మట్టి పరిమళం - శ్రామిక ఆత్మగౌరవం: ‘వాము’ కథల్లో సూక్ష్మ సౌందర్యశాస్త్రం
ఆచార్య వెంకటరామయ్య గంపా
‘వాము’ సంపుటిలో సంపాదకులు ‘శ్రమ సౌందర్యం’ గురించి క్లుప్తంగా ప్రస్తావించారు. నిజానికి ఈ సంపుటిలోని ప్రతి కథ, ఏదో ఒక మలుపులో, పెద్ద సాంకేతిక పదజాలం లేకుండానే, సహజమైన తెలంగాణ తెలుగులో ఒక ప్రత్యేక అందాన్ని ఆవిష్కరిస్తుంది. కేవలం గొప్ప శిల్పాలు, చిత్రలేఖనాలు మాత్రమే కళ కాదని, దైనందిన శ్రమలో కూడా ఒక లోతైన సౌందర్యం దాగి ఉందనే ఆలోచనతో ఈ వ్యాసం రాయబడింది. ఇక్కడ ఒక ప్రాథమిక ప్రశ్న తలెత్తుతుంది- ‘కళ, సౌందర్యం, నైపుణ్యం’ అనేవి నిజానికి ఎవరికి చెందాలి? వాస్తవానికి వీటిపై అధికారం బడుగు, బలహీన వర్గాలకూ ఉంది. బీసీ వృత్తుల్లోని మనుషులు తమ పని ద్వారానే సౌందర్యాన్ని వ్యక్తం చేస్తారు, ఉపన్యాసాలు ఇవ్వరు. కానీ దురదృష్టవశాత్తు ఈ కళాత్మక దృక్పథాన్ని విశ్వవిద్యాలయాల్లో గానీ, సాహిత్య విమర్శలో గానీ పెద్దగా చర్చించిన దాఖలాలు లేవు. సౌందర్య శాస్త్రం, తత్వశాస్త్రం వంటి పెద్ద అంశాలను సంప్రదాయ విమర్శకుల ఆలోచనలకే పరిమితం చేసి, మిగిలిన వాటిని ఉపేక్షించారు.
ప్రస్తుత వ్యాసం తెలుగు ప్రాంతాల్లోని అన్ని బీసీ వృత్తులను చర్చించదు, ఇది చాలా విశాలమైన పరిశోధన అంశం. ఇది కుమ్మరి వృత్తి సాంస్కృతిక అనుభవాలకే తన పరిశీలనను పరిమితం చేస్తుంది.ఈ వ్యాసం ప్రతిపాదించే ప్రధాన వాదన ఏమిటంటే, ‘వాము’ కథలు కుమ్మరి వృత్తిని కేవలం సామాజిక వాస్తవికతగా చిత్రించడమే కాక, దైనందిన శ్రమలో అంతర్లీనమైన ఒక సూక్ష్మ సౌందర్యానుభవాన్ని తెలుపుతుంది. ఈ సంపుటిలోని కథలను సౌందర్య శాస్త్రంలో ఒక భాగమైన ‘సూక్ష్మ సౌందర్యశాస్త్రం’ (Micro Aesthetics) అనే కోణం నుండి విశ్లేషించడమే ఈ వ్యాస లక్ష్యం.
కథల సంపుటి ముఖచిత్రం- మౌనంగా మాట్లాడే శ్రమ సౌందర్యం
‘వాము’ పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు కవర్ పేజీ మౌనంగా మాట్లాడే శ్రమ సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తుంది. కుమ్మరి కొలిమి మంటలు, కుండల అమరిక తక్షణమే దృష్టిని ఆకర్షించినా, మన చూపు ఆగేది మాత్రం మొత్తం ముఖచిత్రం కూర్పు మీదనే. ఇది కేవలం ఒక దృశ్య రూపకల్పన మాత్రమే కాదు, బీసీల బతుకుల అంతరంగాన్ని, శ్రమ సంస్కృతిని, మట్టితో ముడిపడిన జీవిత తత్త్వాన్ని సున్నితంగా ఆవిష్కరించే ఒక సూక్ష్మ సౌందర్యశాస్త్ర ప్రయోగం. స్థూలంగా చూస్తే కుమ్మరుల జీవితం కనిపిస్తుంది. కానీ దాని అంతరాళంలోని అగోచర క్షణాలు, వస్తు తత్వం, సాంస్కృతిక రూపకాలు గాఢమైన సాహిత్య విమర్శకు తావునిస్తాయి.
ముందుగా, ఈ ముఖచిత్రంలో అగ్ని, మట్టి మధ్య సంవాదం కేంద్రంగా నిలుస్తుంది. కుమ్మరి బట్టీ కాలుతున్న తీరు, కుండల అమరిక భౌతిక శ్రమతో పాటు పంచభూతాలతో మనిషి చేసే నిరంతర సంభాషణను సూచిస్తాయి. మండుతున్న అగ్నికీలలు, వాటి నుంచి లేచే నల్లని పొగ కేవలం రసాయనిక మార్పుకు చిహ్నాలు మాత్రమే కాదు, అవి శ్రామికుడి నిట్టూర్పులకు, అతని జీవన పోరాటాల అణగారిన వేదనకు దృశ్యరూపాలు. చిత్రంలో కుమ్మరి ఒంపుసొంపులుగా మంటను సర్దుతున్న భంగిమ ఒక విచిత్రమైన ఏకాగ్రతను, దైవికమనిపించే ప్రశాంతతను ప్రదర్శిస్తుంది. ఇది కుండ కాల్చడం మాత్రమే కాదు, రూపాన్ని ఆవిష్కరించే సృష్టికర్త తపస్సులా అనిపిస్తుంది. చిత్రకారుడు ఉద్దేశపూర్వకంగా కుమ్మరి ముఖాన్ని అస్పష్టంగా ఉంచాడు. ఈ నిర్ణయం వల్ల ఆ వ్యక్తి ఒక్కడే కాక, కులవృత్తిలోని ప్రతి కుమ్మరికీ ప్రతినిధిగా మారి సార్వత్రికతను సంతరించుకుంటాడు.
శీర్షిక అక్షరాల విషయానికి వస్తే, ‘వాము’ పదం మట్టి రంగుల తెల్లటి ఛాయలతో, కుండల ఆకృతులను తలపించేలా తీర్చిదిద్దబడింది. అక్షరాలు కంప్యూటర్ లో టైపు చేసిన అక్షరాల్లాగా యాంత్రికంగా లేవు, మట్టితో చేసిన శిల్పాల్లా సహజమైన వంపులతో ప్రవహిస్తున్నాయి. దాని కింద ‘కుమ్మరుల బతుకు చక్రాలు’ అనే ఉపశీర్షిక శ్రమను కాలంతో ముడిపెడుతుంది. కుమ్మరి చక్రం గిరికీలు కొట్టే కాలచక్రానికి ప్రతీక - కాలం ఎంత మారినా చక్రం తిరుగుతూనే ఉంటుంది. మట్టి రూపాలు మారవచ్చు కానీ ఆ బతుకుల గతి మాత్రం ఆగిపోదు అనే తాత్విక సత్యం ఈ కథల సంపుటి కవర్ డిజైన్‌లో దృశ్యమానమవుతుంది.
చిత్ర కూర్పు ఒక విశేషమైన శ్రేణిని అనుసరిస్తుంది. నేపథ్యంలో పచ్చని చెట్టు, చిన్నపాటి ఊరు, గుడిసెలు సామూహిక జీవన సౌందర్యాన్ని ప్రతిబింబిస్తాయి. అక్కడి నుంచి దృష్టి క్రమంగా మధ్యభాగంలోని కేంద్రీకృత కుండల బట్టీ మీదకు, శ్రామికుడి శ్రమ మీదకు మళ్ళుతుంది. విశాల ప్రపంచం నుంచి ఒక నిర్దిష్ట శ్రామిక కుటుంబపు సూక్ష్మ వేదనలోకి చూపు మళ్ళించిన అనుభూతిని ఈ కూర్పు కలిగిస్తుంది. ఇది కేవలం సాంకేతిక నైపుణ్యం కాదు, ఒక సామాజిక వ్యాఖ్య కూడా. వాటర్ కలర్ మాధ్యమం చిత్రానికి ఒక ప్రత్యేక ఆర్ద్రతను, కాలం చెల్లిన జ్ఞాపకాల సువాసనను అద్దింది. రంగులు ఎక్కడా కృతకంగా లేవు. మట్టితో మమేకమైన బతుకులు ఎంత సౌమ్యంగా, నిరాడంబరంగా ఉంటాయో ఈ రంగుల కూర్పు సున్నితంగా తెలియజేస్తుంది. చివరగా, చిత్రంలో పనిచేస్తున్న కుమ్మరి చుట్టూ గాఢమైన నిశ్శబ్దం ఆవరించి ఉంది. ఈ నిశ్శబ్దం శతాబ్దాలుగా అణచివేయబడిన కులవృత్తి పడుతున్న ఒంటరి పోరాటానికి, యంత్ర నాగరికత మధ్య కనుమరుగవుతున్న హస్తకళల ఆక్రందనకు ప్రతీక. ఈ నిశ్శబ్దాన్ని రంగుల్లో పట్టగలగడమే ఈ దృశ్య కావ్యం నిజమైన శక్తి.
ఈ ముఖచిత్రం పుస్తకం లోపలి కథలకు కేవలం సూచిక కాదు, అది ఒక స్వతంత్ర దృశ్య కావ్యం. పాఠకుడు తన అనుభవాల నుండి మట్టి వాసనను, చెమట చుక్కల వేడిని అనుభూతి చెందేలా చేయడంలో, శ్రమను సౌందర్యంగా మలచడంలో, బీసీల జీవన రేఖలను పదునైన కుంచెతో అద్దడంలో ఈ ముఖచిత్రం సంపూర్ణంగా సఫలమైంది.
సూక్ష్మ సౌందర్యశాస్త్రం: సాధారణంలో అసాధారణం
ముఖచిత్రంలో కనిపించే ఈ లోతైన సౌందర్యం, సాహిత్య విమర్శలో ‘సూక్ష్మ సౌందర్యశాస్త్రం’ అనే ఒక ప్రత్యేక దృక్కోణానికి దారితీస్తుంది. ఇది గొప్ప కళాఖండాల్లో, రాజభవనాల్లో వెతికే అందం గురించి కాదు. మన రోజువారీ జీవితంలో భాగమైన చేత్తో తాకే, కంట పడే, ముక్కుతో వాసన పట్టే మామూలు వస్తువుల అందం గురించి మాట్లాడుతుంది. కుండ సరిగ్గా అలాంటిదే. దానికొక ఆకారం, స్పర్శ, రంగు, వాసన ఉన్నాయి. ఇవన్నీ కలగలిసి ఒక సౌందర్యానుభూతిని కలిగిస్తాయి.
ఈ సంపుటిలోని కథలు చాలాచోట్ల ఈ సూక్ష్మ సౌందర్యాన్ని ప్రత్యక్షం చేస్తాయి. చేతిపని మీద గౌరవం, అది కనుమరుగవుతున్న తీరు వీటి చుట్టూనే కథనం తిరుగుతుంది. కుమ్మరి పనిలో అత్యంత ఆసక్తికరమైన సౌందర్య ఘట్టం మట్టిముద్ద చక్రం మీద ఆకారం తీసుకోవడం. ఇది కేవలం తయారీ దశ కాదు, ఒక కళాత్మక చర్య. అతని చేతి వేళ్ళ కదలిక, చక్రం తిరిగే వేగం, మట్టి తడి - ఇవన్నీ కలిస్తేగానీ కుండ దాని రూపు దాల్చదు. శరీరం, పరికరం, పదార్థం మూడూ ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. ఆ చేతుల్లో తరాల జ్ఞాపకం, తండ్రి నుంచి వచ్చిన నైపుణ్యం, ఒక లయ అన్నీ ఇమిడి ఉంటాయి.
ఈ అనుభవాన్ని సిద్ధాంతీకరించడానికి థామస్ లెడ్డీ తన ‘The Extraordinary in the Ordinary’ అనే పుస్తకంలో ఒక కీలకమైన ప్రతిపాదన చేస్తాడు. సాధారణమైనది (ordinary) తనలో అసాధారణతను (extraordinary) దాచుకుంటుంది. మనం రోజూ చూసే వస్తువుల్ని అతి పరిచయం వల్ల చూడటం మానేస్తాం. కానీ థామస్ లెడ్డీ చెప్పే ‘అసాధారణత’ అనేది అరుదైనది కాదు, ఒక అనుభవ తీవ్రత. కుమ్మరి ప్రతిరోజూ చేసే పని, సంవత్సరాల సాధన వల్ల వచ్చిన నైపుణ్యం ఆ దైనందిన చర్యను ఒక అసాధారణ స్థాయికి తీసుకువెళ్తాయి. థామస్ లెడ్డీ దీన్ని ‘అభ్యాసం ద్వారా వచ్చే అసాధారణ నైపుణ్య లోతు’గా పేర్కొంటాడు. పునరావృతం బోర్ కొట్టించదు, అది లోతును పెంచుతుంది. వెయ్యవ కుండ చేస్తున్నప్పుడు కుమ్మరి చేతికున్న సున్నితత్వం మొదటి కుండకు ఉండదు.
‘వాము’ సంపుటిలోని కథలు ఈ థామస్ లెడ్డీ సూత్రాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. ఒక కథలో వృద్ధ కుమ్మరి వణుకుతున్న వేళ్ళ వర్ణన కనిపిస్తుంది. ఆ వయసు ఒక బలహీనతగా కాక, దశాబ్దాల శ్రమతో గడించిన ఆస్తిగా చిత్రించబడింది. ఆ వణుకుడు కూడా ఖచ్చితమైన ఆకారాన్ని సృష్టిస్తుంది. ఇది కేవలం తరాల నైపుణ్యాన్ని చూపించే ఉపకరణం కాదు, థామస్ లెడ్డీ చెప్పిన సాధన లోతు నిర్మాణ రూపం. అయితే ఈ సౌందర్యం కేవలం ఆనందంతో మాత్రమే నిండి ఉండదు. థామస్ లెడ్డీ మరో ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావిస్తాడు- దైనందిన సౌందర్య అనుభవాలు చాలావరకు మిశ్రమ భావోద్వేగాలతో కూడి ఉంటాయి. కేవలం స్వచ్ఛమైన ఆనందమే సౌందర్యం కాదు, దుఃఖం కలగలిసిన ప్రశంస, నష్టభావం మిళితమైన మెప్పు కూడా గాఢమైన అనుభవాలే. ఈ సంపుటిలోని కథలు చాలావరకు ఈ సంయుక్త భావ స్వరంతోనే నడుస్తాయి.
కథల విశ్లేషణ: సౌందర్యం, జ్ఞాపకం, సంక్షోభం
ఈ ‘వాము’ కథల్లో వస్తువులు జ్ఞాపకాల నిల్వ కేంద్రాలుగా కనిపిస్తాయి. కుండలు కేవలం నేపథ్యంలో అలంకారాలుగా మిగలవు, అవి కథాగమనానికి చుక్కాని అవుతాయి. పెళ్ళి అంటే బోనం కుండ, చావు అంటే తద్దినం కుండ - తెలుగు పల్లె జీవితంలో ప్రతి కీలక ఘట్టానికీ ఒక కుండ ముడిపడి ఉంటుంది. ఒక్కో సందర్భానికి ఒక్కో ఆకారం, ఒక్కో అలంకారం. ఈ కథలు చదివిన తర్వాత, ఆ వస్తువు వెనుక సామాజిక బరువు, ఎవరు చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు అన్న స్పృహ మెరుస్తుంది. ‘ఐరేణి కుండలు’ కథ ఈ సంయుక్త భావోద్వేగానికి ఒక గొప్ప ఉదాహరణ. పాఠకుడు కుండ అందాన్ని ఆస్వాదిస్తూనే, ఆ కళ క్షీణిస్తోందేమో అన్న ఆందోళనను ఒకేసారి అనుభవిస్తాడు. పట్టణం వెళ్ళిపోయిన కొడుకుల కోసం తల్లి రంగురంగుల కుండల్ని జాగ్రత్తగా దాచిపెట్టే సన్నివేశం, సంప్రదాయానికీ ఆధునికతకూ మధ్య ఘర్షణను సూక్ష్మ సౌందర్యంతో మేళవిస్తుంది. కొడుకు పెళ్ళికి ఆ మట్టి కుండలే కావాలనే తల్లి పట్టుదల కేవలం సెంటిమెంట్ కాదు, ఒక సౌందర్య నిర్ణయం. సరళమైన ఆనందం కాదు, సరళమైన విషాదం కాదు - రెండింటి సమ్మేళనమే ఇక్కడి కథన పరిపక్వత.
స్త్రీల చేతిపని ఈ కథల్లో మరో సూక్ష్మ సౌందర్య అభ్యాసం. కుండలు చేసేది ఎక్కువగా పురుషులే అయినా, రంగులు కలపడం, డిజైన్లు వేయడం, పండుగలకు సిద్ధం చేయడం వంటి పనులు స్త్రీల భాగస్వామ్యంతో జరుగుతాయి. కథలో కోడలు అత్తగారి దగ్గర రంగులు కలిపే నిష్పత్తులు నేర్చుకునే సన్నివేశం, ఏ పండగకు ఏ రంగు వాడాలో నిర్ణయించే సూక్ష్మ జ్ఞానం తరతరాలుగా స్త్రీల మధ్య మౌఖికంగా చేరిన విధానాన్ని రికార్డు చేస్తుంది. సూక్ష్మ సౌందర్యశాస్త్ర దృష్టితో చూస్తే, ఇది ఏ కళా పాఠశాలలో నేర్పని, పుస్తకాల్లో రాయని ఒక సౌందర్య విద్య. వంట చేయడం, ఇల్లు అలంకరించడం లాగే ఇదీ ఒక కళాత్మక అభ్యాసంగా గుర్తింపు పొందాలి.
ఇక ఇంద్రియానుభవాల విషయానికి వస్తే, సూక్ష్మ సౌందర్యశాస్త్రం చూపుకు మాత్రమే పరిమితం కాదు, అన్ని ఇంద్రియాలనూ కలుపుకుంటుంది. ‘కాగుబొత్త’ కథ దీనికి ఒక మంచి ఉదాహరణ. ఇందులో మట్టికుండ నీటి రుచి, అందులో వండిన అన్నం వాసన విపులంగా చర్చితమవుతాయి. మట్టికుండ నీళ్ళు చల్లగా ఉండడమే కాదు, ఒక ప్రత్యేకమైన మట్టి వాసన అంటుకుని ఉంటుంది. ఫ్రిజ్ నీరు కేవలం చల్లబరుస్తుంది, కానీ మట్టికుండ నీరు ఒక వ్యక్తిత్వాన్ని, ఒక రుచిని ఇస్తుంది. స్టీలు పాత్రలో వండిన పప్పుకూ, మట్టి చట్టిలో వండిన పప్పుకూ ఉన్న తేడా అనుభవమే. ఈ కథలు శాస్త్రీయ వివరణల్లోకి వెళ్ళవు, బదులుగా జ్ఞాపకాలతో ముడిపడిన సజీవ అనుభవాన్ని చెప్తాయి. అమ్మమ్మ పులుసు రుచి, నాయనమ్మ జాడీ వాసన వ్యక్తిగతం, సజీవం. స్పర్శ మరో కోణం. మట్టిముద్ద చేత పట్టుకుంటే చల్లగా, తడిగా, మెత్తగా ఉంటుంది. ఆరిన తర్వాత గరుకెక్కుతుంది. కొలిమిలో కాలినాక గట్టిగా మారుతుంది. ఈ మూడు స్పర్శల మార్పును కొందమంది రచయితలు విపరీతమైన శ్రద్ధతో రాశారు. ఇంత ఖచ్చితమైన వర్ణనకు ప్రత్యక్ష పరిశీలన లేదా అనుభవం తప్పనిసరి.
బీసీల సాహిత్య అధ్యయనానికి సూక్ష్మ సౌందర్యశాస్త్రం ఎందుకు అవసరం?
ఈ దృక్కోణం సాహిత్య విమర్శకు ఒక కొత్త ఆలోచనను ఇస్తుంది . సాధారణంగా వృత్తి కథల్ని ఆర్థిక దోపిడీ, సామాజిక అన్యాయం చట్రంలోనే చూస్తాం. అవి ముఖ్యమే, కానీ సరిపోవు. సూక్ష్మ సౌందర్యశాస్త్రం అడిగే ప్రశ్న వేరు- ఈ మనుషులు తమ శ్రమలో ఏ ఆనందం పొందుతున్నారు? వాళ్ళ పనిలో ఏ కళాత్మక సంతృప్తి ఉంది? ఇలా అడగడం ద్వారా మనం వారిని కేవలం బాధితులుగా కాక, తమ నైపుణ్యంతో గర్వించే, పనిలో అర్థం వెతుక్కునే సంపూర్ణ వ్యక్తులుగా చూడగలుగుతాం. అది వారి మానవత్వాన్ని గౌరవించడమే. పైగా ఈ కోణం సాహిత్యానికి కూడా న్యాయం చేస్తుంది. ఈ రచయితలు కేవలం సామాజిక సందేశం కోసం మాత్రమే రాయలేదు, వాళ్ళు మట్టి వాసనను, రంగుల కలయికను, చక్రం లయను తన్మయత్వంతో వర్ణించారు. ఆ శ్రద్ధను గమనించకుండా కథలను కేవలం సామాజిక దస్తావేజుల్లా చదివితే, వాటి సాహిత్య నైపుణ్యాన్ని తక్కువ అంచనా వేసినట్టే.
సూక్ష్మ సౌందర్యశాస్త్రం చెప్పే పాఠం ఒక్కటే- గొప్పతనం పరిమాణంలో కాదు, పరిశీలనలో ఉంటుంది. చిన్న నీళ్లకుండ వంపులో, దాని రంగులో, దాన్ని మోసే స్త్రీ నడకలో ఒక అందం దాగి ఉంటుంది. దాన్ని చూడడానికి ప్రత్యేకమైన శ్రద్ధ కావాలి. ‘వాము’ కథలు ఆ శ్రద్ధను మనకు నేర్పిస్తాయి. అవి కుమ్మరి వృత్తిని కేవలం సామాజిక సమస్యగా కాకుండా, ఒక జీవన కళగా చూపిస్తాయి. అంతేకాక, ఆ కళ వెనుక దాగిన శ్రమను, సంక్షోభాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తాయి. ఈ రెండింటి సమతుల్యతే ఈ సంపుటిని విలువైనదిగా మారుస్తుంది.
‘వాము’ కథలు కుమ్మరి జీవితాన్ని కేవలం సామాజిక వాస్తవికతగా నమోదు చేయడమే కాక, రోజువారీ శ్రమలోని సూక్ష్మ సౌందర్యాన్ని ఒక ప్రత్యేక సాహిత్యానుభవంగా నిర్మిస్తాయి. ఈ సంపుటి ముఖచిత్రం నుండి కథాంతర్గత వస్తువులు, ఇంద్రియ వర్ణనల వరకు ప్రతి అంశం ఈ సౌందర్య నిర్మాణానికి దోహదం చేస్తుంది. తెలుగు విమర్శకు ఈ అధ్యయన పద్ధతి చేసే కొత్త ప్రతిపాదన ఏమిటంటే, బీసీ వృత్తి కథలను కేవలం సామాజిక దోపిడీ కోణంలోనే కాకుండా, ‘దైనందిన సౌందర్యశాస్త్ర’ దృక్పథంతో చదవడం ద్వారా వాటిలోని లోతైన కళాత్మకతను, మానవీయ కోణాన్ని బయటకు తీసుకురావచ్చు. ఇది విమర్శకుడి పరిధిని విస్తృతం చేస్తుంది, పాఠకుడి అనుభవాన్ని సుసంపన్నం చేస్తుంది. ఇదే దృక్పథం ఇతర కులవృత్తుల సాహిత్యాన్ని, స్త్రీల మౌఖిక సౌందర్య జ్ఞానాన్ని, డిజిటల్ యుగంలో నెమ్మదైన పఠనానుభవాన్ని అర్థం చేసుకోవడానికి కూడా విస్తరించవచ్చు. ‘వాము’ కేవలం కథల పుస్తకం కాదు- కుమ్మరుల బతుకులోని సూక్ష్మ సౌందర్యాన్ని భావితరాలకు అర్థమయ్యేలా నిక్షిప్తం చేసే ఒక సాంస్కృతిక దస్తావేజు.
**************************
Prof. Venkata Ramaiah Gampa
Department of Indian Languages and Literary Studies
University of Delhi
Delhi-110 007
Ph.09958607789
Venkat@il.du.ac.in
gvramaiah@gmail.com
బహుజన అస్తిత్త్వాన్ని ప్రతిఫలించిన 'వాము' కుమ్మరుల బతుకు చక్రాలు
డి. సాయినాథ్ రెడ్డి
ఒకప్పుడు ఇండ్లలో ఆహారం, నీరు, ధాన్యం నిలువ ఉంచుకోవడానికి పూర్వం మట్టి పాత్రలనే వాడేవారు. వాటిని కుమ్మరులు ఎంతో నైపుణ్యంతో ఈ మట్టి పాత్రలను తయారుచేస్తారు. మంచి మట్టిని ఎంచుకోవడం నుండి, దానిని మెత్తగా చేసి సారెపై సరైన ఆకారానికి తేవడం వరకు ప్రతి పనిలో శాస్త్రీయత ఉంటుంది. పాత్రలను వాములో పెట్టి సరైన ఉష్ణోగ్రతలో కాల్చి మన వాడకానికి అందిస్తారు. మనిషి జీవితంలో పుట్టుక నుండి చివరి పయనం వరకు కుండ తోడుగా ఉంటుంది. శుభకార్యాలలో కుండను పవిత్రంగా పూజిస్తారు. ఇప్పటికూడా వేసవిలో కుండ చల్లని నీటిని ఇస్తుంది. అప్పుడు మట్టి పాత్రలలో వంట వండుకునే వారు పేదవాళ్లు ఇప్పుడు అది వ్యతిరేకం అయ్యింది. ఆరోగ్యం కోసం ధనవంతులు మట్టి పాత్రలలో వంట వండుకుని తింటున్నారు. కుండ మనిషి చనిపోయిన తర్వాత చేసే అంతిమ సంస్కారాలలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తన సేవ ముగిశాక కుండ పగిలి మళ్లీ మట్టిలోనే కలిసిపోతుంది. మట్టి నుండి వచ్చిన మనిషి చివరికి మట్టిలోనే కలుస్తాడనే సత్యాన్ని కుండ మనకు గుర్తుచేస్తుంది.
ఒకప్పుడు గ్రామీణ జీవితంలో కాగులు, ముంతలు, బువ్వకుండలు, గంజి కుండలు, పాల అటికెలు, ప్రమిదలతో పాటు ఇండ్ల పెంకులు, దేవాలయాల గోపురాలు, గ్రామ దేవతల విగ్రహాలు, పండుగ దొంతుల తయారీ వరకు ప్రతి పనిలో కుమ్మరుల చేతుల సృజనాత్మకత, కళా నైపుణ్యం స్పష్టంగా కనిపించేవి. సరైన మట్టిని ఎంచుకోవడం, పదును చేసి సారెపై ఆకారాన్నివ్వడం, ఆరబెట్టిన కుండలను ఇంట్లోని స్త్రీలు సల్పతో కొట్టి రూపుదిద్దడం, ఆపై వాములో సరైన ఉష్ణోగ్రత వద్ద కాల్చడం వెనుక అపారమైన మేధస్సు, సాంకేతిక విజ్ఞానం దాగి ఉన్నాయి. వీరు తయారుచేసిన మట్టి పాత్రల వల్లనే ఆహారం, ధాన్యం, విత్తనాలను నిల్వ చేసుకోవడం, వ్యవసాయాన్ని విస్తరించడం, మానవ స్థిర నివాసాలు (నాగరికత) ఏర్పడటం సాధ్యమైంది. నిజానికి మన సమాజపు తొలి శాస్త్రవేత్తలుగా, మానవ నాగరికత వికాసానికి మూలస్తంభంగా నిలిచిన ఈ శ్రమజీవులు కొన్ని చోట్ల సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిపోవడం, విద్యా రంగాలు వీరి సాంప్రదాయ విజ్ఞానాన్ని తగిన రీతిలో గుర్తించకపోవడం విచారకరం.
కుమ్మరి వృత్తి అనేది ఒక కుటుంబమంతా కలిసి పనిచేసే ఉత్పత్తి వ్యవస్థ. ఈ పనిలో పురుషులతో పాటు స్త్రీలు కూడా ఎంతో క్రియాశీలకంగా భాగస్వాములవుతారు. కుండలకు తుది రూపాన్ని ఇవ్వడం, వాటిపై అందమైన అలంకరణలు చేయడం, వాటిని ఆరబెట్టడంలో స్త్రీల నైపుణ్యం స్పష్టంగా కనిపిస్తుంది. తయారు చేసిన కుండలను అమ్మడంలో కూడా స్త్రీలదే ప్రధాన పాత్ర. ఇది ఉత్పత్తిలో, పంపిణీలో స్త్రీలకు లభించే సమ ప్రాధాన్యతను, శ్రమలోని సౌందర్యాన్ని తెలియజేస్తుంది. మన సాంస్కృతిక ఆచారాలలో కూడా కుమ్మరుల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. గ్రామదేవతల విగ్రహాలు, ఊరేగింపుల్లో సమర్పించే బోనం కుండలు, మొక్కుల కోసం వాడే దొంతులు అన్నీ వీరి చేతుల నుంచే పుడతాయి.
తెలుగు సాహిత్యంలో ప్రాచీన కాలం నుండి కుమ్మరి వృత్తికి, వారి సాంస్కృతిక ప్రాధాన్యతకు విశిష్టమైన స్థానం ఉంది. సాహిత్యంలో కుమ్మరుల జీవితాలు, వారి వృత్తి నైపుణ్యం, ఎదుర్కొన్న సాధకబాధకాలకు విశిష్టమైన స్థానం ఉంది. సూర్యరాయాంధ్ర నిఘంటువు కుమ్మరులను మట్టి పాత్రలు చేస్తూ జీవించే కులంగా పేర్కొనగా, మహాభారతం కాలం నాటికే కుమ్మరి సారె ఉపమానంగా వాడబడేంత ప్రాచుర్యం పొందింది. 15వ శతాబ్దానికి చెందిన అన్నమాచార్యులు తమ కీర్తనలో ‘‘కుమ్మర దాసుడైన కురువరతి నంబి యిమ్మన్న వరములెల్లా ఇచ్చినవాడు’’ అంటాడు. 18వ శతాబ్దపు కవి అయ్యలరాజు నారాయణామాత్యుడు 'హంసవింశతి' కావ్యంలో కుమ్మర వృత్తి ధర్మాలు, వారు వాడే పరికరాలు, రకరకాల మట్టి పాత్రల పేర్లను వివరంగా అభివర్ణించారు. ఆధునిక కాలంలో దోరవేటి వంటి కవులు పద్యాల్లోనూ, మరికొందరు పాటలు, కవిత్వాల రూపంలోనూ మట్టితో మమేకమై సమాజానికి సేవ చేసే కుమ్మరుల శ్రమను, వారి సమస్యలను ఆవిష్కరించారు. ఇక నవలల విషయానికి వస్తే, 1975లో వచ్చిన మాదిరెడ్డి సులోచన గారి 'సుషూప్తి' నవలలో ప్లాస్టిక్, స్టీలు రాని రోజుల్లో కుమ్మరి బాలయ్య పూలకుండీలు, పెంకులు, బోనం కుండలు వంటివి తయారు చేస్తూ కుటుంబాన్ని పోషించుకున్న తీరును అద్భుతంగా చిత్రీకరించారు. అలాగే ఎనుగంటి వేణుగోపాల్ రాసిన 'ఆమె-అతడు-అడవి', ముదిగంటి సుజాతారెడ్డి గారి 'సంకెళ్లు తెగాయి' వంటి నవలలు కూడా కుమ్మరుల జీవిత చిత్రణను పాఠకులకు సమర్థవంతంగా అందించాయి.
తెలంగాణ ప్రాంతంలో కుమ్మరుల వృత్తి, వారి ఆర్థిక, సామాజిక జీవితాలు, శ్రమ సౌందర్యాన్ని ప్రతిఫలించే కథలతో 'వాము' అనే విశిష్టమైన కథల సంకలనం వెలువడింది. డాక్టర్ అట్టెం దత్తయ్య సంపాదకత్వంలో వస్తున్న 'తెలంగాణ బి.సి. కథలు' ప్రచురణల సిరీస్‌లో భాగంగా ఈ పుస్తకం రూపొందింది. ఇందులో ప్రముఖ రచయితలు రాసిన 20 అద్భుతమైన కథలు ఉన్నాయి. ఐరేని కుండలు(మలయశ్రీ), ఈ భూమి నాది (కాలువ మల్లయ్య), చలివేంద్రం(జాతశ్రీ), కాగుబొత్త (పెద్దింటి అశోక్ కుమార్), ప్రయాస (శిరంశెట్టి కాంతారావు), తలగోరుకుండ (బోయ జంగయ్య), తలగోరుకుండ (మేరెడ్డి యాదగిరి రెడ్డి), ఇత్తడి కుండలు (నేరెళ్ళ శ్రీనివాస్ గౌడ్), నిరంతరమూ అనంతరమూ (రామా చంద్రమౌళి), తెగిన బంధాలు (పెద్దింటి అశోక్ కుమార్), కొడుకు రాకపాయే(ఐతా చంద్రయ్య), దడ్వత్ (వెల్దండి శ్రీధర్), సారె (సాగర్ల సత్తయ్య), మంగలం పెంక (నాంపల్లి సుజాత), చిప్ప (సంపత్ కుమార్), కుమ్మరి పనొక్కటే గాదు(వాసరవేణి పరశురాములు), జీవితాన్ని గెలిచినవాడు! (ఎనుగంటి వేణుగోపాల్), కాలచక్రం (వడ్కాపురం క్రిష్ణ), మట్టికుండ(గుగులోత్ తులసి) వృత్తి బంధువులు (యడవల్లి శైలజ) అనే కథలు కుమ్మరుల జీవితాలలోని వైవిధ్యభరితమైన పార్శ్వాలను, వారి సాంస్కృతిక ప్రాధాన్యతను ఎంతో సహజంగా ఆవిష్కరించాయి.
వాము పుస్తకంలోని కథలు కుమ్మరుల జీవితాలను, వారి సంస్కృతిని మన కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయి. వారు పడే వృత్తి కష్టాలు, వారి నీతి నిజాయితీలు ఈ కథల్లో స్పష్టంగా కనిపిస్తాయి. అధికారులు, భూస్వాములు చేసే దోపిడీలు, మోసాల వల్ల వారు ఎంతగా నష్టపోయారో ఇవి వివరిస్తాయి. మట్టినిచ్చే చెరువులు నాశనం కావడం వల్ల ఆ కుమ్మరులు పడిన వేదన, కుటుంబాల్లో మహిళలు పడే శ్రమ మనసును కలచివేస్తాయి.కొందరు ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడినప్పటికీ.. ఇతర వృత్తుల వారితో ఎంతో ఆత్మీయంగా ఉంటారు. కాలం మారేకొద్దీ ఈ వృత్తికి ఆదరణ తగ్గినా, తమ వృత్తిపై వారికి ఉన్న అనుబంధం మాత్రం చెదిరిపోలేదు. ఇప్పుడు కొందరు ఈ రంగంలోనే కొత్తగా ఎదుగుతూ ఆశలు రేపుతున్నారు. ముఖ్యంగా ఈ కథలు కుమ్మరి వృత్తికి చెందిన విశిష్టమైన పదజాలాన్ని, వారి గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని మనకు అందిస్తాయి.
మలయశ్రీ రాసిన ఐరేని కుండలు కథ ఒక పూర్తి జీవితాన్ని మనకు కనిపిస్తుంది. ఐరేని కుండలు అంటేనే మనకు ముందు గుర్తుకువచ్చేది పెళ్లి అందులో కుండ పాత్ర ఎంత విలువైనదో మనకు తెలుస్తుంది. ఈ కథలో మన జీవితం మట్టితోనే ముడిపడి ఉంది అని సత్యాన్ని తెలుసుకోవచ్చు. ఈ కథలో శ్రమజీవుల జీవితాలను, వారి ఆత్మగౌరవాన్ని చాలా సహజంగా చూపించారు. కుమ్మరుల కష్టం, త్యాగం, వారి ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తాయి.
"ఒంటినిండా బలం, చేతినిండా పని ఉంటే చాలు... బంటులా పనిచేసి రాజులా బతుకుతాను" అని అంటుంది. మేడలు, మిద్దెలు, ఆస్తులు సంపాదించడమే జీవితం కాదని ఈ మాటలు నిరూపిస్తున్నాయి. తిండికి అంబలి, కట్టుకోవడానికి బట్ట ఉంటే చాలని తృప్తిపడడం వారి గొప్ప మనసుకు నిదర్శనం. ఎంత కష్టపడి పనిచేసినా తమ కాళ్లపై తాము నిలబడి ఆత్మగౌరవంతో బతకడమే అసలైన రాజసం అని వారు నమ్ముతారు. వృత్తులు తగ్గిపోతున్న ఈ రోజుల్లో కూడా, స్వశక్తిని నమ్ముకుని జీవించే కుమ్మరుల నిజాయితీని, గ్రామీణ సంస్కృతిలోని గొప్పదనాన్ని ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాయి.
డా. కాలువ మల్లయ్య రాసిన ‘ఈ భూమి నాది’ కథ తెలంగాణ సాయుధ పోరాట కాల నాటి భూపోరాటాన్ని, శ్రమజీవుల ఆర్తిని కళ్ళకు కడుతుంది. ముత్తయ్య అనే నిరుపేద కుమ్మరి, పట్వారి మాయమాటలు నమ్మి అడవిలాంటి పరంపోగు భూమిని రాత్రింబవళ్ళు కష్టపడి బంగారు పంట పండేలా మారుస్తాడు. కానీ, పంట చేతికొచ్చేసరికి దొర, పట్వారీలు కుమ్మక్కై ఆ భూమిని ఆక్రమిస్తారు. ఊర్లో ఏర్పాటైన 'సంఘం' అండతో ముత్తయ్య తన భూమిని దక్కించుకున్నప్పటికీ, దొర పోలీసుల చేత ఆయనను అమానుషంగా చిత్రహింసలు పెట్టి చంపిస్తారు. ప్రాణం పోయే ఘడియల్లో కూడా "ఈ భూమి నాది" అని తలుచుకుంటూ, తన కొడుకు కొంరయ్యకు భూమిని దక్కించుకోవాలని మాట తీసుకుని ముత్తయ్య కన్నుమూస్తాడు. తండ్రి త్యాగాన్ని, నరకయాతనను తలచుకుని రగిలిపోయిన కొంరయ్య, పోలీసుల బెదిరింపులకు భయపడక, భుజాన నాగలి పట్టి తిరిగి పొలానికి బయలుదేరడం తరాలు మారినా ఆగేది లేదని చాటే అజేయమైన పోరాట చైతన్యానికి ప్రతీకగా నిలుస్తుంది.
బోయ జంగయ్య రాసిన 'తలగోరుకుండ' కథ ఆధునిక కాలంలో కులవృత్తులు ఎదుర్కొంటున్న సమస్యలను, బతుకుదెరువు కోసం జరుగుతున్న వలసల బాధను చూపుతుంది. ఒకప్పుడు పుట్టుక నుండి చావు వరకు ప్రతి పనికి మట్టి పాత్రలే ఆధారంగా ఉండేవి. ఇళ్ల నిర్మాణంలో కూడా మట్టి వస్తువులే వాడేవారు. కానీ సిమెంట్ రేకులు, ఇత్తడి-రాగి పాత్రలు, రైస్ మిల్లులు రావడంతో కుమ్మరి వృత్తికి గిరాకీ తగ్గిపోయింది. ఎంత కష్టపడినా తగినంత ఆదాయం రాక కుమ్మరులు ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. పాత తరానికి చెందిన వీరయ్యకు తన వృత్తిపై, ఊరిపై ఎంతో ప్రేమ ఉంది. "సారె తిరిగితేనే ఊరు బాగుంటుంది" అని ఆయన నమ్ముతాడు. అందుకే వృత్తిని వదులుకోవడానికి ఆయన మనసు ఒప్పుకోదు. కానీ ఆయన కొడుకు సాయిలు మాత్రం పిల్లల చదువు, భవిష్యత్తు కోసం 'బొంబాయి' వలస వెళ్లడమే మంచిదని భావిస్తాడు. మనిషి చివరి ప్రయాణంలో వాడే 'తలగోరుకుండ' తయారుచేసే కుమ్మరి కూడా నేడు కడుపు నింపుకోవడం కోసం సొంత ఊరిని విడిచి వెళ్లాల్సి వస్తోంది. ఈ కథ నాటి దయనీయ పరిస్థితులను ఎంతో సహజంగా మనకు తెలియజేస్తుంది.
ఆధునిక కాలంలో ప్రభుత్వాల తీరు, మార్కెట్ పోటీ వల్ల కుమ్మరి వృత్తి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. 'చలివేంద్రం' కథలో అధికారులు దయ పేరుతో కుమ్మరుల నుంచి ఉచితంగా కుండలు తీసుకుంటూ వారి కష్టాన్ని దోచుకోవడం కనిపిస్తుంది. అలాగే 'కాగుబొత్త', 'ఇత్తడి కుండలు', 'మంగలం పెంక' వంటి కథలు ఫ్రిజ్‌లు, ప్లాస్టిక్ పాత్రల దాడిని చూపుతాయి. నాణ్యతకు 'ఐఎస్ఐ' గుర్తింపులు అడిగే నేటి సమాజంలో మట్టి కళాకారుల నైపుణ్యానికి విలువ లేకుండా పోతోంది. వృత్తి వల్ల ఆదాయం రాక, ఆఖరికి పట్నం వలస వెళ్లాల్సి వస్తోంది.
వృత్తిని మార్చుకుని సొంతంగా ఎదగాలని చూసినా, సమాజంలోని కులాధిపత్యం బిసిలను ముందుకు సాగనివ్వడం లేదు. 'ప్రయాస' కథలో వీరన్న కుమ్మరి పని వదిలి బొప్పాయి తోట వేసి విజయం సాధిస్తాడు. కానీ అగ్రకులాల వారు ఓర్వలేక ఆ తోటను నాశనం చేస్తారు. 'దడ్వత్' కథలో భూమి గొడవల పేరుతో ఒక పేద కుమ్మరిని దశాబ్దాలుగా వేధించడం కనిపిస్తుంది. మరోవైపు 'అభివృద్ధి' పేరుతో జరిగే ప్రాజెక్టులు కుమ్మరులను దెబ్బతీస్తున్నాయి. రాములు రాసిన 'తలగోరుకుండ' కథలో చెరువును 'సెజ్' గా మార్చడం వల్ల మట్టి దొరకక కుమ్మరులు, నీళ్లు లేక రైతులు, ఇతర కులాల వారు బతుకుదెరువు కోల్పోతారు. 'సారె', 'చిప్ప', 'కాలచక్రం' వంటి కథలలో తండ్రులు వృత్తినే దైవంగా భావిస్తారు. కానీ చదువుకున్న కొడుకులు అది ఆదాయం లేని భారంగా భావిస్తారు. ప్లాస్టిక్, ఫ్రిజ్‌ల వాడకం పెరగడంతో చివరికి చావుకు వాడే తలగోరుకుండ తప్ప వేరే ఏమీ అమ్ముడుపోవడం లేదు. అయితే, ఈ కష్టాల మధ్య చదువు, ఆధునిక ఆలోచనలు ఆశలు రేపుతున్నాయి. 'కొడుకు రాకపాయే', 'కుమ్మరి పనొక్కటే గాదు', 'మట్టికుండ' కథలలో బిసిల కష్టాలు తీరాలంటే చదువు, ప్రభుత్వ చట్టాల రక్షణే మార్గమని చెబుతారు. 'జీవితాన్ని గెలిచినవాడు' కథలో శంకర్ అనే యువకుడు తన కులవృత్తిపై పరిశోధన చేస్తాడు. ఉద్యోగం వదిలి కుమ్మరి పనిని ఆధునిక వ్యాపారంగా మార్చి విజయం సాధిస్తాడు. 'నిరంతరమూ.. అనంతరమూ..', 'వృత్తి బంధువులు' కథలు ఎంత ఎత్తుకు ఎదిగినా మన మూలాలను మర్చిపోకూడదని, మానవ నాగరికతకు కులవృత్తులే పునాది అని చాటిచెబుతున్నాయి.
మట్టి పాత్ర అనేది కేవలం ఒక వస్తువుగే కాకుండా అది మానవ నాగరికత వికాసానికి, శ్రమ సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తుంది. పుట్టుక నుండి అంతిమ పయనం వరకు మనిషి జీవితంతో ముడిపడి ఉన్న కుమ్మరి వృత్తి, సమాజానికి మూలస్తంభంగా ఉన్న మాట వాస్తవ చిత్రం. ప్రాచీన సాహిత్యం నుండి నేటి ‘వాము’ కథల సంకలనం వరకు ప్రతి రచన కూడా కుమ్మరుల ప్రతిభను, ఆత్మగౌరవాన్ని, అలాగే వారు ఎదుర్కొంటున్న ఆధునిక సంక్షోభాలను ఎంతో నిష్పాక్షికంగా ఆవిష్కరించాయి.
ఆధునీకరణ, యంత్రాల దాడి, వనరుల కోల్పోత వంటివి ఈ వృత్తిని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టినప్పటికీ... శ్రమను నమ్ముకున్న ఈ శ్రమజీవుల నిజాయితీ, సాంస్కృతిక బంధం ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. నేడు చదువు, ఆధునిక విజ్ఞానంతో కులవృత్తికి నూతన రూపమిస్తూ విజయం సాధిస్తున్న యువత సమాజానికి కొత్త ఆశలను అందిస్తోంది. మట్టిని, శ్రమను గౌరవించడం అంటే మన సాంస్కృతిక మూలాలను కాపాడుకోవడమే. నాగరికతకు ప్రాణం పోసిన ఈ మట్టి మనుషుల జ్ఞానాన్ని, కళను గుర్తించి ఆదరించడం మనందరి బాధ్యత. డాక్టర్ అట్టెం దత్తయ్య గారి రచనలు బి.సి.ల భాషను, సాంస్కృతిక మూలాలను కాపాడటమే కాకుండా... తరతరాలుగా సమాజానికి సేవ చేసి అణచివేతకు గురైన శ్రమజీవుల అస్తిత్వ పోరాటానికి బలమైన సాహిత్య రూపంగా నిలుస్తోంది.
మట్టి కుండ - మన జీవిత ప్రయాణం
మట్టిలో పుట్టిన ఒక చిన్న కుండ
మనిషి జన్మతో పెంచుకుంది గట్టి బంధం
పసిపాప పుట్టిన వేళ తొట్టె నీళ్లకు ఆధారమై
నామకరణ వేడుకలో పవిత్ర జలాల నిలయమై
పండుగ వేళ ఇంటి ముంగిట మంగళ కలశమై
చిరునవ్వులతో పంచింది శుభాల శోభను...
ఎండకాలపు తాపంలో అమృతంలాంటి చల్లదనమై
పొలానికి వెళ్లే రైతుకు దాహం తీర్చే స్నేహితయై
కట్టెల పొయ్యిపై రుచికరమైన వంటల వేదికై
తోడుపెట్టిన పాలకు కమ్మని పెరుగును ఇచ్చే భాగ్యమై
బోనాల వేళ శిరస్సుపై దీపమై వెలిగిపోయింది...
చెట్లకు నీళ్ళిచ్చే చిన్నటి జల్లుల పాత్రై
పెళ్లి పందిట్లో పాలకడవై నిలిచింది
పేదరికం ఆపదలో ఉచిత బిందెగా మారింది
కడిగిన ప్రతిసారి కొత్తగా మారి
ఇంటి మూలన చేరి నిశ్శబ్దంగా సేవలు చేసింది...
మనిషి వయసు మళ్లిన వేళ ముసలితనంలో తోడుగా ఉండి
చివరికి ఊపిరి ఆగాక శ్మశాన దారిలో ముందు నడిచింది...
పితృ తర్పణాల ఘట్టంలో ఆత్మశాంతికి నీటిని సమర్పించి
చితి మంటల చుట్టూ తిరుగుతూ చివరి పయనాన సాగనంపింది...
ఆపై తాను కూడా పగిలిపోయి
మళ్లీ ఆ మట్టిలోనే కలిసిపోయింది...
పుట్టుక నుండి చావు వరకు...
కుండ మనిషి జీవితానికి నిలువుటద్దమై నిలిచింది!