని మన ముందుంచడమంటే కొండను అద్దంలో చూపే ప్రయత్నమే. ఇది భవిష్యత్తులో బి.సి.వాద సాహిత్యంపై పరిశోధన చేసేవారికి ఒక దిక్సూచిలా ఉపయోగపడుతుంది. విశేషమైన కృషి చేసి బి.సి. సాహిత్య పరిశోధనకు చక్కని బాట వేసిన దత్తయ్యకు హృదయపూర్వక అభినందనలు.
డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య
అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు శాఖ,
నాగార్జున ప్రభుత్వ కళాశాల, నల్లగొండ. తెలంగాణ.
(తంగేడు పత్రికలో ప్రచురితం. జూన్ 2022)
సమగ్ర తెలంగాణా సాహిత్య చరిత్ర రచనకు దోహదం చేస్తుంది
అట్టెం దత్తయ్య ఉస్మానియా పరిశోధక విద్యార్థిగా మిత్రుడు పత్తి పాక మోహన్ ద్వారా పరిచయం. మోహన్ నేషనల్ బుక్ ట్రస్టు- ఆంధ్రమహిళా సభ ప్రాంగణంలో ఉండడం వలన తరచూ మోహన్ దగ్గరికి వెళ్ళడం వలన చాలా సార్లు దత్తయ్య కలిసేవారు. అలా కొంత చనువు కూడా..
దత్తయ్య ఈ మధ్య కాలంలో "తెలంగాణా బి.సి.వాద సాహిత్యం "అనే పుస్తకాన్ని తెచ్చారు. తెలంగాణా సమగ్ర సాహిత్య చరిత్ర తయారు కావాలంటే అన్ని విభాగాల నుంచి సమగ్రంగా చర్చ జరగాలి పుస్తకాలు రావాలన్న ఆలోచన నన్ను చాలా సార్లు వెంబడించేది. దత్తయ్య ఈ పుస్తకం చూడగానే ఆయన చేసిన ఈ పనికి చాలా సంతోషం కూడా కలిగింది. తెలంగాణా రచయితల సంఘం ఒక జూం సమావేశంలో దత్తయ్యతో ఈ అంశం పై మాట్లాడించిన తరువాత - ఆ ప్రసంగాన్ని విని తనతో మాట్లాడి పుస్తకాన్ని అడిగి తీసుకున్నాను. నిజానికి బి.సి.సాహిత్యానికి ఉద్యమ రూపం, తనదైన గొంతుక 2000కు ఈవల కనిపిస్తుంది కాని దీని ఉనికి అస్తిత్వ దీప్తి 1854 నుంచే ఉందని నాకు చలా సార్లు అనిపించేది.కాని రచనల్లో అది వ్యక్తమయిందా లేదా అన్నది చాలా తక్కువ. పారిశ్రామికీ కరణలో ఎక్కువగా కుల వృత్తులు పరిశ్రమలుగా మారాయి.బహుశః ఈ క్రమంలో తొలుత నష్టపోయింది కుమ్మరి,కమ్మరి లాంటి కుటుంబాలు. ఉత్పత్తి కుటుంబాల ఉత్పత్తులన్నీ ఒక్కొక్కటిగా పరిశ్రమలుగా ఎలా మారాయో అర్థం చేసుకుంటే వచ్చిన సాహిత్యాన్ని అనుశీలన చేయడానికి ఒక మార్గం దొరుకుతుంది.(ఈ క్రమంలో దళితులకు సంబంధించిన వృత్తులు కూడా కొన్ని విధ్వంసమయ్యాయి.డప్పుల్లాంటి తయారీ పరిశ్రమలు చేపట్తాయి.కాని అవి బి.సి.వృత్తులు కాదు)
బహుశః చేనేతల నాటికి ఈ స్పృహ కొంత వ్యక్తమయింది.కథలు,కవిత్వం ఎక్కువగా వచ్చింది.ఇలా అస్తిత్వ చేతన వెలగడానికి కొంత సమయం పట్టింది.అస్తిత్వ సంవేదననుంచి వెలువడిన దానినే బి.సి.వాద సాహిత్యం కింద అనుశీలన చేయాలి. ఉనికి సంబంధమైన చర్చ లేకుండా బి.సి సంవేదనని,తాత్త్వికతను అర్థం చేసుకోలేం. బి.సి.అస్తిత్వంపై ప్రపంచీకరణ సందర్భంలో జరగాలి. కుల వృత్తుల విద్వంసం గురించి వచ్చిన సాహిత్యంలో గరిష్టభాగం ప్రపంచికరణ కిందే చర్చకు వచ్చింది.తరువాతి కాలం బి.సి.సమూహాలు కూడా దళితసమూహంలో కలిసి "దళిత బహుజన"తాత్త్వికతలో వ్యక్తమవడం వలన బి.సి.సాహిత్య చర్చ దళిత శీర్శికకిందే జరిగింది.2002లో కొన్ని పరిణామాల వలన వచ్చిన వెంటాడే కలాలు వెనకబడిన కులాలు ఈ చర్చను రగిలిచాల్సిన సందర్భం.కాని ఆకాలానికి వచ్చిన తెలంగాణా ఉద్యమంవలన ఈ చర్చకూడా వెనుకబడింది.సమూహం తరువాత ప్రవీణ్ తీసుకువచ్చిన అనుశీలనబి.సి.సాహిత్యవిషయంలో కొంత జతచేసింది.ఈ మూడు కారణాల వలన బి.సి.అస్తిత్వ సాహిత్యం వ్యష్టిగా అనుశీలనలకు రాలేదు.బహుసః ఈ కారణాల వల్ల దత్తయ్యకు బి.సి.విమర్శ చాలా తక్కువగా దొరికింది.248 పేజీలున్న ఈ పుస్తకంలో విమర్శాభాగం 10 పేజీలు మాత్రమే లభించింది. నవల, కథ కూడా 60 పేజీలకు మించలెదు. కాని కథలు ఎక్కువగా వచ్చాయి.బి.సి.కథా సంపుటాలు సంకలనాలు అనేకంగా కనిపిస్తాయి. ఈ పుస్తకం మొత్తంలో కవిత్వానుశీలనకు 170 పేజీలు కేటాయించారు దత్తయ్య.
మొత్తంగా బి.సి.సాహిత్యాన్ని మరో సారి ఈ పుస్తకం చర్చకు తీసుకు వస్తుంది. దత్తయ్య చేసిన ఈ పని తప్పకుండా సాహిత్యవేత్తలకు ఉన్న సమగ్రవివేచనాభిరుచిని ప్రశ్నిస్తుంది. బి.సి.రచయితలు, కవులు పరిశోధకులు ఉన్నప్పటికీ బి.సి.సాహిత్య చరిత్ర అనే విభాగం ఒకటి ఎందుకు వేళ్లూనుకోలేదు అనే విషయాన్ని చర్చకు తెస్తుంది.దళిత బహుజన శీర్షిక కింద దళిత బి.సి.,ముస్లీం మైనారిటీ వర్గాలన్నీ సమూహంగా ఉన్నప్పటికీ ముస్లీం సాహిత్యం గురించి కొంత చర్చ జరిగింది.(ఇది కూడా సమగ్రంగా వచ్చిందా లేదా అన్నది చర్చించుకోవాలేసే ఉంది)ఆధునిక సాహిత్యం సుమారుగా అభ్యుదయ సాహిత్యానికి ఈవల వచ్చిన సాహిత్యానుశీలనలో సాహిత్య చరిత్రలన్నీ సుమారుగా చేతులెత్తేశాయి..
ఈ అ నుశీలన కోసం దత్తయ్య పుస్తకం తప్పకుండా ఒక చర్చను తెస్తుంది.తప్పకుందా సమగ్ర తెలంగాణా సాహిత్య చరిత్ర రచనకు దోహదం చేస్తుంది.
ఎం. నారాణయ శర్మ
ప్రముఖ విమర్శకులు
సప్రమాణ బీసీ వాద సాహిత్య పరిశోధన
ఆధునిక సాహిత్య చరిత్రలో అస్తిత్వ ఉద్యమాలది విశిష్ట స్థానం. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశ కాల పరిస్థితులను బట్టి సాహిత్యంలో అస్తిత్వ ఉద్యమాలు ఆవిర్భవించినట్లే మనదేశంలోనూ ఇక్కడి సమాజంలోని అపసవ్య ధోరణులపై ప్రత్యేకించి అణచివేయబడిన సమాజాలు, వర్గాలు తమ ప్రత్యేక అస్తిత్వాన్ని చాటుకునే ప్రయత్నంలో గొప్ప సాహిత్యమే వచ్చింది. ఇది అస్తిత్వవాద సాహిత్యం. 90వ దశకం అనంతరం ఈ స్పృహ మరింత అధికమైంది. దళితవాదం, స్త్రీవాదం, మైనారిటీ వాదం, బీసీ అస్తిత్వవాదం, తెలంగాణ వాదం మొదలైనవన్నీ ఈ కోవలోని ఉద్యమాలే. తెలంగాణలో బిసి అస్తిత్వవాద సాహిత్య చరిత్రను సాధికారికంగా పరిశోధించి మనకు అందించిన వారు డాక్టర్ అట్టెం దత్తయ్య. తెలంగాణ బిసి వాద సాహిత్యం పేరుతో వీరి పరిశోధనాత్మక విమర్శ గ్రంథం నేటి సాహిత్య విద్యార్థులకు పరిశోధకులకూ దిక్సూచి గా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
ఈ గ్రంథంలో దత్తయ్య అభిప్రాయపడినట్టు దళితవాదం స్త్రీవాదం ప్రచారంలోకి వచ్చినంతగా బిసి వాదం ప్రచారంలోకి రాలేదు అనేది నిర్వివాదాంశం. బీసీ కులాల అనైక్యత కూడా దీనికి కొంత కారణం కావచ్చు. బీసీ కులాలలో గొల్ల కురుమలు, ఉప్పరులు, మున్నూరు కాపులు, దర్జీలు, విశ్వబ్రాహ్మణులు, పద్మశాలీలు, కుమ్మరులు, గౌడ లు, పిచ్చుక కుంట్ల వారు, నాయి బ్రాహ్మణులు, మేదర్లు, గంగిరెద్దులవారు, రజకులు గంగ పుత్రులు, వడ్డెరలు, జంగాలు, కాటికాపరి వాళ్లు, ఆరెకటిక లు, పట్కారీలు, వంజరులు, జోగినిలు, దాసరులు, ముదిరాజులు, మున్నూరు కాపులు మొండోళ్లు మొదలైనవారు తమ జీవితాల్ని తామే చిత్రించుకున్న సాహిత్యం విభిన్న ప్రక్రియలలో ఆవిష్కృతమైన తీరు ఈ గ్రంథంలో సమగ్రంగా విశ్లేషించబడింది.
వెనుకబడిన కులాలు తమ జీవితాలను, తమ మూలాలను, తమ సంస్కృతి సంప్రదాయాలను, తమ అస్తిత్వాన్ని, తమ జీవన విధానాన్ని సాహిత్యంలో నిక్షిప్తం చేయవలసిన ఆవశ్యకతను ఈ గ్రంథం చాటి చెబుతున్నది. ఎత్తున ఎగిసి పడకపోయినా, జడత్వం తో నిశ్చలంగా ఉండకుండా బీసీ సాహిత్యకారులు చాప కింద నీరులా నిరంతరం తమ అస్తిత్వాన్ని ప్రకటిస్తున్నారు అన్న విషయాన్ని ఈ గ్రంథం తెలియపరిచింది.
జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వచ్చిన వెంటాడే కలాలు వెనకబడ్డ కులాలు సంకలనం పూర్తిస్థాయి బిసి వాద సాహిత్య సంకలనం గా చెప్పుకుంటున్నప్పటికీ దీనికి పూర్వమే బీసీ అస్తిత్వవాదం తో కవులు కొన్ని కవితా సంపుటాలు వెలువరించారని రచయిత వివరించారు. ఇందులో ప్రధానంగా నల్లగొండ నుంచి వచ్చిన బహువచనం, నీలి సాహితీ సంస్థ మేమే, మొగి మొదలైన సంకలనాల ప్రస్తావన ఈ గ్రంథంలో కనిపిస్తుంది. దళిత వాద కవిత్వం లో ఒక పాయగా మొదలైన బీసీ వాద కవిత్వం అనంతరం స్వతంత్ర అస్తిత్వ ఉద్యమంగా ఎదిగింది అని డాక్టర్ పగడాల నాగేందర్ రాసిన ' కొత్త తోవలు తీసిన బీసీ కవిత్వం' అనే వ్యాసాన్ని ఉటంకిస్తూ తెలియజేశారు.
బీసీ అస్తిత్వవాద సాహిత్యాన్ని విశ్లేషించడానికి రచయిత ఎంచుకున్న వింగడింపు పాఠకుడు సరళంగా విషయాన్ని అవగాహన చేసుకోవడానికి తోడ్పడే విధంగా ఉంది. ప్రక్రియల వారీగా, ఆ ప్రక్రియలలోనూ కులాల వారిగా సాహిత్య విశ్లేషణ చేశారు. తెలంగాణ పద్యకవిత్వం బీసీ వాదం అనే అంశంలో తెలంగాణ పద్య సాహిత్యానికి బీసీల కాంట్రిబ్యూషన్ గొప్పది అని నిరూపించారు. పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలో బీసీ కులాల ప్రస్తావన మొదలు నేటి వరకు బీసీ కవుల సాహిత్య ప్రస్థానాన్ని చక్కగా విడమర్చి చెప్పారు. గొల్ల కురుమల జీవితాలను గురించి పాల్కురికి సోమనాథుడు వృషాధిప శతకంలో, కేశవపంతుల వెంకట నరసింహ శాస్త్రి గోలకొండ కవుల సంచికలో, దోరవేటి శ్రమ దేవోభవ ఖండకావ్యం లో టి అనిత బంగారు తెలంగాణ శతకంలో చక్కని పద్యాలలో వివరించారు. ఉప్పరుల జీవితాలను గురించి దోరవేటి శ్రమ దేవోభవ ఖండకావ్యం లో, అవుసుల భానుప్రకాష్ ఘన శతకంలో, రాధా శ్రీ వెనుకబడిన వాళ్ళము కాదు అనే ఖండకావ్యం లో ప్రస్తావించిన తీరును పేర్కొన్నారు.
మున్నూరు కాపు ల గురించి గంగుల శాయిరెడ్డి కాపుబిడ్డ లో, దర్జీల జీవితాలను గురించి విశ్వబ్రాహ్మణుల జీవితాలను గురించి, కుమ్మరులు పద్మశాలీలు గౌడ లు, నాయి బ్రాహ్మణులు రజకులు గంగపుత్రుల శ్రమను దోరవేటి తన శ్రమ దేవోభవ కావ్యంలో హృద్యంగా చిత్రించారు అని ఆయా పద్యాలను ఉటంకిస్తూ విశ్లేషించారు. విశ్వబ్రాహ్మణుల సంస్కృతిని రామసింహ కవి, అవుసుల భాను ప్రకాష్, రాధాశ్రీ మొదలైనవారి కావ్యాల్లో గమనించవచ్చు. గోశిక నరహరి రాసిన పద్మశాలి శతకము పూర్తిగా పద్మశాలీల జీవన ప్రతిబింబంగా కనిపిస్తున్నది. వరకవి సిద్ధప్ప కవి కుమ్మరుల జీవన విధానాన్ని తమ గ్రంథంలో చిత్రించారు. మామిండ్ల రామగౌడు, డాక్టర్ పాండాల మహేశ్వర్ గౌడ జీవితాలను తమ పద్యాలలో చిత్రిక పట్టారు. పిచ్చుక కుంట్ల వారిని ప్రస్తావించిన గ్రంథం పండితారాధ్య చరిత్ర. గంగిరెద్దుల వారి జీవితాలను చిత్రించిన గొప్ప కావ్యం పల్లా దుర్గయ్య గంగిరెద్దు. ఇట్లా ప్రాచీన, ఆధునిక కావ్యాలలో బీసీ కులాల ప్రస్తావన జీవన సంస్కృతులు ప్రతిబింబించిన తీరును రచయిత పరిశోధనాత్మకంగా విశ్లేషించారు.
తెలంగాణ పాట బిసి వాదం అనే అంశంలో గోరటి వెంకన్న, ఏపూరి సోమన్న,మిత్ర, టి కృష్ణమూర్తి యాదవ్, ననుమాస స్వామి, బండి సత్తన్న మొదలగు వారు రాసిన పాటలు గొల్ల కురుమల జీవితదర్పణాలుగా కనిపిస్తాయి. చెరబండరాజు రాసిన ఏ కులమబ్బి పాట లో ఉప్పరి వాళ్ళ జీవితం తోపాటు అనేక ఉత్పత్తి కులాలు కనిపిస్తాయి. అందెశ్రీ, వైయ్య సామేలు ముదిరాజుల జీవితాలను చిత్రించారు. గోరేటి వెంకన్న మిత్ర అందెశ్రీ, జయరాజు బండి సత్తన్న మొదలైన ప్రజాకవులు దాదాపు అన్ని బీసీ కులాలను తమ పాటల్లోచిత్రించారు. గుండేటి రమేష్, వడ్డేపల్లి కృష్ణ, చేనేత బతుకులను చిత్రించే పాటలు రాశారు.నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్, మాస్టర్ జి డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య మొదలైనవారు గీత వృత్తి కార్మికుల జీవితాలను కష్టాలను కడగండ్లను తమ పాటల్లో చిత్రించారు. చెరబండరాజు పాట కొండలు పగలేసినం వడ్డెర శ్రమ జీవనాన్ని ప్రతిఫలిస్తుంది. నాయిబ్రాహ్మణుల, రజకుల గురించి రాసిన మరొక కవి రాసా భూమయ్య. ముకురాల రామారెడ్డి ప్రసిద్ధ గేయం వలస కూలి గంగపుత్రుల జీవితాలను ఆవిష్కరించింది. గూడ అంజన్న సుద్దాల అశోక్ తేజ నకిరేకంటి సీనయ్య మొదలైనవారు బీసీ అస్తిత్వం పై పాటలు రాశారు. ఈ విధంగా పాటల్లో ప్రతిబింబించిన బీసీ కులాల జీవితాలను పరిశోధకుడు దత్తయ్య చక్కగా విశ్లేషించారు.
తెలంగాణ వచన కవిత్వం బిసి వాదం అనే విభాగం లో బహువచనం, వెంటాడే కలాలు - వెనకబడ్డ కులాలు, పొక్కిలి, ఎడపాయలు, చెమ్మస్, కలాలు గళాలు, తెలంగాణ కవిత, అనేక, దశాబ్ది కవిత, సమూహ, బీసీ కవితాసంకలనం, రుంజ, మొదలైన కవితా సంకలనాల్లో చోటు చేసుకున్న బీసీ అస్తిత్వ కవిత్వాన్ని విశ్లేషించారు. అమ్మంగి వేణుగోపాల్, మామిడి హరికృష్ణ, అనిశెట్టి రజిత, బెల్లి యాదయ్య, కృష్ణమూర్తి యాదవ్ బాణాల శ్రీనివాస్, అట్టెం దత్తయ్య, బైతి దుర్గయ్య, కూకట్ల తిరుపతి, తగుల్ల గోపాల్, బండి శ్రీనివాస్ యాదవ్, సాగర్ల సత్తయ్య మొదలైన వారు యాదవుల జీవితాలను తమ కవిత్వంలో చిత్రిక పట్టారు
చేరాల సుధాకర్, బి.విజయ పగడాల నాగేందర్ మున్నూరు కాపు ల జీవితాల గురించి చక్కని కవితలు రాశారు. బోల యాదయ్య , సిహెచ్ ఆంజనేయులు, మొదలైన కవులు ముదిరాజుల జీవితాలను కవిత్వీకరించారు. మోత్కూరి అశోక్ కుమార్ సూర్య బలిజ ల పై కవిత్వం రాయగా రేనా ఈశ్వరయ్య దొమ్మరి కులస్తుల పై కవిత్వం రాశారు. అవని శ్రీ, మాడిశెట్టి శ్రీనివాస్, రేడియం మొదలైనవారు దర్జీల జీవితంపై కవిత్వాన్ని రాశారు. ఎస్వీ సత్యనారాయణ, గూడూరు ఉమ, మంగళగిరి శ్రీనివాస్ ఆరెకటిక ల కష్టసుఖాలను కవిత్వంలో వ్యక్తీకరించారు.
విశ్వకర్మ జీవితాలను గురించి విశేషమైన కవిత్వం వచ్చింది. బాణాల శ్రీనివాస్ డాక్టర్ ఎస్ రఘు , దాసోజు కృష్ణమూర్తి, దెంచనాల శ్రీనివాస్, ఆడెపు లక్ష్మణ్, జూలూరు గౌరీశంకర్, అన్నవరం దేవేందర్, వెన్నెల సత్యం, దేవరకొండ భగవాన్, అనంతోజు మోహన్ కృష్ణ, ఐ చిదానందం, వడ్ల సాయిలు, వంగాల సైదాచారి, దార్ల రాఘవేంద్ర చారి, కొండి మల్లారెడ్డి వడ్ల సంగయ్య, పులికొండ సుబ్బాచారి, దాసోజు కృష్ణమాచారి, దాసోజు జ్ఞానేశ్వర్, కటుకోఝ్వుల రమేష్, కి ఆనందాచారి, పరమాత్మ మొదలైన వారి కవిత్వం విశ్వకర్మ జీవితాలలోని అన్ని కోణాలను ఆవిష్కరిస్తుంది.
ఎన్ గోపి రాసిన ఓ రాజయ్య కథ, ఆడెపు లక్ష్మణ్ 'బెంగ పెట్టుకోకు', పులిపాటి గురుస్వామి రాసిన పోగుల గూడు కవిత పత్తిపాక మోహన్ రాసిన తెగిన పోగు కాన్ఫిడెన్షియల్ రిపోర్టర్లు డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య ఉప్పల పద్మ రాసిన అల్పసంతోషి, మొదలైన కవితలు చేనేతల కష్టాలను బలంగా ప్రతిబింబిస్తాయి.
వనపట్ల సుబ్బయ్య రాసిన ధర్మచక్రం, సముద్రాల కుమారస్వామి రాసిన మట్టి చక్రం నందిని సిద్ధారెడ్డి గారి మృత్కళలు అన్నవరం దేవేందర్ గారి బువ్వ కుండ కుమ్మరుల జీవితాలను దృశ్యమానం చేశాయి. కొంపెల్లి వెంకట్ ముస్తాదులు కదులుతున్నాయి , అవని శ్రీ ఈతాకు సాటు బిడ్డలం, తండా హరీష్ గౌడ్ ఇన్‌బాక్స్ బండారి రాజ్ కుమార్ మండువ మొదలైన కవితలు గీత కార్మికుల వెతలను పట్టి చూపుతున్నాయి. ఇదేవిధంగా ఇతర బీసీ కులాలయిన వడ్డెర లూ నాయి బ్రాహ్మణులు రజకులు కాటిపాపలు గంగ పుత్రులు మొదలైన వారి జీవితాలపై వచ్చిన కవిత్వాన్ని సమగ్రంగా విశ్లేషించారు.
తెలంగాణ కథ బిసి వాదం అనే విభాగంలో గ్రామీణ జీవితాలను కులవృత్తి జీవితాలను తెలంగాణ రచయితలు ఏ విధంగా కథలుగా మలిచారో సాధికారికంగా నిరూపించారు. కులాల వారీగా వచ్చిన కథల సంపుటాలనూ సమీక్షించారు. సంగిశెట్టి శ్రీనివాస్ సంపాదకత్వంలో వచ్చిన చేనేత కథలు పడుగు పేకలు, కాలువ మల్లయ్య సంపాదకత్వంలో వచ్చిన గొల్ల కురుమల కథలు వేపకాయంత నిజం, గౌడ జీవితాలను ప్రతిబింబించిన నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్ మా బతుకులు కథాసంపుటి, నాయిబ్రాహ్మణుల జీవితాలను కథలుగా మలిచిన అడపం తుమ్మల రామకృష్ణ సంపాదకత్వంలో వచ్చింది. అన్ని బీసీ కులాల కథలను ఉప్పల నరసింహం సబ్బండ వర్ణాల సారస్వతం పేరుతో కథా సంకలనం వేశారు. పీవీ నరసింహారావు గొల్ల రామవ్వ మొదలు అట్టెం దత్తయ్య బతుకు బండి దాకా అనేకులు రాసిన యాదవ కథలనూ రచయిత సమగ్రంగా విశ్లేషించారు.ఉత్పత్తి కులాల జీవితాలు,వారు ఎదుర్కొంటున్న సమస్యలు, బీసీ కులాల చైతన్యం మొదలైనవి ఇతివృత్తాలుగా వచ్చిన కథలను చక్కగా సమీక్షించారు.
తెలంగాణ నవల బీసీ వాదం అనే విభాగంలో పూర్తి స్థాయిలో నవలా విభాగం లో బీసీ ఉత్పత్తి కులాల ప్రత్యేక నవలలు రాకపోయినా అనేక నవలలు ఆయా సందర్భానుసారం బీసీ కులాల జీవితాలు చిత్రించబడ్డాయి అని రచయిత ఈ గ్రంథంలో నిరూపించారు.గుడ్డెళ్ల గుమ్మి మారెమ్మ, సాంబయ్య సదువు మొదలైన నవలలు యాదవుల జీవితాలను చిత్రించాయి. భూమిపుత్రుడు బతుకు పుస్తకం నవలలు మున్నూరు కాపుల జీవితాలను చిత్రించాయి. పట్నం వచ్చిన పల్లె అనే నవలికలో ముదిరాజుల జీవితం కనిపిస్తుంది లో కమల్ హరి నవలలు, ముదిగంటి సుజాత రెడ్డి సంకెళ్లు తెగాయి. దేవులపల్లి కృష్ణమూర్తి ఊరు వాడ బతుకు బి.ఎస్.రాములు జీవనయానం, కాలువ మల్లయ్య గువ్వలచెన్న రామా చంద్రమౌళి కాలనాళిక మొదలైన నవలలు పద్మశాలీల జీవితాలను ఇతివృత్తంగా కలిగివున్నాయి. శిరంశెట్టి కాంతారావు పరంపర విశ్వబ్రాహ్మణుల జీవితాలను చిత్రించగా మాదిరెడ్డి సులోచన నవల సుషుప్తి కుమ్మరుల జీవితాలకు దర్పణం పట్టింది. నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్ బతుకు తాడు, దుల్దుమ్మ, కల్తీ బతుకులు నవలలు, కె వి ఎల్ కల్లు మండువ,జి.రాములు పెరటిచెట్టు, ననుమాస స్వామి మోహిని, ఎస్ ఎం ప్రాణ్ రావు రాసిన ప్రజా జ్యోతి పాపన్న వేముల ప్రభాకర్ రాసిన వరకవి భూమా గౌడు మొదలైన నవలలు గౌడ జీవితాలు ఇతివృత్తాలుగా కలిగి ఉన్నవి. ఇట్లా ఇంకా అనేక నవలలు ఇతర కులాల ప్రస్తావన కూడా ఉన్నదని రచయిత ఈ గ్రంథంలో వివరించారు.
తెలంగాణ బిసి వాద సాహిత్య విమర్శ ఈ విభాగంలో ఇప్పటివరకు బిసి సాహిత్యంపై వచ్చినవిమర్శ గ్రంథాలను ప్రస్తావించారు. ఇంకా తగినంత విమర్శ రాలేదని అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. రాబోయే కాలంలో కాబోయే పరిశోధకులకూ ఈ గ్రంథం తగిన మార్గదర్శకత్వం చూపుతుంది అనడంలో సందేహం లేదు. దత్తయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒకవైపు పీహెచ్డీ పరిశోధన చేస్తూనే దానికి సమాంతరంగా తెలంగాణ బీసీ వాద సాహిత్యం అనే ఈ సప్రమాణ పరిశోధన గ్రంథాన్ని తెలంగాణ సాహిత్యానికి అందించారు. వాస్తవానికి ఇదే ఒక పీహెచ్డీ అందించవలసిన స్థాయి ఉన్న గ్రంథం. రచయితకు అభినందనలు. ఈ గ్రంథం స్ఫూర్తిగా బీసీ వాద సాహిత్యం పై మరింత లోతైన అధ్యయనాలు జరుగుతాయని ఆశించడం అత్యాశ కాబోదు.
సాగర్ల సత్తయ్య
విమర్శకులు, కథా రచయిత
(సూర్యపేట టైమ్స్ దినపత్రికలో ప్రచురితం. 04.02.2022)
బి.సి.వాద సాహిత్య స్తబ్దతను బద్దలుకొట్టిన గ్రంథం
సాహిత్యం యొక్క ప్రధాన భూమిక సమాజ హితాన్ని కాంక్షించడం. రాయబడే ప్రతీ విషయం సాహిత్యం లో భాగం అవుతుందా అనే ప్రశ్నకు సమాజ శ్రేయస్సును కోరుతూ, సమాజాన్ని ప్రభావితం చేయగలిగినదైతే అది సాహిత్యంగా పరిగణించడం ఏ మాత్రం తప్పు కాదు. సాహిత్యం యొక్క పరిధిని, సాహిత్యంలోని రీతులను పనికట్టుకొని హాద్దులు నిర్ణయించడం సాధ్యం కాని పని. ఒకనాడు మౌఖిక సాహిత్యం ఆ తర్వాతి కాలంలో 11వ శతాబ్దం నాటి నన్నయ నుండి నేటి ఆధునిక కవుల దాకా, నాటి వేదాలు, పురాణాలు, ఇతిహాసాల నుండి నేటి నానీలు, హైకూలవంటి ప్రక్రియలదాకా దేనికీ కొలమానాలు రూపొందించలేం. కాబట్టే సాహిత్యం యొక్క పరిధి విస్తృతమైంది. సామాజిక స్పృహతో పాటు, వ్యక్తిని సంకుచితత్వం నుండి విశాల భావాలోచన వికాసం వైపు పయనించేలా చేయగలిగిన శక్తి సాహిత్యానిది.
తెలుగు సాహితీ ప్రపంచాన ఎందరో గొప్ప కవుల ఉదయాస్తమానాలు జరిగినా వారు నాటిన ఆలోచనాంకురాలు సమాజాన్ని కాలానుగుణంగా ప్రభావితం చేస్తూ వున్నాయి. కొన్నిసార్లు ఆ ప్రభావం విప్లవాలకు దారితీయొచ్చు కాని అది విప్లవాత్మక వేగంతో జరుగుతుందా అనేది ఎవ్వరం నిర్ణయించలేం. తెలుగు సాహిత్యంలో సాహితీ కలాలు ఎన్నో వాదనలను, ఎన్నెన్నో వేదనలను కాగితపు కాన్వాస్ పై పుటలు, పుటలుగా చిత్రించాయి. కాల, స్థల, పాలనా పరిస్థితులకు అనుగుణంగా పేదల, పీడితుల కష్టాల, కన్నీటి కథలను ఎందరో కవులు సిరాచుక్కలతో వ్యవస్థపై కుమ్మరించారు. సాహితీ కలానికుండే శక్తి ప్రశాంతంగా కనిపించే అగ్ని పర్వతం లాంటిది. రచనాభిరుచి అనేది వ్యక్తి, వ్యక్తిని బట్టి మారుతుంది. అది పూర్తిగా స్వనిర్ణయ సాధికారతను కల్గి వుంటుంది. ఒకనాడు శిష్ట కులాలకు మాత్రమే అనే చందాన సాగేది పాండిత్య, రచనా ప్రస్థానం కాని నేడు అన్ని వర్గాలకు వ్యాపించడం శుభపరిణామం. దాని వల్ల జరిగిన లాభం ఏమిటంటే? ఇతరుల భాదను చూస్తూ రాస్తున్న వ్యక్తి కంటే అనుభవించిన వాడు చేసే వ్యక్తీకరణ మరింత సహజంగా, ప్రభావవంతంగా వుంటుంది. కుటుంబ ప్రాతిపాదికన వ్యక్తుల సమూహం చేత భాషా, ప్రాంత, కుల, మత వైరుధ్యాలచే నిర్మితమయ్యే సంక్లిష్ట వ్యవస్థ సమాజం. సాహిత్యమెప్పుడూ సాధారణ ప్రజల పక్షాన నిలిచి వారి నిత్యజీవితంలో నిక్షిప్తమై వున్న ఘోషను, గోసను వినిపించే స్వరం అవుతుంది. ఈ క్రమంలో దళిత వాదం, స్త్రీ వాదం, మైనార్టీ వాదం, బహుజనవాదం మొదలైన సాహితీ వాదాలు ఉనికిలోకి వచ్చాయి.
ఏ వాదమైనా వ్యక్తి, వ్యవస్థ యొక్క అస్థిత్వాన్ని, జీవికను ఉనికిలో ఉంచే లక్ష్యంతో కొనసాగుతూ సమాజపు విపరీత పోకడలను నిరసించడంలో కీలక పాత్ర వహిస్తుంది. ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ మూలంగా మన సమాజాల్లో ఏర్పడిన సంఘర్షణలు, సంపీడిత పరిస్థితులను బహిష్కృతం చేసే స్వభావాన్ని కల్గి వుంటాయి. అక్కడి నుండి ఉద్భవించినవే దళిత, స్త్రీ, మైనార్టీ, బహుజన వాదాలు. ఈ క్రమంలో బిసీ వాదం అనే ప్రత్యేక వాదం ఉందా లేదా అనే ప్రశ్న తలెత్తక తప్పదు. ఈ ప్రశ్నకు సమాధానంగా నిలిచే దానికి సంబంధించిన అంశాలను చర్చించే వివిధ బీసీ వాద గ్రంథాల క్రమంలో నిలిచిన మరొక గ్రంథం "తెలంగాణ బి.సి. వాద సాహిత్యం". ఈ పుస్తక రచయిత అట్టెం దత్తయ్య. అట్టెం దత్తయ్య నేటి కామారెడ్డి జిల్లాలోని షెట్పల్లి గ్రామ వాస్తవ్యులు. ఈయన ఇటీవలే "మహభారతంలో సంవాదాలు- సమగ్ర పరిశీలన" అనే అంశంపై పరిశోధనను పూర్తి గావించారు. ఇంతకుముందు ఈ రచయిత ఆధ్వర్యంలో ‘కళ్ళం’(సాహిత్య వ్యాస రాశి) 2018 అనే గ్రంథం వెలువడింది.
'ఆకాశంలో సగం' అనే నినాదంతో పురుషుల్లో సగభాగంగా వున్న స్త్రీలు వారి పట్ల కొనసాగుతున్న వివక్షకు వ్యతిరేకంగా స్త్రీ వాదం అనే పేరుతో పోరాడుతున్నారు. సమాజంలో సగ భాగంగా వున్న బిసీలు అనేక ఉద్యమాలలో క్రియాశీలంగా వుంటున్నప్పటికీ అటు రాజ్యాధికారమూ, ఇటు అస్తిత్వమూ లేని పరిస్థితుల్లోకి నెట్టి వేయబడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో బిసిలు అస్తిత్వ, రాజ్యాధికారం వైపుగా ఆలోచించడం అవసరం. దానికై సాహిత్య, సాంస్కృతిక పునరుజ్జీవనం తథ్యంగా రావాలి. బిసీలకు చెందిన సాహిత్య, సాంస్కృతిక అంశాలు బహుజన సాహిత్యం ముసుగులో అసౌష్ఠవ రీతిలో విసిరివేసినట్లుగా వున్న సందర్భంలో వాటినంతటినీ ఒక చోటకు చేర్చడం అనివార్యమైంది. ఈ అనివార్యతను తొలగించి బిసీ సాహిత్యం యొక్క స్థాయి, వ్యాప్తిలను తెలిపిన నిర్మాణాత్మక రచన ఈ "తెలంగాణ బిసీ వాద సాహిత్యం" అంటూ ఈ పుస్తకానికి 'బహుజనుల వీలునామా' పేరుతో పీఠిక రాశారు ఎస్.రఘు గారు.
ప్రస్తుత పరిస్థితుల్లో వైశ్వీకరణం(గ్లోబలైజేషన్), వైశ్యీకరణం( వాణిజ్యీకరణం) మూలంగా చేతి వృత్తులు, కుల వృత్తులతో పాటు అన్ని వర్గాలు అస్తిత్వాన్ని కోల్పోయి వృత్తి, విషయ నైపుణ్యాలకు విలువ లేకుండా పోయింది. వాటి పర్యవసానంగా సంపద కేంద్రీకరణ, అధికార కేంద్రీకరణ పెరిగిపోయి అన్ని వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుకు గురవుతున్నాయి. వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను ఏకరువు పెట్టే క్రమంలో కొందరు స్వానుభవం చేత, మరికొందరు పరిశీలన అనుభవం చేత సాహిత్యాన్ని సృష్టించారు. ఆ సాహిత్యాన్ని సంకలనం చేస్తూ విమర్శించిన పుస్తకం ఈ " తెలంగాణ బిసీ వాద సాహిత్యం" అంటూ పుస్తక పీఠిక రాశారు సాగి కమలాకర శర్మ గారు.
"బహుజనులు దళితులు ఒక్కరే, ఇవి రెండు సమానార్థక పదాలు. ఈ విషయం గుర్తించకుండా ఎస్సీలను దళితులుగా, బిసీ లను బహుజనులుగా పేర్కొని వారి మధ్య దూరం పెంచకూడదు" (తెలంగాణ బిసీ వాద సాహిత్యం-పేజీ 24) అంటూ కాలువ మల్లయ్య స్పష్టం చేశారు. లక్ష్మీనర్సయ్య 'చిక్కనవుతున్న పాట' లో ఎస్సీ, ఎస్టీ, బిసీ కవులందరూ తమ స్వానుభావాల్ని కూర్చుతూ రాసిన కవిత్వమే దళిత కవిత్వం అన్నాడు. పరాయి పల్లవి వ్యాసంలో సతీష్ చందర్ దళిత వాడలు అగ్రహారనికి ఎంతదూరమో బిసీ పేటలకూ అంతే దూరం. హరిజనోద్దరణ కవిత్వం పేరుతో పులుపు చావని బిసీ కవులు మళ్ళీ రాయనవసరం లేదంటూ ఘాటుగా స్పందించాడు. బిసీ సాహిత్యకారులు తమ కోణాల్లో సాహితీ సృజన చేస్తున్నప్పటికీ వారి సాహిత్యం బిసీ అస్తిత్వవాద సాహిత్యంగా ఎందుకు గుర్తించబడలేదు అనే ప్రశ్నను బాణాల శ్రీనివాస్ లేవనెత్తాడు. ఇదే విషయంపై ఎస్.రఘు "కొన్ని గాయాలు మానవు కాని మానినట్టుగా వుంటాయి. అస్తిత్వ ఉద్యమాలు కూడా గాయాల్లాంటివే కొన్నిసార్లు అవి ఉవ్వెత్తున ఎగసి పడలేక పోవచ్చు, కాని అంతర్గత స్రావాలు జరుగుతూనే వుంటాయి అని చెప్తూనే బిసీల కన్నా పై తరగతి వారి చేతుల్లో మూల్గిన సాహిత్యం ఇప్పుడిప్పుడే వారికి సాన్నిహిత్యంగా ముందుకు సాగుతుండడం వల్ల బిసీలు తమ అస్తిత్వవాదాన్ని బలపర్చడానికి కొంత తెగింపును ప్రదర్శించడం లేదు" అనే కారణాన్ని తెలియపరిచాడు. ఇలాంటి సమయంలో 2001లో పూర్తి బిసీ వాద కవిత్వంగా జూలూరి గౌరీశంకర్ సంపాదకత్వంలో 'వెంటాడే కలాలు- వెనుకబడిన కులాలు' అనే సంకలన గ్రంథం వెలువడింది. ఆయన అగ్రకుల అధిపత్య, భూస్వామ్య వర్గాల అణచివేతను ఎదిరించడానికి దళిత, బిసీ, మైనార్టీలందరూ కలిసికట్టుగా ఉద్యమించాలని కోరుకున్నారు. కాని ఈ విషయాన్ని దళితులు మరో కోణంలో అర్థం చేసుకున్నారంటూ 'కొత్త తొవ్వలు తీస్తున్న బిసీ కవిత్వం' అనే వ్యాసంలో పగడాల నాగేందర్ తెలుగు సాహిత్యంలో దళితవాద కవిత్వం ఒక పాయలాగ మొదలై 1995-2000 మధ్య పూర్తి పాయలాగా చీలిపోయింది. దానికి కారణం "అనాది కాలం నుండి అగ్రకులాల చేతిలో అవమానాలకు గురికావడం వల్ల వారికి వారే అన్నట్లుగా భావించడం, దాంతోపాటు బిసీలను మీరు మాతో సమానమైన పీడితులు కాదు అంటూ వారిలో నిక్షిప్తమైన ఎత్తిపొడుపు భావన" అంటూ వివరించారు. శతాబ్దాలుగా సమాజంలో, చరిత్రలో కీలక పాత్ర పోషిస్తున్న సమాజ నిర్మాతలు, సంపద సృష్టికర్తలు బిసీలు అంటూ బి.ఎస్. రాములు ఒక వ్యాసంలో తెలియపర్చారు. దళిత సాహిత్యం, మాదిగ సాహిత్యం, మైనార్టీ సాహిత్యం, గిరిజన సాహిత్యం, క్రైస్తవ సాహిత్యం అంటూ అన్నింటికీ ఒక అస్తిత్వం వుంది. కాని బిసీ సాహిత్యం మాత్రం దళిత, బహుజన సాహిత్యంలో అంతర్భాగమైన నేపథ్యంలో బిసీ సాహిత్యం 'సబ్బండ సాహిత్యం' గా బలపడాలి అంటూ కాలువ మల్లయ్య తన వాదనను తెలియపర్చారు. ఇలా పలువురు రచయితల నిర్వచన, అభిప్రాయాలతో ఈ పుస్తకంలో బి.సి.వాదం ఎందుకు ప్రత్యేకంగా ప్రారంభమైంది, ఇది కావడానికి ప్రేరణలు, కారణాలు ఏమిటి, బి.సి.ల గురించి వచ్చిన మొదటి గ్రంథాలు ఏవి, వెలువరించిన గ్రంథాల మీద వచ్చిన కుట్రపూరిత విమర్శ, విస్మరణ, అట్లాగే బి.సి.పదాన్ని మరో పదంగా మార్చుకోవాలనే సాహితీకారులు సమావేశాల ద్వార నిర్ణయించిన పదాలు, బి.సి.వాదం గురించి రాస్తున్న వారిలో కనిపిస్తున్న రెండు ధోరణులు వంటి విషయాలను సోపపత్తికంగా "తెలంగాణ బిసి వాద సాహిత్యం- పరిచయం" అనే విభాగంలో చర్చించారు.
ఈ పుస్తకంలోని ప్రధాన శీర్షికల్లో మొదటి అంశం "తెలంగాణ పద్య కవిత్వం - బిసీ వాదం". పురాణం, ప్రబంధం, శతకం, ఉదాహరణం ప్రక్రియ ఏదైనా విషయాన్ని ఉద్ఘాటించడానికి పద్యం వారధిగా నిలిచింది. తెలంగాణ సాహిత్యంలో మొదటిసారిగా బిసి కులాలకు తన బసవపురాణంలో పాల్కురికి సోమనాథుడు స్థానమివ్వడంతో ప్రారంభం అయింది. పాత జ్ఞాపకాల వెలికితీత, బాధలు, వివక్షల ఇతివృత్తంతో, వృత్తి ఆధారంగా కులం ఏర్పడిందా? కులం ఆధారంగా వృత్తి ఏర్పడిందా? అనే ప్రశ్న వస్తుంది. కొన్నిసార్లు అవసరం నిమిత్తం తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర కుల వృత్తులు చేపట్టిన వారున్నారు. అంత మాత్రాన వారి కులం మారుతుందా? అనేది ప్రశ్న. ఇక వృత్తి పనిని నమ్ముకొని కాలం వెళ్ళదీస్తున్న వారికి, సమాజంలో కనీస ఆదరణ లేక వారి జీవన ఉపాధి పరిస్థితులు ఏవిధంగా మారాయి అనే తాత్వికతతో వివిధ రచయితలు రాసిన పద్యాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. వాటిలో వృషాధిప శతకంలో పాల్కురికి " గొల్ల స్త్రీ లు వీధుల్లో చల్లను అమ్మేవారని" రాసిన విషయాన్ని, అలాగే బసవ పురాణంలో " వీధిలో చల్లనమ్ముచు ఒక గొల్లకాంత జారి పడబోయి బసవరో అని కేక పెట్టగా బసవన కాపాడినాడు" లాంటి విషయాలు కలవు. వీటి ద్వారా బిసి కులాలకు చెందిన గొల్లల ప్రస్తావన నాటి కాలంలోనే రాయబడింది అనే విషయం ధ్రువీకరించాడు రచయిత దత్తయ్య. గొల్లడా! అనే శీర్షికతో కేశపంతుల వేంకట నర్సింహశాస్తి రాసిన ఐదు పద్యాలు చేర్చాడు. దోరవేటి ఒక పద్యంలో ఉప్పరుల గూర్చి 'కట్టడముల ధాత! కరము మోడ్తు' అని పల్కిన సందర్భాన్ని తెలియజేశాడు. దానితోపాటు దోరవేటి అన్ని కులాలను గురించి పద్యాల్లో ప్రస్తావించిన విషయం తెలియ పర్చాడు. గంగుల శాయి రెడ్డి 'కాపుబిడ్డ'(1937) లో మున్నూరు కాపులు మొదటి రోజుల్లో పడ్డ కష్టాలను తెలుపుతూ రాసిన పద్యం అయిన " కుడిమూపుపై కాడి యెడమ భుజంబున..." ను గూర్చి రాశారు. "తెలంగాణ పద్య కవిత్వం- బిసీ వాదం" శీర్షికలో 14 కులాల ప్రస్తావనతో వివిధ రచయితలు వారి రచనలలోని పద్య పంక్తులను సహ వాటి నేపథ్యంతో కూడిన విషయ వివరణ తెలియజేశారు.
ఈ పుస్తకంలో మరొక శీర్షిక "తెలంగాణ పాట- బిసి వాదం". ఆట- పాట, పని- పాట, ఆడుతు పాడుతు పనిచేస్తుంటే ఇలాంటి మాటలను బట్టి చూస్తే మనిషి జీవితంలో పాటకున్న ప్రాముఖ్యత ఏపాటిదో అర్థం అవుతుంది. పండితులకూ, పామరులకు అందరికీ ఆమోదయోగ్యమైనది, ఆదరపూరకమైనది పాట. "జర్మన్ భాషా సుభాషితం ప్రకారం ప్రతి వస్తువులోనూ ఒక పాట నిద్రిస్తూ వుంటుంది, ప్రతి వస్తువూ ఆ పాటను స్వప్నిస్తూ వుంటుంది(అదే, పుట :73)" అన్నట్టుగా ఈ శీర్షికలో పాటల ద్వారా బిసీ కులాలు, వారి జీవన విధానం, సంఘర్షణలు, వారి పాటలో వృత్తికి సంబంధించిన పంక్తులు మొదలైన అంశాల పరిశీలన కలదు. అలాంటి కొన్ని ఉదాహరణలు: గూడ అంజయ్య చేతివృత్తుల వారి కష్టాలను తెలుపుతూ రాసిన పాట 'బావయ్యో...బావయ్యో', గోరటి వెంకన్న సబ్బండ వర్ణాల కష్టాలను తెలిపిన పాట 'పల్లే కన్నీరు' ఇందులో కుమ్మరి, కమ్మరి, మంగలి, కంసాలి, సాకలి, గౌడ, కురుమ కులాల బతుకు చిత్రం ఎలా ఛిద్రం అవుతుందో తెలియపరిచాడు. బిసీ కులాలను గూర్చి ఒకే పాటలో పలికిన మరో రచయిత జయరాజ్ పంక్తులు: 'గడ్డాలు మీసాలు గీసి/గుడ్డల్ని శుభ్రంగ ఉతికి/ వండె గుండిల్ని చేసి/ వంటా వార్పుల నేర్పి/మనిషిని మనిషిగ చేసిన.. బహుజనులే మన ప్రేమ పావురాలు/బహుజనులే మన శాంతి కపోతాలు' అంటూ బహుజన కులాల ప్రాముఖ్యాన్ని తెలిపాడు. అదే విధంగా కందికొండ రాసిన యూట్యూబ్ పాటలో: 'చలో చలో చలో చలో బిసి/ నీవే నీ తలరాతను రాసుకోలేసి/60శాతం ఉండి అడుక్కునుడు ఏంది' అంటూ బిసిల్లో ఐక్యత నింపేలా వారు రాజ్యాధికారం వైపు అడుగులు కల్పించాలంటూ స్ఫూర్తిని నింపే మరో పాటను నొక్కిచెప్పాడు. ఈ శీర్షికలో వివిధ రచయితలు పాటల రూపంలో బిసి కులాలకు సంబంధించి ప్రత్యేకంగా స్పృశిస్తూ రాసిన పాటలను, బహుజన, సబ్బండ వర్ణాల నేపథ్యంగా రాయబడిన పాటల ప్రస్తావనను గూర్చి అట్టెం దత్తయ్య విశ్లేషించారు. ఈ విభాగంలో సూచించిన ప్రధానమైన అంశం బి.సి.ల ఆశ్రితగాయకుల మౌఖిక సాహిత్యం అంతా గ్రంథస్థం అయిననాడు బి.సి.ల నిజమైన అస్తిత్వం తెలుసుకునే అవకాశం ఉంది అనే అంశం తెలిపాడు.
"తెలంగాణ వచన కవిత్వం- బిసీ వాదం" అనేది మరొక శీర్షిక. నిజానికి బిసీ వాద సాహిత్యం ఎక్కువ మొత్తంలో వచన కవిత్వంలో వచ్చిందని చెప్పొచ్చు. దానికి కారణం పీ.వీ.నరసింహ రావు గారి నూతన ఆర్థిక సంస్కరణల వల్ల జరిగిన పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణల ఫలితంగా చేతి, కులవృత్తుల ప్రాభవం తగ్గిపోయింది. బిసీల జీవన స్థితిగతులు దైన్యంలోకి నెట్టబడ్డాయి. వాటిని ఏకరువు పెట్టేందుకు 2000 సంవత్సరం తర్వాత చాలా మంది రచయితలు తమ కలాల గలాలను వచన రూపంలోనే ఎక్కువ మొత్తంలో వినిపించారు. అలాంటి వచన కవితా సంకలనాలలో కొన్ని ' బహువచనం', ‘మేమే‘, ‘మొగి‘, 'వెంటాడే కలాలు- వెనుకబడిన కులాలు', ‘ఇరుసు’, ‘సమూహం’, ‘బి.సి.కవితా సంకలనం’ వంటి వచన కవితా సంపుటాలలో వారి అస్తిత్వాన్ని, జీవన సంఘర్షణలను, వృత్తుల విలువ తగ్గడం వల్ల ఎదుర్కొంటున్న కష్టాలను ప్రతిబింబించే రీతిలో వచ్చిన వచన కవితా సంకలనాలను పూర్తిస్థాయిలో విశ్లేషించే ప్రయత్నం కనిపిస్తుంది. వీటితో పాటు కొన్ని కులాల మీద వచ్చిన దీర్ఘ కవిత అయిన‘బువ్వకుండ’ వంటి వాటిని విశ్లేషిండం వల్ల రచయిత దత్తయ్య పాఠకులకు బిసీ సాహిత్యంలో రూపొందిన వచన కవిత్వ సాంద్రతను తెలిపే ప్రయత్నం చేశాడు. ఉదాహరణకు యువ రచయిత, పరిశోధకుడైన వడ్కాపురం క్రిష్ణ కుమ్మరి కులం వారి వ్యధలను తెలుపుతూ రాసిన 'మట్టి చిత్రం' కవితలో కొన్ని పంక్తులు:
"జీవితమంతా మట్టిమయం
అంతెందుకు!?
అసలు మట్టి అంటేనే జీవితం
జీవితమే మట్టి కదా
అదే మట్టికుండ నాడు
రాగి, ఇత్తడి,వెండి
ఆఖరుకు ఇనుమును కూడా తట్టుకుని నిలబడింది
నేడు ప్లాస్టిక్
చెరలో బందీగా కనుమరగవగా
ఉత్పత్తి కులం నేడు ఉత్తి చేతులతో నిలబడిపోతున్నది..."
ఇలా వచన కవిత్వంలో బిసీలకు సంబంధించిన వివిధ కులాలపై వచ్చిన కవిత సంపుటాలను, అందులోని వాదాన్ని, వర్ణనలను పాఠకులకు పరిచయం చేశారు.
తెలంగాణ కథ- బి.సి వాదం, తెలంగాణ నవల బి.సి వాదం అనే పేర్లతో మరో రెండు శీర్షికలు కలవు. ఇక కథ, నవలల్లో బిసిల ప్రస్తావన అస్తిత్వ ఉద్యమానికి ముందు నుంచే వారి కులాలకు చెందిన, వారి జీవనశైలికి సంబంధించిన అంశాలతో కథలు, నవలలు కలవు. సమాజంలో ఉత్పత్తి, సేవా, చేతివృత్తుల పాత్ర గణనీయమైనది అవ్వడం మూలంగా వారి జీవన ముఖచిత్రాల గూర్చి ప్రత్యేకంగా బిసీ వాదం పేరుతో కాకుండా ఒక కథ, నవలకు కథా వస్తువును ఎంచుకొనే క్రమంలో సహజంగానే కథా సంవిధానాల్లో వారి జీవిత చిత్రాలు అల్లబడినాయి. కథ, నవల ఎప్పుడూ ప్రజల పక్షం వహిస్తూ అన్ని వర్గాల వారి శ్రామిక, పీడిత, సమస్యాత్మక అంశాలను, భూస్వామ్య, పెట్టుబడిదారీ, పారిశ్రామికీకరణల పర్యవసానంగా ఉత్పన్నమైన సమస్యలను, వివాదాలను చిత్రీకరించే విధంగా వుంటాయి. దానికి తోడు సమకాలీన, చారిత్రక కల్పిత అంశాలచేత మనిషిని ఒక కొత్త ప్రపంచంలో లీనమయ్యేలా చేయగల్గి, సగటు మనిషిని వాటిలో ప్రతిబింబించే స్వభావాన్ని కల్గి వుంటాయి. సమాజంలో, కుటుంబంలో అంతర్గతంగా ఇనుమడింపబడిన విభిన్నత కల్గిన కథావస్తువుతో సమాజాన్ని పెద్ద కాన్వాస్ లో దర్శించడానికి కథలు, నవలలు తోడ్పడ్తాయి. బహుజనులను ఆధారంగా చేసుకొని వచ్చిన కథలు, నవలలకు సంబంధించిన వివరాలను రచయిత ఈ "తెలంగాణ బిసీ వాద సాహిత్యం" పుస్తకంలో ఎక్కువ మొత్తంలో నమోదు చేశారు. అందులో కొన్ని: చేనేత జీవిత సాధకబాధకాలను చెప్పే 'పడుగు పేకలు', గొల్ల- కురుమల కథల సంకలనం 'వేపకాయంత నిజం', నేరెల్ల శ్రీనివాస్ గౌడ్ ' మా బతుకులు', తుమ్మల రామకృష్ణ సంపాదకత్వంలో నాయీ బ్రాహ్మణుల జీవితాలను చిత్రించిన 'అడపం', ఉప్పల నరసింహం 'సబ్బండ వర్ణాల సారస్వతం' మొదలైన కథల సంపుటాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఇక నవలల విషయానికి వస్తే గుడెళ్ళగుమ్మి మారెమ్మ, పట్నమొచ్చిన పల్లె- భూపాల్, సాంబయ్య సదువు, చీకట్లో చిరుదీపం, భూమిపుత్రుడు- కాలువ మల్లయ్య, సంకెళ్లు తెగాయి- ముదిగంటి సుజాతా రెడ్డి, ఊరువాడబ్రతుకు- దేవులపల్లి కృష్ణమూర్తి, పరంపర- శిరంశెట్టి కాంతారావు, సుషుప్తి- మాదిరెడ్డి సులోచన, బతుకు తాడు, కల్తీ బతుకులు- నేరెళ్ళ శ్రీనివాస్ గౌడ్ మొదలైన నవలలు ఇవన్నీ కూడా కేవలం మచ్చుకు కొన్ని మాత్రమే. దత్తయ్య ఈ పుస్తకంలో బహుజన, సబ్బండ కులాలపై వివిధ కవులు రాసిన కథలు, నవలలను చాలా మొత్తంలో తెలియపరిచారు. ముఖ్యంగా కథలను గురించి రాస్తూ బి.సి.ల జీవితాలకు సంబంధించి కథకులు విస్తృతంగా రాసినప్పటికి వాటిలో కులాల ప్రస్తావనలు మరుమరుగుగా చేయడం వెనుకున్న భయమేమిటో సందిగ్ధత ను రేకెత్తించే విషయం అని కథా రచయితలను ప్రశ్నిస్తాడు.
ఇక ఈ శీర్షికల తర్వాత చివరగా 'తెలంగాణ బి.సి.వాద సాహిత్య విమర్శ' పేరుతో ఒక శీర్షిక కలదు. విమర్శ అనగా సమీక్షించడం, పర్యాలోచించడం అనే అర్థాలు కలవు. బహుశా వెనుకబడిన వర్గాలపై వచ్చిన సాహిత్యం గురించి విమర్శ చేయడం పై స్థాయి వర్గాల వారికి ఆసక్తి వుండకపోవచ్చు. అందుచేత బిసీల, బహుజనుల సాహిత్యం పెద్దగా విమర్శకు నోచుకోలేదు. కవిత్వం, నవల, నాటకం, కథ ఇలా ప్రక్రియ ఏదైనా రచయిత దానిని ఏ పరిస్థితుల్లో రాశాడు, ఏ కోణంలో రాశాడు, ఏ ఆశయం చేత రాశాడు, తదుపరి దాని ప్రభావం ఎలా వుండబోతుంది అనే విషయాలన్నింటికీ విమర్శ దారి చూపుతుంది. బిసి సాహిత్య విమర్శలో ప్రధానంగా చెప్పబడే నాలుగు పుస్తకాలను తెలిపారు. అవి 'బి.సి కథలు ఒక విశ్లేషణ 2000-2010'- కథా సాహిత్యం పై బి.ఎస్.రాములు 2011 లో వెలువరించారు. 'కవిత్వంలో బిసి సూర్యోదయం' 2015 లో జూలూరి గౌరీశంకర్, ఈయన ఆధ్వర్యంలోనే బిసీ వాద కవిత్వం పై 'ఒక కవిత ఇరవై కోణాలు'. మరొక విమర్శ గ్రంథం 'ప్రవాహం' ఇది బిసి అస్తిత్వవాద యువ కవిత్వం పై వెలువడిన సంకలనం దీనికి చింత ప్రవీణ్ సంపాదకత్వం వహించారు. ఇలాంటి ఎన్నో విషయాలను ప్రస్తావించిన దత్తయ్య ’వినతి‘ అనే శీర్షకలో ఇదొక చిన్న ప్రయంత్నమని వినయంగా చెప్పుకుంటాడు. ఇంకా కొన్ని కులాల గురించి, కొన్ని ప్రక్రియలలో వచ్చిన బి.సి.ల జీవితాలను గురించి ముందు ముందు రాసే ప్రయత్నం చేస్తానని చెప్పుకోవడం సమగ్రతకోసం ప్రామిస్ చేసినట్లుగా కనిపిస్తుంది.
అట్టెం దత్తయ్య రూపొందించిన "ఈ తెలంగాణ బిసీ వాద సాహిత్యం" పుస్తకంలో పద్యం,పాట, వచన, కథ, నవలా ప్రక్రియల్లో బిసిలకు సంబంధించి కవులు వివిధ కోణాల్లో బహుజన, బిసీ కులాలను గూర్చి వ్యక్తం చేసిన అంశాలను విస్తృత పరిశీలనతో సంక్షిప్తంగా పొందుపరిచారు. దత్తయ్య చేసిన ఈ ప్రయత్నం మాటల్లో, వాక్యాల్లో మాట్లాడినంత సులభం కాదనే విషయం పుస్తకాన్ని చదివే ప్రతీ పాఠకుడికి అర్థం అవుతుంది. ఈ పుస్తకం బిసీలు, వారి అస్తిత్వవాదానికి సంబంధించిన కోణంలోనూ, పరిశోధన చేస్తున్న, చేయబోయే వారికి మార్గదర్శనం చేయడంలో ఎంతో కొంత పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. బిసీ వాదం పై వచ్చిన పుస్తకాల వరుసలో అట్టెం దత్తయ్య పుస్తకం కూడా విలువైనదిగా మారబోతుందనేది సత్యం. ఏదేమైనా అట్టెం దత్తయ్య సలిపిన ఈ కృషి ఒక చారిత్రక సందర్భాన్ని గుర్తుచేస్తుంది. అదేమిటంటే నాడు తెలంగాణ ప్రాంతంలో సాహితీవేత్తలు, సాహిత్యమే లేదన్న ఆంధ్ర సాహితీ మేధావులకు తెలంగాణ సాహిత్య విస్త్రృతిని, సాహిత్యకారులను పరిచయం చేస్తూ సురవరం వారు రూపొందించిన 'ఆంధ్ర కవుల సంచిక' లాగానే, నేడు దళిత, మైనార్టీ, బహుజన వాద సాహిత్యాల ముసుగులో బిసీ వాద సాహిత్యం విస్తృతి, కవులు తెరచాటైన స్థితి ఏర్పడింది. ఇలాంటి స్థితిలో రచయిత దత్తయ్య రాసిన ఈ "తెలంగాణ బిసీ వాద సాహిత్య గ్రంథం" బీసీ వాద సాహిత్యం యొక్క విస్తృతిని, కవులను సాహితీ ప్రపంచానికి తెలియజేసి నాటి సందర్భాన్ని పునరావృతం చేసిందని చెప్పొచ్చు. ఏదేమైనా బీసీ వాదాన్ని వ్యక్తీకరించే ప్రయత్నం లో ఈ "తెలంగాణ బిసీ వాద సాహిత్యం" గ్రంథం ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పవచ్చు.
డా. తాటికొండ లక్ష్మీనారాయణ
విమర్శకులు
(మయూఖ అంతర్జాల పత్రికలో ప్రచురితం)
https://mayuukhathemagazine.com/%e0%b0%ac%e0%b0%bf-%e0%b0%b8%e0%b0%bf-%e0%b0%b5%e0%b0%be%e0%b0%a6-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b0%ac%e0%b1%8d%e0%b0%a6%e0%b0%a4/
సంకుచితత్వాన్ని ప్రశ్నించిన గ్రంథం ‘తెలంగాణ బి.సి. వాద సాహిత్యం’
ఒక రచన సాధించే అత్యుత్తమ ప్రయోజనం పాఠకున్ని అంతవరకు ఉన్న తన అవగాహనను తిరిగి వ్యాఖ్యానించుకునేలా చేయడమే. ఈ రచన ఆ ప్రయోజనాన్ని సాధించింది. సాహిత్యంలో అప్పటివరకు స్థిరపడ్డ భావాలను, కొత్త భావాలకు చోటివ్వలేని సంకుచితత్వాన్ని ప్రశ్నిస్తుంది ఈ పుస్తకం. సాహితీ ప్రపంచంలో పలకడానికి సిద్ధపడని పేరు బి.సి. వాదం. ఇది వాస్తవం. కొందరు అప్రయత్నంగా తప్పుకుంటే మరికొందరు ఉద్యేశ్యపూర్వకంగా తప్పుకుంటారు. మరికొందరు థాట్ పోలిసింగ్కి గురవుతారు. మరికొందరు కవిత్వాలకు ఉద్యమాలు రాలవంటారు. ఇన్ని నేపథ్యాల్లోంచి అట్టెం దత్తయ్య ‘‘తెలంగాణ బి.సి. వాదం’’ గురించి మాట్లాడుతున్నారు. పుస్తకం పేరు ‘‘తెలంగాణ బి.సి. వాద సాహిత్యం’’. దాదాపు 257 పుటలతో ‘‘ప్రణవం’’ పబ్లికేషన్స్ ద్వారా ఈ పుస్తకాన్ని అందిస్తున్నారు.
ఈ పుస్తకంలో 7 అధ్యాయాలు ఉన్నాయి. ఈ అధ్యాయ విభజన అకడమిక్ పరిశోధనలకు, వాటి విధివిధానాలకు చాలా దగ్గరగా ఉంది. మొదటి అధ్యాయంలో ‘తెలంగాణ బి.సి. వాద సాహిత్యం - పరిచయం’ పేరుతో తెలుగులో ఉన్న బి.సి. వాద సాహిత్యానికి ముందు వెనుకలను ప్రస్తావించారు. రెండవ అధ్యాయంలో ‘తెలంగాణ పద్య కవిత్వం - బి.సి.వాదం’, తరువాత వరుసగా ‘తెలంగాణ పాట - బి.సి. వాదం’, ‘తెలంగాణ వచన కవిత్వం - బి.సి. వాదం’, ‘తెలంగాణ కథ - బి.సి. వాదం’, ‘తెలంగాణ నవల - బి.సి. వాదం’, ‘తెలంగాణ బి.సి. వాద సాహిత్య విమర్శ’లతో కూడిన అధ్యాయాలు ఉన్నాయి. పద్య సాహిత్యానికన్న ముందు పాటకు సంబంధించిన విశ్లేషణ ఉండి వుంటే బాగుండేది. ఈ పుస్తకం లోపటికి వెళ్లడానికి ప్రధాన ద్వారం, బి. సి. వాదానికి తాత్త్విక నేపథ్యాన్ని అందించే రోడ్ మ్యాప్ డా. ఎస్. రఘు రాసిన ‘‘బహుజన వీలునామా’’ అనే ముందుమాట. భవిష్యత్తు తార్కికత డా. సాగి కమలాకర శర్మ రాసిన ‘‘సొంత గొంతుకల వెలుగు’’ అనే ముందుమాట. ఈ రచయిత దాదాపు 190కి పైగా రచయితల సాహిత్యాన్ని స్పృశించారు. బి.సి. సాహిత్యానికి సంబంధించినంత వరకు ఈ పుస్తకం సాహిత్య రాశి. ఈ పుస్తకాన్ని స్థూలంగా ‘‘తెలంగాణ బి.సి కులాల ప్రస్తావన ఉన్న సాహిత్య సమీక్ష’’గా చెప్పవచ్చు.
ఒక రచన, సంబంధిత విషయంపై మనకున్న అభిప్రాయాలను, సమాచారాన్ని సభ్య సమాజానికి తెలియజేయాలనే ఉత్సుకతలోంచి, అవసరంలోంచి బయటకు వస్తుంది. అవి కొన్ని సార్లు వ్యక్తిగత అవసరాలైతే, మరికొన్ని సార్లు సామాజిక అవసరాలు. ఈ విధంగా చూసుకున్నప్పుడు రచయిత నిశ్చితాభిప్రాయాలు కొన్నిసార్లు అవేదనాభరితంగా, ధిక్కారంగా, భవిష్యత్తుపై ఆరాటంలోంచి కన్పిస్తున్నాయి. ‘‘ఎంతటి వెలుగు ఎగచిమ్మినా ఒక్క దీపం సర్వలోకాలను కాంతిమంతం చేయలేదు. అసంఖ్యాక అజ్ఞాత జ్యోతులను వెలిగింప చేయగలిగినప్పుడే దాని కర్తవ్యం సార్థకమవుతుంది’’ (పుట. 24) ఈ వాక్యమే రచన ఏ అవసరాల్లోంచి వచ్చిందనే ప్రశ్నకు సమాధానం.
సాధారణంగా పాఠకులు ఒకే రకంగా ఉండరు. పాఠకులు పుస్తకాలను తమ వైయక్తిక, సామాజిక అవసరాల్లోంచి అధ్యయనం చేస్తారు. కొందరు రచన కేంద్రంగా అధ్యయనం చేస్తారు. ఇంకొందరు రచయిత - రచన అనే రెండు కోణాల్లోంచి చూస్తారు. ఈ విధంగా రచయిత ఉద్ధేశ్యాలు రచనలో ప్రతిఫలించాయా? ప్రతిఫలిస్తే ఎంతమేరకు ప్రతిఫలించాయి? ప్రతిఫలించకపోతే ఎందుకు ప్రతిఫలించలేదన్న ప్రశ్నలు సాధారణంగా వస్తాయి. వీటికి సమాధానం రాబట్టుకోవాల్సిన అవసరం రచయితకే కాదు, సమాజానికి కూడా ఉంటుంది. రచన సామాజిక అవసరం అయినప్పుడు, అందులోని మంచిచెడులు, అవసర, అనావసరాలు చర్చించే బాధ్యత కూడా పాఠకుల మీద ఉంటుంది. ఈ బాధ్యతతోనే ఈ పనికి పునుకుంటున్నాను.
తెలంగాణ బి.సి. వాద సాహిత్యానికి సంబంధించి రచయిత ఏడు అధ్యాయాలుగా విభజించుకున్నారు. తెలంగాణ పద్య సాహిత్యం - బి.సి. వాదం అధ్యాయంలో 14 రకాల కులాలను ప్రస్తావన చేస్తూ, పద్యంలో చిత్రించిన బి.సి కులాల జీవితాలను, ఘర్షణలను సమీక్షించారు. పాల్కురికి సోమనాథుని మొదలు, ఆధునిక కవులైన మారుకొండ సాయిలు, సజ్జన, దోరవేటి లాంటి బి.సి. కవుల వరకు ఈ కృషి ప్రస్తావన ఉంది. తెలంగాణ పాట - బి.సి వాదం అధ్యాయంలో దాదాపు 14 కులాల ప్రస్తావన ఉన్న పాటలను పేర్కొన్నారు. పాటకు ప్రజలను మేల్కొల్పే శక్తి ఉన్నదన్నారు. బి. సి. కులాల ప్రస్తావన ఉన్న పాటలు తాము చేస్తున్న వృత్తులు, వాటి తాలూకూ కష్టనష్టాలు, అభిమానం, ఆవేదన కనపడినంతగా, పాటల్లో చూపించిన విముక్తి మార్గాల ప్రస్తావన లేదు. ఆ ప్రస్థావనలు తెచ్చి వాటిపై బి.సి కులాల అవగాహనను విశ్లేషిస్తే బాగుండేది. తెలంగాణ వచన కవిత్వం - బి. సి వాదం అధ్యాయంలో బి.సి వాదం ఎక్కువగ వచన కవిత్వంలో కన్పిస్తుందని, వచన కవిత్వానికి ఉన్న ప్రక్రియా పరమైన వెసులుబాటును ప్రస్తావించారు. బి. సి. కవిత్వం రాస్తున్న రచయితల సాహిత్య తత్త్వాన్ని పట్టుకునే ప్రయత్నం చేసారు. ‘‘బి.సి. కవిత్వం రాసిన కవులు రెండు రకాలుగా దర్శనమిస్తున్నారు. కొంతమంది వారి వృత్తికి సంబంధించిన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని వృత్తులు విధ్వంసం చెందుతున్నందుకు బాధపడుతున్నారు. వారి వృత్తికి కొత్త రంగులు పులిమి పెట్టుబడిదారులు వారి చేతుల్లోకి తీసుకుంటున్నారని వాపోతున్నారు. మరి కొంత మంది వృత్తులు ధ్వంసం కావాలంటూ, ఆ వృత్తులు మా కులాలకు అంటగట్టడం వల్లనే మేము వెనుకబడుతున్నామని నినదిస్తున్నారు. ఆ వృత్తే నా కులాభివృద్ధికి ఆటంకమని నిర్మొహమాటంగా అక్షరాల తూటాలను పేల్చుతున్నారు’’. (పుట.33 , 34) ఇది మంచి పరిశీలన.
తెలంగాణ కథ - బి.సి. వాదం అధ్యాయంలో బి.సి. కులాల స్థితిగతులను తెలిపిన కథలు అస్తిత్వోద్యమాల కంటె ముందు నుంచే ఉందని చెప్తూ, దాదాపు 20 పైగా కులాల ప్రస్తావన, వారి జీవన సంఘర్షణ నేపధ్యంగా కలిగిన కథలను పరిశీలించారు. తెలంగాణ నవల - బి.సి. వాదం అధ్యాయంలో బి. సి వాదం ఇతర ప్రక్రియల్లో వచ్చినంతగా నవల ప్రక్రియలో రాకపోవడానికి గల కారణాలను విశ్లేషించారు. నవల ప్రక్రియలో మరింత సాహిత్యం రావాల్సిందిగా చెప్పారు. తెలంగాణ బి.సి. వాద సాహిత్య విమర్శ అద్యాయంలో బి. సి. వాదాన్ని సాహిత్య విమర్శ రంగంలో పట్టుకోకపోవడానికి గల కారణాలను విశ్లేషించడం ఈ రచనలో కన్పిస్తుంది. అది శాస్త్రీయం కూడా. బి.సి. వాద సాహిత్య విమర్శను ప్రధానంగా చేపట్టిన విమర్శకుల రచనా వ్యాసంగాన్ని విశ్లేషించారు. బి.ఎస్ రాములు, జూలూరి గౌరిశంకర్, చింతం ప్రవీణ్, సీతారాం, గుడిపాటి, బాణాల శ్రీనివాస్, పగడాల నాగేందర్, దెంచనాల శ్రీనివాస్, వెల్దండి శ్రీధర్, బి.వి.ఎన్ స్వామి, మాచిడి సంతోష్ గౌడు, ఐ. చిదానందం, వడ్కపురం క్రిష్ణ, తాటి కాయల బోజన్న, బాసని సురేష్, ఎం. భాస్కర్ వంటి విమర్శక, పరిశోధకుల సాహిత్య విమర్శ స్వభావం కలిగిన వ్యాసాలను పేర్కొన్నారు.
ఈ గ్రంథంలో మెజారిటీ ప్రజలకు తెలియని బి.సి కులాల ప్రస్తావన ఉన్న సాహిత్యాన్ని పరిచయం చేసారు. వంజరులు, పట్కారీలు, మేదరోళ్లు, దాసరులు, దొమ్మరులు, పూసలొల్లు, భట్రాజులు, జంగాలు, గాండ్ల, ఆరె కటికలు, సూర్య బలిజలు వంటి ఎన్నడు వినని కులాల ప్రస్తావన కూడా ఉంది. ఈ కులాల ప్రస్తావనలో జోగినులు, దర్జీలు వంటి వాటిని కూడా కులాలుగా ప్రస్థావించారు. ఇక్కడ రచయిత పొరబడ్డారు. ఇవి వృత్తులు మాత్రమే. జోగిని అనే వృత్తి కేవలం స్త్రీకి సంబంధించింది. రెండు మూడు కులాలలోని ఆడపిల్లలకు మాత్రమే పరిమితం చేయబడ్డ మత మూఢ విశ్వాసం. దర్జీ (బట్టలు కుట్టే పని) బి.సిల్లోని రెండు, మూడు కులాల వారు వృత్తిగా కలిగి ఉన్నారు. అంతే కానీ దర్జి అనే ప్రత్యేక కులం లేదు.
గ్రంథ రచయిత అట్టెం దత్తయ్య బి.సి వాదం అనే పదబంధాన్ని సామాజిక, రాజకీయ, సైద్ధాంతిక దృక్పథం నుంచి రూపొందించుకున్నట్లు కనిపించడం లేదు. దీనికి కారణం కేవలం సాహిత్యోద్యమాల సరసన బి.సి. వాదం ఎందుకు లేదన్న ప్రశ్న నుంచే వారి వెతుకులాట ప్రారంభమై ఉంటుంది. బి.సి. వాదానికి అవసరమైన రాజకీయ, సైద్ధాంతిక భావజాలాలు ఒక పుస్తకంలోకి రాకపోయిన వివిధ రచయితలు రాసిన వ్యాసాల్లోనూ, పుస్తకాల ముందుమాటల్లోను ప్రారంభమై, అనేక చర్చలకు దారి దీసాయి. బుద్ద, నారాయణ గురు, పూలే, అంబేద్కర్ల ఆలోచన విధానాలు బి.సి. కులాలు అనుభవిస్తున్న అన్ని రకాల దోపిడి నుంచి విముక్తి కల్పిస్తాయి. ఈ పుస్తకంలో రాజకీయ, సామాజిక అవసరాల్లోంచి రూపుదిద్దుకున్న ‘బహుజన’, ‘బి.సి.’, ‘సబ్బండ’ వంటి పదాలలో బి.సి. అనే పదానికి రచయిత మొగ్గు చూపించారు. దీనికి గుర్తింపు రాజకీయోద్యమాల సాహిత్యం (అస్తిత్వోద్యమాలు) ప్రారంభమైనప్పటి నుండి వివిధ విమర్శకుల మాటలను ఉటంకిస్తూ బి.సి వాదం అనే పదాన్ని ఉపయోగించాడు. రచయిత బి.సి వాదాన్ని ఎటువంటి తాత్త్విక భూమికను విశ్లేషించకుండా అంగీకరించారు. కాలువ మల్లయ్య ప్రతిపాదించిన ‘‘సబ్బండ సాహిత్య వాదా’’న్ని ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. కె. కొండలరావు గారి అభిప్రాయాన్ని ఉటంకిస్తూ ‘‘సమ సమాజంలో సమానమైన మనుగడ కోసం, మానవత్వం కోసం వాదం ప్రశ్నిస్తుంది. పని చేస్తుంద’’నే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. సామాజిక, రాజకీయ, గుర్తింపు ఉద్యమాల నేపథ్యంలో అభివృద్ధి అయిన కె. కొండలరావు గారి అభిప్రాయాన్ని ఈ గ్రంథం ప్రస్తావించినా, సాహిత్యంలో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. ఈ పుస్తకం చివరన ‘వినతి’ పేరుతో రచయిత రాసిన మాటలో పుస్తకం పేరుకు సంబంధించి ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. ‘‘గ్రంథనామం విషయంలో కొంతమందిని అనుసరించాను. జూలూరి గౌరిశంకర్ ప్రచురించిన పుస్తకాలు, బి.ఎస్ రాములు రాసిన ‘‘బి.సి. కథలు ఒక విశ్లేషణ (2000 - 2010)’’, వి. జయ ప్రకాశ్ సంపాదకత్వాన వచ్చిన ‘‘బి. సి. కవితా సంకలనం (2019) వంటివి. (పుట. 249) ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ యాదవ్ సూచించిన అభివృద్ధి చెందుతున్న కులాలు అనే పదాన్ని కూడా ప్రస్తావించారు.
బి.సి.లు అంటే ఎవరు అనే మౌలిక ప్రశ్నకు రచయిత బి.ఎస్ రాములు ఇచ్చిన నిర్వచనాన్ని ఉటంకింటారు. ఈ నిర్వచనాన్ని (రచయిత ఉటంకించినంతవరకు) లోతుగా అర్థం చేసుకుంటే అవ్యాప్తి దోషం ఉన్నట్లు మనకు తోస్తుంది. మారుతున్న కాలానికి, విస్తృతమవుతున్న సామాజిక, రాజకీయావసరాల్లోంచి ఇంతవరకు నిర్దేశించుకున్న లేదా ఆపాదించుకున్న పేర్లను సామాజిక అవసరాల దృష్ట్యా మార్చుకోవాల్సిన సందర్భం ఇది. బి.సి.లు అంటే కేవలం సాంస్కృతిక, వృత్తి మార్గాల నుంచే రూపొందించుకోవాల్సిన అవసరం లేదు. ఇది సామాజిక, రాజకీయ అవగాహనలోంచి రూపొందించుకోవాల్సిన వర్తమాన అవసరం ఉంది. ఈ రచనలో బి.సి.లు అంటే ఎవరనే ప్రశ్నకు రచయిత తనదైన అవగాహనను ఇవ్వలేకపోయాడు. ‘‘ఈ దేశంలో శూద్రులుగా పిలవబడుతూ మెజారిటీ చేతివృత్తులు, కుల వృత్తులు చేస్తూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ, నిచ్చెనమెట్ల కుల సమాజంలో పీడితులుగా, పీడకులుగా ద్వంద్వ స్థితుల్లో ఉండి రాజకీయార్థిక, సామాజిక వెనుకబాటుతనానికి గురై, అగ్రకుల దోపిడికి గురైనవారు బి.సి. లు’’ అని నిర్వచించుకోవాల్సిన అవసరం ఉంది.
ఏది బి.సి సాహిత్యం అనే ప్రశ్నకు సమాధానంగా ‘‘ఈ సామాజిక వర్గాల క్షోభను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే సాహిత్యమే ఈ బి.సి వాద సాహిత్యం.’’ (పుట. 35) అని తన అభిప్రాయాన్ని వెల్లడిరచాడు. ఇది పరిమితమైన అవగాహన. రచయిత ఈ అవగాహనను విస్తరించుకోవాల్సిన అవసరం ఉంది. ‘‘ఈ దేశంలో శూద్రులుగా పిలవబడుతూ మెజారిటీ చేతివృత్తులు, కుల వృత్తులు చేస్తూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికి, నిచ్చెనమెట్ల కుల సమాజంలో పీడకులుగా, పీడుతులుగా ద్వంద్వ స్థితుల్లో ఉండి రాజకీయార్థిక, సామాజిక వెనుకబాటుతనానికి, అగ్రకుల దోపిడికి గురైన బి.సి. ల స్థితిగతులను మార్చి వారిని రాజ్యాధికారం దిశగా ఉన్ముక్తుల్ని చేస్తూ, సాహిత్య, సామాజిక, రాజకీయ, సైద్ధాంతిక, తాత్త్విక అవగాహనల్లోంచి ఉద్యమించేందుకు అవసరమైన కార్యాచరణను ప్రకటించేది బి.సి. వాదం.’’ ఈ విధంగా ‘‘బి.సి వాదం నేపథ్యంలో ఏ పీడితుల కోసమైతే పోరాడుతున్నామో, రాస్తున్నామో, ఆరాటపడుతున్నామో వారే తమ సాహిత్యాన్ని తామే రాసుకుంటామనే చైతన్యాన్ని ప్రదర్శిస్తారో, వారే తమ జీవన స్థితిగతుల నుంచి, కుల వివక్ష, అనుభవం, అనుభూతితో రాసిన సాహిత్యం బి.సి వాద సాహిత్యం అవుతుంది. కానీ, బి.సిలు రాసిన సాహిత్యం బి.సి వాద సాహిత్యం కాదు’’ ఈ అవగాహనలోంచి బి.సి వాద సాహిత్యోద్యమ లక్ష్యాలను నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ గ్రంథంలో రచయిత పీడకులు అని అంటున్నారు. కానీ ఆ పీడకులు ఎవరో నిర్ధిష్టంగా చెప్పలేదు. దీనికి రాజకీయ చైతన్యం తాలుకూ పార్శ్వం ఈ రచనలో లేకపోవడం ప్రధాన కారణం. ఒక వాదాన్ని గురించి మాట్లాడుతూ వారి రాజకీయ పార్శ్వాన్ని చెప్పకపోవడం కన్పిస్తుంది.
తెలుగు సాహిత్య రంగంలో బి.సి. ల సాహిత్యానికి, సాహిత్యకారులకు జరుగుతున్న అన్యాయాలు, వాటి వెనుకాల దాగిన కుట్రలను పసిగట్టడంలో ఈ రచయిత సఫలీకృతం అయ్యారు. ‘‘బి. సి. లను హిందుత్వం పేరుతో కొందరు, దళితులలో ఒకరిగా మరికొందరు, బహుజనుల పేరుతో ఇంకా కొందరు, దళిత బహుజనుల పేరుతో మరికొందరు చూపిస్తున్నారు. రకరకాల గొడుగులను కప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సామాజికంగాను, సాహిత్య పరంగాను ఒక రకమైన కుట్ర’’ (పుట. 30). సాహిత్య రాజకీయాలను ప్రస్తావిస్తూ, బి.సి. సాహిత్యకారులు ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న ‘‘సాహిత్య దూరాల’’ను చెప్పారు. సాహిత్య రాజకీయాల మాటున దాగిన సామాజిక, రాజకీయ అవసరాలను చర్చించాల్సి అవసరం ఉంది.
దళిత సాహిత్యంతో Iఅ ూఱసవతీ, ూబ్ ూఱసవతీ వంటి చర్చలు వచ్చిన తర్వాత ‘‘మీరు పీడితులే కానీ, మాతో సమానమైన పీడితులు కారు. కొన్ని సార్లు మీరు కూడా పీడకులుగా ఉన్నారనే’’ వారు చెప్పిన అభిప్రాయం సత్యదూరం కాదు. భౌతిక వాస్తవం. పాటకు పరాయి పల్లవి వ్యాసం ద్వారా సతీష్ చందర్ చేసిన సలహాను నాటి బి.సి. వాదులు కొందరు సవాలుగా స్వీకరించి స్వీయ అస్తిత్వవాద నిర్మాణానికి కొంత పని చేసారు. మరికొందరు బి.సి.లతో ఉన్నామంటూనే దళితవాదానికి సతీష్ చందర్ మాటల్లో చెప్పాలంటే పులుపు చావని రాతలను రాసారు. ఇక్కడే రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఒకరు వారి వెంట పులుపు చావని రాతలు రాస్తే, మరికొందరు మరొక్క రూపం ఎన్నుకున్నారు. అభ్యుదయకరమైన భావజాలల్లో నిర్మాణమైన బి.సి. రచయితలకు మనవాళ్లు అనుకున్న దళితులు దూరం పెట్టేసరికి మరో రూపం అవసరమైంది. వెనుకబడిన కులాల పేరుతో సంకలనాలు ప్రారంభమయ్యాయి. జూలూరి గౌరిశంకర్ లాంటి వాళ్లు వెనుకబడిన కులాల తాత్త్వికతలోంచి సాహిత్యాన్ని సృజిస్తూ కొనసాగుతున్న సందర్భంలో, కొంతమంది ూబ్ ూఱసవతీ గానే ఉంటూ Iఅ ూఱసవతీం సహగమనం చేస్తూ దళిత విమర్శకులు అనే మాట కోసం పరితపించి సఫలీకృతమయ్యారు. ఆనాడు వారు ప్రత్యేక అస్తిత్వ మార్గంలో ఆలోచనలు చేయకుండా ఉన్నారు. వారే కనుక ప్రత్యేక అస్తిత్వ మార్గాన్ని ఎంచుకొని ఉంటే బి.సి సాహిత్య తాత్వికత నిర్మాణంలో సఫలీకృతం అయ్యేవాళ్లం. ఆనాడు బి.సి.ల సాహిత్యానికి ఒక వేదిక నిర్మించగల ధైర్యం ఎవరు చేయలేకపోయారు. తద్వారా బి.సి వాదం కొన్ని సంకలనాల, రచనల ముందుమాటలకు పరిమితమైపోయింది. నిద్రాణమైన ఉన్న బి.సి వాదాన్ని నేడు బద్దుడు, పూలే, అంబేద్కర్, మండల్ల తాత్త్వికతలోంచి పని చేస్తూ కంచ ఐలయ్య, కాలువ మల్లయ్య, జూలూరి గౌరింశంకర్, సంగిశెట్టి శ్రీనివాస్, వెల్దండి శ్రీధర్, పగడాల నాగేందర్, చింతం ప్రవీణ్, ప్రభంజన్ యాదవ్, ఎస్. రఘు వంటి వాళ్లు మేల్కొల్పుతున్నారు. వారి సరసన ‘‘బి.సి.ల ఉటంకింపు ఉన్న సాహిత్యాన్ని సమీక్షించిన’’ ఈ పుస్తకం ద్వారా అట్టెం దత్తయ్య కూడా నిలిచాడు.
తెలుగు సాహిత్యంలో గుర్తింపు రాజకీయ ఉద్యమ సాహిత్యాలు (అస్తిత్వోద్యమాలు) అభివృద్ధి అయిన తర్వాత వాటి సరసన బి.సి. వాద సాహిత్యం కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. ఇది బి.సి.ల రాజకీయ, సామాజిక అవసరం కూడా. దాని కోసం ముందు వాదం, ధోరణి, ఉద్యమం వంటి పారిభాషిక పదాలను అర్థం చేసుకోవాలి. వాదం అంటే ‘‘ఒక నిర్దిష్టమైన మార్గానికి, భావ సూత్రాలకు కట్టుబడే కవులు, రచయితలు చేసే వ్యక్తిగత ప్రయత్నాల, చర్యల పరంపర’’. ధోరణి అంటే ‘‘నిర్దిష్ట భావాత్మకాశయంతో కొంత మంది వ్యక్తులు ఉమ్మడి మార్గంలో చేసే వ్యక్తిగత ప్రయత్నాల, చర్యల పరంపర’’. ఉద్యమమంటే ‘‘నిర్దిష్ట భౌతికాశయంతో ఒక సమూహం చేసే సమష్టి ప్రయత్నాల, చర్యల పరంపర’’. ఈ పరంపరలో బి.సి సాహిత్యం మౌలిక మార్గమైన ఆలోచన మార్గం దాటింది. ఆచరణ రూపంలో వాదంగా రూపొందుతున్న దశ ఇది. దీని తర్వాత ఉద్యమ రూపం తోసుకోవాల్సిన అవసరం ఉంది.
అస్తిత్వం అనే మాటను ఉనికి అర్థంలో తీసుకుంటున్నాము. ఇక్కడ ఉనికి వ్యక్తిగత ఉనికి కాదు. సామాజిక ఉనికి. సాహిత్యంలోని అన్ని గుర్తింపు రాజకీయ ఉద్యమ సాహిత్యాలు (అస్తిత్వోద్యమాలు) తమ సామాజిక ఉనికిని ప్రకటించాయి. స్త్రీవాదం వ్యక్తిత్వానికి సంబంధించిన సమస్యలోంచి రూపుదిద్దుకున్నట్లుగా, దళిత వాదం సామాజిక ఆత్మగౌరవం, ముస్లిం వాదం మతపరమైన అగ్రత్వం, ప్రాంతీయవాదం ఆర్థిక, సాంస్కృతిక ఆధిపత్యాల్లోంచి రూపుదిద్దుకున్నట్లుగా బి.సి వాదం కూడా తనదైన ప్రత్యేక అవసరాల్లోంచి, ఆవేదనల్లోంచి, పరిష్కార మార్గాల్లోంచి రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపై మరింతగా చర్చలు జరిగి, నిష్పక్షపాతంగా వాటి మదింపు చేయడం అవసరం. విమర్శకులు, పరిశోధకులు ఈ దిశగా ఆలోచించాలి. ఈ గ్రంథ రచయిత అట్టెం దత్తయ్య ఆవేదన కూడా ఇదే.
బి.సి. వాదం సామాజిక, తాత్త్విక, సాహిత్య రంగాల్లో మౌలిక ప్రశ్నలను లేవనెత్తాలి. ఈ విధంగా కొత్త ప్రశ్నలను లేవనెత్తినప్పుడు కొత్త సమాధానాలు అవసరం అవుతాయి. సమాధానాలను సాధించే క్రమంలో ముందుకు పోతున్నా కొద్దీ అనిర్దిష్ట స్థితి నుండి నిర్దిష్ట స్థితి సాధిస్తాము. ఈ క్రమంలో వచ్చే వైరుధ్యాలు, వాటి పరిష్కారాలు, తృప్తికరమైన సమాధానాలంన్నింటిని సాధించే క్రమంలో బి.సి. వాదానికి తాత్త్విక భూమిక ఏర్పడుతుంది. ఈ దిశలో అట్టెం దత్తయ్య రచించిన తెలంగాణ బి.సి. వాద సాహిత్యం తొలి అడుగు. అనేక ప్రశ్నలను లేవనెత్తే రచన. రచయితలందరు బ్రాహ్మణీయ, సాంస్కృతికాధిపత్యం నుంచి కెరియరిజం తాలూకూ ఆలోచనలోంచి నిర్భయంగా బయటికి వచ్చి కొత్త అస్తిత్వ పంథాను నిర్మించడానికి ఈ రచన సలహా పూర్వక గ్రంథంగా పనిచేస్తుంది. ఈ ప్రయాణంలో సాగడానికి మనకు సహకారాలు అందిస్తుంది. బి.సి.ల జీవితాలను స్పర్శించిన సాహిత్యం ఎంత?, వాటిలోని వైవిధ్యం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తుంది. రచయిత యువ పరిశోధకుడు కావడం మూలంగా ఈ మధ్య తెలుగు సాహిత్య విమర్శలో అడుగుపెడుతున్న మొదటి అడుగులను ఒడుపుగా అందుకోగలిగాడు. కొత్త విమర్శకులను సాహితీ లోకానికి పరిచయం చేయగలిగాడు. సమకాలీన తెలుగు సాహిత్యాల్లో బి.సి. వాదానికి చోటునిస్తూ భావజాల, తాత్త్విక, సాహిత్య రంగాల్లో కృషి చేస్తున్న సబ్ ఆల్ట్రన్, బహుజన కెరటాలు వంటి పత్రికల కృషిని, వివిధ సాహిత్య కారులు సృష్టించిన సాహిత్యాన్ని ప్రస్తావించారు. బి.సి. వాద నిర్మాణానికి మరిన్ని పత్రికలు రావాలని ఆకాంక్షించాడు.
‘‘బి. సి. లు కవులు రచయితలు వారి స్వీయ అస్తిత్వ పంథాలో నడవక తప్పదు’’ (పుట. 28). యుగాల నుంచి పొగడ్తలను ఆశిస్తూ, రసాలను ఆస్వాదిస్తూ ఇంకెన్ని సంవత్సరాలు కాలం వెలిబుచ్చడం. అసమానతను ప్రశ్నిస్తూ, మోసాలను గురించి రాసి పీడకులను నిలదీయ వలసిన అవసరం ఉంది. (పుట. 35), కలిసికట్టుగా పోరాడి రాజ్యాధికారాన్ని సాధించుకుందాం. (పుట. 110), బి. సి సాహితీవేత్తలు వారి వారి జీవితాలను వాస్తవికంగా, నిర్మొహమాటంగా, నిర్భయంగా లిఖించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. (పుట. 234) వంటి సూచనలు కన్పిస్తున్నాయి. ఇవి ఆయా అధ్యాయాలలో సాహిత్యాల విశ్లేషణ తర్వాత ఈ అబిప్రాయాలను వ్యక్తం చేసారు.
చివరగా ఒక సూచన ఇవ్వవచ్చు. ఒక సిద్ధాంతాన్ని లేదా వాదాన్ని నిర్మించాలంటే, ఇప్పటివరకు మనకున్న భేషజాలాల్నీ, అవగాహనలు, పరిభాషల్నీ, ప్రత్యయాలపై అనుమానం వ్యక్తంచేయాలి. ధ్వంసం చేయాలి. అప్పటివరకున్న అవగాహనను శాస్త్రీయ అవగాహనగా పునాదులు వేసుకొని, నిర్మించాల్సిన పనిలో నిమగ్నం అవ్వాలి. అది చేయనంత వరకు ఇప్పుడు మనమనుకుంటున్న వాద నిర్మాణాల్లో సఫలీకృతం కాలేము.
డా. ఇమ్మిడి మహేందర్
అధ్యాపకులు, తెలుగుశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం.
(మూసీ పత్రికలో ప్రచురితం. ఆగస్టు 2021)
తెలంగాణ బిసివాద సాహిత్యం కులవృత్తుల జీవన చిత్రణ
దేశంలో నిమ్నకులా లు, వెనుకబడిన కులాల వారిని చైతన్య పరిచిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావుపూలే. వీరితో నే ఈ దేశంలో దళిత, బహుజన వర్గాల సమైక్య పోరుకు నాంది పలికింది. పీడి త, తాడిత శ్రామిక కులాలను దోచుకుం టున్నది అగ్రవర్ణ భూస్వాములు పురో హిత వర్గాలే కాని దేవుడు కారణం కాదని పూలే సూత్రీకరించాడు.
భారతీయ పురాణాలన్నింటినీ ఔపో సన పట్టి న జ్యోతిరావు పూలే దేశ నిర్మాణంలో సంపదలో బహుజను ల భాగస్వామ్యం ఉందని ఒక కొత్త దృక్పథాన్ని, ఆలోచనను ఇచ్చాడు. ఆ క్రమంలోనే 'గులాంగిరి", "పురోహితుల బండారం బట్టబయలు' లాంటి గొప్ప గ్రంథాలను రచించాడు. నిమ్నకులాల విముక్తి కోసం 1873లో సత్యశోధక సమాజాన్ని స్థాపించాడు.
ఒక విశాల ప్రాతిపదికన సంఘటితంగా వచ్చిన ఎస్.సి., ఎస్.టి., బి.సి. మైనారిటీ కవులు ఆ తర్వాత కాలంలో ఒక నిర్దిష్టతల వైపు విడిపోయారు. ఆ క్రమంలోనే చైతన్యాలవైపు, సొంత అస్థిత్వాల వైపు మళ్ళారు. చిక్కనవుతున్న పాటలో ఎస్.సి.ల ఊచకోత మీద అనేక మంది బి.సి. కవులు స్పందించి కవిత్వం రాశారు. అయినా చిక్కనవుతున్న పాట, పదునెక్కిన పాట, చిత్తరువు వంటి సంకలనాలు దళిత కవిత్వం పేరుతోనే వెలువరించారు. బహువననం, మేమే, మొగి వంటి సంకలనాలు దళిత బహయిన కవిత్వం పేరుతో వెలువ రించారు. అప్పటి వరకూ ఎస్.సి. ల సమస్యలను తమ గొంతుతో నిన దించిన బి.సి.లు, ఎస్.సి.ల సమస్యలను తమ గొంతుతో నినదించిన బి.సి.లు, ఎస్. సి.లజీ కాదు తమకూ సమస్యలు ఉన్నాయనే వాటి గురించి చెప్పవలసిన అవసరముందని గ్రహించారు.
సతీష్ చందర్ గారన్నట్లు బి.సి.లు ఆకలితో చనిపోయారు. ఎస్.సి.లు అవమానాలతో చనిపోయారు. తమ అనుభవాల్ని రాయా ల్సిన బి.సి. కవులు ఎస్.సి.ల అనుభవాల్ని రాశారు. వారి అనుభవాల్ని దాచిపెట్టుకున్నారు. జంధ్యాలను ధరించినా నీచవృత్తులు, అవమానాలు బి.సి.లకు తప్పలేదని స్పష్టపరిచారు. గాయాలను ధైర్యంగా బయటపెట్టాలని సూచించారు. సతీష్ చందర్ మాటలు బి.సి. కవులను ఆలోచింప చేశాయనుకుంటాను. ఆ క్రమంలోనే బి.సి.వాద సాహిత్యం వెలుపరింపబడ్డూ వస్తుంది. ఆ వెలుగులోనే జూలూరి గౌరీశంకర్ సంపాదకత్వంలో వెంటాడే కులాలు పూర్తిగా బి.సి. కవుల కవిత్వంగా మనముందుకు వచ్చింది.
"ఆయా ఉత్పత్తి కులాలలో పుట్టిన గర్భస్థమేధావులు కుల పనితనాన్ని, ప్రకృతితో దానికుండే ఉత్పత్తి సంబంధాన్ని మానవ జాతికి ఆయా కులాలు చేసే మేలును ప్రతినిత్యం ప్రతిరూపంలో నెను రువేసుకోవడం ఒక ప్రక్రియగా మారుతున్నది" అని కంచ ఐలయ్య (సూదిశ్యేక ముందుమాట) అన్నట్టు ఆయాకులాల పనితనాన్ని, కవి త్వపు పనితనం జోడించి మరీ బి.సి. కవులు అందించారు.
తెలంగాణాలో కవులే లేరు అన్న మాటను సవాల్ గా తీసికొని గోల్కొండ కవుల సంచిక ద్వారా 364 నుంచి కవులను సురవరం ప్రతాపరెడ్డి పరిచయం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అదే విధంగా సాహిత్య చరిత్రలో విస్మరించబడిన తెలంగాణ సాహిత్య విశే షాలను సాధికారికంగా తిరగ రాసుకుంటున్నాం కూడా. అనేక సామాజిక ఉద్యమాల్లో కీలడపాత్ర వహించారు. పోరాడారు అయినా అనేక విధాలుగా అస్థిత్వ సంక్షోభాన్ని నేటికి అనుభవిస్తూనే ఉన్నారు.
సమాజ ఆర్థికాభివృద్ధికి ఉత్పత్తి కులాల ప్రజ లై ఉండి, రాజకీయ రంగంలో పాలనా అవకాశాలను అందులోలేకపోతున్నారు. అలాంటి బహుజన కులాల అస్థిత్వాన్ని దానికి సంబంధించిన సాహిత్య వైవి ధ్యాన్ని ఆవిష్కరింపచేస్తూ నిర్మాణాత్మకమైన రచనగా కేవలం "తెలం గాణ బి.సి. వాద సాహిత్యం" డా అట్టెం దత్తయ్య 2021న మన ముందుకు తెచ్చారు. దాదాపు ముప్పై కులాలను ఇందులో పరి చయం చేశాడు. 196 మంది రచయితలు ఇందులో ప్రస్తావించల డ్డారు. 46 మంది ఎక్కువ ప్రక్రియలు రాసిన వారున్నారు. అందులో 14 మంది స్త్రీలున్నారు.
అట్టెం దత్తయ్య రాసిన తెలంగాణ బి.సి వాద సాహిత్యం పుస్తకం లో మొదటి అధ్యాయంలో తెలంగాణ బిసి వాద సాహిత్యం పరి చయం, రెండవ అధ్యాయంలో తెలంగాణ పద్య కవిత్వం బిసి వాడ .. మూడవ అధ్యాయంలో తెలంగాణ పాట బిసి వాదం, నాల్గవ అధ్యా యంలో తెలంగాణ వచన కవిత్వం బిసి వాదం, ఐదవ అధ్యాయంలో తెలంగాణ కథ బిసి వాదం, అరవ అధ్యాయం లో తెలంగాణ నవల బి సి వాదం, ఏడవ అధ్యాయం లో తెలంగాణ బి సి వాద సాహిత్య విమర్శ అని ఏడు విభాగాలుగా విభజన చేయటం కనిపిస్తుంది.
బీ.సి.లు అంటే ఎవరు? ఎవరు రాసింది బిసి వాద సాహిత్యం అనే చర్చ జోలికి నేను వెళ్ళను. మొదటి భాగంలో- ఈనాటి సాహి త్యంలో అస్థిత్వ ఉద్యమాలు ఎలా మొదలై తీవ్రతరం చెందాయి. దేశంలో ప్రతీరంగం ప్రపంచీకరణ పేరుతో పరాయికరణ చెందిన అంశాలు. పరాయి కరణ వల్ల అనాదిగా వస్తున్న కులవృత్తులు దెబ్బ తిని ఉపాధి కోల్పోయిన తీరు. వారి వారి అస్థిత్వ నేపథ్యం నుండి అనుభవాలను సాహిత్యంగా రూపొందించిన అనేక రూపాలను తెల్పటం జరిగింది.
బిసి వాద సాహిత్యం నిర్విరామంగా వచ్చినప్పటికీ సాహిత్య ఉద్యమాలు ప్రచారం పొందినంత బిసీ వాద సాహిత్యం రాలేదని అంటూనే అంతర్గతంగా బలపడ్తూ వ్యాప్తి చెందుతుందనే వివరణలు ఇచ్చాడు. బీసీ వాద సాహిత్యం మొదట ఏ ప్రక్రియలతో మొదలైంది. మిగతా ప్రక్రియలలో ఎంతమేరకు ప్రయత్నం జరిగింది. ఎవరెవరి. కృషి ఎంతగా ప్రతిఫలించిందనే అంశాలను ఉదహరి స్తూ చక్కని వివరణలు అందించాడు.
రెండవ భాగంలో 14 రకాల కుల వృత్తులను పద్య కవిత్వంలో వచ్చిన తీరు కనిపిస్తుంది. పర్యానికి కొన్ని కట్టుబాట్లు ఉన్నప్పటికీ అన్ని రకాల జీవితాలను, సంఘర్షణలను సమాజానికి దగ్గరయ్యే పద్ధతిలో ముందుకు సాగించన్నాడు. పొల్యురికి సోమనాథుని పండి తారాధ్య చరిత్ర నుంచి బి.సి. కులాల ప్రస్థావన ఉందని, సబ్బండ వర్గాలను సాహిత్యానికెక్కించి 40 కులాలకు జననపురాణంలో స్థాన మిచ్చిన మొట్ట మొదటి కవిగా పాల్కురికి సోమనాథుని నిర్ధారించాడు.
మూడవ భాగంలో పాటకు, మానవుడికి విడదీయరాని బంధం పెనవేసుకుందని, నిద్రాణమైన జాతిని మేల్కొలిపే లక్షణం పాటకుం దని తెల్పాడు. ఇందులో కూడా 14 రకాల కుల వృత్తులను పాటలో వచ్చిన స్థితిని వివరించాడు. 2,3 కుల వృత్తులు వేర్వేరు తప్పు, రెండవ భాగంలోనినే చోటుచేసుకున్నాయి.
బి.సి. కులాల వారికి అక్రిత గాయక కులం, వారి సంప్రదాయం.. ఏ విధంగా ఉంటుందో ఎవరికీ తెలియదంటూ, బి.సి.ల మూలా లను, అవమానాలను, సాహసాలను గానం చేసిన మౌఖిక సాహి త్యాన్ని వెలికి తీయాలనే సూచన చేశారు. ఇంచుమించు ప్రతి బి.సి. కులానికి ఒక ఆశ్రిత గాయక కులం ఉందని మచ్చుకు కొన్ని ఉదహ రించాడు కూడా, బి.సి, సాహిత్యం ఎక్కువగా వచన కవిత రూపంలో వచ్చినట్లు తాను గమనించిన వచన కవితా సంకలనాల లిస్టు ప్రస్తా వించారు. ఇందు లో 17 కుటాల పరిచయం కనిపిస్తుంది. మూడు కులాలు అదనంగా చేరాయి.
ఐదవ భాగంలో తెలంగాణ కవులు, రచయిత ు గ్రామీణ నేపధ్యం కలిగినవారు ఎక్కువని, వృత్తుల గురించి కథలు రాశారని, చెప్పాడు. బి.సి. కులాల స్థితిగతులను అస్తిత్వ ఉద్యమాల కంటే ముండే కథలే తెలియజెప్పాయని కూడా అన్నాడు.
ప్రాచీన సాహిత్యం నుండే కథ ప్రజల పక్షం వహించిందని కొత్త ప్రతిపాదన చేయటం గమనించవచ్చు. కొందరు కులవృత్తి ఆధారిత జీవితాలను కథలుగా మలిచి చైతన్య పర్చటమే కాకుండా కొంత తిరు గుబాటు కూడా నేర్పినట్లు తెలియజేసాడు. బహుజనుల జీవితం చెప్పే పద్ధతిలో, ఆలోచింపచేయటంలో చాలా మార్పు వచ్చిందం టాడు. అందులో 23 కులాల పరిచయం జరిగింది.
అరస భాగంలో చాలామంది తెలుగు రచయితలు సాహిత్య మంటే కేవలం కవిత్వం మాత్రమే అనుకోవటం వల్ల, సేవలను ఒక ఉద్యమంగా తీసుకురాలేక పోయారనే అభిప్రాయం వ్యక్తం అయింది.
బిసి వాద సాహిత్యం మిగతా ప్రక్రియలో వచ్చినంతగా నవలా ప్రక్రియలో రాలేదని చెప్పాను. ఒక వృత్తిని గురించి, ఒక కళను గురించి సంపూర్ణ విజ్ఞానంతో వివరించిన నవలలు చాలా అరుదుగా వచ్చాయని చెప్పి అందరి ఆలోచనకు వదిలేశాడు.
రచయితలు శ్రమ జీవుల పక్షం అనే స్పృహ ను నవలా రచయి తలు కోల్పోయారని, కాలం వెళ్ళబుచ్చే నవలలు ఎక్కువ రాశారని విమర్శిస్తూ వారి స్పందనకే వదిలేశాడు, ఇందులో 13 కులాల వృత్తుల పరిచయం జరిగింది. ఏ రచయిత అయి నా కల్పిత రచనకి, అనుభవ రచనకి తేడా ఉంటుందని తేల్చేశాడు.
చివరిదైన ఏడవ భాగంలో మేధోపరమైన బి.సి, వాద సాహిత్య విమర్శలో ఎవరి అభిరుచులు వారికుంటాయని చెప్పాడు. కడుపు నిండిన వాడు కాలక్షేపానికి రసాలను అద్దుతూ ఎంతటి రమ్యమై న కవిత్వం రాసినా, కడుపు కాలుతున్న భావుకుడిని స్పందించి చేయలే డనేది వాస్తవం. ఒకప్పుడు గ్రామాలలో దొర, భూస్వాములు కులన్న త్తుల శ్రమను దోపిడీ చేస్తే, అది నేడు రూపాంతరం చెంది ప్రపంచీక రణ ప్రభావంతో పెట్టుబడిదారీ వ్యవస్థ చేసిన దోపిడీని కూడా తీసి వాద సాహిత్యం చిత్రించింది.
అట్టడుగు స్థాయి, అణచబడుతున్న వారి అస్థిత్వం నుంచి దాసిన రచనల మీద ఆధిపత్య చరపు వారికి పూర్తిస్థాయిలో నచ్చరు. అందుకే సాహిత్య చరిత్రలో వెనుకబడిన వారిపై ఎంతో కొంత సాహిత్యం వచ్చినా విమర్శకులు ఎక్కువమంది పట్టించుకోలేదనే అనే దన కనిపిస్తుంది. ఏ ప్రక్రియనైనా సాంఘిక స్వభావాన్ని విశ్లేషించాలి. అదే విమర్శనం అని చెప్పి అనేక ప్రశ్నలు ఎక్కు పెట్టటమే కాకుండా శాస్త్రీయమైన సమాధానాలు రచనలో విశ్లేషించటమే విమర్శ అని. చెబుతూనే వృత్తి కులాలకు సంబంధించిన సాహిత్యం మీద విస్తృత మైన విమర్శ రావాలని ఆశను, ఆకాంక్షను వ్యక్తం చేశాడు.
మొత్తం మీద అట్టెం దత్తయ్య గొప్ప ప్రయత్నం చేశాడు. కొన్ని కులాలు అన్ని ప్రక్రియల్లో పునరావృతం అయ్యాయి. కొన్ని కులాలు కొన్ని ప్రక్రియలకు మాత్రమే పరిమితమయ్యాయి. కొన్ని ఏ ప్రక్రి యకు నోచుకోలేదు. చేసి వాద సాహిత్యం మీద ఎంతో కృషి చేయాల్సి ఉంది. దత్తయ్య, పరిశోధన చేయాలనుకునే వారికి దారు లు పర్చాడు. దీన్ని స్ఫూర్తిగా తీసికొని మరింత పరిశోధన చేయగలి గితే బి సి వాద సాహిత్యం వెలుగులోకి తీసుకురావచ్చు, అధునాత నంగా వస్తున్న నానీలు, మొగ్గలు, రక్కలు, మణిపూసలు మొదలగు ప్రక్రి యలలో బి.సి.ల గురించి ఎక్కువగా నమోదవుతున్న విషయం కూడా ప్రస్తావించాడు. ఆసక్తి ఉన్నవాళ్ళు వీటిని పరిశీలించవచ్చు. వీటిని ముందుముందు పరిశీలించే ప్రయత్నం చేస్తాననే కోరడను కూడా. వ్యక్తం చేశాడు. దత్తయ్య తపన మనకు అర్ధమవుతుంది.
ఈ పుస్తకానికి "బహుజనుల విలునానూ" అంటూ డా॥ ఎస్. రఘు గారు చారిత్రక అవసరా న్ని తెలియజేస్తూ గొప్ప వివరణ - సొంత గొంతుకల వెలుగు" అంటూ డా॥ సాగి కమలాక దశర్మ గారి ప్రోత్సాహం, అభినందనలు చూడవచ్చు.
అస్థిత్వం పేరిట 1980 దశకం నుండే తెలుగు సాహిత్యంలో ఈ రోరణి ప్రారంభమైంది. మాకు అన్యాయం జరిగించంటూ కులాబు గా, మతాలుగా, స్త్రీలుగా, పురుషులుగా విడిపోయారు. ఎవరికి వారే అనే దశను ప్రకటిస్తున్నాడు. మనుషులం అనే వాస్తవాన్ని బాధ్యతను మరిచి పోతున్నాం. అధిక శాతం జనాభా కలిగిన బి.సి.ల్లో ఇప్పటికీ ఐక్యత మాత్రం కలగటం లేదు. దేశంలో బ్రాహ్మణుల్లో ఉన్న బ్రహ్మనిజం రానురాను ఇప్పుడు బి.సి.ల్లో కూడా వ్యాపించింది. మరొకటి కులం మతం రాజకీయ చదరంగంలో పాపులు అవుతున్నాయి. బతుక నేర్చే వాళ్ళకి బావుటాలు అవుతున్నాయి. మేధావులకు హోదాలు దక్కుతు న్నాయి. ప్రపంచీకరణ ప్రభావం వల్ల చెట్టు పేరు చెప్పి కాయలమ్మే వ్యవహారం ఎక్కువగా కొనసాగుతుంది.
మనిషి బతకాలంటే ఏదో ఒక పనిచేయాలి. పని అంటే శ్రమకు పర్యాయపదం, అది వెనుటకు ప్రతిరూపం. సమాజ నిర్మాణానికి జీవనానికి మూలధనం కాబట్టి సమాజంలో ఎవరో ఒకరు ఏదో ఒక పనిచేయక తప్పదు. చేసే పనిని బట్టి గౌరవ ఆగౌరవాలు ఇచ్చేవాడు నీచుడు. సమాజ చీడపురుగులు, దోపిడీదారులు, మనుషులను కులా లుగా మతాలుగా విడగొట్టి వివాదాలు సృష్టించి లబ్దిపొందే వాళ్ళు న్నారు. పుట్టిన కులం కాదు ముఖ్యం. మనిషిలోని ఆలోచన ముఖ్యం.
ప్రజాకవి వేమన చెప్పినట్టు
"కులము గలుగువాడు గుణము గలుగువాడు
విద్యచేత విర్రవీగువాడు
పసిడి గలుగువాని బానిస కొడుకులు”
ఇది గమనించాల్సిన విషయం.
కులవృత్తులు నీచమైనవి కాదు. నీచంగా చూడకూడదు. వృత్తి అనేది బతుకునిచ్చేది. ప్రతి కుల వృత్తిలో కళాత్మకత ఉంది. బతుకు చెరువు ఉంది. మన కళాత్మకతను దోపిడి చేసేవాన్ని, మన బతుకుల్ని చిర్రం చేసినవారిని, చేస్తున్నవారిని నిలదీసి పాతరెయ్యాలి. అనేక సాహిత్య ప్రక్రియల్లో కుమ్మరి, వడ్రంగి, గౌండ్ల, రజక, సాయీ బ్రాహ్మణ, దర్జీలు, పద్మశాలీలు, గంగపుత్రులు ఇలా అనేక వివిధ వృత్తుల్లోని కష్టాలను కన్నీళ్ళను కవులు నిక్షిప్తం చేశారు.
"సీత కష్టాలు లు సీతవి పీత కష్టాలు పీతవి" అన్నట్లు ఎవరి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. కన్నీళ్ళూ ఉన్నాయి.
"ఎవరో తోడు వస్తారని / ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా?/ విజల నురచి విదుర పోకుమా? శ్రీశ్రీ అన్నట్టు ముసం మోసపోవద్దు. రచయితలు, కవులు ఆలోచించాలి.
ఇవాళ వృత్తులు కులాల పరంగా లేవు. కాని కులాలున్నాయి. ఇవి రాజకీయాల చుట్టు కులం, మతం చుట్టూ తిరుగుతూ వ్యష్టి ప్రయోజనం పొందుతున్నాయి. కాని అందరికి కావాల్సింది సమష్టి ప్రయోజనం, కాబట్టి కుల, మత రాజకీయాల నుండి మన ఆలోచ నల్ని నడవడికల్ని దారి మళ్ళించి ప్రజారాజకీయాలకు నాంది పలు కుదాం. అప్పుడే "మనిషి" అనే మాటకు అర్ధం. మానవత్వానికి విలువ, బతుకుకు ఒక దారి.
డా. కందాళ శోభారాణి
రచయిత అధ్యాపకురాలు
(ప్రజాపక్షం దినపత్రికలో ప్రచురితం. 09 ఆగస్టు 2021)
ఈ ప్రపంచంలో ఒక్క భారత దేశంలో మాత్రమే పుట్టక ముందే, పుట్టబోయే వారు చేయాల్సిన వృత్తి నిర్ధేశించబడతాయి. అది మనదేశ ప్రజలపై రుద్దబడిన కుల కట్టుబాటు బానిసత్వం. మనిషి అనే ఉదాత్తమైన గుర్తింపు కంటే ఫలానా కులం వాడని వేసిన ముద్ర ఆ మనిషి చచ్చాక కూడా వెంటాడుతుంది. ఆ కుల కోరల వల్లనే ఉన్నతమైన జ్ఞానం, సారవంతమైన గుణం ఉన్న డా.బి.ఆర్ అంబేడ్కర్‌ని లోకమంతా ప్రపంచ మేధావి అని కీర్తిస్తున్నా, మన దేశ అగ్రకులతత్వం అతని మేధోశక్తిని గుర్తించనిరాకరిస్తూనే ఉంది. స్వాతంత్య్రం వచ్చిన నలభై ఏండ్లు గడిచాకే తమ సొంత వాణిని విన్పించుకునే ప్రయత్నాలు ప్రారంభించే స్థితికి శూద్రకులాలు నెట్టబడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో డానిష్ తత్త్వవేత్త సోరెన్ కీర్క్ గార్డ్, ఫ్రెంచ్ తత్త్వవేత్త జీన్ పాల్ సార్త్రే ల అస్తిత్వవాద ఉద్యమ ప్రభావంతో తెలుగు నేల మీద కూడా సబాల్ట్రన్ యుగం ప్రారంభమైంది. అప్పటిదాక అగ్రకులాలు ఏ దారిలో పోతే ఆ దారినే గుడ్డిగా పోవడం, వారి ప్రసన్నం చేసుకోవడం కోసం సాహిత్యాన్ని రాయడం తప్పితే వేరే దారిలో పోదామనే సోయిని బహుజన కులాలకు కలగనివ్వలేదు.
తొలి దశలో జ్యోతిభా ఫూలే, అంబేడ్కర్ స్వాతంత్య్ర పోరాటంలో ప్రధాన స్రవంతికి భిన్నంగా అణగారిన వర్గాల వాణిని వినిపించడం సాహిత్యంలో మరో కోణం ప్రచారానికి వచ్చింది. అట్టడుగు వర్గాలపై వివక్ష, అణచివేత, అంటరానితనం పోవడమే స్వాతంత్య్రంకు ముందు జరగాల్సిన అసలైన విముక్తి అని వారు ప్రకటించారు. ఆ అస్తిత్వ మూలాల వెలుగుల్లో సాహిత్యం కొత్త పుంతలు తొక్కింది. ఆ పరంపరలో భాగంగానే జూలూరి గౌరీ శంకర్ సంపాదకత్వంలో 2001లో ‘స్పృహ సాహితీ సంస్థ’ ద్వారా ‘వెంటాడే కలాలు- వెనకబడిన కులాలు’ అనే టైటిల్‌తో ఇరవై ఆరు మంది కవులు రాసిన మొట్ట మొదటి బి.సి కులాల కవిత్వ సంకలనం వెలువడింది. ఆ తర్వాత ప్రారంభమైన బి.సి వాద సాహిత్యపు ధార ‘ఎలగటి వ్యవసాయం’ వలెనే సాగుతుంది. ఆ అస్థిత్వ రచనల ప్రవహ ఉదృతి పెరగాల్సిన అవసరం ఉంది. దాన్ని పెంచే కృషిని ‘తెలంగాణ బి.సి వాద సాహిత్యం’ పుస్తకం ద్వారా ప్రేరేపిస్తున్నాడు దత్తయ్య. అన్ని రంగాలలో దామాషా ప్రకారం వాటా లబ్ధి పొందాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో కొంతమంది వెనకబడిన కులాల మీద జరుగుతున్న వివక్షలు తిప్పి కొట్టాల్సిన సమయం. సమానమైన మనుగడకోసం, మానవత్వం కోసం, సమ సమాజం కోసం వాదం ప్రశ్నిస్తుంది, పనిచేస్తుంది’ (పుట.32) అంటాడు అట్టెం దత్తయ్య. సమానత్వ లోకమే బిసివాద దృక్పథమని స్పష్టపరచడమనేది మొత్తం బిసి వాదానికే ఒక దిక్సూచి లాంటిది. ఇది ఆయన భావ విస్తృతికి, వాద అవగాహనకు ఒక తార్కాణంగా చెప్పవచ్చు. అందుకే ఉత్పత్తి కులాల సాహిత్యాన్ని దేశ యవనిక మీద నిలబెట్టాలంటే బలమైన బి.సి వాద సాహిత్యం – విమర్శ రావాలంటాడు కవి, రచయిత, విమర్శకుడు డా.అట్టెం దత్తయ్య. చెప్పడమే కాదు అలాంటి పనిని తనే తలకెత్తుకొని ‘తెలంగాణ బి.సి వాద సాహిత్యం’ అనే విమర్శనా గ్రంథ రచనతో సబ్బండ కులాల గొంతును ఎలుగెత్తి చాటుతున్నాడు.
డా. అట్టెం దత్తయ్య రాసిన ఈ ‘తెలంగాణ బి.సి వాద సాహిత్యం’ అనే పుస్తకం ‘బహుజనుల వీలునామా’ అంటాడు డా.ఎస్.రఘు. నిజమే కాలం ఆరు ఋతువులుగా నడిచినట్లు ఈ పుస్తకంలో దత్తయ్య చేసిన విమర్శ కూడా పద్య కవిత్వం, పాట కవిత్వం, వచన కవిత్వం, కథ, నవల, విమర్శ అనే ఆరు ప్రక్రియలుగా సాగి దారిదీపం అవుతుంది. ఈ గ్రంథం చారిత్రక దృక్పథంతో అనేక ఉదాహరణలతో పరామర్శించి మన ముందు పెట్టాడు. విడిగా ఈ ప్రక్రియలపై విస్తారమైన విమర్శ జరిగి ఉండొచ్చు. కానీ బి.సి వాదంలో ఈ సాహిత్య ప్రక్రియలన్నిటిపై ఇప్పటిదాకా ఇటువంటి పుస్తకం రాలేదని చెప్పవచ్చు.
నివురుగప్పిన నిప్పుని ఊది మంటను రాజేసినట్టు పదకొండవ శతాబ్దం పాల్కురికి సోమనాథుడి లెగసీని తట్టి లేపుతున్నాడు. ఆయన రాసిన ‘పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం, వృషాధిప శతకం’ లో ఉన్న బి.సి కులాల ప్రస్తావనల్ని, సబ్బండ వర్ణాల జాడను మన ముందు తవ్వి పోస్తున్నాడు అట్టెం దత్తయ్య. పద్యం సదా పండితుల పక్కలోనే కులికింది తప్పితే పామరులను పట్టించుకున్న పాపాన పోలేదు. ”ప్రాచీన కాలం నుండి పద్యం పండితుల చేతుల్లో పరిఢవిల్లుతుంది. ఛంద్ణ సౌందర్యం, ప్రాస విన్యాసం మేళవించుకున్న ఈ పద్యం సామాన్యుడి బాధలను, వారిపై జరుగుతున్న అన్యాయాలను, వివక్షతను, దోపిడిలను పట్టించుకోలేదు. శృంగారానికి, అంగరానికి, వర్ణన విన్యాసాలకు, సుత్తికే సరిపోయింది.”(పుట. 70) అంటూ పద్యం, పండితుల పక్షపాత వైఖరిని ఎండగట్టాడు దత్తయ్య. పాల్కురికి సోమనాథుని వృషాధిపశతకంలో ‘గొల్ల స్త్రీలు పట్టణ వీధుల్లో చల్లను అమ్మేవారు’ (వృ.శ.68) అని రాయడం, అలాగే బసవ పురాణంలో ‘వీథిలో చల్లనమ్ముచు ఒక గొల్లకాంత జారి పడబోయి ‘బసవరో ‘ అని కేక పెట్టగా ఆమెను పడిపోకుండా బసవన కాపాడినాడు’ బ.పు. 2- 108) ఇలా గొల్ల, కురుమల ప్రస్తావన ఉన్న పురాణ సాహిత్యాన్ని వెలికి తీసే ఆధార పూర్వక ప్రస్తావన అట్టెం దత్తయ్య పరిశోధనా శ్రమకు నిదర్శనం. అదే విధంగా 1934లో 354 మంది తెలంగాణ కవుల కవిత్వంతో వచ్చిన గోలకొండ కవుల సంచికలో పది మందికి పైగా బి.సి లు ఆనాడే కవిత్వం రాసిన విషయాన్ని లేవనెత్తాడు.
రెండవ భాగం వచన కవితా విమర్శ. వాదం ప్రారంభంలో బి.సి కులాల సాహిత్యం వచన కవిత్వంలోనే పొంగిపొర్లిందని చెప్పాలి. వృతులపై వచ్చిన కవిత్వం కట్టలు తెంచుకొని ప్రవహించింది. బి.సి కవులు విద్యుత్ వేగంతో, విద్వత్ రాగంతో కవిత్వాన్ని అలుగుదునికించారు. అందుకు సాక్ష్యంగా తొంబై రెండు మంది కవులు పదిహేడు కులాలను ప్రస్తావిస్తూ రాసిన నూటపదమూడు కవితలను ”తెలంగాణ వచన కవిత్వం – బిసి వాదం” అనే భాగంలో చూడవచ్చు. వచన కవిత్వంలో 1996లో సునారె సంపాదకత్వంలో వెలువడిన ‘బహువచనం’ సంకలనం నుండి 2020లో వచ్చిన ‘బిసి కవితా సంకలనం’ వరకు పదమూడు కవిత్వ సంకలనాలు, అలాగే కొన్ని వ్యక్తిగత సంపుటిలు వచ్చినట్లు తెలుపుతాడు రచయిత. వాటిలోని కవితలను అట్టెం దత్తయ్య పరిచయం చేసిన తీరు పాఠకులను అబ్బురపరుస్తది. అయితే ‘వెంటాడే కలాలు – వెనకబడిన కులాల’ సంకలనం వృత్తి, ఈతిబాధలు ప్రకటించే దశను దాటి బిసి వాద నినాదాన్ని ప్రకటించింది. అదే బిసి వాద సాహిత్యంలో ఓ పెద్ద మూలమలుపు. ఇలాంటి స్థితిలో అట్టెం దత్తయ్య తెచ్చిన ఈ గ్రంథం బిసి వాద సాహిత్యాన్ని మరో మెట్టుకు తీసుకుపోయిందని చెప్పవచ్చు. ఇందులో వడ్డెర, కుమ్మరి, ఆరెకటికలు, గాండ్ల, జంగాల కులాల పై వచ్చిన వచన కవిత్వాన్ని వెలికితీసి చర్చిస్తాడు రచయిత. ‘వాడు మరణాన్ని గానం చేస్తాడు’ అనే తైదల అంజయ్య రాసిన ‘కాటి పాపలోడు’ కవితను దత్తయ్య విమర్శకు పెట్టిన తీరు మనసును మెలిపెడుతది. వీరి బతుకుల్లో కన్నీళ్లకు కారణమెవ్వరని ప్రశ్నను లేవనెత్తుతాడు. ఇట్లా అనేక వృత్తుల బహుజనుల కవితలను దత్తయ్య విస్తృతంగా విశ్లేషించాడు. జనం వంటిపై ధగ ధగ మెరిసే నగలను అందించే కంసాలి వంటికి ఇంత కూడు కరువయిన దుస్థితిని, వడ్రంగి, మంగలి, కమ్మరి, కుమ్మరి, పద్మశాలి లాంటి చేతి వృత్తులపై ఆధారపడ్డ కులాలు ప్రపంచీకరణ కూడలిలో కూదేలై కూలబడ్డ జీవితాలపై వచ్చిన కవిత్వాన్ని ఈ పుస్తకంలో పరిశీలించిన తీరు దత్తయ్య సూక్ష్మ దృష్టిని, సునిశిత విమర్శకు నిదర్శనం.
మూడవ భాగంలో ”తెలంగాణ పాట – బిసి వాదం” అనే ప్రక్రియలో బి.సి ల పాటలను పరిచయం చేస్తూ విశ్లేషించాడు. ఆదినుండి పాట ఏ ఆధిపత్యం లేని సొంత గొంతుకల మట్టి పరిమళంతో ఉబికి ప్రవాహం చెందుతుంది. బహుజన కులాల వారు శ్రామికులవడంతో పాట వారి చెమటబట్టును ముద్దాడి సరికొత్త గానాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. సరిగమపదనిసలు అగ్రకులాల ఒళ్ళో సేద తీరితే, జనపద సాహిత్యం బహుజనుల గొంతులో రాగాలు తీసింది. నిజానికి జనపదాలకు, అగ్రహార పరివారాలకు సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్ధికంగా స్పష్టమైన వైరుధ్యం ఉంది. మూలవాసులైన దళిత, బహుజనులే వేల సంవత్సరాలుగా పాటను రక్షిస్తూ వస్తున్నారు. బి.సిలు పాటను తమ ఉత్పత్తి ప్రక్రియలో భాగం చేయడం వలన, వృత్తులతో కలపడం ద్వారా పాట మరింత పదునెక్కింది. ”జానపద పాట మౌఖికంగా బి.సి ఆశ్రిత కులాల వారు పాడుతూ, కథ రూపంలో చెబుతున్నారు. కానీ లిఖిత రూపంలో రావాలని, అప్పుడే బి.సి ల గత చరిత్ర, వైభవం తెలుస్తుందనీ” చెబుతూ పాటలను రికార్డు చేయాల్సిన అవసరాన్ని విమర్శకుడిగా ఈ తరానికి నొక్కి చెబుతున్నాడు దత్తయ్య. ”బి.సి ప్రధాన కులాల వారికి ఆశ్రిత గాయక కులాలు ఉండటం, వీరు ఆయా కులాలకు చెందిన వీరుల, సాహసికుల, నాయకుల, దాతల గొప్పతనాన్ని గానం చేస్తారు.” అని దత్తయ్య చెబుతూ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను అర్ధం చేయిస్తాడు.
నాల్గవ భాగంగా కథా ప్రక్రియను పరిశీలించాడు. భారతదేశంలో బహుజనుల జీవితాల్లో పురాణేతిహాసాలకు మించి లోతైన యదార్థ గాథలుంటాయి. ఎవరి జీవితాల్ని కదిలించినా కథలు కెరటాలై పోటెత్తుతాయి. అవేవీ కాలక్షేపానికో, వ్యాపకం కోసమో చెప్పుకునే వట్టి కథలు కాదు. బహుజన బతుకుల ఎతలు, కథలన్నీటి నుండి పచ్చి కన్నీటి వాసన మనల్ని చుట్టుముడుతుంది. కనుక ఏ బి.సి ఇంటి కడపను తడిమి చూసినా కథలు కట్టలు తెగి ఉబికివస్తాయి. ముఖ్యంగా బి.సి ఆశ్రిత కుల జీవనమంతా కథా, కథన సమాహారమే. ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో కన్ను తెరిచిన్నుండి కన్ను మూసే వరకు ప్రతి కదలికా ఒక కథే. అదిమపట్టి ఉంచిన చేతివృత్తి, సేవా కులాల అంతరంగాలను పరిశీలిస్తే కథలు ఉసిల్ల పుట్టలా కదిలస్తాయి. అయితే వాటిని అక్షరీకరించేదెవరు? ఒకవేళ అక్షరీకరించే కృషి చేస్తే, ఆ ప్రయత్నం కూడా ఇంకో కథే అవుతుంది. ‘కథా సాహిత్యంలో బి.సి కులాల స్థితిగతులను ఎరుకజేసిన కథలు అస్తిత్వ ఉద్యమాల కంటే ముందునుండే దర్శనమిస్తాయి” అంటూ కథా సాహిత్యంలో బి.సిల ఆనవాళ్లు వెలికితీస్తున్నాడు దత్తయ్య. తెలంగాణలో కథకు చారిత్రక నేపథ్యం ఉందని, ఉద్యమాలకు ఊపిరి అయ్యిందని, వర్తమానంలో బహుజన కులాల్లో మార్పులను కథ చూపెట్టిందనే కోణాన్ని విప్పిచెబుతూనే, ప్రపంచీకరణ కుల వృత్తులపై చేస్తున్న ధ్వంసరచనను వివరించాడు.
మానవ జీవనాన్ని, సామాజిక సంబంధాల్ని ఆసాంతం వ్యక్తం చేయగలిగిన సాహిత్య ప్రక్రియ నవల ప్రక్రియను అయిదవ అధ్యాయంగా స్వీకరించాడు. ‘తెలంగాణ నవల – బిసి వాదం’ అనే అధ్యాయంలో తెలంగాణలోని పదిహేను బి.సి కులాల వృత్తి జీవితాల ఆధారంగా నవలలు వచ్చాయని నిర్ధారించాడు అట్టెం దత్తయ్య. వారి వేదనాభరితమైన స్థితిని ఇరవై రెండు మంది రచయితలు ముప్పై నవలల్లో చిత్రీకరించారని గుర్తించాడు. అయితే సమాజంలో అధిక సంఖ్యాక జనాభాగా ఉన్న వెనకబడిన కులాలపై నవల సాహిత్యం రావాల్సినంత రాలేదనీ దత్తయ్య నిరాశ చెందుతున్నాడు. తెలుగు రచయితలకు సాహిత్యం అంటే కవిత్వం మాత్రమేననే తప్పుడు అభిప్రాయం ఉందని కుండబద్దలు కొట్టినట్టు విమర్శిస్తున్నాడు. అగ్రకుల పద్య పండితులు కింది కులాలు సాహిత్యంలోకి రాకుండా చేసే కుట్రలో భాగమే కవిత్వానికి అధిక ప్రాధాన్యతనివ్వడంలో ఉన్న అంతరార్థమని దత్తయ్య విమర్శ ద్వారా వెల్లడవుతుంది. నేటి బహుజన యువకవులు కూడా కవిత్వ ప్రక్రియకే అధిక మొగ్గు చూపడం లాంటి భావబానిసత్వం నుండి బయటపడాలని సూచిస్తున్నాడు.
ఇక ఆరో భాగంలో విమర్శ మీద దృష్టిసారించాడు. సాహిత్య ప్రక్రియల్లో ఆధునికమైన విమర్శ ప్రక్రియ వల్ల సాహిత్యం సుసంపన్నం అవుతుంది. అట్టెం దత్తయ్య ”తెలంగాణ బిసివాద సాహిత్యం” అనే విమర్శనా గ్రంథం ద్వారా బి.సి వాద సాహిత్య చరిత్రను, విమర్శను, సాంస్కృతిక వైభవాన్ని, సామాజిక చలనాన్ని బి.సిల జీవన విస్తృతిని తాత్వికత స్థాయిలో నిలబెట్టాడు. అగ్రకులాల సాహిత్యంపై వచ్చిన విమర్శలు బి.సి వాద సాహిత్యంపై రాలేదు. అగ్రకులాలు కావాలనే బి.సి వాద సాహిత్యాన్ని విస్మరించారనే నిజాల్ని అట్టెం దత్తయ్య నిరూపిస్తున్నాడు. అధిక సంఖ్యాక జనమైన వెనకబడిన కులాలను విస్మరించడం అంటే సంద్రాన్ని వదిలి బురద గుంటలో చేపలు పట్టినట్లే ఉంటుందంటాడు. ఆ అగ్రకుల కుట్రలో బహుజనులు కొట్టుకుపోకుండా సొంత సాహిత్య సేద్యం చేస్తూ వివిధ ప్రక్రియల్లో బి.సి వాదాన్ని బలంగా వినిపించాలాని పిలుపునిస్తున్నాడు. బి.సి సాహిత్య విమర్శ పుస్తకాలుగా నాలుగు వచ్చాయి. కథా సాహిత్యం మీద ‘బి.సి.కథలు ఒక విశ్లేషణ 2000- 2010’ అనే బి ఎస్ రాములు గారి విమర్శ గ్రంథం 2011లో, కవిత్వ ప్రక్రియ మీద కవిత్వంలో ‘బిసి సూర్యోదయం’ 2015లో జూలూరి గౌరీ శంకర్, ఆయన సంపాదకత్వంలోనే మరో వ్యాస సంకలనం ‘ఒక కవిత ఇరవై కోణాలు’, అలాగే బిసి వాద యువ కవిత్వంపై ‘ప్రవాహాం’ చింతం ప్రవీణ్ సంపాదకత్వంలో 2017లో విమర్శనా గ్రంథాలు వచ్చాయి. అలాగే ఒక్కో ప్రక్రియను సమీక్షిస్తూ వ్యాసాలు కొంత మంది కవులు రాసారు. అలా విమర్శలో కొంత కృషి జరిగింది.
ఎ. విజయ్ కుమార్, 9573715656
సాహిత్యవిమర్శలో బిసి వాదం: అట్టెం దత్తయ్య దృక్పథం
వ్యాససంగ్రహం:
తెలుగు సాహిత్యంలో బీసీల పాత్ర గణనీయమైంది. తెలుగు సాహిత్యవిమర్శలో బీసీల ప్రాతినిథ్యం చాలా తక్కువ. అందువల్లనే బీసీ సాహిత్యంపై జరిగిన విమర్శ కుడా పరిమితంగానే ఉన్నది. ఇటువంటి పరిస్థితులలో విమర్శకుడు అట్టెం దత్తయ్య తన అధ్యయంలో భాగంగా సాహిత్యంలో బీసీవాద చిత్రణకు సంబంధించిన సమచారాన్ని విశ్లేషిస్తూ తెలంగాణ బీసీవాద సాహిత్యం అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకంలో ఉన్న సాహిత్య విమర్శనాత్మక దృష్టిని పరిశీలించడం ఈ వ్యాస ముఖ్యోద్దేశం. తెలుగు సాహిత్యంలో బీసీవాదానికి సంబంధించిన చర్చ చాలా పరిమితంగా ఉన్నది. బీసీ వాదానికి సంబంధించినంత వరకు జూలూరు గౌరీ శంకర్, ప్రసేన్ “వెంటాడే కలాలు వెనుకబడిన కులాలు” అనే కవిత్వ సంపుటికి రాసిన ముందుమాటలో కొంత బిసి వాదానికి సంబంధించిన చర్చ చేసారు. తర్వాత బి.ఎస్. రాములు “బిసి కథలు – ఒక విశ్లేషణ” (2011), చింతం ప్రవీణ్ కుమార్ “బిసి చౌక్” (2022), వంటి పుస్తకాలు వచ్చాయి. అక్కడక్కడ కవిత్వం, కథల రూపంలో బిసివాదం చర్చకు వచ్చింది. కానీ, ఉద్యమ స్థాయిలో చర్చ జరగలేదు. కారణం ఈ సామాజిక వర్గాలలో చైతన్యం లేకపపోవడం. ఈ పరిశోధన పత్రాన్ని రాయడానికి అట్టెం దత్తయ్య రాసిన “తెలగాణ బీసీవాద సాహిత్యం” అనే గ్రంథం ప్రధానఆకరం. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి సంపాదకత్వంలో “బహువచనం”, జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వచ్చిన “వెంటాడే కలాలు- వెనుకబడిన కులాలు”, చింతం ప్రవీణ్ కుమార్ ప్రచురించిన “బీసీ చౌక్” అనే గ్రంథం ద్వితీయ ఆకరాలు. వీటి ఆధారంగా బీసీవాద నేపథ్యం గురించి విశ్లేషణాత్మక పద్ధతిలో అధ్యయనం చేసాను. సాహిత్యవిమర్శలో బీసీవాద సాహిత్య విమర్శ ప్రాతినిథ్యం, దాని విస్తరణకు ఈ అధ్యయనం తోడ్పాటునందిస్తుంది.
Keywords: బిసి వాదం, విమర్శ, అట్టెం దత్తయ్య, తాత్వికత, ఆర్థిక, రాజకీయ, కుల నిర్మూలన, బహుజన దృక్పథం
1. ఉపోద్ఘాతం
"Existence precedes essence." - Jean Paul Sartre. సారం కంటే ముందే అస్తిత్వం ఉంటుందంటాడు ఫ్రెంచ్ తత్వవేత్త జీన్ పాల్ సార్త్రే (Sartre). పుట్టిన ప్రతీసారి అస్తిత్వం ముందుగా మనిషిగానే గుర్తించబడుతుంది. ఆ తర్వాతే వారి లక్ష్యాలను ఎంచుకొని, తమ మార్గాన్ని వృత్తిని నిర్ణయించుకుంటారు. కానీ ఈ ప్రపంచంలో ఒక్క భారతదేశంలో మాత్రమే పుట్టక ముందే, పుట్టబోయే వారు చేయాల్సిన వృత్తి నిర్దేశించబడుతుంది. అది మన దేశ ప్రజలపై రుద్దబడిన కుల కట్టుబాటు బానిసత్వం. మనిషి అనే ఉదాత్తమైన గుర్తింపు కంటే ఫలానా కులం వాడని వేసిన ముద్ర ఆ మనిషి చచ్చాక కూడా వెంటాడుతుంది. ఆ కుల కోరల వలనే ఉన్నత జ్ఞానం, సారవంతమైన గుణం కలిగిన డా. బి. ఆర్. అంబేడ్కర్‌ని లోకమంతా ప్రపంచ మేధావి అని కీర్తిస్తున్నా, మన దేశ అగ్ర కులతత్వం అతని మేధోశక్తిని గుర్తించ నిరాకరిస్తూనే ఉంది. అలాగే శూద్రులుగా చెప్పబడుతున్న బిసి కులాల ప్రతిభ, సామర్థ్యాలు అగ్రహార పీఠాల ఆధిపత్యం వలన చిన్నచూపుకు గురైతూనే ఉన్నది. బిసిలు అధిక సంఖ్యాకులుగా ఉండి సైతం తమ అస్తిత్వం కోసం వందల ఏళ్ల నుండి పెనుగులాడుతూనే ఉన్నారు. అగ్రకులాల కబంధ హస్తాల్లో చిక్కుకోవడం వలన తెలుగు సాహిత్యం అగ్రకుల సాహిత్య చరిత్రగా, వారి పాండిత్య సంపదగా వ్యక్తమవుతూ వచ్చింది. అక్షరాస్యతలో, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనకబడిన కులాల అస్తిత్వమే ఆ సాహిత్యంలో ప్రస్తావన లేకుండా పోయింది. స్వాతంత్య్రం వచ్చిన నలభై సంవత్సరాలు గడిచాకే తమ సొంత వాణిని వినిపించుకునే ప్రయత్నాలు ప్రారంభించే స్థితికి శూద్ర కులాలు నెట్టబడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో డానిష్ తత్త్వవేత్త సోరెన్ కీర్క్ గార్డ్ (Kierkegaard), ఫ్రెంచ్ తత్త్వవేత్త జీన్ పాల్ సార్త్రే అస్తిత్వవాద ఉద్యమ ప్రభావంతో తెలుగు నేల మీద కూడా సబాల్ట్రన్ యుగం ప్రారంభమైంది. అప్పటిదాకా అగ్రకులాలు ఏ దారిలో పోతే ఆ దారినే గుడ్డిగా పోవడం; వారిని ప్రసన్నం చేసుకోవడం కోసం సాహిత్యాన్ని రాయడం తప్ప వేరే దారిలో పోదామనే సోయి బహుజన కులాలలో కలుగలేదు.
2.1. బిసివాద సాహిత్యం – తాత్విక విశ్లేషణ
తొలి దశలో జ్యోతిబాపూలే, అంబేడ్కర్ స్వాతంత్ర్య పోరాటంలో ప్రధాన స్రవంతికి భిన్నంగా అణగారిన వర్గాల వాణిని వినిపించడం సాహిత్యంలో మరో కోణం ప్రచారానికి వచ్చింది. అట్టడుగు వర్గాలపై వివక్ష, అణచివేత, అంటరానితనం తొలగడమే స్వాతంత్య్రంకు ముందు జరగాల్సిన అసలైన విముక్తి అని వారు ప్రకటించారు. ఆ అస్తిత్వ మూలాల వెలుగుల్లో సాహిత్యం కొత్త పుంతలు తొక్కింది. ఆ పరంపరలో భాగంగానే జూలూరి గౌరీ శంకర్ సంపాదకత్వంలో 2001లో 'స్పృహ సాహితీ సంస్థ' ద్వారా 'వెంటాడే కలాలు- వెనకబడిన కులాలు' అనే పేరుతో ఇరవై ఆరు మంది కవులు రాసిన మొట్ట మొదటి బి.సి. కుల కవిత్వ సంకలనం వెలువడింది (గౌరీ శంకర్, వెంటాడే కలాలు). ఆ తర్వాత ప్రారంభమైన బి.సి. వాద సాహిత్యపు ధార 'ఎలగటి వ్యవసాయం' వలనే సాగుతుంది. ఆ అస్తిత్వ రచనల ప్రవాహ ఉధృతి పెరగాల్సిన అవసరం ఉంది. దాన్ని పెంచే కృషిని "తెలంగాణ బి.సి. వాద సాహిత్యం" పుస్తకం ద్వారా ప్రేరేపిస్తున్నాడు దత్తయ్య.
అన్ని రంగాలలో దామాషా ప్రకారం వాటా లబ్ధి పొందాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో కొంతమంది వెనకబడిన కులాల మీద జరుగుతున్న వివక్షలు తిప్పి కొట్టాల్సిన సమయం. సమానమైన మనుగడ కోసం, మానవత్వం కోసం, సమ సమాజం కోసం వాదం ప్రశ్నిస్తుంది, పనిచేస్తుంది (దత్తయ్య 32).
సమానత్వ లోకమే బిసి వాద దృక్పథమని స్పష్టపరచడమనేది మొత్తం బిసి వాదానికే ఒక దిక్సూచి వంటిది. ఇది ఆయన భావ విస్తృతికి, వాద అవగాహనకు తార్కాణంగా చెప్పవచ్చు. అందుకే ఉత్పత్తి కులాల సాహిత్యాన్ని దేశ యవనిక మీద నిలబెట్టాలంటే బలమైన బి.సి. వాద సాహిత్యం - విమర్శ రావాలంటాడు కవి, రచయిత, విమర్శకుడు డా. అట్టెం దత్తయ్య. చెప్పడమే కాదు అలాంటి పనిని తనే తలకెత్తుకొని "తెలంగాణ బి.సి. వాద సాహిత్యం" అనే విమర్శనా గ్రంథ రచనతో సబ్బండ కులాల గొంతును ఎలుగెత్తి చాటుతున్నాడు.
డా. అట్టెం దత్తయ్య రాసిన ఈ "తెలంగాణ బి.సి. వాద సాహిత్యం" అనే పుస్తకం 'బహుజనుల వీలునామా' అంటాడు డా. ఎస్. రఘు. నిజమే కాలం ఆరు ఋతువులుగా నడిచినట్లు ఈ పుస్తకంలో దత్తయ్య చేసిన విమర్శ కూడా పద్య కవిత్వం, పాట కవిత్వం, వచన కవిత్వం, కథ, నవల, విమర్శ అనే ఆరు ప్రక్రియలలో సాగి దారిదీపం అవుతుంది. ఈ గ్రంథం చారిత్రక దృక్పథంతో అనేక ఉదాహరణలతో పరామర్శించి మన ముందు పెట్టాడు. విడిగా ఈ ప్రక్రియలపై విస్తారమైన విమర్శ జరిగి ఉండొచ్చు. కానీ బి.సి. వాదంలో ఈ సాహిత్య ప్రక్రియలన్నిటిపై ఇప్పటిదాకా ఇటువంటి పుస్తకం రాలేదని చెప్పవచ్చు. తెలుగు బి.సి. వాద సాహిత్యాన్ని ఆరు ప్రక్రియలుగా పరిశీలించి, పరిశోధించి, విమర్శనా స్థాపన చేసిన విమర్శకుడు నాకు తెలిసి ఒక్క అట్టెం దత్తయ్య తప్ప మరెవ్వరూ లేరు. అటువంటి కృషిని 2021నాటికే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా, పరిశోధకుడిగా తెలంగాణ బి.సి. వాద సాహిత్య విమర్శ పుస్తకం తీసుకొని రావడం గొప్ప కార్యంగా అభివర్ణించవచ్చు. పనిలో పనిగా, అనేక చర్చలు, వాదనల మధ్యన ఉన్న బహుజన పదానికి బదులుగా బి.సి. సాహిత్యం అనే నామ స్థాపన కూడా చేశాడు. ఇది సాహిత్య చరిత్రపై, భవిష్యత్ పై దత్తయ్యకు ఉన్న స్పష్టతను విశదపరుస్తుంది.
3. బిసివాద సాహిత్యం - ప్రక్రియావిశ్లేషణలు
3.1. పద్యకవిత్వం
ఈ 'తెలంగాణ బిసి వాద సాహిత్యం'లోని మొదటి భాగంలో తెలంగాణ పద్య కవిత్వంలోని బి.సి. వాదాన్ని వెతుకులాడాడు. నివురుగప్పిన నిప్పుని ఊది మంటను రాజేసినట్టు పదకొండవ శతాబ్దం పాల్కురికి సోమనాథుని లెగసీని తట్టి లేపుతున్నాడు. ఆయన రాసిన 'పండితారాధ్య చరిత్ర', 'బసవ పురాణం', 'వృషాధిప శతకం'లలో ఉన్న బి.సి. కులాల ప్రస్తావనల్ని, సబ్బండ వర్ణాల జాడను మన ముందు తవ్వి పోస్తున్నాడు అట్టెం దత్తయ్య. పద్యం సదా పండితుల పక్కలోనే కులికింది తప్ప పామరులను పట్టించుకున్న పాపాన పోలేదు.
ప్రాచీన కాలం నుండి పద్యం పండితుల చేతుల్లో పరిఢవిల్లుతుంది. ఛందః సౌందర్యం ప్రాస విన్యాసాల మేళవింపు ఉన్న ఈ పద్యం సామాన్యుడి బాధలను, వారిపై జరుగుతున్న అన్యాయాలను, వివక్షతను, దోపిడీలను పట్టించుకోలేదు. శృంగారానికి, అంగరానికి, వర్ణన విన్యాసాలకు, సుత్తికే సరిపోయింది (దత్తయ్య 70).
అంటూ పద్యం, పండితుల పక్షపాత వైఖరిని ఎండగట్టాడు దత్తయ్య. పాల్కురికి సోమనాథుని వృషాధిప శతకంలో "గొల్ల స్త్రీలు పట్టణ వీధుల్లో చల్లను అమ్మేవారు" (పాల్కురికి, వృషాధిప శతకం 68) అని రాయడం; అలాగే బసవ పురాణంలో "వీథిలో చల్లనమ్ముచు ఒక గొల్లకాంత జారి పడబోయి 'బసవరో ' అని కేక పెట్టగా ఆమెను పడిపోకుండా బసవన కాపాడినాడు" (పాల్కురికి, బసవ పురాణం 2.108) ఇలా గొల్ల కురుమల ప్రస్తావన ఉన్న పురాణ సాహిత్యాన్ని వెలికి తీసే ఆధార పూర్వక ప్రస్తావన అట్టెం దత్తయ్య పరిశోధనా శ్రమకు నిదర్శనం. అదే విధంగా 1934లో 354 మంది తెలంగాణ కవుల కవిత్వంతో వచ్చిన గోలకొండ కవుల సంచికలో పది మందికి పైగా బి.సి.లు ఆనాడే కవిత్వం రాసిన విషయాన్ని లేవనెత్తాడు. 2020 సంవత్సరంలో దోరవేటి రాసిన 'శ్రమదేవో భవ' పుస్తకంలోని 25 వ పుట పద్య పంక్తులను సాక్ష్యంగా చూపుతూ గొల్ల కురుమలు పాల శాస్త్రవేత్తలు అని, ప్రజలకు పాలు, మజ్జిగ, వెన్న వంటి బలమైన ఆహారాన్ని అందిస్తున్నారని, అలాంటి వారిని మాత్రం వెర్రివారిగా చూడటం ఆలోచింపదగిన అంశం అని బాధను వ్యక్తం చేస్తాడు అట్టెం దత్తయ్య (దోరవేటి 25). శ్రమను తక్కువ చేసే కుల సమాజ కునీతిని మన కళ్ల ముందు పెట్టాడు అట్టెం దత్తయ్య. టి. అనిత చెప్పిన "అప్పటి కాలంలో గొర్ల కాపరి వృత్తి బాగానే ఉండేదనే" దానికి భిన్నంగా ఆ వృత్తినే మళ్లీ ఎంచుకునే ఉచ్చులో పడకుండా వృత్తిని దాటి బయటికి పయనించి ఆధునిక సమాజంలోకి దూసుకుపోవాలని నేటి తరానికి సూచన చేస్తున్నాడు అట్టెం దత్తయ్య. అవుసుల భానుప్రకాశ్, రాధ శ్రీ వంటి వారితో పాటు పదిహేను మంది బి.సి. కవులు డెబ్బై పద్యాలలో రాసిన ఉప్పరులు, మున్నూరు కాపులు, దర్జీలు, విశ్వబ్రాహ్మణులు, పద్మ శాలీలు, కుమ్మరులు, గౌండ్లు, పిచ్చుకగుంట్ల వారు, మంగలి, మేదరులు, గంగిరెద్దులు, చాకలి, బెస్తలు ఇలాంటి వృత్తి, సేవా కులాల జీవన గమనంలో వేదనా భరితమైన సంక్షోభాన్ని తెలుపుతూ రచయిత వేదన చెందుతాడు. అక్షరం ముక్క రాని పిచ్చుకగుంట్లవారు ఆరు ఉప జాతులుగా ఉంటూ కామమ్మ, బాల నాగమ్మ, లక్ష్మమ్మ, సరోజమ్మ, సూర్య చంద్ర రాజుల చరిత్ర, కథా గేయాలను చదువు వచ్చిన వారి కంటే అలవోకగా పాడి తిండి కోసం అడుక్కొని జీవిస్తారు. కానీ వారిని ఇటు సమాజంలో గానీ అటు సాహిత్యంలో గానీ ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్న మన ముందు ఉంచుతాడు రచయిత.
3.2. వచన కవిత్వం
రెండవ భాగం వచన కవితా విమర్శ. వాదం ప్రారంభంలో బి.సి. కులాల సాహిత్యం వచన కవిత్వంలోనే పొంగిపొర్లిందని చెప్పాలి. వృత్తులపై వచ్చిన కవిత్వం కట్టలు తెంచుకొని ప్రవహించింది. బి.సి. కవులు విద్యుత్ వేగంతో విద్వత్ రాగంతో కవిత్వాన్ని అలుగ దునికించారు. అందుకు సాక్ష్యంగా తొంభై రెండు మంది కవులు పదిహేడు కులాలను ప్రస్తావిస్తూ రాసిన నూట పదమూడు కవితలను "తెలంగాణ వచన కవిత్వం - బిసి వాదం" అనే భాగంలో చూడవచ్చు. వచన కవిత్వంలో 1996లో సుంకిరెడ్డి నారాయణ రెడ్డి సంపాదకత్వంలో వెలువడిన 'బహువచనం' సంకలనం నుండి 2020లో వచ్చిన 'బిసి కవితా సంకలనం' వరకు పదమూడు కవిత్వ సంకలనాలు, అలాగే కొన్ని వ్యక్తిగత సంపుటిలు వచ్చినట్లు తెలుపుతాడు రచయిత. వాటిలోని కవితలను అట్టెం దత్తయ్య పరిచయం చేసిన తీరు పాఠకులను అబ్బురపరుస్తది. అయితే "వెంటాడే కలాలు - వెనకబడిన కులాలు" సంకలనం వృత్తి, ఈతిబాధలు ప్రకటించే దశను దాటి బిసి వాద నినాదాన్ని ప్రకటించింది. అదే బిసి వాద సాహిత్యంలో ఓ పెద్ద మూలమలుపు. ఇలాంటి స్థితిలో అట్టెం దత్తయ్య తెచ్చిన ఈ గ్రంథం బిసి వాద సాహిత్యాన్ని మరో మెట్టుకు తీసుకుపోయిందని చెప్పవచ్చు. ఇందులో వడ్డెర, కుమ్మరి, ఆరెకటికలు, గాండ్ల, జంగాల కులాలపై వచ్చిన వచన కవిత్వాన్ని వెలికితీసి చర్చిస్తాడు రచయిత. "వాడు మరణాన్ని గానం చేస్తాడు" అనే తైదల అంజయ్య రాసిన 'కాటి పాపలోడు' కవితను దత్తయ్య విమర్శకు పెట్టిన తీరు మనసును మెలిపెడుతుంది. వీరి బతుకుల్లో కన్నీళ్లకు కారణమెవ్వరని ప్రశ్నను లేవనెత్తుతాడు. ఇట్లా అనేక వృత్తుల బహుజనుల కవితలను దత్తయ్య విస్తృతంగా విశ్లేషించాడు. జనం వంటిపై ధగ ధగ మెరిసే నగలను అందించే కంసాలి వంటికి ఇంత కూడు కరువయిన దుస్థితిని, వడ్రంగి, మంగలి, కమ్మరి, కుమ్మరి, పద్మశాలి వంటి చేతి వృత్తులపై ఆధారపడ్డ కులాలు ప్రపంచీకరణ కూడలిలో కుదేలై కూలబడ్డ జీవితాలపై వచ్చిన కవిత్వాన్ని ఈ పుస్తకంలో పరిశీలించిన తీరు దత్తయ్య సూక్ష్మ దృష్టిని, సునిశిత విమర్శకు నిదర్శనం. అగ్రకులాలు వారి అవసరాలకు బి.సి.లను కుల నిర్మాణంలో బందీలుగా మలిచారని, ఆ బంధనాల విముక్తికి బి.సి. వాద భావావేశం అందరికీ కలిగితేనే విముక్తి సాధ్యమని భావిస్తున్నాడు. అందుకు బహుజనులు ఐక్యత చాలా అవసరమని, బహుజనులకు పొలిటికల్ పవరే అంతిమ లక్ష్యంగా సాగాలని చైతన్య పరుస్తున్నాడు. ఇలా వచన కవిత్వంలో బి.సి. కులాల సామాజిక, సాంస్కృతిక మూలాలను తడిమి, బిసి వాద దృక్పథాన్ని విమర్శనాత్మకంగా చర్చకు పెట్టాడు అట్టెం దత్తయ్య.
3.3. పాట కవిత్వం
మూడవ భాగంలో "తెలంగాణ పాట - బిసి వాదం" అనే ప్రక్రియలో బి.సి.ల పాటలను పరిచయం చేస్తూ విశ్లేషించాడు. ఆదినుండి పాట ఏ ఆధిపత్యం లేని సొంత గొంతుకల మట్టి పరిమళంతో ఉబికి ప్రవాహం చెందుతుంది. బహుజన కులాల వారు శ్రామికులు కావడం వలన పాట వారి చెమటబొట్టును ముద్దాడి సరికొత్త గానాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. సరిగమపదనిసలు అగ్రకులాల ఒళ్ళో సేద తీరితే, జనపద సాహిత్యం బహుజనుల గొంతులో రాగాలు తీసింది. నిజానికి జనపదాలకు అగ్రహార పరివారాలకు సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా స్పష్టమైన వైరుధ్యం ఉంది. మూలవాసులైన దళిత బహుజనులే వేల సంవత్సరాలుగా పాటను రక్షిస్తూ వస్తున్నారు. బి.సి.లు పాటను తమ ఉత్పత్తి ప్రక్రియలో భాగం చేయడం వలన, వృత్తులతో కలపడం ద్వారా పాట మరింత పదునెక్కింది.
జానపద పాట మౌఖికంగా బి.సి. ఆశ్రిత కులాల వారు పాడుతూ, కథ రూపంలో చెబుతున్నారు. కానీ లిఖిత రూపంలో రావాలని, అప్పుడే బి.సి.ల గత చరిత్ర, వైభవం తెలుస్తుందనీ చెబుతూ పాటలను రికార్డు చేయాల్సిన అవసరాన్ని విమర్శకుడిగా ఈ తరానికి నొక్కి చెబుతున్నాడు దత్తయ్య.
బి.సి. ప్రధాన కులాల వారికి ఆశ్రిత గాయక కులాలు ఉండటం, వీరు ఆయా కులాలకు చెందిన వీరులు, సాహసికులు, నాయకులు, దాతల గొప్పతనాన్ని గానం చేస్తారు (దత్తయ్య 72)
అని దత్తయ్య చెబుతూ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను అర్థం చేయిస్తాడు. అదే సందర్భంలో వారి పాటలను, గాయకుల గురించి సాహిత్య సేకరణ, పరిశోధన జరగటం లేదని వాపోతున్నాడు. బి.సి. వాద ఉద్యమం బలంగా లేని కారణంగా ఆ వాదం మీద నిలబడి, ఆ దృక్పథంతో పాటలు రాసే బి.సి. పాటల రచయితల కొరత ఉందని దత్తయ్య గుర్తించాడు. మిత్ర పాటల్లో వృత్తి గోసతో పాటు రాజ్యాధికార స్పృహను రగిలిస్తాడంటాడు. వారి పాటల స్ఫూర్తితో బి.సి.లు తమ చైతన్యాన్ని, ఐక్యతను పెంచుకోవాల్సిన అవసరాన్ని కనిపిస్తుంది. "శత్రువును అంతం చేయడానికి సకల దిక్కుల నుంచి ముట్టడిస్తున్న మనుషుల్లాగా ఈ పాటలు కనిపించాయి" అని సీతారాం అన్నట్లు ఈ పాటలన్నింటి విశ్లేషణతో బి.సి.ల మనసుల్లోకి ఉద్యమ సన్నద్ధత ఎదురెక్కాల్సిన అవసరాన్ని దత్తయ్య ప్రతిపాదిస్తున్నాడు.
3.4. కథాసాహిత్యం
నాల్గవ భాగంగా కథా ప్రక్రియను పరిశీలించాడు. భారతదేశంలో బహుజనుల జీవితాల్లో పురాణేతిహాసాలకు మించి లోతైన యదార్థ గాథలుంటాయి. ఎవరి జీవితాల్ని కదిలించినా కథలు కెరటాలై పోటెత్తుతాయి. అవేవీ కాలక్షేపానికో, వ్యాపకం కోసమో చెప్పుకునే వట్టి కథలు కాదు. బహుజన బతుకుల ఎతలు, కథలన్నిటి నుండి పచ్చి కన్నీటి వాసన మనల్ని చుట్టుముడుతుంది. కనుక ఏ బి.సి. ఇంటి కడపను తడిమి చూసినా కథలు కట్టలు తెగి ఉబికి వస్తాయి. ముఖ్యంగా బి.సి. ఆశ్రిత కుల జీవనమంతా కథా, కథన సమాహారమే. ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో కన్ను తెరిచిన నుండి కన్ను మూసే వరకు ప్రతి కదలికా ఒక కథే. అదిమిపట్టి ఉంచిన చేతివృత్తి, సేవా కులాల అంతరంగాలను పరిశీలిస్తే కథలు ఉసిళ్ల పుట్టలా కదిలొస్తాయి. అయితే వాటిని అక్షరీకరించేదెవరు? ఒకవేళ అక్షరీకరించే కృషి చేస్తే, ఆ ప్రయత్నం కూడా ఇంకో కథే అవుతుంది.
కథా సాహిత్యంలో బి.సి. కులాల స్థితిగతులను ఎరుకజేసిన కథలు అస్తిత్వ ఉద్యమాల కంటే ముందు నుండే దర్శనమిస్తాయి (దత్తయ్య 171)
అంటూ కథా సాహిత్యంలో బిసిల ఆనవాళ్లు వెలికితీస్తున్నాడు దత్తయ్య. తెలంగాణలో కథకు చారిత్రక నేపథ్యం ఉందని, ఉద్యమాలకు ఊపిరి అయ్యిందని, వర్తమానంలో బహుజన కులాల్లో మార్పులను కథ చూపెట్టిందనే కోణాన్ని విప్పి చెబుతూనే, ప్రపంచీకరణ కుల వృత్తులపై చేస్తున్న ధ్వంస రచనను వివరించాడు. బహుజన కథకులు బి.సి. కులాల శ్రమను, బాధితుల వేదనను ప్రకాశవంతంగా మలిచి ప్రపంచానికి అందించారు. అట్లాగే బిసిల అస్తిత్వాన్ని కథల్లోకి ఒంపి, చెమట చుక్కలకు చరిష్మా అద్దారు. ఇలా కథల ద్వారా బి.సి. రచయితలు బహుజన చైతన్యాన్ని ఒక మెట్టు ఎక్కించారని అట్టెం దత్తయ్య తీర్మానిస్తున్నాడు. మానవ వికాసానికి ఉత్పత్తి కులాల వారు తమ రక్తాశ్రువులు సర్వం ధార పోశారని విశ్లేషణాత్మకంగా వివరించాడు. బహుజన బతుకుల్లో అగ్గిపెట్టి, వారి జీవితాల ధ్వంసానికి పాల్పడ్డ అగ్రకులాలకు చెందిన రచయితలు పీడిత కులాల పట్ల కథలు రాయడం ఏమిటని సందేహం వ్యక్తంచేస్తున్నాడు.
బి.సి.లు తమ బాధను ప్రత్యక్షంగా అనుభవిస్తున్న జీవితాలను స్వయంగా నిస్సిగ్గుగా రాసుకోవాలి. కానీ కొందరు బి.సి. కథా రచయితలు అగ్రవర్ణాల మెప్పుకోసం తన స్వంత అస్తిత్వాన్ని పక్కకు పెట్టి అనవసరమైనవన్నీ రాస్తున్నారు (దత్తయ్య 173)
అని కొద్ది మంది బి.సి. కథా రచయితల తీరు చూసి బాధపడుతున్నాడు. వారు తమ బానిస బుద్ధిని మార్చుకొని సొంత గాథలను రాసుకోవాలని హిత బోధ చేస్తున్నాడు. తమ సొంత జీవన గాథే బిసిలకు గొప్ప కథా వస్తువంటున్నాడు అట్టెం దత్తయ్య.
3.5. నవలా సాహిత్యం
మానవ జీవనాన్ని, సామాజిక సంబంధాల్ని ఆసాంతం వ్యక్తం చేయగలిగిన సాహిత్య ప్రక్రియ నవల ప్రక్రియను అయిదవ అధ్యాయంగా స్వీకరించాడు. "తెలంగాణ నవల - బిసి వాదం" అనే అధ్యాయంలో తెలంగాణలోని పదిహేను బి.సి. కులాల వృత్తి జీవితాల ఆధారంగా నవలలు వచ్చాయని నిర్ధారించాడు అట్టెం దత్తయ్య. వారి వేదనాభరితమైన స్థితిని ఇరవై రెండు మంది రచయితలు ముప్పై నవలల్లో చిత్రీకరించారని గుర్తించాడు. అయితే సమాజంలో అధిక సంఖ్యాక జనాభాగా ఉన్న వెనకబడిన కులాలపై నవల సాహిత్యం రావాల్సినంత రాలేదని దత్తయ్య నిరాశ చెందుతున్నాడు. తెలుగు రచయితలకు సాహిత్యం అంటే కవిత్వం మాత్రమేననే తప్పుడు అభిప్రాయం ఉందని కుండబద్దలు కొట్టినట్టు విమర్శిస్తున్నాడు. అగ్రకుల పద్య పండితులు కింది కులాలు సాహిత్యంలోకి రాకుండా చేసే కుట్రలో భాగమే కవిత్వానికి అధిక ప్రాధాన్యతనివ్వడంలో ఉన్న అంతరార్థమని దత్తయ్య విమర్శ ద్వారా వెల్లడవుతుంది. నేటి బహుజన యువకవులు కూడా కవిత్వ ప్రక్రియకే అధిక మొగ్గు చూపడం వంటి భావ బానిసత్వం నుండి బయటపడాలని సూచిస్తున్నాడు. కాలువ మల్లయ్య 'చీకట్లో చిరుదీపం' (మల్లయ్య), లోక హరి 'సంఘము' (హరి), బి.ఎస్. రాములు 'జీవనయానం' (రాములు, జీవనయానం), నేరేళ్ల శ్రీనివాస్ గౌడ్ 'బ్రతుకు తాడు' (గౌడ్), ఎస్.ఎమ్. ప్రాణ్ రావు 'ప్రజా జ్యోతి పాపన్న' (రావు), శాంతి ప్రబోధ 'జోగిని' (ప్రబోధ), పెద్దింటి అశోక్ కుమార్ 'సంచారి' (కుమార్) వంటి వారు రాసిన నవలల్లో చేతివృత్తుల చెమ్మను పసిగట్టాడు. అట్లా ఈ నవలల్లో సబ్బండ బి.సి. కులాల సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక జీవన గతులను దత్తయ్య పరిశీలించి, విమర్శనాత్మకంగా మన కళ్ళముందు ఉంచడంతో బి.సి. వాద తాత్వికత విస్తృతి మనకు గోచరిస్తుంది.
3.6. విమర్శ
ఇక ఆరో భాగంలో విమర్శ మీద దృష్టిసారించాడు. సాహిత్య ప్రక్రియల్లో ఆధునికమైన విమర్శ ప్రక్రియ వలన సాహిత్యం సుసంపన్నం అవుతుంది. అట్టెం దత్తయ్య "తెలంగాణ బి.సి. వాద సాహిత్యం" అనే విమర్శనా గ్రంథం ద్వారా బి.సి. వాద సాహిత్య చరిత్రను, విమర్శను, సాంస్కృతిక వైభవాన్ని, సామాజిక చలనాన్ని, బిసిల జీవన విస్తృతిని తాత్వికత స్థాయిలో నిలబెట్టాడు. అగ్రకులాల సాహిత్యంపై వచ్చిన విమర్శలు బి.సి. వాద సాహిత్యంపై రాలేదు. అగ్రకులాలు కావాలనే బి.సి. వాద సాహిత్యాన్ని విస్మరించారనే నిజాల్ని అట్టెం దత్తయ్య నిరూపిస్తున్నాడు. అధిక సంఖ్యాక జనమైన వెనకబడిన కులాలను విస్మరించడం అంటే సంద్రాన్ని వదిలి బురద గుంటలో చేపలు పట్టినట్లే ఉంటుందంటాడు. ఆ అగ్రకుల కుట్రలో బహుజనులు కొట్టుకుపోకుండా సొంత సాహిత్య సేద్యం చేస్తూ వివిధ ప్రక్రియల్లో బి.సి. వాదాన్ని బలంగా వినిపించాలని పిలుపునిస్తున్నాడు. బి.సి. సాహిత్య విమర్శ పుస్తకాలుగా నాలుగు వచ్చాయి. కథా సాహిత్యం మీద 'బి.సి. కథలు ఒక విశ్లేషణ 2000-2010' అనే బి.ఎస్. రాములు విమర్శ గ్రంథం 2011లో (రాములు, బి.సి. కథలు), కవిత్వ ప్రక్రియ మీద కవిత్వంలో 'బిసి సూర్యోదయం' 2015లో జూలూరి గౌరీ శంకర్ (గౌరీ శంకర్, కవిత్వంలో బి.సి.), ఆయన సంపాదకత్వంలోనే మరో వ్యాస సంకలనం 'ఒక కవితా ఇరవై కోణాలు' (గౌరీ శంకర్, ఒక కవితా), అలాగే బిసి వాద యువ కవిత్వంపై 'ప్రవాహం' చింతం ప్రవీణ్ సంపాదకత్వంలో 2017లో విమర్శనా గ్రంథాలు వచ్చాయి (ప్రవీణ్ కుమార్). అలాగే ఒక్కో ప్రక్రియను సమీక్షిస్తూ వ్యాసాలు కొంత మంది కవులు రాశారు. అలా విమర్శలో కొంత కృషి జరిగింది. కానీ అన్ని ప్రక్రియలు కలిపి విమర్శ రాలేదు. కానీ అట్టెం దత్తయ్య ఆరు ప్రక్రియలపై తెచ్చిన 'తెలంగాణ బి.సి. వాద సాహిత్యం' అనే సమగ్రమైన విమర్శనా గ్రంథం బి.సి. సాహిత్య విమర్శలో మహత్తర కృషిగా నిలిచిపోతుంది. రాబోయే బి.సి. సాహిత్య విమర్శకు ప్రామాణికమైన మైలురాయిగా దారి చూపుతుంది.
ఉపసంహారం
తెలుగు సాహిత్య విమర్శలో బీసీల ప్రాతినిథ్యం గురించిన చర్చ చాలా లోతైనది. అట్టెం దత్తయ్య "తెలంగాణ బిసి వాద సాహిత్యం" అనే ఈ గ్రంథం ద్వారా బిసి వాద సాహిత్య చరిత్రను, విమర్శను, సాంస్కృతిక వైభవాన్ని, సామాజిక చలనాన్ని, బిసిల జీవన విస్తృతిని తాత్వికత స్థాయిలో నిలబెట్టాడు. అగ్రకులాల సాహిత్యంపై వచ్చిన విమర్శలు బిసి వాద సాహిత్యంపై రాలేదు. అగ్రకులాలు కావాలనే బిసి వాద సాహిత్యాన్ని విస్మరించారనే నిజాల్ని అట్టెం దత్తయ్య నిరూపించాడు. అధిక సంఖ్యాక జనమైన వెనకబడిన కులాలను విస్మరించడం అంటే సంద్రాన్ని వదిలి బురద గుంటలో చేపలు పట్టినట్లే ఉంటుంది. ఆ అగ్రకుల కుట్రలో బహుజనులు కొట్టుకుపోకుండా సొంత సాహిత్య సేద్యం చేస్తూ వివిధ ప్రక్రియల్లో బిసి వాదాన్ని బలంగా వినిపించాలని పిలుపునిస్తున్నాడు.
అట్టెం దత్తయ్య "తెలంగాణ బి.సి. వాద సాహిత్యం" అనే గ్రంథం బి.సి. సాహిత్యానికి ఒక సమగ్ర విమర్శనాత్మక దృక్పథాన్ని అందించింది.
ఈ పరిశోధన పద్యం నుండి విమర్శ వరకు వివిధ సాహిత్య ప్రక్రియలలో బి.సి. వాద అస్తిత్వ భావనలను విస్తృతంగా చర్చించింది.
బహుజన కులాల జీవితాలు, వృత్తులు, సామాజిక, ఆర్థిక స్థితిగతులు సాహిత్య చరిత్రలో విస్మరించబడిన తీరును ఈ గ్రంథం స్పష్టంగా వెల్లడించింది.
అగ్రకులాల ఆధిపత్యం, పక్షపాత వైఖరులను ప్రశ్నిస్తూ, బి.సి. కులాలకు సొంత వాణి అవసరాన్ని నొక్కి చెప్పింది.
ఈ గ్రంథం బి.సి. కులాలలో ఐక్యత, చైతన్యం పెంచడం ద్వారా రాజకీయ శక్తిని సాధించాలని పిలుపునిస్తూ, భవిష్యత్ బి.సి. సాహిత్య విమర్శకు మార్గదర్శకంగా నిలిచింది.
ఉపయుక్త గ్రంథసూచి
ఐలయ్య షెపర్డ్, కంచె. 'హిందూ మతాంతర భారత దేశం'. హైదరాబాద్: భూమి బుక్ ట్రస్ట్.
గౌరీశంకర్, జూలూరు. సంపా. 'వెంటాడే కలాలు- వెనకబడ్డ కులాలు'. హైదరాబాద్: స్పృహ సాహితీ సంస్థ.
పైదే. 'కవిత్వంలో బి. సి. సూర్యోదయం'. హైదరాబాద్: అడుగుజాడలు పబ్లికేషన్స్.
పైదే. సంపా. 'ఒక కవితా ఇరవై కోణాలు'. హైదరాబాద్: స్పృహ సాహితీ సంస్థ.
దత్తయ్య, అట్టెం. 'తెలంగాణ బి. సి. వాద సాహిత్యం'. హైదరాబాద్: ప్రణవం పబ్లికేషన్స్.
ప్రవీణ్ కుమార్, చింతం. సంపా. ' ప్రవాహం'. హైదరాబాద్: బి. సి. రైటర్స్ వింగ్.
రాములు, బి. ఎస్. 2011. 'బి.సి. కథలు ఒక విశ్లేషణ 2000-2010'. హైదరాబాద్ : విశాల సాహిత్య అకాడమి.
ఎ. విజయ్ కుమార్
రచయిత, విమర్శకులు,
నల్లకుంట, హైదరాబాద్
తెలంగాణ.
సెల్: +91 9573715656
https://www.auchithyam.com/2025/nov_2025/pdf_papers/november25_06.pdf